గూడు చెదిరింది.. గోడు మిగిలింది

The TDP Government Does Not Grant Full-Fledged Homes To The Titli Victims - Sakshi

తిత్లీ బాధితులకు పూర్తిస్థాయిలో ఇళ్లు మంజూరు చేయని ప్రభుత్వం

నిరాశ్రయులు.. కేటాయింపుల మధ్య భారీ వ్యత్యాసం

ఇప్పటికీ పరాయి పంచన తలదాచుకుంటున్ను బాధితులు

సాక్షి, సంతబొమ్మాళి (శ్రీకాకుళం): గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన తిత్లీ తుపాను ధాటికి నియోజకవర్గం అతలాకుతలమైంది. వందలాది మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయిలుగా మారారు. ఈ నేపథ్యంలో వారిని పెద్ద మనసుతో ఆదుకొని, అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వం వివక్షత చూపింది. అధికార పార్టీ నాయకులు చెప్పినదే వేదంగా బాధితుల జాబితాను ప్రకటించిన ప్రభుత్వ యంత్రాంగం వాటి ఆధారంగా ఇళ్ల కేటాయింపులు చేసింది. ఇందులో ప్రతిపక్ష పార్టీకి చెందిన బాధితుల పేర్లు లేవు సరికదా.. అధికార పార్టీ కరుణించక పోవడంతో నిరాశ్రయులుగా మారిన పేదలను కూడా విస్మరించారు.

ఇదిలా ఉండగా... తుపాను అనంతరం సంతబొమ్మాళి మండలానికి వచ్చిన సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కె.అచ్చెన్నాయుడు బాధితులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో టీడీపీ నాయకులు కొన్ని గ్రామాలకు అధికారులను తీసుకు వెళ్లి, ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు కేటాయిస్తామని నమ్మ బలికారు. దీంతో నౌపడ, సీతానగరం, మేఘవరం, సూరాడవానిపేట తదితర గ్రామాల్లో పరదాలు వేసుకుని, తల దాచుకుంటున్న ఇళ్లను కూడా కూల్చివేసి నిర్మాణాలను చేపట్టారు. అయితే... నిర్మాణాలు ప్రారంభించి నెలలు కావస్తున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.

అప్పులు చేసి మరీ పనులు చేపట్టామని, ఇలా అర్ధాంతరంగా వదలేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికార పార్టీ నాయకులు, హౌసింగ్‌ అధికారులను అడిగినా అదిగో.. ఇదిగో.. అంటూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. దీంతో చాలామంది బాధితులు ఇప్పటికీ తుపాన్‌ షెల్టర్, అద్దె ఇళ్లలో, పరాయి పంచన తల దాచుకుంటున్నారు. తమను రోడ్డు పాటు చేసిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామంటూ వారంతా హెచ్చరిస్తున్నారు. కాగా అధికారుల విడుదల చేసిన, వాస్తవ బాధితుల సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం.

నియోజకవర్గంలో ఇళ్లు కోల్పోయిన తిత్లీ బాధితులు

మండలం  అధికారులు గుర్తించిన ఇళ్లు
సంతబొమ్మాళి  1396
నందిగాం  684
టెక్కలి  40
కోటబొమ్మాళి  9

అద్దె ఇంటిలో ఉన్నాం
తిత్లీ తుపాను వల్ల  ఇళ్లు మొత్తం ధ్వంసమైంది. తల దాచుకునేందుకు నీడ లేకపోవడంతో ఐదు నెలలుగా అద్దె ఇంటిలో ఉంటున్నాం. ఇళ్ల నిర్మాణంలో భాగంగా పునాదులు వేసి నెలలు గడుస్తున్నా ఇంత వరకు బిల్లులు చెల్లించలేదు.
– కర్రె ఈశ్వరమ్మ, తిత్లీ బాధితురాలు, నౌపడ
వస్తాయనే చెబుతున్నారు
తిత్లీ తుపాను ప్రభావంతో ఉన్న గూడును కోల్పోయాం. బిల్లులు వెంటనే ఇస్తామని చెప్పడంతో ఇంటి నిర్మాణం చేపట్టాం. పునాదులు వేసి నెలలు గడుస్తున్నా బిల్లులు రాలేదు. దీనికోసం అడిగితే వస్తాయనే కాలయాపన చేస్తున్నారు.
– ఎల్‌.ప్రభావతి, బాధితురాలు, హెచ్‌.ఎన్‌.పేట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top