గో‘దారి’ మళ్లితే.. గొడవే

mla solipeta ramalinga reddy write article on godavari and krishna rivers - Sakshi

సందర్భం
రాష్ట్రాల అభ్యర్థనలను లెక్కించకుండా మొండిగా నదులను అనుసంధానం చేసి  తెలంగాణ మాగాణాన్ని ఎండబెట్టి గోదావరి జలాలను కృష్ణా, కావేరిలకు పంపించే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజానీకం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు.

తెలంగాణ ఉద్యమం బలంగా పల్లెల్లోకి చొచ్చుకుపోవటానికి, విస్తరించటానికి, బలపడటా నికి నీళ్లే  కారణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నీళ్లే ఆధారం.  రైతులు, కూలీలు, కులవృ త్తులు, చేతి వృత్తులు, సబ్బండ జాతులు  అంతా కలిస్తేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవు తుంది. ఈ వ్యవస్థకు మూలం వ్యవసాయం. నీళ్లుంటేనే  పల్లె పచ్చగా ఉంటుంది. నీళ్ల విలువేంటో తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌  బడ్జెట్‌లో యేటా 25 వేల కోట్ల నిధులు ప్రాజెక్టులకు కేటాయించి  కోటి ఎకరాల మాగా ణికి జీవం  పోసే దిశగా వడివడిగా అడుగులు వేస్తు న్నారు.  గోదావరిలో మనకొచ్చే 954 టీఎంసీల వాటా లో ఒక్క చుక్క వృథాగా పోకుండా  జల ప్రాజెక్టులకు రూపం ఇచ్చారు. 

ఇప్పుడు నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను బలవంతంగా తీసుకపోయి  కృష్ణా, కావేరిలోకి  మళ్లించి  దిగువ రాష్ట్రాల్లో  ఓట్ల  సాగుకు మోదీ సర్కారు తహతహలాడుతున్నట్లుంది
కృష్ణా నదిలో 79 శాతం పరీవాహక ప్రాంతం తెలం గాణలోనే ఉంది. అంటే ముప్పావు వంతు జలాల వాటా తెలంగాణకు దక్కాలే. కృష్ణానది నీటి లభ్యత 811 టీఎంసీలు. ఈ లెక్కన కనీసం 600 టీఎంసీలు తెలం గాణకు రావాలే. కానీ అప్పటి హైదరాబాద్‌ ప్రభుత్వం తెలంగాణకు 161 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వాటాను 111కు కుదించింది. పోయిన నీళ్లు ఎలాగు పోయాయి, కనీసం ఉన్న గోదా వరి జలాలనైనా పోతం చేసుకుందామంటే కేంద్రం  తెర మీదకు తెచ్చిన నదుల అనుసంధానంతో మళ్లీ తెలంగా ణను ఎండబెట్టేటట్టే  కనబడుతోంది. 

ఒడిశా రాష్ట్రంలోని మహానదిలో 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీలు మొత్తం కలసి 890 టీఎం సీల మిగులు జలాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం లెక్కలు చెప్తోంది. మహానదిని గోదావరితో కలసి, గోదా వరిని కృష్ణానది మీదుగా కర్ణాటక, తమిళనాడు సరి హద్దుల్లో ఉన్న కావేరి నదికి అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉండగా.. నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం కలిపి 684 టీఎంసీల జలాలే వాడు కుంటున్నారని, మిగిలిన 270 టీఎంసీల నీళ్లు మిగులు జలాలే అని చెప్తోంది. 

ఇవి అన్యాయమైన లెక్కలని జలరంగ నిపుణులు దివంగత విద్యాసాగర్‌రావు బతికి ఉన్నంతకాలం నెత్తి నోరు బాదుకున్నారు. ఇప్పుడు గోదావరి మీద కాళే శ్వరం, కంతనపల్లి, తుపాకుల గూడెం, దుమ్ము గూడెం, దేవాదుల ప్రాజెక్టులు రూపం పోసుకుంటున్నాయి. పాత  ప్రాజెక్టులు ఉండనే ఉన్నాయి. ఏ నది జలాలైనా ప్రస్తుత, కనీస భవిష్యత్తు పరీవాహక ప్రాంత అవస రాలను తీర్చాలి. అంటే మరో 30 ఏళ్ల నాటికి పెరగ నున్న జనాభా, వారికి అవసరమైన నీటి పరిమాణాన్ని  నిర్థారించి లెక్కగట్టాలి. ఆ తరువాతే మిగులు జలాలను గుర్తించాలి. కానీ  కేంద్రం మాత్రం 20 ఏళ్ల కిందట 75 శాతం నీటి లభ్యతతో తీసిన లెక్కలు చెప్తోంది. ఆ లెక్కలు ఇప్పటి నీటి లభ్యతతో ఎలా సరిపోలుతాయి? 

