తిత్లీతో తక్షణ జీవనాధారం కరువు

Uddanam Collapse With Titli Cyclone - Sakshi

అక్టోబర్‌ 11 వ తేదీన ముంచుకొచ్చిన తిత్లీ తుఫాను ఉద్దానం ప్రజల జీవికను చుట్ట చుట్టి తన విలయపు రెక్కల మీద మోసుకు పోయింది. ఒక మత్స్యకార మహిళ మాటల్లో చెప్పాలంటే ‘‘తుఫాను యిరిగినాక సూత్తే వూరు తామర లాగా పైకి తేలినాది’’. విశాఖనుంచి ఒక బృందంగా కూడి నవంబర్‌ 1 తేదీన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాం. 160 కిలోమీటర్ల మేర విస్తరించిన తిత్లీ ప్రభావం శ్రీకాకుళం జిల్లా తామరపల్లి నుంచే కనపడసాగింది. పూండి నుంచి ఇద్దువానిపాలెం వరకూ దాదాపు నలభైగ్రామాలని చూశాం. పదిగ్రామాల లోపలికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడాం.   తుఫానుకు ఎడాపెడా కూలిపోయిన కొబ్బరి, జీడిమామిడి, పనస చెట్లతోపాటు అనేకచెట్లు ఎండి మోడువారుతున్నాయి. వాటి తొలగింపుకి ప్రభుత్వం సమకూర్చిన కోతమిషన్లు మొదలు నుంచి కొమ్మల్ని వేరుచేసి వెళ్ళిపోతున్నాయి. పదిమంది కలిస్తే తప్ప ఎత్తలేని చెట్టు మొదళ్ళు, కొమ్మలు–లారీల కొద్దీ ఎత్తవలసిన కొబ్బరిబొండాల గుట్టలని ఏం చేయాలో అర్థంకాక అలాగే వదిలేశారు రైతులు. పోయినవి ఏడాదికి ఒకటి రెండుసార్లు వేసుకునే పంటలు కాదు, నాటిన పదేళ్ళకి కాపుకి వచ్చే పంటలు.  ఇక అన్నేళ్ల పాటు వేలాది చిన్నకారు రైతుల జీవిక ఎలా గడు స్తుంది అన్నది ఇపుడు సమస్య. ఒకటీ అరా వేర్లు భూమిలోకి అంటుకుని ఉంటే చెట్టు చిగురించే ఆస్కారం ఉంది కనుక కొమ్మలు కొట్టేసి మొదలుని అలాగే ఉంచుతున్నారు కొందరు రైతులు. కానీ మొదలుకూడా తీసేస్తేనే నష్టపరిహారం ఇస్తాం అంటున్నారు అధికారులు. ఉంచాలో తీయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు రైతులు.  

ప్రభుత్వం కన్నా స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులే ఎక్కువ అండగా నిలబడ్డారని ప్రజలు చెపుతున్నారు. విపత్తు సంభవించిన ప్రాంతాల్లోకి ప్రభుత్వమే కదిలి వెళ్ళాలన్న ఆలోచన మంచిదే. కానీ పటాటోపాల రాజకీయవ్యవస్థలో పెద్దలరాక ఊరికి బరువు తప్ప ఓదార్పు కాదు. స్థానికంగా పని చేయాల్సిన అధికారులు, ఉద్యోగులు, వచ్చీపోయే వారి ప్రొటోకాల్‌ కోసం పరుగులు తీయడంలో మునిగిపోయారు. సర్వేలు చేసి, ఆన్‌ లైన్‌లో పొందుపరిచి నష్టపరిహారం ఇవ్వాలనుకోవడం పక్కా ప్రణాళిక కావచ్చు. కానీ సర్వం కోల్పోయిన వారికి ఎంత తొందరగా సాయం అందితే అంత ఉపశమనం కలుగుతుంది. విపత్తు వచ్చి ఇరవైరోజులు దాటినా వారికి భరోసా కలగకపోవడమే విషాదం. విపత్తువల్ల ప్రజల మానసికస్థితి ఊహించని మార్పులకి లోనవుతుంది. గొల్ల గండి గ్రామానికి వెళ్ళే తోవలో ఒకచోట భార్యాభర్తలిద్దరు చిన్నిచిన్ని ఎండుకొమ్మలు విరిచి పక్కన పెడుతూ కనిపించారు. మిగతావారు కనపడటం లేదేంటని అడిగితే ‘‘ఇదంతా సూసి బరాయించుకోనేక వూరువూరంతా తుండుగుడ్డ కప్పుకోని ఇంట్లోట పడుకుంది’ అని చెప్పిందామె. అంతేకాదు ‘ఇంట్లోట ఎండగా ఉంటే తోటకి వచ్చి సల్లగా కూకునేవాళ్ళం, తోటే ఎండ గొడతంటే ఎందల పడేది’ అని నిట్టూ ర్చింది. ప్రజలకి పునర్నిర్మాణం మీద ఆశ మానసికంగా కూడా కలగాలి.  

ఇద్డువానిపాలెం పరిస్థితి అత్యంత విషాదకరం. సముద్రతీర గ్రామం కావటాన ఏడెనిమిదేళ్ళ కిందట అక్కడికి దగ్గరలో ఉన్న బోరువంకలో వారికి స్థలం కేటాయించారు. ఈ తుఫానుకి గ్రామం సగం ఊడ్చిపెట్టుకుపోయింది. కానీ ఆన్‌లైన్‌లో వారిపేర్లు లేవు. ఎందుకంటే వారికి బోరువంకలో స్థలం కేటాయించారు కనుక అక్కడనే వారి ఇల్లు చూపించాలి. ‘మా ఊరిని దత్తత తీసుకోమని ఎవరికైనా చెప్పండి’ అంటూ పోరాటాలగడ్డ మీద పుట్టిన యువకుడు ‘కర్రి నాగరాజు’ నిస్సహాయతతో అన్నమాటలు అక్కడి పరిస్థితికి అద్దంపడుతున్నాయి. తీరప్రాంతపు ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం నివారణా మార్గాలను అమలుచేయాలి. భూమికోతని ఆపే రావణుడి మీసాలనే నేలతీగెలు, తీరప్రాంతపు తుఫానుగాలుల తీవ్రతని తగ్గించే పొట్టి చెట్లు, మొగలి పొదలు, సరుగుడు చెట్లతో మూడంచెల రక్షణవనాల పెంపకం సంబంధిత శాఖలు నిర్వహించాలి. తుఫాను షెల్టర్లను ప్రజలు ఉపయోగించుకునే భవనాలుగా మార్చాలి. ప్రజల తక్షణ జీవనాధారం కోసం వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు ఆహ్వానించి అమలు చేయాలి. (పర్యటించిన బృందం: కృష్ణాబాయి, జెవి రత్నం, నారాయణ వేణు, శశాంక్, రవి, ఈ వ్యాసకర్త)
వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘ 88850 16788
సందర్భం
కె.ఎన్‌. మల్లీశ్వరి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top