బెంగాలీ కవికి జ్ఞాన్‌పీఠ్‌

బెంగాలీ కవికి జ్ఞాన్‌పీఠ్‌


శంఖ ఘోష్‌కు పురస్కారం

కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఘోష్‌
న్యూఢిల్లీ: ప్రసిద్ధ బెంగాలీ కవి, విమర్శకుడు శంఖ ఘోష్‌కు ప్రతిష్టాత్మక ‘జ్ఞాన్‌పీఠ్‌’ పురస్కారం దక్కింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశంలో 2016 సంవత్సరానికి గాను ఘోష్‌ పేరును ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రముఖ రచయిత నమ్వార్‌ సింగ్‌ నేతృత్వంలోని ‘జ్ఞాన్‌పీఠ్‌ ఎంపిక మండలి’ ప్రకటించింది. గతేడాది గుజరాతీ రచయిత రఘువీర్‌ చౌదరికి జ్ఞాన్‌పీఠ్‌ దక్కింది. ఈ అవార్డు కింద సరస్వతి దేవి కాంస్య విగ్రహంతో పాటు నగదు బహుమతి అందిస్తారు. ఆధునిక బెంగాలీ కవి, విద్యావేత్త అయిన శంఖ ఘోష్‌ 1932లో జన్మించారు. ప్రయోగాత్మక కవిత్వ రూపాలతో అరుదైన శైలిలో కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించారు. నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీత రవీంద్రనాథ్‌ టాగూర్‌ రచనలపై ఆయనకు మంచి పట్టుంది. ఆయన కవిత్వం ఆద్యంతం సామాజిక స్పృహ, సందేశాలతో సాగుతుంది. ఎక్కడా విమర్శలకు తావు లేకుండా సున్నితంగా అక్షరాలు పేర్చడంలో ఘోష్‌ దిట్ట. ఆయన ప్రతిభావంతమైన కవితా పంక్తుల్లో సంఘంలోని రుగ్మతలపై ఆవేదన ప్రతిధ్వనిస్తుంది.ఎన్నో అపురూపాలు... అవార్డులు...

52వ జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారం అందుకోనున్న శంఖ ఘోష్‌ కలం నుంచి ఎన్నో అపురూప కవితలు జాలువారాయి. ‘అదిమ్‌ లతాగుల్మోమే, ముర్ఖా బారో.. సమాజిక్‌ నే, కబీర్‌ అభిప్రాయ్, ముఖ్‌ దేఖే జే బిగ్యాపనే, బాబరర్‌ ప్రార్థనా’ వంటివి ఘోష్‌ సృజనాత్మక కవితా సృష్టికి మచ్చుతునకలు. ముఖ్యంగా ఆయన రచించిన ‘డింగులి రాత్‌గులి, నిహితా పటాల్చయా’లు ఆధునిక కవితా స్రవంతికి స్ఫూర్తిగా నిలిచాయి. ఘోష్‌ రచనలు హిందీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, మళయాళం తదితర భారతీయ భాషలతో పాటు విదేశీ భాషాల్లోకీ అనువాదమయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు నర్సింగ్‌దాస్‌ పురస్కార్, సరస్వతి సమ్మాన్, రవీంద్ర పురస్కార్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డులెన్నో ఘోష్‌ అందుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top