భవిష్యత్తు అవసరాలపై కేసీఆర్‌ ప్రభుత్వానికి పక్కా ప్రణాళిక ఉంది. నిర్మాణం పూర్తి అయిన  ప్రాజెక్టు కింద 433.04 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 475.79 టీఎంసీలు, చేపట్టబోయే ప్రాజెక్టుల కింద 45.38 టీఎంసీలు మొత్తం కలిపి 954 టీఎంసీల జలాలు మనకు అవసరపడుతాయి. మరో వైపు మహానదిలో అసలు మిగులు జలాలే లేవు అని ఒడిశా ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్రాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకో కుండా మొండిగా నదులను అనుసంధానం చే సి  తెలం గాణ మాగాణాన్ని ఎండబెట్టి గోదావరి జలాలను కృష్ణా, కావేరిలకు పంపించే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజా నీకం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు.

నదుల అనుసంధానం అనేది ఇప్పటి ముచ్చటేం కాదు. 1960లో 4,200 కిలోమీటర్ల పొడవైన హిమా లయ ప్రాంత కాల్వలను, 9,300 కిలోమీటర్ల పొడవైన దక్షిణ ప్రాంత కాల్వలను ఢిల్లీ–పట్నాల వద్ద కలపాలని కెప్టెన్‌ దస్తూన్‌ తొలిసారి ప్రతిపాదించారు. ఆ తరువాత 1972లో అప్పటి కేంద్ర మంత్రి, ఇంజనీరు కేఎల్‌రావు కావేరి–గంగా నదుల ప్రతిపాదన చేశారు. సోన్, నర్మద, పెన్‌ గంగ, ప్రాణహిత, గోదావరి, కృష్ణా నదుల మీదుగా కావేరి నదితో అనుసంధానం చేయాలని సూచించారు. ఈ రెండు కూడా ఆచరణ సాధ్యం కాదని అప్పట్లోనే కేంద్రం తేల్చి చెప్పింది. నాటినుంచి నదుల అనుసంధాన ప్రతిపాదనపై చర్చ జరుగుతూనే ఉంది. అనుకూల వర్గం కంటే వ్యతిరేక వర్గమే ఎక్కువగా ఉండ టంతో ప్రభుత్వాలు ఈ ప్రక్రియను పక్కన పెట్టాయి. 

పశ్చిమ కనుమల్లో  వర్ష ప్రభావం ఎక్కువ. అక్కడ  స్థిరమైన వర్షపాతం ఉంది. అంతా గుట్టలు, లోయలతో కూడిన ప్రాంతం కాబట్టి వ్యవసాయ భూమి, నివాస ప్రాంతాలు కూడా తక్కువే. ఏటా వందల కోట్ల క్యూసె క్కుల జలరాశులు వచ్చి చేరుతున్నాయి. ఇందులో 90 శాతం నీళ్లు పశ్చిమంగా ప్రవహించి వృథాగా అరేబియా మహా సముద్రంలో కలుస్తున్నాయి. కేంద్రం ముందుగా ఈ జలాల వినియోగంపై దృష్టి పెట్టాలి. వీటిలో పావు వంతు నీళ్లను ఒడిసిపట్టుకుని, తూర్పు దిశగా తీసుకు వచ్చి మహానదిలోకి మళ్లిస్తే ఆ జలాలు గోదావరి, కృష్ణాల మీదుగా కావేరి నదిని తడుతాయి. అప్పుడు  నాలుగు నదులేమిటీ? దక్షిణ భారతంలోని నదులన్నిం టినీ అనుసంధానం చేయవచ్చు. మోదీ అటు దిశగా ఆలోచన చేయకుండా గోదావరిని కృష్ణా, కావేరితో అను సంధానం చేస్తానంటే మాత్రం తెలంగాణ ప్రజలు మరో మహా ఉద్యమానికి సమాయత్తం అవుతారు.


సోలిపేట రామలింగారెడ్డి         
వ్యాసకర్త దుబ్బాక శాసనసభ్యులు
మొబైల్‌ : 94403 80141

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top