ప్రతీకారంతో స్వీయ విధ్వంసం తథ్యం

Shekhar Gupta Article On Pulwama Terror Attack - Sakshi

జాతిహితం

పుల్వామాలో సైనికులపై దాడి తర్వాత మన టీవీ స్టూడియోలు వార్‌ రూమ్‌లుగా మారిపోయి ఎక్కడ దాడి చేయాలో, ఏ ఆయుధాలు వాడాలో కూడా అవే సూచిస్తున్న సమయంలో, దేశమంతటా పాక్‌పై ప్రతీకారం తప్పదంటూ ఆగ్రహం రేగుతున్న సమయంలో అందరూ గుర్తుంచుకోవలసిన పాఠం ఒక్కటే. ప్రతీకారంతో రగిలిపోయే జాతి విజయాన్ని సాధించడం కంటే స్వీయ విధ్వంసాన్నే చవిచూడవచ్చు. శతాబ్దాలుగా ప్రతీకార భావనలో మునిగిన ఆప్ఘానిస్తాన్‌ ఇప్పుడు మధ్యయుగాల స్థాయికి దిగజారిపోయింది. ప్రతీకారం మతిహీనులు ప్రకటించే భావోద్వేగం మాత్రమే. అదే సమయంలో స్వీయ నిరోధకత విజ్ఞుల మనస్సుల్లోంచి పుట్టుకొచ్చే సజీవ భావన.

పాకిస్తాన్‌ వెన్నుదన్నుతో పుల్వామాలో ఉగ్ర దాడి జరిగిన వెంటనే ప్రతీకారం తీర్చుకోవలసిందేనంటూ యావద్దేశం ఊగిపోయింది. కొద్దిరోజులపాటు దీనిపై టీవీల్లో, ఇతర మీడియాలో బహిరంగ చర్చ కొనసాగింది. దీంతో అనివార్యంగానే ప్రతికారానికి సంబంధించిన కొత్త పదబంధం పుట్టుకొచ్చింది. ప్రతీకారమే ఉత్తమ మార్గం. ఈ పదబంధాన్ని కనిపెట్టిన ఘనత మాత్రం ఆప్ఘాన్లకే దక్కుతుంది. ఎందుకంటే ప్రతీకారం తీర్చుకోవడం అనేది వారి జీవన శైలికి అత్యవసర లక్షణంగా మారింది. పైగా ఆ ప్రతీకారం తరాలపాటు కొనసాగేది. దాంట్లో వారెం తగా రాటుదేలిపోయారో తెలుసుకోవడం కోసం సోవియట్లను, అమెరికన్లను, లేదా పాకిస్తానీయులను అడిగితే చాలు. ఆప్ఘాన్‌లతో పెట్టుకో కండి. మీరు అంతకంతా అనుభవిస్తారు. 

ఈ ప్రతీకార చరిత్రను పక్కనబెట్టి ప్రస్తుతం ఆప్ఘానిస్తాన్‌ పరిస్థితిని చూడండి. వారు సాధించిన గత విజయాలు, భారత్‌లోని సంపన్నులను కొల్లగొట్టడం, రెండు అగ్రరాజ్యాలను చిత్తుగా ఓడించడం తర్వాత ఆప్ఘనిస్తాన్‌ చెల్లాచెదురైపోవడమే కాదు, నిరుపేద దేశంగా, దాదాపు మధ్యయుగ పరిస్థితుల్లోకి, పాలించడానికి వీల్లేని విధ్వంసంలోకి దిగజారిపోయింది. బహుశా మానవ చరిత్రలోనే ఇంత శాశ్వత నష్టాల్లో కూరుకుపోయిన మరో దేశాన్ని మనం చూడలేం. దీని వెనుక గుణపాఠం ఏమిటి? ప్రతీకారం అనే వంటకాన్ని వేడిగా లేక చల్లగా వడ్డించినా సరే అది ఆరగించడానికి చాలా అద్భుతమైన వంటకంగానే కనపడవచ్చు. కానీ మీ రక్తపిపాసను సంతృప్తిపరచుకోవడం తప్పితే అది మీకు ఒరగబెట్టేది ఏమీ ఉండదు. ప్రతీకారంతో రగిలిపోయే జాతి విజయాన్ని సాధించడం కంటే స్వీయ విధ్వంసాన్నే చవిచూడవచ్చు. 

