చీకట్లు తొలగించిన నల్లసూరీడు

Mallepalli Lakshmaiah Writes On Nelson Mandela - Sakshi

కొత్త కోణం
వలస విధానాలకు ఎదురు తిరిగినందుకు తెగ పెద్దగా ఉంటున్న మండేలా తండ్రిని బ్రిటిష్‌ వలస పాలకులు  పదవినుంచి తొలగించి, భూముల్నీ లాక్కున్నారు. లొంగని తండ్రి ఊరు వదిలిపెట్టారు. ఇది కేవలం మండేలా కుటుంబ కథ మాత్రమే కాదు. ప్రతి నల్లజాతి కుటుంబానిదీ ఇదే వేదన. ‘‘నల్లజాతి ప్రజలకు భూమి జీవనాధారం. అంతేగాక భూమి మీద నల్లజాతి ప్రజలందరికీ సమష్టి హక్కులుండేవి. వ్యక్తిగత ఆస్తి అనేదే ఆనాడు లేదు,’’ అంటూ మండేలా నాటి నల్లజాతి ప్రజల ప్రజాస్వామ్య జీవన విధానాన్ని వివరించారు. అయితే బ్రిటిష్‌ వారి రాకతో ఈ సమానత్వ భావన కనుమరుగైపోయింది.

‘‘హోసా తెగ, మొత్తం దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజ లందరం పరాజితులం. పుట్టిన గడ్డమీదనే మనం కట్టుబానిసలం. సొంత భూమిలో కౌలుదారులం. మనం తెల్లజాతి పెట్టుబడి దారుల గని పనిమనుషులం. శ్వేత జాతి ధనవం తులు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతున్నారు. మనం కటిక దారిద్య్రంలో బతుకులీడుస్తున్నాం.’’ నెల్సన్‌ మండేలా జన్మించిన ఆదివాసీ తెగ అధిపతి మెలిగ్‌కిలి తన జాతి  విముక్తి కోసం పలికిన మాట లివి. సరిగ్గా ఇవే మాటలు నల్లజాతీయులపై శ్వేత జాత్యహంకార దోపిడీనీ, అణచివేతనీ ధిక్కరించిన మండేలా గుండెను రగిల్చాయి. తనను విప్లవ యోధుడిగా తీర్చిదిద్దడానికి ఈ మాటలే స్ఫూర్తినిచ్చాయి.

నెల్సన్‌ మండేలా 1918 జూలై 18న దక్షిణా ఫ్రికాలోని తెంబు ప్రాంతంలోని ఖును జిల్లా వెజో గ్రామంలో జన్మించారు. మండేలా తండ్రి గాడ్లా హెన్రీ. తల్లి నోసెకెని ఫ్యానీ. ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం ఒకప్పుడు సర్వ స్వతంత్ర దేశంగా ఉండేది. ఎప్పుడైతే యూరప్‌ నుంచి వలస వర్తకులు, పెట్టు బడిదారులు దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టారో అప్పటి నుంచి అక్కడి నల్లజాతి ప్రజలు కట్టు బానిసల య్యారు. మండేలా పుట్టే నాటికే దక్షిణాఫ్రికా బానిస దేశంగా మారిపోయింది. స్థానిక నల్లజాతుల వారి అన్ని హక్కులూ హరించి, ఆధిపత్యం చెలాయిస్తోన్న శ్వేత జాతీయులు సహజ వనరులను సొంతం చేసు కున్నారు. ఇక నల్లజాతి మహిళల పరిస్థితి వర్ణనా తీతం. వారిపై సర్వాధికారాలూ చెలాయిస్తూ గొడ్డు చాకిరీ చేయించుకునేవారు.

మహిళలను తమ దగ్గరే ఉంచి, మగాళ్లను మాత్రం సుదూర తీరాలకు తర లించి అక్కడి బంగారు గనుల్లో కార్మికులుగా వాడుకు న్నారు. అయితే మండేలాది ఆదివాసీ రాచరిక ప్రతిని ధిగా ఉన్న కుటుంబం కావడం వల్ల కార్మికుల కుటుం బాలతో కలిసి జీవించే అవకాశం రాలేదు. సామాజిక పరిస్థితులు నెల్సన్‌ మండేలాను నిరంతరం ఆలో చింపజేసేవి. తెల్లజాతి పాలకులు మండేలా కుటుం బాన్ని అన్ని రకాలుగా వేధించారు. వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు భూమి మీద హక్కు లేకుండా చేశారు. దక్షిణాఫ్రికాలో మండేలా జన్మించిన హోసా తెగతో పాటు, జూలూ, స్వాన, సొతో తెగల ప్రజలు అనాదిగా నివాసముంటున్నారు. డచ్‌ వర్తకులు ప్రవే శపెట్టిన బానిస విధానం, బ్రిటిష్‌ వారి రాకతో మరింత పాతుకుపోయింది.

