కేసీఆర్‌ (తెలంగాణ సీఎం)

Madhav SIngaraju Article On Telangana Elections Results - Sakshi

రాయని డైరీ

మళ్లొక ఉద్యమం చేసినట్లైంది.. తెలంగాణ కోసం! పాగల్‌గాళ్లు, బేవకూఫ్‌లు,  బద్మాష్‌లు, చిలకజోస్యం చెప్పేటోళ్లు అంతా జమైన్రు.. కేసీఆర్‌ను ఓడగొట్టేటందుకు! కేసీఆర్‌ ఓడిపోతడా? ఓడిపోతడో, ఓడగొడతడో రెండు రోజులు ఆగితే చూస్తం గదా. తొందరెందుకు? 

పోలింగ్‌ తర్వాత రెండు రోజులు
ఆగినం, ఫలితాలకు ముందు రెండు రోజులు ఆగుతున్నాం. కారు ఆగిపోతదో, వీళ్ల కారుకూతలు ఆగిపోతయో పేపరోళ్లు రాయరా? చానలోళ్లు చూపించరా?
ఇప్పటికే రాస్తున్నరు, చూపిస్తున్నరు.. టీఆర్‌ఎస్‌ డెబ్బై, ఎనబై, తొంబై, నూరు అని! కేసీఆరేమైనా చెప్పి రాయించుకుంటున్నడా పేపర్లలో?! అడిగి చూపించుకుంటున్నడా టీవీలల్లో?!

తెలంగాణలో కేసీఆర్‌ రాకపోతే మళ్లొచ్చి తెలంగాణలో ఎవరు కూర్చుంటరో తెల్వదా తెలంగాణ ప్రజలకి? తెల్వనంత పిచ్చోళ్లా!  తెల్వకుండానే తెలంగాణ తెచ్చుకున్నరా. ఎట్లనుకుంటున్నరు వీళ్లకు ఓటేస్తరని! ఓటేసి మళ్లీ ఇచ్చుకోవడం కోసమా తెలంగాణను తెచ్చుకుంది? 

ముందస్తు మీద కూడా ఎన్ని మాటలు అన్నరు! కేసీఆర్‌కి భయం పట్టుకుందట. ఎవర్ని చూసి భయపడాలి? కేసీఆర్‌ ఎప్పుడన్నా భయపడిండా? ఎవడికన్న భయపడిండా? చావుకే భయపడలే. ఈ సన్నాసిగాళ్లకు భయపడతడా? ముందడుగు వెయ్యకుంటే తెలంగాణ వచ్చిండేదా? ముందస్తుకు వెళ్లకపొయ్యుంటే మళ్లొక ముందడుగు వెయ్యడం అయ్యేదా?

మంత్రులకే నమ్మకం లేకపోయే. ఇప్పుడొద్దన్నరు. అప్పుడే వద్దన్నరు. ‘వద్దా,
సర్లే’ అని, మీటింగ్‌ అయినంక బయటికొచ్చి.. అసెంబ్లీని డిజాల్వ్‌ చెయ్యకపొయ్యుంటే.. ఇప్పటికేమైతుండేది? శీతాకాల సమావేశాల్లో కూర్చొని ఉండేటోళ్లం. జానారెడ్డిగారు లేచి  ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు.

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి లేచి, ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ.. అంటూ, సేమ్‌ థింగ్‌ నేనేదైతే చేస్తానని వారికి చెప్పానో, అదే నన్ను చేయమని అడుగుతూ ఉండేవాడు!
ఇయన్నీ గాదు. ముందస్తుకు వెళ్లకపొయ్యుంటే.. పన్నెండునో, ఆ తర్వాతనో ప్రమాణ స్వీకారం చెయ్యడానికి ఉండేదా? ఎనిమిది నెలల పవర్‌ పోతుందని కుర్చీలో కదలకుండా కూర్చుంటే ఫ్రెష్‌గా మరో ఐదు సంవత్సరాల పవర్‌ రెన్యువల్‌ అయ్యేదా? తెలివుండాలి. 

గవర్నమెంట్‌ ఫామ్‌ అయిన వెంటనే.. ప్రజలకు కాదు గానీ..  లగడపాటికి, రేవంత్‌రెడ్డికి ఏదైనా ఇవ్వాలి. టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని అందరూ చెబుతుంటే లగడపాటి ఒక్కడే టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని చెప్పాడు కాబట్టి అతడికి ఏదైనా ఇవ్వాలి. 
రేవంత్‌రెడ్డి నా ముక్కుమీద సెటైర్‌లు వేశాడు. ఆ మెంటల్‌గానికీ ఏదైనా ఇవ్వాలి. నేనే ఇవ్వడమా, ఎవరిచేతైనా ఇప్పించడమా ఆలోచించాలి. వాళ్లిద్దరి కోసం హరితహారం లాంటి కార్యక్రమం ఏదైనా మొదలుపెట్టాలి. 

హరితహారంలో కోట్ల మొక్కలు నాటాం. ‘పిట్టలహారం’ అని పేరు పెట్టి, చెట్లపై కోట్ల పిట్టల్ని పెంచితే?! పిట్టలు.. పిట్టలు.. పిట్టలు. ఎటు చూసినా పిట్టలు. కొండకల్‌లో పిట్టలు, కొడంగల్‌లో పిట్టలు. ముక్కు పవరేంటో రేవంత్‌రెడ్డికి తెలిసి రావాలె. ఇంటి ముంగట చెట్టు మీది పిట్టొచ్చి ముక్కుతో టకాటకా తలుపుని పొడిచి పక్క మీంచి లేపుతుంటే అప్పుడు తెలుస్తది. రేవంత్‌రెడ్డి అమరావతికి పారిపోవాలె.
ఇక అక్కుపక్షుల్ని, అపశకునం పక్షుల్ని కూడా పెంచితే సర్వేల దొర లగడపాటికి చేతిలో పిట్టల్లా ఉంటాయి. చేస్తా. ఎవరికివ్వాల్సింది వాళ్లకు ఇస్తా.
-మాధవ్‌ శింగరాజు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top