ఇక పాకిస్తాన్‌ విషయానికి వద్దాం. 1971లో భారత్‌ చేతుల్లో ఘోర పరాజయం పొందాక ప్రతీకారం తీర్చుకోవాలని దశాబ్దాల ఘర్షణను అది కొనసాగించింది. ఈ క్రమంలో పాక్‌ ఆర్థికవ్యవస్థ, సమాజం, రాజ్యపాలన పూర్తిగా ధ్వంసమైపోయింది. మరోవైపున యుద్ధంలో గెలిచిన విజేత భారత్‌ ప్రతీకారం కంటే ‘నిరోధకత’కు ప్రాధాన్యమిచ్చింది. ప్రతీకారం మందబుద్ధులు, మతిహీనులు ప్రకటించే కేవల భావోద్వేగం మాత్రమే. అదే సమయంలో స్వీయ నిరోధకత అనేది విజ్ఞత కలిగిన వారి మనస్సుల్లోంచి నిత్యం పుట్టుకొచ్చే సజీవ భావన. ఉదాహరణకు ఉడీలో ఫిదాయీలు దాడి తర్వాత భారత్‌ జరిపిన సర్జికల్‌ దాడులను చూడండి. వాళ్లు 19మంది మన సైనికులను చంపారు. మనం అంతకంటే ఎక్కువమంది ఉగ్రవాదులను చంపేశాం. రక్తానికి రక్తం సమాధానం అన్నమాట. కానీ వాళ్లు పుల్వామాలో మళ్లీ మన గొంతుకోశారు. దీనికి మళ్లీ మనవైపునుంచి ప్రతీకారం ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో టీవీ స్టూడియోలు వార్‌ రూమ్‌లుగా మారిపోయాయి. ఎక్కడ దాడి చేయాలో, ఏ ఆయుధాలు వాడాలో కూడా అవే సూచిస్తున్నాయి. ఇక మన ప్రధాని నరేంద్రమోదీ ‘మీ ప్రతి కన్నీటిబొట్టు’కు బదులు తీరుస్తాం అంటూ వాగ్దానం చేస్తున్నారు. ఇక మన వ్యాఖ్యాతలు ఈసారి తప్పకుండా ఏదో ఒకటి చేసేయాల్సిందే అని మోత మోగిస్తున్నారు. ఎంత సీరియస్‌ ఘటనలకూ స్పందించని వారు కూడా ప్రతీకారమే ఉత్తమం అంటున్నారు. ఇది సరిగ్గా ఆప్ఘాన్‌లు చాలాకాలంగా చెబుతున్నట్లే ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న. ప్రతీకారం తర్వాత ఏం జరుగుతుంది? అది మీకు శాంతిని, భద్రతను సంపాదించిపెడుతుందా? అది మీకు ఎన్నికల్లో విజయాన్ని సాధించి పెట్టవచ్చు. కానీ అది మీ శత్రువును నిరోధించగలుగుతుందా? 

చరిత్రలోకి వెళితే.. కౌటిల్యుడి ధోవతి ఒక ముళ్లపొదలో చిక్కుకుని చిరిగిపోయినప్పుడు ఆ ముళ్లపొదను తెగనరకడానికి అతడు ప్రయత్నించలేదు. కాస్త సమయం తీసుకుని తీపి పాలను ఆ ముళ్లపొద కుదురులో పోశాడు. చంద్రగుప్తుడు ఎందుకలా చేశావని అడిగితే ‘నేను దాన్ని నరికినట్లయితే అది మళ్లీ వేర్లనుంచి పెరుగుతుంది. అదే చక్కెర కలిపిన పాలను దాని కుదుళ్లలో పోస్తే, ఆ తీపి పాలు లక్షలాది చీమలను ఆకర్షించి అవి ముళ్లపొద వేర్లతో సహా తినివేస్తాయి’ అన్నాడు కౌటిల్యుడు.  ఇక్కడ ముళ్లపొదను తెగనరిగే కొడవలి ప్రతీకారం అయితే, తీపిపాలు అనేది నిర్మూలన అవుతుంది. ఈ భావన ఏమాత్రం ఆకర్షణీయమైనది కాదు పరమ పాశవికమైనది. కానీ కౌటిల్యం అంటే అదే మరి. 

