15 లక్షల మంది.. పల్లె బాట

15 lakh people going their own towns for Sankranthi - Sakshi

   సంక్రాంతికి సొంత ఊళ్లకు తరలిన నగరవాసులు

   కిక్కిరిసిపోతున్నబస్సులు, రైళ్లు

సాక్షి, హైదరాబాద్‌: పట్నం పల్లెకు తరలింది. సొంత ఊళ్లో సంక్రాంతి వేడుకలు చేసుకునేందుకు నగరవాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు గత నాలుగు రోజులుగా కిక్కిరిసిపోతున్నాయి. రెగ్యులర్‌ రైళ్లు, ప్రత్యేక రైళ్లు రెట్టింపు ప్రయాణికులతో బయలుదేరుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సుమారు 3,500 రెగ్యులర్‌ బస్సులతో పాటు, మరో 3,650 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది.

వ్యక్తిగత వాహనాలు, ట్రావెల్స్‌ కార్లు, ఇతర రకాల వాహనాల్లో సైతం భారీ సంఖ్యలో ఊళ్లకు బయలుదేరి వెళ్లారు. స్కూళ్లు, కళాశాలలకు  సెలవులు  ప్రకటించడం, ప్రభుత్వ కార్యాల యాలకు సైతం వరుసగా సెలవులు రావ డంతో  నగర ప్రజలు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. ఈ నాలుగు రోజుల్లో వివిధ మార్గాల్లో సుమారు 15 లక్షల మందికి పైగా ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్లారు. మరో రెండు రోజుల పాటు 5 లక్షల మందికి పైగా ఊళ్లకు తరలి వెళ్లనున్నారు. రైళ్లల్లో రిజర్వేషన్‌లు లభించక పోవడంతో  చాలా  మంది దూరప్రాంతాలకు సైతం ప్యాసింజర్‌ రైళ్లల్లో, సాధారణ బోగీల్లో ఒంటికాలిపై ప్రయాణం చేయాల్సి వచ్చింది.   రైళ్లపై  ఆశలు వదులుకున్న వాళ్లు  ఆర్టీసీ, ప్రైవేట్‌  బస్సులను ఆశ్రయించారు. మరోవైపు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాలకు సైతం అనూహ్య డిమాండ్‌ నెలకొంది. 

భారీ దోపిడీ...
ప్రత్యేక బస్సులపై 50 శాతం చొప్పున ఆర్టీసీ అదనపు వసూళ్లు చేస్తోంది. ప్రైవేట్‌ బస్సులు మరో అడుగు ముందుకేసి డబుల్‌ చార్జీలు వసూలు చేస్తున్నాయి.  సంక్రాంతి వేడుకలను సొంత ఊళ్లో చేసుకోవాలనుకున్న తమ కోరిక  కోసం నగర వాసులు రవాణా చార్జీల రూపంలో భారీ మూల్యాన్నే  చెల్లించు కోవలసి వచ్చింది. విజయవాడ, విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, తిరుపతి,  కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్‌  వంటి వివిధ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున  తరలి వెళ్లారు.

రోజువారి బయలుదేరే 80 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కాకుండా, వివిధ ప్రాంతాల మధ్య సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే మరో 50 ప్రత్యేక రైళ్లను అదనంగా ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన చార్జీలు కూడా భారీగా పెరిగాయి. ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా ఉండే అన్ని మార్గాల్లో చార్జీలు ఒకటి నుంచి రెండు రెట్లు అధికమయ్యాయి. ప్రయాణికుల రద్దీ మరో రెండు రోజుల పాటు ఇలాగే కొనసాగనుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top