ప్రణబ్‌ ముఖర్జీ రాయని డైరీ

Pranab Mukherjee Was Attend For RSS Meeting - Sakshi

నాగపూర్‌ వెళ్లొచ్చినప్పట్నుంచీ నా మనసుకు హుషారుగా ఉంది. ఊహు.. వెళ్లొచ్చినప్ప ట్నుంచీ కాదు, వెళ్లబోయే ముందు నుంచీ! ‘ఆరెస్సెస్‌ పిలిస్తే మీరు వెళ్లడం ఏంటి ప్రణబ్‌జీ!’ అని.. మా పక్కింట్లో ఉండే బెంగాలీ.. మాణింగ్‌ వాక్‌లో అవాక్కయ్యాడు. సాధారణ పౌరుడే అవాక్కయ్యాడంటే దేశంలోని అసా ధారణ పౌరులు ఇంకెంత అవాక్కవుతారో కదా అని అప్పుడు నేను ఆలోచించలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఆలోచిస్తున్నాను. 

బెంగాల్‌లో ఉండేది అంతా బెంగాలీలే అయినప్పుడు బెంగాల్‌లోని ఏ పక్కింట్లోనైనా బెంగాలీనే కదా ఉంటాడు. అయితే ఈ పక్కింటి బెంగాలీ ఎప్పుడూ ‘నేను బెంగాలీని కాదు ప్రణబ్‌జీ, భారతీయుడిని’ అని  నడుస్తూ, నడుస్తూ.. ఆయాసంగా అంటుంటాడు. అలాగని అతడి గురించి ‘మా పక్కింట్లో ఉండే భారతీయుడు’ అని చెబితే.. ‘ప్రణబ్‌జీ మీరు భారతీయుడు కాదా!’ అని రేపు మాణింగ్‌ నాతో పాటు నడిచే ఇంకో వాకర్‌ అవాక్కయ్యే ప్రమాదం ఉంది. బెంగాలీ బెంగాలీనని చెప్పుకోకున్నా భారతీయుడు కాకుండా పోడు. భారతీయుడు భారతీయుడినని చెప్పుకోకపోతే మాత్రం బెంగాలీగా కూడా మిగలడు.

ఏం తోచక, మరికొంత సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను. బహుశా పక్కింటి బెంగాలీ కూడా నాలాగే తన ఇంట్లో ఏం తోచక, నా గురించే ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. నాగ పూర్‌లో నేనేమీ మాట్లాడలేదు కాబట్టి, నా గురించి ఆలోచించడానికి ఏమీ లేదని దేశ ప్రజలందరికీ తెలిశాక కూడా పక్కింటి బెంగాలీ నా గురించి ఏం ఆలోచిస్తూంటాడు?! 
‘‘వెళ్లొద్దంటే విన్నారా.. నాన్నా..’’ అంది శర్మిష్ట దిగాలుగా వచ్చి. 
‘‘ఇప్పుడేమైందమ్మా..’’ అన్నాను. 
‘‘ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా అయి ఉంటే!’’ అంది. 
‘‘నేనేమైనా బంగీ జంప్‌ చేసి వచ్చానా తల్లీ! ఊరికే స్టేజీమీద నాలుగు ముక్కలు మాట్లాడ్డానికే కదా వెళ్లాను’’ అన్నాను. 
‘‘కానీ నాన్నా.. కాంగ్రెస్‌ మీద కోపంతో మీరు బంగీ జంప్‌ లాంటిదేదో చేయబోతున్నా రని మేమంతా భయంభయంగా టీవీల ముందు కూర్చున్నాం. పక్కింటి అంకుల్‌ కూడా మనింటికే వచ్చి కూర్చున్నారు. ఆయన మాకన్నా భయస్తులు. స్టేజీ మీద ఎవర్ని చూసినా ‘ఆయన మీ డాడీనే కదా’ అని అడుగు తున్నారు. ‘తలపై ఆ క్యాప్‌ పెట్టుకుంది మీ డాడీనే కదూ’, ‘చెయ్యి అలా అడ్డంగా పైకి లేపి ప్రణామం చేస్తున్నది మీ డాడీనే కదూ’ అని మా ప్రాణం తీశారు’’ అంది శర్మిష్ట. 
‘‘పాపం.. వాళ్లు ముందే చెప్పారు కదమ్మా.. మీటింగ్‌ తర్వాత కూడా ప్రణబ్‌ ప్రణబ్‌లాగే ఉంటారనీ, ఆరెస్సెస్‌ ఆరెస్సెస్‌లానే ఉంటుందనీ’’ అన్నాను. 
‘‘అయినా గానీ భయంగానే ఉంది నాన్నా’’ అంది శర్మిష్ట. ‘‘ఎందుకమ్మా..’’ అన్నాను. 
‘‘నాగపూర్‌ నుంచి వచ్చినప్పటి నుంచీ మీలో కొత్త ఉత్సాహం ఏదో కనిపిస్తోంది నాన్నా’’ అంది!! 

మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top