వలసపాలనపై మండేలా తండ్రి ధిక్కారం
బ్రిటిష్‌ వలస విధానాలపై ఎదురు తిరిగినందుకు హోసా తెగ పెద్దగా వ్యవహరిస్తోన్న మండేలా తండ్రిని ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన భూములన్నింటినీ బ్రిటిష్‌ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. బతుకుదెరువు కోసం పుట్టిన ఊరు విడిచి నెల్సన్‌ మండేలా కుటుంబం పట్టణానికి చేరింది. ప్రతి నల్లజాతి కుటుంబానిదీ ఇదే వేదన. ‘నల్లజాతి ప్రజలకు భూమి జీవనాధారం. అంతేగాక భూమి మీద నల్లజాతి ప్రజలందరికీ సమష్టి హక్కు లుండేవి. వ్యక్తిగత ఆస్తి అనేదే ఆనాడు లేదు’ అంటూ మండేలా నాటి నల్లజాతి ప్రజల ప్రజాస్వామ్య జీవన విధానాన్ని వివరించారు. అయితే బ్రిటిష్‌వారి రాకతో ఈ సమానత్వ భావన కనుమరుగైపోయింది. నల్ల జాతి ప్రజలను విభజించి, కొంత మంది తెగల పెద్ద లకు కొంత భూమి అప్పజెప్పారు. అప్పటివరకూ లేని పేద, ధనిక అంతరాలు దక్షిణాఫ్రికా ప్రజల జీవితాల్లోకి ప్రవేశించాయి.

కుటుంబంలో మండేలానే తొలి తరం అక్షరాస్యుడు. బ్రిటిష్‌ విధానాల ప్రకారం నడిచే పాఠశాల కావడంతో ఆయన పేరుకు ముందు ఆయన ఉపాధ్యాయుడు నెల్సన్‌ అనే ఇంగ్లిష్‌ పేరు చేర్చారు. మండేలా తొమ్మిదేళ్ల వయస్సులో ఉన్న ప్పుడే ఆయన తండ్రి మరణించారు. దానితో ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది. తండ్రి లేని మండే లాను హోసా తెగ నాయకుడు జోగింతాబా దత్తత తీసుకున్నారు. ఆయన సొంత ఊరు వదిలి తెంబూ లాండ్‌ రాజధానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి వరకూ స్వేచ్ఛా విహంగంలా గడిపిన మండేలా ఒక్కసారిగా కట్టుబాట్లలో బందీ అయ్యారు. అయితే తెగ అధిపతి పిల్లలతో పాటు, మండేలాకు కూడా ఆ కుటుంబంలో తగిన ప్రేమ లభించింది. రాజభవనం సమీపంలో నడిచే పాఠశాలలో ఇంగ్లిష్‌ , హోసా తెగ చరిత్ర, భూగోళ శాస్త్రం లాంటి విషయాలు నేర్చుకున్నారు. ఆ సమయంలోనే నల్లజాతి ప్రజల ఘనమైన చరిత్ర చదివే సందర్భం మండేలాకు ఎదురైంది.

విద్యార్థిగా రాజకీయాల్లోకి!
మండేలా హోసా పెద్ద సహకారంతో  విద్యాభ్యాసం కొనసాగించారు. ఆయన చదువుతో పాటు బాక్సిం గ్‌లో ప్రావీణ్యం సంపాదించారు. ఎలాంటి తారత మ్యాలు లేకుండా, బరిలో ఇద్దరు మాత్రమే కలబడే ఆటగా ఆయన బాక్సింగ్‌ను అభివర్ణించారు. ఒక్క నల్లజాతివారే చదువుకునే అవకాశం ఉన్న  ఫోర్ట్‌ హరే విశ్వవిద్యాలయంలో మండేలా 1939లో చేరారు.  చదువుతో పాటు విద్యార్థి సంఘ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వర్సిటీలో రెండో సంవత్సరం లోనే విద్యార్థి ప్రాతినిధ్య సమితి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ సమితి విద్యార్థుల సమస్యలను పరిష్క రించడంలో విఫలమైందని భావించి రాజీనామా చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు తరగతులకు హాజరుకావద్దని నిర్ణయించిన విద్యార్థులకు నాయకత్వం వహించడంతో విశ్వవిద్యాలయం యాజమాన్యం ఏడాదిపాటు మండేలాను బహిష్కరించింది.

