రాయని డైరీ : కె.ఆర్‌.రమేశ్‌ (కర్ణాటక స్పీకర్‌)

Madhav Singaraju Article On Karnataka Politics - Sakshi

మాధవ్‌ శింగరాజు 

కుమారస్వామి మూడ్‌లో లేరు. మూడ్‌లో లేకపోతే లేకపోయారు, సిఎం సీట్‌లో కూర్చునే మూడ్‌ కూడా ఆయనలో కనిపించడం లేదు! ఆదివారం ఎప్పుడు పోతుందా, సోమవారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు విశ్వాస తీర్మానంలో ఓడిపోతామా? ఎప్పుడు వెళ్లి ప్రతిపక్షంలో కూర్చుంటామా అన్నట్లుగానే ఉన్నారు. సోమవారం ఫ్లోర్‌ టెస్ట్‌. ‘‘సోమవారమే కదా రమేశ్‌’’ అని అడిగారు కుమారస్వామి నుదుటిని చేత్తో పట్టుకుని. ఏడాదిగా ఆయన అలా నుదుటిని చేత్తో పట్టుకునే కూర్చుంటున్నారు. సభ లోపల అంతే, సభ బయటా అంతే. అసలు లోపలనీ బయటనీ కాదు.. మనిషి కనపడితే చాలు, నుదుటిపైకి ఆయన చెయ్యి వెళ్లిపోతోంది. మనుషుల మీద నమ్మకం పోయి, అదలా వెళ్లిపోతున్నట్లుంది. ‘‘మాట్లాడవేం రమేశ్‌! సక్సెస్‌ఫుల్‌గా పైకి లేస్తామంటావా?’’ అని అడిగారు.

సర్‌ప్రైజ్‌ అయ్యాను. ‘సక్సెస్‌ఫుల్‌గా పడిపోతామా రమేశ్‌’ అని అడగాలి అసలైతే ఆయన ఇప్పుడున్న మూడ్‌లో. ‘సక్సెస్‌ఫుల్‌గా పైకి లేస్తామా రమేశ్‌?’ అని అడిగారంటే ఆయన మూడ్‌లోనే ఉన్నారని!  ‘‘సంతోషంగా ఉంది కుమారస్వామి’’ అన్నాను. కుమారస్వామిని కుమారస్వామి అనేంత చనువు ఆయన దగ్గర నాకు ఉంది. ఉంది అని నేను అనుకుంటున్నాను కానీ, ఉంటే తప్పేముంది అని ఆయన అనుకుంటున్నారో లేదో నుదుటిపై నుంచి ఆ చెయ్యి అడ్డు తీస్తే గానీ తెలియదు. కుమారస్వామి నా కంటే పదేళ్లు చిన్న. పైగా పాతికేళ్ల క్రితమే దేవెగౌడ దగ్గర స్పీకర్‌గా చేశాను. తండ్రి దగ్గర స్పీకర్‌గా చేసి, కొడుకు దగ్గరా స్పీకర్‌గా చేస్తున్నప్పుడు తెలియకుండానే ఆ మాత్రం చనువు వద్దన్నా వచ్చేస్తుందేమో. ఆయన నన్ను రమేశ్‌ అంటారు. నేను కుమారస్వామి అంటాను. 

‘‘ఇప్పుడే ఎందుకు సంతోషం? సక్సెస్‌ఫుల్‌గా పైకి లేచాక కదా. అసలే ఒకసారి ఫెయిలయ్యాం. క్రయోజనిక్‌ ఇంజిన్‌లో మళ్లీ ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే?!’’ అన్నారు కుమారస్వామి.  ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఆయన అంటున్నది చంద్రయాన్‌ గురించి!! మూడ్‌లోకి వచ్చారనుకున్నాను కానీ, మూడ్‌లోనే ఉండిపోతారని అనుకోలేదు.‘‘మీరు ఫ్లోర్‌ టెస్ట్‌ గురించి అడుగుతున్నారని అనుకున్నాను. స్పేస్‌ టెస్ట్‌ గురించని అనుకోలేదు’’ అన్నాను. ‘‘ఫ్లోర్‌ టెస్ట్‌లో మీరు గానీ, నేను గానీ సంతోషపడేందుకు ఏముంటుంది రమేశ్‌? మీరు స్పేస్‌ టెస్ట్‌ గురించి చెబుతారనే నేను అనుకున్నాను’’ అన్నారు కుమారస్వామి.. ప్యాంట్‌ జేబులోంచి కర్చీఫ్‌ బయటికి తీసి! ఆయన కర్చీఫ్‌ని తీశారంటే తీరని ఆవేదనలో ఉన్నారనే. పైకి స్పేస్‌ అంటున్నారు కానీ, ఆయన లోపలంతా ఫ్లోరే ఉన్నట్లుంది. 

‘‘మీరలా కర్చీఫ్‌ బయటికి తీసినప్పుడల్లా నాకొకటి అర్థం కాకుండా ఉండిపోతుంది కుమారస్వామీ’’ అన్నాను. ‘‘మీకేం అర్థం కాకుండా ఉండిపోకూడదని మీరు అనుకుంటున్నారో చెప్పండి రమేశ్‌’’ అన్నారు కుమారస్వామి. ‘‘కర్చీఫ్‌ను తియ్యకుండానే కన్నీళ్లను ఆపలేమా అన్నది నాకెప్పుడూ అర్థం కాని విషయం. మీరనే కాదు. ఎవరైనా..’’ అన్నాను.  విరక్తిగా నవ్వారు కుమారస్వామి. ‘‘వస్తున్న కన్నీళ్లను, వెళ్తున్న ఎమ్మెల్యేలను ఎవరాపగలరు’’ అన్నారు నవ్వుతూనే కళ్లు తుడుచుకుంటూ.  కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై మూడు రోజులుగా చర్చ జరుగుతోందని మాత్రమే  దేశానికి తెలుసు. కుమారస్వామి సీఎం అయిన నాటి నుంచి పద్నాలుగు నెలలుగా జరుగుతున్నదీ అదేనని ఆయనకు, నాకు మాత్రమే తెలుసు.

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top