అన్నా హజారే (సామాజిక కార్యకర్త) రాయని డైరీ

Social Worker Anna Hazare Unwritten Diary - Sakshi

మాధవ్‌ శింగరాజు

రామ్‌లీల మైదానంలో దీక్ష రెండో రోజుకు చేరుకుంది. రాత్రంతా చల్లగా ఉంటోంది. పగలంతా వేడిగా ఉంటోంది.
‘‘ఎందుకు పెద్దాయనా ఈ వయసులో! చెయ్యగలిగినవాళ్లే ఏమీ చెయ్యడం లేదు. ఏమీ చెయ్యలేనివాళ్లం..  మనం చేయించగలమా?’’ అన్నాడు ఒకాయన వచ్చి.
‘‘చెయ్యగలిగినవాళ్లు మౌనంగా ఉంటున్నారని, చేయించవలసినవాళ్లం మనమూ మౌనంగానే ఉండిపోదామా? చెప్పండి’’ అన్నాను. 
వచ్చి, నా పక్కనే కూర్చున్నారు ఆయన.  
డెబ్భైఏళ్ల వయసుకీ, ఎనభైæ ఏళ్ల వయసుకీ దీక్షలో కూర్చోవడంలో తేడా ఏమీ ఉండదు. ఏ వయసు వాళ్లు దీక్షలో కూర్చున్నా యూపీఏకి, ఎన్డీయేకి కూడా ఏమీ తేడా ఉండదు!
దీక్షకు కొద్దికొద్దిగా జనం జమ అవుతున్నారు. జనం జమ కాకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తోంది. రామ్‌లీలకు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో నీటి చుక్కన్నది దొరక్కుండా జాగ్రత్త పడుతోంది. హజారే ఆమరణ దీక్ష చేస్తున్నాడు కాబట్టి, ఆయన కోసం వచ్చేవాళ్లకూ అన్నమూ నీళ్లు అక్కర్లేదనుకున్నట్లుంది. 
ఆకలికో ఏమో, రాత్రంతా ఒకటే కలలు.
మొదట కేజ్రీవాల్‌ వచ్చాడు కలలోకి. 
‘మీరేమీ చిక్కిపోలేదు హజారేజీ’ అన్నాడు!
‘ఒకరోజు దీక్షకే నేను చిక్కి శల్యం అయిపోవాలని ఎలా ఆశిస్తావు కేజ్రీ’ అన్నాను. 
‘అయ్యో.. నా ఉద్దేశం అది కాదు హజారేజీ. ఏడేళ్ల క్రితం మనిద్దరం కలిసి దీక్ష చేశాం. అప్పటికీ, ఇప్పటికీ మీరేం చిక్కిపోలేదని అంటున్నాను’ అన్నాడు. అతడివైపు చూశాను. చాలా చిక్కిపోయి ఉన్నాడు!  ‘నువ్వేంటి కేజ్రీ అలా అయిపోయావ్‌?’ అని అడిగాను.
‘నా కిందివాళ్లెవరూ పని చేయడం లేదు హజారేజీ. వాళ్ల చేత పని చేయించలేక.. రోజూ ఆమరణ దీక్ష చేస్తున్నట్లే ఉంది నాకు’ అన్నాడు. 
‘అవినీతిపై ఏం చెప్పావు? ఏం చేస్తున్నావు కేజ్రీ’ అని అడిగాను. 
టప్పున కల చెదిరిపోయింది. కేజ్రీవాల్‌ మాయమై, మోదీ ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో గ్లాసు ఉంది. అందులో నిమ్మరసం ఉంది. 
‘తాగండి హజారేజీ. చల్లగా ఉంటుంది. ఎండకు బాగుంటుంది’ అన్నాడు. 
‘నన్ను చల్లార్చడానికా? దీక్షను చల్లార్చడానికా మోదీజీ?’ అన్నాను. 
‘ఎవరు చేయని దీక్ష చెప్పండి హజారేజీ?! చూస్తూనే ఉన్నారు కదా. పార్లమెంటులో రోజుకో దీక్ష అవుతోంది. ఆ దీక్షలు తప్పించుకోడానికి పార్లమెంటుకు వెళ్లకూడదనే దీక్షలో ఉన్నాను నేనిప్పుడు’ అన్నాడు మోదీ.
‘అవినీతిపై ఏం చెప్పావు? ఏం చేస్తున్నావు మోదీజీ’ అన్నాను. 
టప్పున కల చెదిరిపోయింది.
మోదీజీ మాయమై, మెలకువ వచ్చింది. 
రామ్‌లీలా మైదానంలో ఈ పీడకలలేంటో!
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top