
తుని ఘటన వెనుక అసాంఘిక శక్తులు: పవన్ కల్యాణ్
తుని సంఘటన తనకు మనసుకు చాలా బాధకలిగించిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో తాను కేరళలో ఉన్నానని, రైలును తగులబెట్టడం చూసి తన మనసులో చాలా బాధ కలిగిందని అన్నారు.
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు గర్జనలో హింసాత్మక సంఘటనలు తన మనసుకు చాలా బాధ కలిగించిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో తాను కేరళలో ఉన్నానని, రైలును తగులబెట్టడం చూసి తనకు చాలా బాధ కలిగిందని అన్నారు. ఉద్యమంలో తాను నమ్మేది శాంతియుత మార్గం అని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందు ఈ పంథాను అనుసరిస్తూ విజ్ఞప్తి చేస్తేనే బాగుంటుందని అన్నారు. కాపుల రిజర్వేషన్ల సమస్య నేటిది కాదని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
'బ్రిటీష్ కాలం నుంచి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనూ, 1956 సమయంలో కూడా ఈ సమస్య బయటకు వచ్చింది. అనేక దశాబ్దాలుగా ఈ డిమాండ్ ఉంది. అనేక తెగలు కలిపితే కాపులు. కాపుల్లో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే.. ఉత్తరాంధ్రలో, తెలంగాణలో వెనుకబడిన కులాలుగా వారికి గుర్తింపు ఉంది.. తూర్పు ఆంధ్రలో లేదు. పార్టీ నాయకులు బీసీల్లో చేరుస్తామని చెప్పడంతో వారిని ఓటుబ్యాంకుకు వాడుకుంటున్నారని కాపులకు బాధ అనిపిస్తోంది. ఒక శాంతియుతంగా జరగాల్సిన సభ ఎందుకు ఇలా దారితీసిందో అర్ధం కాలేదు. రైలు అగ్గిపుల్లతో తగలబెట్టేది కాదు. దీని వెనుక ఎంతో వ్యూహం ఉండి ఉండొచ్చు. దీని వెనుక అసాంఘిక శక్తులు, ప్రొఫెషనల్స్ ఉండి ఉండాలి.. దీని వెనుక ఎవరి ప్రభావమో ఉంది' అని పవన్ ఆరోపించారు. అసలు లక్షల మంది ఒక సమస్యపై ఉద్యమించేందుకు కదులుతుంటే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదని చెప్పారు.
ఇంకా ఏమన్నారంటే..
- నిన్నటి సంఘటనపై ఎవరిపైనా నిందలు వేయడం లేదు
- సభ దగ్గర సరిపడా పోలీసులను ఎందుకు పెట్టలేదు
- కమిషన్లపై కాపులకు నమ్మకం లేదు
- కాపు సామాజిక వర్గంలో ఏదో భయం ఉంది
- ప్రజలను రెచ్చగొట్టేలా ఉద్యమ నేతలు ప్రసంగాలు చేయకూడదు
- ఉద్యమ నాయకులు చాలా బాధ్యతతో వ్యవహరించాలి
- తుని ఘటనను రాజకీయం చేయాలని కానీ, లబ్ధి పొందాలని కానీ నాకు లేదు
- ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు
- ట్రయిన్ను తగులబెట్టడం మామూలు కార్యకర్తలకు సాధ్యం కాదు
- మిగతా బీసీ కులాలకు నష్టం వాటిల్లకుండా కాపులకు న్యాయం చేయగలిగితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాళ్లు అవుతారు
- సాధ్యం అయితే చేస్తాం, లేకుంటే సాధ్యం కాదు అని స్పష్టం చేస్తే మంచిది
- గాల్లో దీపం పెట్టేలా మాటలు చెప్పకూడదు
- చౌరాచౌరీ సంఘటన వల్ల స్వాతంత్ర్యం 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది
- హక్కులు తెచ్చుకోవడానికి ఓ ఎజెండా ఉంటుంది. కానీ, అది పక్కదారి పట్టకూడదు
- నేను కులంకోసం కాదు.. ప్రజలకోసం పోరాటం చేస్తాను
- జాతి సమగ్రత కోసం నేను ఆలోచిస్తాను