జీజీహెచ్‌లో ఆ‘పరేషన్‌’..!

Patients suffer due to lack of basic facilities at Guntur GGH - Sakshi

    పరికరాలు లేక మధ్యలో నిలిచిపోయిన ఆపరేషన్‌

     హడావుడిగా ఆర్థోపెడిక్‌ ఓటీకి తరలించి శస్త్ర చికిత్స

     వారం కిందట ఆపరేషన్‌ మధ్యలో ఆరిపోయిన ఓటీ లైట్‌

     సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుగులో శస్త్రచికిత్స పూర్తి చేసిన వైద్యులు

     జీజీహెచ్‌ ఎస్‌ఓటీలో తరచూ తలెత్తుతున్న సమస్యలు  

సాక్షి, గుంటూరు/ గుంటూరు మెడికల్‌: గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఎం.జోషిబాబుకు ఈ నెల 12న జరిగిన ఓ ప్రమాదంలో  కుడిచేయి నుజ్జునుజ్జయింది. దీంతో కుటుంబసభ్యులు అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చేతి వేళ్లు పూర్తిగా దెబ్బతినడంతో బుధవారం సర్జికల్‌ ఆపరేషన్‌ థియేటర్‌ (ఎస్‌ఓటీ)లో శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే ఆపరేషన్‌ మధ్యలో ఉండగా హ్యాండ్‌ డ్రిల్‌ మిషన్‌ పనిచేయలేదు. దీంతో వెంటనే అతడిని ఆర్థోపెడిక్‌ విభాగంలోని ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

సరిగ్గా గత బుధవారం కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. పల్నాడు ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వెంకమ్మకు రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ నెల 7న ఎస్‌ఓటీలో శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్‌ మధ్యలో ఉన్న సమయంలో ఓటీ లైట్లు ఆరిపోయాయి. దీంతో వైద్యులు సెల్‌ఫోన్‌ లైట్ల మధ్య ఆపరేషన్‌ పూర్తి చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని ఎస్‌ఓటీలో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు రోగులను, వారి కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం
జీజీహెచ్‌లోని చిన్న పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న ఓ పసికందును ఎలుకలు కొరికి చంపిన సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జీజీహెచ్‌ను ప్రక్షాళన చేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు హడావుడి చేశారు. ఆ తర్వాత షరామామూలే. జీజీహెచ్‌లో జరిగే ఆపరేషన్ల వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తున్నా ఆపరేషన్‌ థియేటర్లలో వైద్య పరికరాలు, వసతుల కల్పనను మాత్రం ఆస్పత్రి అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవేళ నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు నాణ్యత లేని వైద్య పరికరాలు సరఫరా చేస్తుండడంతో అవి ఆపరేషన్ల మధ్యలో మొరాయిస్తున్నాయి.  

థియేటర్లు లేక నిలిచిన ఆపరేషన్లు
జీజీహెచ్‌లోని ఎస్‌ఓటీలలో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ వైద్యులు ఆస్పత్రి అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేసి ఆపరేషన్లు నిలిపివేశారు. మూడు పర్యాయాలు ఆపరేషన్లు నిలిపివేయడంతో అధికారులు మరమ్మతుల కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. మరమ్మతులు పూర్తయినా సరిపడా వైద్య పరికరాలు లేకపోవడంతో తాజాగా బుధవారం శస్త్రచికిత్స నిలిచిపోయింది. ఎస్‌ఓటీలో ముఖ్యమైన వైద్య పరికరాలు లేకపోవడంతో ఆపరేషన్లు చేయలేక అవస్థలు పడాల్సి వస్తోందంటూ వైద్య సిబ్బంది వాపోతున్నారు. న్యూరోసర్జరీ వైద్య విభాగంలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారికి తగ్గట్టుగా ఆపరేషన్‌ థియేటర్లు లేక పలుమార్లు ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయి.

ఆర్థోపెడిక్‌ వైద్య విభాగానికి ప్రత్యేకంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు థియేటర్‌ కేటాయించకపోవడం వల్ల ఏడాది పాటు ఆపరేషన్లు నిలిచిపోయాయి. అత్యంత ఖరీదైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకూ ప్రత్యేకంగా థియేటర్‌ కేటాయించకపోవడంతో ఆర్నెల్లుగా ఆపరేషన్లు నిలిపివేశారు. దీంతో రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్‌ చేయించుకునే స్థోమత లేక ఎంతోమంది పేదలు జీజీహెచ్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

జీజీహెచ్‌ ఎదుట ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళన
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్లక్ష్యం వల్లే జీజీహెచ్‌లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో ఆస్పత్రిలో ఎలుకలు చిన్నారిపై దాడి చేశాయని, పాములు కూడా వచ్చాయని ఆయన మండిపడ్డారు. సూపరింటెండెంట్‌ ఛాంబర్‌ వద్ద ముస్తఫా బైఠాయించిన నిరసన తెలిపారు.

విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
టార్చ్‌లైట్ వెలుగులో ఆపరేషన్లు చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మరోవైపు వీడియో ఎలా బయటకు వచ్చింది, ఎవరు తీశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా గత మూడు నెలలుగా సెల్‌ఫోన్, టార్చ్‌లైట్ల వెలుగులోనే వైద్యులు ఆపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top