రామ్‌నాథ్‌ కోవింద్‌ రాయని డైరీ

Madhav Singaraju Unwriten Dairy On Ram Nath Kovind - Sakshi

తలనొప్పిగా ఉంది. ‘‘ఎక్కువ ఆలోచించకండి’’ అంది సవిత. ఆలోచిస్తే వచ్చిన నొప్పి కాదు, ఆలోచన లేకపోవడం వల్ల వచ్చిన తలనొప్పి ఇది. ఈ సంగతి ఆవిడకు చెబితే అర్థం చేసుకుంటుందో, అర్థం చేసుకోలేక తలనొప్పి తెచ్చుకుంటుందో?!

ఐ అండ్‌ బి మినిస్ట్రీకి ఆలోచన లేకపోవడం వల్ల రాష్ట్రపతి భవన్‌కి వచ్చిన తలనొప్పి ఇది. ఐ అండ్‌ బి సెక్రెటరీ సిన్హా నెల క్రితమే వచ్చి కూర్చున్నాడు. ‘‘అవార్డులు ఎక్కడిద్దాం సార్‌? విజ్ఞాన్‌ భవన్‌లోనా? రాష్ట్రపతి భవన్‌లోనా?’’ అని.

‘‘ఏంటి తేడా?’’ అన్నాను.
‘‘ఎప్పుడూ రాష్ట్రపతి భవన్‌లోనే ఇస్తాం సర్‌. ఈసారి మంది ఎక్కువయ్యారు. విజ్ఞాన్‌ భవన్‌ అయితే స్పేషియస్‌గా వచ్చినవాళ్లంతా కూర్చోడానికి బాగుంటుంది’’ అన్నాడు.

‘మంది’ అనగానే నా కాళ్లు ఒణికాయి.
‘‘అంతమందికి ఇవ్వలేనయ్యా.. నన్ను త్వరగా పంపించు. ఓ పదిమందైతే ఫర్వాలేదు’’ అన్నాను.

‘‘నేను చూసుకుంటాను సార్‌’’ అన్నాడు.
ఏం చూసుకున్నాడో ఏమో. ఆర్టిస్టులంతా అవార్డు తీసుకోకుండానే హర్టయి వెళ్లిపోయారు. కళలు బలమైనవి అంటారు. కళాకారులు ఇంత బలహీనంగా ఎందుకుంటారో అర్థం కాదు!
‘ఇస్తే రాష్ట్రపతి ఇవ్వాలి. ఇవ్వలేకపోతే రాష్ట్రపతి ఇవ్వలేకపోతున్నారని చెప్పాలి. రాష్ట్రపతి ఇస్తాడని పిలిపించి, రాష్ట్రపతేతరుల చేత ఇప్పించి పంపాలని చూడ్డం ఏంటని’ అంతా నొచ్చుకున్నారట.
నా ప్రెస్‌ సెక్రెటరీని పిలిచి అడిగాను.. ‘‘అశోక్‌.. ఏంటయ్యా ఇది! స్టేజీ మీద ఎక్కువసేపు ఉండలేనని ముందే నువ్వు ఐ అండ్‌ బి కి చెప్పలేదా?’’ అని.‘‘చెప్పాను సార్‌. అయినా గానీ, అందరికీ మీరే అవార్డులు ఇస్తారని ఐ అండ్‌ బి ఇన్విటేషన్‌లు పంపింది’’ అన్నాడు!

ఐ అండ్‌ బి సెక్రెటరీ అక్కడే ఉన్నాడు.
‘‘నిజమే సార్‌. మీరు కొద్దిసేపే ఉంటారని అశోక్‌ చెప్పాడు. రాష్ట్రపతి ఇచ్చే అవార్డులు రాష్ట్రపతి చేతుల మీదుగానే ఇవ్వాలని రూల్‌ ఏమీ లేదు కదా అనీ.. ఏదో మాట వరసకి ‘ప్రెసిడెంట్‌ వుడ్‌ గివ్‌ ద అవార్డ్స్‌’ అని కార్డులో కొట్టించాం సార్‌. ఇంతగా ఆర్టిస్టులు హర్ట్‌ అవుతారని అనుకోలేదు సార్‌’’ అన్నాడు!

‘‘ఇప్పుడేం చేద్దాం! అంతా నన్ను ప్రణబ్‌జీతో కంపేర్‌ చేస్తున్నారయ్యా. లాస్ట్‌ ఇయరో, ఆ ముందు ఏడాదో..  నిలబడీ నిలబడీ కాళ్లు, అవార్డులు ఇచ్చీ ఇచ్చీ చేతులు అలసిపోయినా కూడా, చిన్న బ్రేక్‌ తీసుకుని మూడుగంటల పాటు ప్రణబ్‌జీ అలా స్టేజీ మీదే ఉండిపోయారట. చెప్పండి. ఏం చేద్దాం?’’ అన్నాను.

‘‘ఇప్పుడేం చెయ్యడానికి లేద్సార్‌’’ అన్నాడు ప్రెస్‌ సెక్రెటరీ.
‘‘నెక్ట్స్‌ ఇయర్‌ దాదాసాహెబ్‌ అవార్డు ఒక్కటే రాష్ట్రపతి చేతులు మీదుగా ఉంటుందని ముందే ప్రకటిస్తే ఏ గొడవా ఉండదు సర్‌’’ అన్నాడు ఐ అండ్‌ బీ సెక్రెటరీ! -మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top