అన్నదాత.. గుండెకోత

More than 100 farmers commit suicide in district last three years - Sakshi

జిల్లాలో మూడేళ్లలో 100 మందికిపై రైతుల బలవర్మణం

వీధిన పడుతున్న కుటుంబాలు

ప్రభుత్వ చేయూత కరువు

సాక్షి, అమరావతి: జిల్లాలో కౌలు రైతులకు కష్టాలు వెన్నంటే వస్తున్నాయి. చీడ పీడలు, తెగులు, నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, ప్రకృతి వైపరీత్యాలకు తోడు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఫలితంగా కాడిని పక్కకు పడేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తిగా చేయూత కరువు కావడంతో చేసేది ఏమిలేక బలవంతగా ఉసురు తీసుకొంటున్నారు. దీంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. పది మందికి పట్టెడన్నం పెట్టే రైతన్న,అవమానం భరించలేక పురుగుల మందు డబ్బాతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. 

ఆత్మభిమానం చంపుకొలేని కొంత మంది రైతులు కిడ్నీలు అమ్ముకొనైనా అప్పు తీరుస్తామనే స్థాయికి వెళుతున్నారు. గుంటూరు జిల్లాలో మూడేళ్లలో వంద మందికిపైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 60 మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. గురువారం సాయంత్రం ఫిరంగిపురం మండలం  అల్లంవారిపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు కొండవీటి బ్రహ్మయ్య (45) రెండేళ్లుగా 15 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని ప్రత్తి, మిరప పంట సాగు చేశారు. గులాబీ రంగు పురుగుతో పత్తి పంట దెబ్బతింది. మిరప పంటకు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు. చివరకు రూ.17 లక్షల అప్పులయ్యాయి. తీర్చే దారిలేక గుంటూరు కలెక్టరేట్‌లోనే పురుగు మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాజా అనే రైతు తాను పడిన ఇబ్బందులను అధికారులకు వీడియో ద్వారా తీసి పంపడమే కాకుండా ఈ నెల 22 వ తేదీన గుంటూరులో కలెక్టర్‌ ఎదుటనే ఆత్మహత్య చేసుకొంటానని పేర్కొన్నాడు.  

కౌలు రైతులకు అసరా ఏదీ...
జిల్లాలో 3.5 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.60 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో కేవలం సాగు ధ్రువీకరణ పత్రాలు 50,884 మందికి, రుణ అర్హత పత్రాలు 35,921 మందికి మొత్తం 86, 139 మందికి మాత్రమే కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు ఇవ్వటం గమనార్హం. ఈ ఏడాది ఖరీప్‌లో రూ. 5193 కోట్లు, రబీలో రూ. 3461 కోట్లు మొత్తం రూ. 8654 కోట్ల రూపాయల పంట రుణాలను  ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందులో దాదాపు రూ. 7 వేల కోట్ల రూపాయలకుపైగా పంట రుణాలను ఇప్పటికే రైతులకు ఇచ్చారు. 

ఈ లెక్క ప్రకారం ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పంట రుణాల్లో 10 శాతం రుణాలు కౌలు రైతులకు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు రూ.150 కోట్లు మాత్రమే కౌలు రైతులకు ఇవ్వటం గమనార్హం. రుణ అర్హత పత్రాలు లేకపోవడంతో కనీసం విత్తనాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, యాంత్రీకరణ పరికరాలు కౌలు రైతులకు అందటం లేదు. పొలం కలిగిన రైతుల పేరిటనే పాసు పుస్తకాలు ఉండటంతో బ్యాంకర్లు సైతం కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు. మరో వైపు రైతులకు పంట చేతికి వచ్చే సమయంలో ధరలు పతనమవతున్నాయి.  

నిండా మునుగుతున్న రైతులు...
ప్రధానంగా కౌలు రైతులతోపాటు, రైతులు మూడేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. నాగార్జున సాగర్‌ కుడికాలువ పరిధిలో మూడేళ్లుగా వరి పంట పండక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో చేసేదేమి లేక ప్రత్యామ్నాయ పంటలైనా పత్తి , మిరప పంటల వైపు మొగ్గుచూపారు. గత ఏడాది మిర్చి పంట సాగు చేసిన రైతులు ప్రారంభంలో నకిలీ విత్తనాలతో నిండా మునిగారు. పంట చేతికి వచ్చాక మిర్చి ధరలు భారీగా పతనం కావడంతో కౌలు రైతులు కుదేలయ్యారు. దీంతో ఈ ఏడాది రైతులు  మిర్చి పంటకు బదులు పత్తి సాగు చేశారు. గులాబీ రంగు పురుగు సోకటంతో పంట దిగుబడులు భారీగా తగ్గాయి. రెండేళ్లుగా పంట దెబ్బతినడం, ధరలు లేకపోవడంతో అప్పులు తీర్చేదారిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

పడిపోయినా పప్పు ధాన్యాల ధరలు...
వరి పంటకు ప్రత్యామ్నాయంగా మినుము, పెసర, కంది పంట వేసిన రైతులు గుల్లయ్యారు. గత ఏడాది మినుము, పెసర పంటకు తలమాడు తెగులు సోకటంతో పంట నేల మట్టమైంది పండిన అరకొర పంటకు ఎన్నడూ లేని విధంగా మినుము, పెసర, కంది ధరలు పడిపోయాయి. దీంతో పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. మొత్తం మీద మూడేళ్లలో రైతులు, కౌలు రైతుల పరిస్థితి అంతకంతకు తీసికట్టుగా మారింది. 
 

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top