కన్నడ అంటే కువెంపు

కుప్పళి వెంకటప్పగౌడ


కస్తూరి పరిమళం


‘కువెంపు’ పేరుతో ప్రసిద్ధులైన కుప్పళి వెంకటప్పగౌడ పుట్టప్ప ఆధునిక కన్నడ  సాహిత్యంలో ఎవరెస్టు శిఖరం లాంటి వారు. కవితలు, ఖండకావ్యాలు, మహాకావ్యం, నాటకం, నవల, కథ, బాల

 సాహిత్యం, విమర్శ, జీవితచరిత్రలు, స్వీయచరిత్ర- ఇలా సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ రచనా వ్యాసంగం చేసిన

 బహుముఖ ప్రతిభాశాలి ఆయన. కేంద్ర సాహిత్య అకాదెమీ బహుమతి పొందిన తొలి కన్నడ రచయితగా, జ్ఞానపీఠ   

 పురస్కారం స్వీకరించిన ప్రప్రథమ కన్నడ సాహిత్యవేత్తగా

 కువెంపు ఖ్యాతి అసామాన్యం.

 కువెంపు చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకాలోని

 హిరేకూడిగే గ్రామంలో 1904 డిసెంబర్ 29న జన్మించారు. ఆయన బాల్యం తండ్రిగారి వూరైన శివమొగ్గ జిల్లా కుప్పళిలో గడిచింది. ఉన్నత విద్యాభ్యాసం మైసూరు మహారాజా కాలేజీలో సాగింది. 1929లో ఎం.ఎ. కన్నడ మొదటి వరుసలో ఉత్తీర్ణులై అదే కాలేజీలో అదే సంవత్సరం కన్నడ ఉపన్యాసకులుగా చేరారు. 1946-55 మధ్య కన్నడ విభాగాధ్యక్షులుగా ప్రశంసనీయమైన కృషి చేసి, 1955లో ఆ కళాశాల ప్రిన్సి

 పాల్‌గా, 1956-60 మధ్య మైసూరు విశ్వవిద్యాలయ

 కులపతిగా విధి నిర్వహణ చే శారు.

 

తన జీవితకాలంలో మొత్తం 76 పుస్తకాలు రాసి కన్నడ భాషకు నేడు పర్యాయపదంగా పిలువబడుతున్న కువెంపుకు విద్యార్థి దశలో ఆంగ్లమంటే పంచప్రాణాలు. నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ఆయన ‘బిగినర్స్ మ్యూజ్’ (1922) అనే ఆంగ్ల కవితా సంకలనం ప్రచురించారు. ఆ ఇంగ్లిష్ కవితల రాతప్రతిని చూసి

 

ఫరవాలేదని తలవూపుతూ మీరు మీ మాతృభాషలో రచనలు చేస్తే మీరునూ గొప్పగా రాణించగలరని ప్రసిద్ధ ఆంగ్ల రచయిత జేమ్స్‌హెచ్. కజిన్సు సలహా ఇచ్చారు. ఈ మహానుభావుడే మన దువ్వూరి రామిరెడ్డి  ఇంగ్లిష్ కవితల్ని మెచ్చుకొంటూ మాతృభాషలలో రచనచేయమని ఆయనకు సలహా ఇచ్చారు. కువెంపు 1973లో ‘ఎలైన్ హార్ట్’ అనే మరో ఇంగ్లిష్ కవితా సంకలనం ప్రచురించినా కన్నడ సాహిత్యానికే అంకితమయ్యారు.



రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన కువెంపు శివమొగ్గ జిల్లా కుప్పళి ప్రాంత ప్రకృతి సౌందర్యానికి సమ్మోహితులయ్యారు. ఆయన ఏకాంతయోగి, మౌని, తపస్వీ, ప్రకృతిలోని కొండలు, గుట్టలు, సెలయేర్లు, నదులు, చెట్టూ చేమా, పక్షులు వీటి మధ్య తన్ను తాను మరిచిపోయేవారు.  ప్రకృతి ఒడిలో పెరిగి, జీవించి, పక్షిలా పాడుతూ నిర్మల చింతన ధ్యానాల్లో మునిగితేలే వర్డ్స్ వర్త్‌ను తన ఆదర్శంగా స్వీకరించిన కువెంపు అంతే లలితంగా జీవించారు.

 

కువెంపు శాశ్వత కీర్తికి మూలం ఆయన రచించిన ‘శ్రీరామాయణ దర్శనం’ మహాకావ్యం. ఈ బృహత్ కావ్యం రెండు సంపుటాలుగా (1949, 1959) వెలువడింది. ఇందులో పరాత్పరుడైన శ్రీరాముడి ‘లోక తీలా దర్శనం’తో పాటు మంధర, ఊర్మిళ, కుంభకర్ణుడు, వాలి మొదలైన పాత్రల చిత్రణ మనోహరంగా సాగింది. ‘శ్రీరామాయణ దర్శనం’లో ఆయన సామాన్య పాత్రల్ని కూడా తెరమీదకి తెచ్చి వాళ్లకు గుర్తింపు, సహానుభూతి సంపాదించి పెట్టారు.



కువెంపు ‘కానూరు హెగ్గడితి’ (కానూరురెడ్డిసాని), ‘మలెగళల్లి మదుమగళు’ (కొండల్లో పెళ్లికూతురు) అనే రెండు పెద్ద నవలల్ని రాశారు. ఈ రెండు నవలల్లో తాను పుట్టిపెరిగిన మలనాడు ప్రాంతంలోని ప్రజా జీవితాన్ని సహజ నేపథ్యంలో చిత్రించారు. ఇంగ్లిష్ విద్యావిధానం వల్ల అన్ని వర్గాల ప్రజలకు చదువు సంధ్యలు చేరువయ్యి మేలు చేశాయని చెప్పారు. మలనాడు ప్రాంత పల్లీయుల జీవితాల్లో స్వాతంత్య్రానంతరం వచ్చిన కొత్త మార్పుల్ని, సామాన్య జనుల మేలైన బతుకుల్ని చక్కగా చిత్రీకరించారు.

 

కువెంపు (1904-1994) భారతీయ సాహిత్యానికి తన జీవితాన్ని ధారపోయడమే కాకుండా పూర్ణచంద్ర తేజస్వి వంటి గొప్ప కథకుడిని కని, తన పరంపరకు వారసుడిగా చేసి వెళ్లారు.



- ఘట్టమరాజు

 

కువెంపు సాహిత్యం-జాతీయ సదస్సు



కువెంపు ప్రతిష్ఠాన, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కన్నడ విశ్వవిద్యాలయంల ఆధ్వర్యంలో ‘జాతీయకవి కువెంపు జీవితం- రచనలు’ అనే అంశంపై జాతీయ సదస్సు అక్టోబర్ 18, 19 తేదీలలో హైదరాబాద్ తెలుగు యూనివ ర్సిటీలో జరగనుంది. ఎల్లూరి శివారెడ్డి, ఘట్టమరాజు, వెలుదండ నిత్యానంద రావు, చంద్రశేఖర ఎన్.బెట్టహళ్లి, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎన్.గోపి తదితరులు పాల్గొంటారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top