అలాగే 1962లో చైనా చేసిన దురాక్రమణ భారత్‌ను శిక్షించడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి, భూభాగాన్ని లాక్కోవడానికి కాదు. అది నిరోధకతను సృష్టించడమే. అది భారత్‌ ముందుకు పురోగమించే పాలసీకి భరతవాక్యం పలికింది. టిబెటన్లతో సరసమాడటం అనే మన వ్యూహానికి ఆ దాడి చెక్‌ పెట్టింది. అంతేకాకుండా సరిహద్దుల రక్షణకోసం 1962 నాటి యుద్ధపద్ధతుల్లోనే పోరాడాలనుకుంటున్న భారతీయ వ్యూహకర్తలను తరాలపాటు రక్షణాత్మక తత్వంలోకి నెట్టేసింది. తర్వాత చైనీయులు పాకిస్తాన్‌ను తమ విలువైన క్లయింటుగా మార్చిపడేశారు. అయిదు దశాబ్దాల నుంచి భారత్‌ను నిలువరించేందుకు అతి చిన్న దేశ మైన పాక్‌ని చైనీయులు అత్యంత తెలివిగా వాడుకుంటూ వస్తున్నారు.
1971లో ఇందిరాగాంధీ తనదైన అర్థశాస్త్రాన్ని అమల్లో పెట్టారు. ఆ సంవత్సరం మార్చి నెలలో పశ్చిమ పాకిస్తాన్‌ పాలకులు తమ ఆధీనంలోని తూర్పు పాకిస్తాన్‌ (బంగ్లాదేశ్‌)పై సైనిక చర్యలకు పాల్పడినప్పుడు ఆమె ప్రజాగ్రహం పట్ల స్పందించకుండా, 9 నెలలపాటు తగిన సైనిక, దౌత్యపరమైన సన్నాహక చర్యలను చేపడుతూ వచ్చారు. ఈ విరామ సమయంలో ఆమె సైన్యాన్ని సిద్ధపర్చారు. అమెరికాను, చైనాను అడ్డుకోవడానికి సోవియట్లతో సంధి కుదుర్చుకున్నారు. పాకిస్తాన్‌ అతి చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచమంతటా తిరిగి ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించారు. పాక్‌ను ఆమె ఎంతగా ఊపిరాడకుండా చేశారంటే డిసెంబర్‌లో పాక్‌ సైనిక జనరల్‌ యాహ్యాఖాన్‌ను యుద్ధం ప్రకటించని స్థితిలోకి నెట్టారు. అనంతరం పాక్‌ ఈ 50 ఏళ్ల కాలంలో తన కలలో కూడా ఎన్నడూ కశ్మీర్‌ ఆక్రమణకోసం తన సైన్యాన్ని ఉపయోగించే ఆలోచనలకు పోలేదు. 1980ల చివరి నుంచి అది ఉగ్రవాదానికి, మంద్రస్థాయి ఘర్షణలకు మళ్లింది. చివరగా పాకిస్తాన్‌పై మీరు ప్రతీకారం తీసుకోండి. అది వారినేం చేయలేదు. వారిపై సైనిక దాడులను చేయండి. వారు ఎదురుదాడి చేస్తారు. ఈ క్రమంలో మనం మరింత ఆగ్రహానికి గురవుతుంటాం. ప్రతీకారం తప్పదంటుంటాం, నిస్పృహకు గురవుతుంటాం కూడా. అటు తన వద్ద ఉన్న అణ్వాయుధాలు, ఇటు సాంప్రదాయిక సైనికబలంలో తన సరిపోలని అసౌష్టవం రెండూ కలిసి భారతీయ నిర్ణయాత్మక దాడిని నిరోధిస్తాయన్న నమ్మకంతో పాకిస్తాన్‌ ఒక దేశంగా కొనసాగుతూనే ఉంటుంది.