అక్కడి నుంచి నెల్సన్‌ మండేలా చదువు కొనసాగలేదు. ఇంటికి తిరిగివచ్చిన మండేలాకు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇది ఇష్టంలేని మండేలా జోహానిస్‌బర్గ్‌ పారిపోయారు. అక్కడ చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూనే, కరస్పాండెన్స్‌ ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత విట్‌ వాటర్స్‌ రాండ్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర కోర్సులో చేరారు. ఆ సమయంలో సాగుతున్న జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలోకి దూకి 1942 నుంచి ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ)లో భాగస్వామి అయ్యారు. ఉద్యమస్ఫూర్తితో ఏఎన్‌సీ ముందుకు పోవడం లేదని గ్రహించిన మండేలా యువతను కూడగట్టారు. 1949 నుంచి ఏఎన్‌సీ ఉద్యమ స్వరూపం మారిపోయింది. దీనికి ప్రధాన బాధ్యత మండేలా నాయకత్వం వహిస్తున్న యూత్‌లీగ్‌దే. సమ్మెలు, సహాయ నిరాకరణలు, బహిష్కరణల వంటి ప్రజా పోరాటాలను మండేలా ప్రారంభించారు.

ఇదే సమయంలో నల్లజాతి ప్రజలకు న్యాయ సహాయం అందించడానికి మరో ఉద్యమకారుడు ఆలివర్‌ టాంబోతో కలిసి ఒక న్యాయకేంద్రం స్థాపిం చారు. అయితే మండేలాకు అహింసా ఉద్యమం మీద నమ్మకం పోయింది. మిలిటెంట్‌ పోరాటాలకు ప్రజలు సన్నద్ధం కావాలని ఆయన కోరారు. 1961లో మూడు రోజుల జాతీయ సమ్మెకు మండేలా పిలుపునిచ్చారు. దీనితో బెదిరిపోయిన శ్వేత జాతి ప్రభుత్వం మండేలాను అరెస్టు చేసి అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. 1963లో రెండోసారి విచారణ జరిపి ఆయనతో పాటు మరో పది మంది ఏఎన్‌సీ నాయ కులకు యావజ్జీవ శిక్ష విధించింది. అప్పటి నుంచి 27 సంవత్సరాలు మండేలా జైలు జీవితం గడిపారు.

పోరాట పంథా విరమణకు ససేమిరా!
అయితే 1985లో అప్పటి శ్వేత జాతి ప్రభుత్వ అధ్య క్షుడు పి.డబ్ల్యూ. బోథా ఒక రాజకీయ ఎత్తుగడతో ముందుకు వచ్చారు. సాయుధ పోరాట పంథాకు స్వస్తి చెబితే,  జైలు నుంచి విడుదల చేస్తామని మండే లాకు సందేశం పంపారు. దానికి అంగీకరించిన మండేలా ఖైదీలతో చర్చలు జరపడం చట్ట వ్యతిరేక మనీ, విడుదల చేసి మాట్లాడితే అది ప్రజాస్వామిక విధానమవుతుందని తేల్చిచెప్పారు. మండేలా విడు దలకు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. దేశాలు, ప్రజలు, ప్రభుత్వాలు ఖండాంతరాల నుంచి ఆయన విడుదల కోసం డిమాండ్‌ చేశారు. కానీ బోథాను పదవి నుంచి తొలగించి, మండేలా విడుదలకు మార్గం సుగమం చేయాల్సివచ్చింది. 1990లో బోథా స్థానంలో అధ్యక్ష పదవిని చేపట్టిన ఫ్రెడరిక్‌ విలియం క్లార్క్‌ మండేలా విడుదల విషయం ప్రకటించారు. ఏఎన్‌సీపై నిషేధం ఎత్తివేయడంతో పాటు, రాజ కీయ సంస్థలపై ఆంక్షలు తొలగించారు.

రాజకీయ ఖైదీల ఉరిశిక్షలు రద్దు చేశారు. నల్లజాతి వారందరికీ ఓటు హక్కు లభించే దాకా సాయుధ పోరాటం సాగుతుందని మండేలా తేల్చి చెప్పారు. విడుదల య్యాక 1991లో మండేలా ఏఎన్‌సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో జాత్యహం కార విధానాన్ని నిర్మూలించి, ప్రజాస్వామ్యాన్ని నెల కొల్పడానికి, నల్లజాతి ప్రజలకు సర్వాధికారాలు లభించడానికి క్లార్క్‌తో మండేలా విస్తృతంగా చర్చిం చారు. 1994 మే 10న నెల్సన్‌ మండేలా దక్షిణాఫ్రికా నల్లజాతి తొలి అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. అప్పటి నుంచి 1999 వరకు పదవిలో కొనసాగారు. 1996లో దక్షిణాఫ్రికా నూతన రాజ్యాంగం ఆమోదించారు. నల్లజాతి ప్రజలకు విద్యను చేరువ చేయడానికి ఎన్నో పథకాలు ప్రారంభించారు. ఎన్నో అవరోధాలు, నిర్బంధాలు, ఆంక్షలు ఎదుర్కొని దేశాన్ని తెల్ల జాతి పాలన నుంచి విముక్తి చేసిన నెల్సన్‌ మండేలా 2013 డిసెంబర్‌ 5న శాశ్వతంగా కన్నుమూశారు. (నెల్సన్‌ మండేలా శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా)


వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మల్లెపల్లి లక్ష్మయ్య
మొబైల్‌ : 97055 66213 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top