టీచర్ల బదిలీలకు 1500 దరఖాస్తులు!

టీచర్ల బదిలీలకు 1500 దరఖాస్తులు!


ముగిసిన దరఖాస్తు ప్రక్రియ

పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తి


 

 సిటీబ్యూరో: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. రెండేళ్ల తర్వాత టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు విధానం పూర్తయింది. వాటిని పరిశీలించిన అనంతరం విద్యాశాఖ ఆమోదించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే దరఖాస్తుల సంఖ్య తేలనుంది. జిల్లాలో మూడు వేలకు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో తప్పనిసరి బదిలీ అయ్యే వారితోపాటు ఆశావహులు సైతం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్కూళ్లలో ఉన్న మిగులు ఉపాధ్యాయులు 95 మంది, ఒకే పాఠశాలలో ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న 78 మంది ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు ఒకే బడిలో విధులు నిర్వహించిన 100 మంది స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 200 మంది ఎస్‌జీటీలు తప్పనిసరిగా ద రఖాస్తు చేసుకున్నట్లే. వీరితో దాదాపు 800 మంది రిక్వెస్ట్ కింద, మరికొందరు ఆశావహ దృక్పథంతో దరఖాస్తులను అప్‌లోడ్ చేశారని సమాచారం. ఇలా అన్ని విభాగాల్లో 1,500 పైబడి బదిలీ కోసం దరఖాస్తులు వచ్చి ఉండవచ్చని అంచనా.



ముగిసిన పాఠశాలల రేషనలైజేషన్

 హైదరాబాద్ జిల్లాలో పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియ ముగిసింది. అందుకు సంబంధించిన జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సంఖ్యలో ఎంటువంటి మార్పులేదు. ఇప్పటివరకు ఉన్న స్కూళ్లు యథావిధిగా 2015-16 విద్యా సంవత్సరానికి కొనసాగనున్నాయి. అయితే ఉన్నత పాఠశాలల్లో నడుస్తున్న సక్సెస్ స్కూళ్ల సంఖ్య మాత్రం తగ్గింది. జిల్లాలో 135 సక్సెస్ స్కూళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందిస్తున్నారు. 20 సక్సెస్ స్కూళ్లలో 50 మంది లోపు విద్యార్థులే నమోదయ్యారు. రేషనలైజేషన్‌లో భాగంగా వీటిని కిలోమీటర్ పరిధిలో ఉన్న ఇతర సక్సెస్ స్కూళ్లలో విలీనం చేశారు. తద్వారా 15 సక్సెస్ స్కూళ్లు సంఖ్యా పరంగా తగ్గాయని అధికారులు తెలిపారు. ఈ బడుల్లో బోధించే 60 - 70 మంది ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయనున్నారు.



అలాగే ప్రాథమిక పాఠశాలల సంఖ్యలో మార్పు చోటుచేసుకుంది. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న రెండు పీఎస్‌లను.. ఒక పీఎస్‌గా మార్చారు. ఇలా పది పీఎస్‌లను ఇతర పీఎస్‌లలో విలీనం చేయడంతో తాజాగా జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంఖ్య 624కు పడిపోయింది. విలీనమైన బడుల్లోని ఉపాధ్యాయులకు అదనపు పాయింట్లు కే టాయించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top