మనం ఈ కలుగులోంచి బయటకు వెళ్లేముందు, ఇక్కడ మనకు ఏం లభించిందో అర్థం చేసుకోవాలి. నేను నిర్ధారణకు వచ్చిన అంశాలు ఇవి. 1. విజేత కంటే ఓటమి పాలైనవారే ఎక్కువ గుణపాఠం నేర్చుకుంటారనేది పాత సామెత. పాకిస్తాన్‌ నుంచి వచ్చే ప్రమాదాలకు 1971 పూర్తిగా అడ్డుకట్ట వేస్తుందని భారత పాలకులు తప్పుగా భావించారు. అందుకు భిన్నంగా జుల్ఫికర్‌ అలీ భుట్టో సంప్రదాయ సైనిక దాడులకు స్వస్తి పలికారు. కానీ, భారత్‌ను కాదంటూ అణుశక్తిగా పాక్‌ ఎదిగింది. 1980 నాటికి పాకిస్తాన్‌ తన అణుశక్తితో తగిన బలం సంపాదించుకుంది. అప్పటి నుంచి తొలుత పంజాబ్‌లో, తర్వాత కశ్మీర్‌లో అల్లర్లు సృష్టిం చడం ప్రారంభించింది. భారత్‌ నిశ్చింతంగా ఉంది. 2. 1998లో జరిగిన పరీక్షలతో రెండు దేశాలు అణుశక్తితో సమాన స్థాయిని పొందాయి. దీంతో పాకిస్తాన్‌ మళ్లీ కొత్త ఎత్తుగడలకు పోగా, భారత్‌ అణుశక్తికి కట్టుబడింది. దీంతో సంప్రదాయ యుద్ధం వచ్చే అవకాశం పోయింది. భారత విధాన నిర్ణయిక బృందం ‘న్యూక్లియర్‌ లేజీ’గా మారిందని చెప్పడం కాస్త సాహసమే అవుతుంది. పెను విధ్వంసాలను సృష్టించే మారణయుధాలు ఓటమిపాలైనవారి చివరి అస్త్రాలని ఆ బృందం మరిచిపోయింది. ఈ విషయంలో పాక్‌ తెలివిగా వ్యవహరించింది. 3. ఫలితంగా తన ఆర్థిక స్థాయికి తగినట్టుగా సంప్రదాయ సైనిక బలం పెంచుకోవడంలో భారత్‌కు ఆసక్తి లేకపోయింది. సంప్రదాయ సైనిక బలం పెంపుతో దండించగలిగే స్థాయి ద్విగుణీకృతమవుతుందని, తద్వారా మెరుపుదాడుల నుంచి పాక్‌ను నియంత్రించవచ్చనీ, అణుశక్తి స్వీయ వినాశనానికేననే భావనవైపు పాక్‌ను నెట్టవచ్చని భారత్‌ మరి చిపోయింది. లేకపోతే, ఇక్కడ బస్సులను పేల్చివేసేప్పుడు పాక్‌ పునరాలోచనలో పడి ఉండేది. ఈ న్యూక్లియర్‌ లేజీనెస్‌ కారణంగా జీడీపీలో భారత రక్షణ బడ్జెట్ల శాతం తగ్గుతూ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు యుద్ధమే గనుక వస్తే.. మూడు దశాబ్దాల క్రితం రాజీవ్‌గాంధీ కొనుగోలు చేసిన వాటినే మొదటి వరుసలో నిలపాల్సి వస్తుంది. 

అణుశక్తివల్ల యుద్ధాలు వచ్చే అవకాశం లేనప్పుడు ఎందుకు అధికంగా ఖర్చు చేయాలి? దేశభద్రత కోసం ఎంతో చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే మోదీ ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో బ్రెయిన్‌ వాష్‌ అవసరం. అది ఏడవ వేతన సంఘం సిఫారసులు అమలు చేసింది. కానీ, జీడీపీలో రక్షణ బడ్జెట్‌ శాతాన్ని తగ్గించివేసింది. అంతో, ఇంతో ప్రతీ కారం తీర్చుకోవడం ద్వారా మనల్ని మనం బాగానే సమర్థించుకోవచ్చు. కానీ, పాకిస్తాన్‌కు అడ్డుకట్టవేయలేం. మనం ముందుకెలా వెళ్లాలి? పాక్‌ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనే అంశాన్ని పక్కనబెట్టి, భారీగా సైన్యాన్ని పెంపొందించుకోవాలి. సైనిక బలంతో ప్రత్యర్థిలో వణుకు పుట్టించాలి. పాతకాలం నాటి సంప్రదాయక సైనిక శక్తిగా అవతరించి వారిని నిరోధించాలి. ఇది కౌటిల్యుడు చెప్పిన తియ్యని పాలు వంటి ఉపదేశంలా అనిపించవచ్చు. తలనొప్పిగా కూడా భావించొచ్చు. కాస్త సమ యం, సహనం ఉంటే ఇది పని చేస్తుంది. అప్పుడు వచ్చే ఎన్నికల్లో చంద్రగుప్తుడిని గెలిపించాల్సిన తప్పనిసరి బాధ్యత కౌటిల్యుడిపై పడదు.

వ్యాసకర్త : శేఖర్‌ గుప్తా, ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top