నలుగురు మహిళా మావోయిస్టులు మృతి


చింతూరు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఆదివారం ఉదయం ఎన్ కౌంటర్ చోటుచేసుకొని నలుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్ రేంజ్ ఐజీ ఎస్ఆర్పీ కల్లూరి తెలిపిన వివరాల ప్రకారం.. రెండు జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో దర్బా, మలంగీర్ ఏరియా మావోయిస్టు కమిటీల సమావేశం జరుగుతోందన్న సమాచారంతో సమేలీ, పాల్నార్, ఆరన్పూర్ పోలీస్ స్టేషన్ల నుంచి సీఆర్పీఎఫ్, డిస్ట్రిక్ట్ రెస్క్యూ గార్డ్స్, డిస్ట్రిక్ట్ ఫోర్స్ కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో గాదిరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగల్ గూడ సమీపంలో మావోయిస్టులు తారసపడటంతో పోలీసులకు వారికి మధ్య రెండు గంటలపాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి.



అనంతరం ఘటనా స్థలంలో నలుగురు మహిళా మావోయిస్టుల మృతదేహాలతోపాటు 303 రైఫిల్, రెండు 12 బోరు తుపాకులు, డిటోనేటర్లు లభ్యమయ్యాయి. కాల్పుల నుంచి దర్బా డివిజన్ కమిటీ కమాండర్ గాయాలతో తప్పించుకున్నారు. మృతి చెందిన మహిళా మావోయిస్టులను మలంగీర్ ఏరియా కమిటీ సభ్యురాలు రామె, లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ సభ్యులు మాతె, సన్నీ, పాండేబాయిలుగా గుర్తించారు. రామెపై రూ.5 లక్షలు, మిగతా ముగ్గురిపై రూ.లక్ష చొప్పున రివార్డులు ఉన్నాయి.




 

Read also in:
Back to Top