సుదర్శన చక్రం

Story On Sudarshan Chakra - Sakshi

శ్రీమన్నారాయణుడి సుగుణ రూపం స్మరించుకొంటే మనో ఫలకంలో కనిపించేది శంఖ చక్రాలు ధరించిన చతుర్భుజ విగ్రహం. హరి పూరించే శంఖానికి పాంచ జన్యం అని పేరు. హరి ధరించే చక్రాయుధం సుదర్శన చక్రం. వైష్ణవ భాగవతులకు సుదర్శన చక్రం కేవలం ఒక చక్రమూ, ఆయుధమూ కాదు. అది చక్రరూపంలో ఉన్న భగవానుడే. సుదర్శన చక్రాన్ని శివుడు శ్రీహరికి కానుక చేశాడని ఒక పురాణ కథ కనిపిస్తుంది. సూర్యుడి అపరిమితమైన తేజస్సువల్ల ఆయన భార్య సంధ్యా దేవికి కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేం దుకు దేవశిల్పి మయుడు సూర్య తేజస్సును కొంత తగ్గించేందుకు సహాయం చేశాడనీ, ఆ తరుగు తేజ స్సుతో ఆయన నిర్మించిన వస్తువులలో సుదర్శన చక్రం ఒకటి అనీ పురాణ కథ.

ఖాండవ వనాన్ని యథేచ్ఛగా దహించి భుజిం చుకొమ్మని కృష్ణా ర్జునులు అగ్ని దేవుడికి అభయం ఇచ్చిన సంద ర్భంలో, అగ్నిదేవుడు ఈ సుదర్శన చక్రాన్ని కృతజ్ఞతాపూర్వకంగా బహూకరించాడని మహాభారతం ఆది పర్వంలో ఒక ఉపాఖ్యానం చెప్తుంది. తనకు వర సకు మేనత్త కొడుకూ, చేది రాజు అయిన శిశుపాలుడు రాజసభలో తనను నిష్కారణంగా నిందిస్తుంటే, నూరు అపరాధాలు దాటే దాకా వేచి ఉన్న శ్రీకృష్ణుడు, తన సుదర్శనం ప్రయోగించి, అక్కడికక్కడే అతగాడి శిరస్సు ఖండించాడని సభాపర్వంలో కనిపిస్తుంది. భాగవత పురాణంలో, కరిని మకరి నుండి రక్షించి గజేంద్రమోక్షం కలిగించటానికి హరి వాడిన ఆయు ధం సుదర్శనమే.

తిరుమల క్షేత్రంలో స్వామివారి చక్రాయుధం స్వామికి కుడిభుజంగా, ఆయన కుడిభుజం మీద దర్శ నమిస్తుంది. తిరుమలకు వెళ్లే యాత్రికులను, ఇల్లు వదిలినప్పట్నుంచీ యాత్ర ముగించుకుని మళ్లీ ఇల్లు చేరేవరకూ సురక్షితంగా ఉంచే బాధ్యత సుదర్శన చక్రం నిర్వహిస్తుందట. బ్రహ్మోత్సవాలు జరిగే రోజు లలో సుదర్శనుడి ఉత్సవమూర్తి ఊరేగి, ఏర్పాట్లన్నీ పర్య వేక్షించి, స్వామివారు రాబోతున్నారని బహు పరా కులూ, హెచ్చరికలూ వినిపించటం ఆనవాయితీ.

ఈ సేవలన్నింటికీ గుర్తింపుగా, బ్రహ్మోత్సవాల ముగింపు సమయంలో, వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో తనకు జరిగే పన్నీటి స్నానాలకు, స్వామి సుదర్శనుడిని ప్రత్యేకంగా పిలిపించి, తనతోపాటు అభిషేకాలు జరిపిస్తారు. ఆ తరువాత, సుదర్శన చక్రత్తాళ్వారుకు మాత్రం స్వామి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. ఆ పుణ్య సమ యంలో దేవతాగణాలు కూడా ఆ పుష్కరిణిలోనే స్నానం చేసి పునీతమవు తాయట. చక్రస్నానంవేళ, వేలాది భక్తులు కూడా పుష్కరిణిలో స్నానంచేసి ధన్యులవుతారు.

– ఎం. మారుతి శాస్త్రి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top