
నిశ్చల్ నారాయణమ్
తొమ్మిదేళ్ల వయసులోనే తన తండ్రి కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో లోపాలను గుర్తించాడు.
అతి చిన్న వయసులో సీఏగా రికార్డు
* అద్భుత జ్ఞాపకశక్తితో గిన్నిస్ రికార్డులు
* 15 ఏళ్లకే కంపెనీ స్థాపించి విద్యా సేవ
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల వయసులోనే తన తండ్రి కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో లోపాలను గుర్తించాడు. 19 ఏళ్లకే చార్టెడ్ అకౌంటెన్సీ (సీఏ) పూర్తి చేసి, అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించి రికార్డు సృష్టించాడు. అద్భుత జ్ఞాపకశక్తితో డబుల్ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ‘యంగెస్ట్ వరల్డ్ మెమరీ చాంపియన్’గా నిలిచాడు. ఇవేగాకుండా మరెన్నో రికార్డులు సాధించి, రివార్డులు అందుకున్న ఆ యువకుడు హైదరాబాద్ చెందిన నిశ్చల్ నారాయణమ్.
పారిశ్రామికవేత్త ఎన్ .నాగేశ్వరరావు, పద్మావతి దంపతుల కుమారుడైన నిశ్చల్‌కు గణితంపై చిన్నప్పటి నుంచే ఎంతో మక్కువ. అమ్మ సంస్కృతంలో పీెహ చ్‌డీ చేయడంతో చిన్నప్పుడే సంస్కృతంపైనా పట్టు సాధించాడు. అంకెలపై అతని మక్కువ చూసి వేదిక్ గణితం, చైనా అబకస్, జర్మన్, రష్యన్ గణిత మెథడాలజీల్లో తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారు. ఈ క్రమంలో తొమిదేళ్లకే గణితావధానం, దశావధానం చేశాడు నిశ్చల్. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, పూర్వ గవర్నర్ సుశీల్‌కుమార్ షిండే, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం, గవర్నర్ రోశయ్య తదితర ప్రముఖుల ప్రశంసలు, సత్కారాలు అందుకున్నాడు. ‘‘వైఎస్సార్ నన్నెంతగానో ప్రోత్సహించారు. ప్రత్యేక గుర్తింపునూ ఇచ్చారు. నా రెండో గిన్నిస్ రికార్డును ఆయనకే అంకితం చేశా’’ అంటారు నిశ్చల్. మిగతా ఫ్రొఫెషనల్ కోర్సులతో పోల్చితే సీఏ చాలా కఠినమే గాక చాలెంజింగ్ కూడానని చెప్పారాయన. ‘‘అందుకే తుది స్థాయిలో రోజుకు 12 గంటల దాకా చదివాను.
డెలాయిట్ కంపెనీలో ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు రెండింటినీ బాలెన్స్ చేయడం కాస్త కష్టమైంది. అయితే, ఇతర పనులు చేసుకుంటూ సీఏ చేయడం కష్టమన్న భావన మాత్రం నా దృష్టిలో తప్పు. సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వాడుకోవడమే విజయరహస్యం. నేను చిన్న వయసులోనే సీఏ పూర్తి చేయడం వెనక రహస్యం అదే’’ అని గుర్తు చేసుకున్నారు.
15 ఏళ్లకే కంపెనీ..
స్కూళ్లను ప్రయోగశాలలుగా మార్చే లక్ష్యంతో 15 ఏళ్లకే ‘నిశ్చల్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్’ కంపెనీని స్థాపించారు నిశ్చల్. ఈ కంపెనీ ద్వారా గణిత లేబొరేటరీని రూపొందించారు. బాల్యంలోనే సృజనాత్మకతను పెంచే బోధన, అభ్యసన పద్ధతులు, చార్టులను రూపొందించి పాఠశాలలకు అందజేశారు. లక్ష స్కూళ్లలో బోధనలో ఈ విధానాన్ని పాటిస్తున్నారు. దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్య ప్రణాళికలోనూ చేర్చింది. త్వరలో తెలంగాణలోనూ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని నిశ్చల్ చెప్పారు. నిశ్చల్ పేరుతో ఫౌండేషన్ స్థాపించి పేద పిల్లలకు ఆయన సేవలందిస్తున్నారు. సమ్మర్ క్యాంపుల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
నిశ్చల్ రికార్డులు, వచ్చిన గుర్తింపులు...
* పదేళ్లకే గణిత మెథడాలజీ పుస్తకాల రచన, ప్రపంచంలోకెల్లా అతి పిన్న వయస్కుడైన
* మెమరీ చాంపియన్‌గా అవతరణ (2007)
* 11 ఏళ్లకు 225 వస్తువుల పేర్లు విని ఏ నంబర్‌లో ఏ వస్తువు ఉందో చెప్పడం ద్వారా
గిన్నిస్ వరల్డ్ రికార్డ్
* 2009లో 13 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
(ఈజీసీఎస్‌ఈ - కేంబ్రిడ్జి) బోర్డ్ ద్వారా 12వ తరగతి పూర్తి. బీకాంలో ఉస్మానియా టాపర్
* వైఎస్సార్ చేతుల మీదుగా స్టేట్ చైల్డ్ అవార్డ్ ప్రదానం. ఉగాది పురస్కారం
* అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా నేషనల్ చైల్డ్ అవార్డ్ (గోల్డ్ మెడల్)
* 132 వస్తువులు ఏ నంబరులో ఉన్నాయో గమనించి.. ఒక నిమిషంలో చెప్పడం ద్వారా
రెండో సారి గిన్నిస్ రికార్డ్
* నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ ద్వారా ‘సెవెన్ బ్రిలియంట్ బ్రెయిన్స్ ఆఫ్ ద వరల్డ్’ అవార్డు