పారదర్శకతకు దూరంగా బీసీసీఐ

Madabhushi Sridhar Article On BCCI - Sakshi

విశ్లేషణ

మన దేశంలో ప్రస్తుతం వందల వేలకోట్ల రూపాయలు సంపాదించే బడా వ్యాపార సంస్థలుగా క్రీడా సంస్థలు ఎదిగాయి. ఈ క్రీడా రాజకీయ వ్యాపారులు రహస్యాలు దాస్తుం టారు. వీరు సమాచార హక్కును తమకు పరమశత్రువుగా భావిస్తారు. పారదర్శకత అంటే ఎందుకని అడుగుతారు. వీరు పుఠాణి ప్రియులు. బయటకు ఏదీ చెప్పరు.ఈక్రికెట్‌ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయిలో సాగించే పెద్ద దుకాణం బీసీసీఐ. కోట్ల రూపాయల లావాదేవీలు ఉంటాయి. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వంటి దారుణాలకు పాల్పడే క్రీడాఘాతకులకు ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. ఇది కుంభకోణాల పుట్ట. స్కాండల్స్‌కు పుట్టిల్లు. వీరు ఆర్టీఐ చట్టం కిందకు రావాలని, జనం అడిగిన సమాచారం ఇవ్వాలంటే అందరూ సరే అంటారు. కానీ ఎవరూ సహకరించరు. వీరికి తోడుగా మంత్రులు ఉంటారు. పేరు మోసిన లాయర్లు వీరి కేసులను కోర్టులకు మోసి, కావలిసిన స్టేలూ అవీ ఇవీ తెచ్చి న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. ప్రజాస్వామ్యానికి, సుపరిపాలనకు, అర్హులైన క్రీడాకారులను ఎంపిక చేయడానికి సానుకూల వాతావరణం ప్రోత్సాహక పథకాలు ఇవన్నీ మంచి వక్తల అంశాలుగా ఉంటాయి. వాటిని వాస్తవాలుగా మలచడం మాటలు చెప్పినంత సులువు కాదు. 

కాంగ్రెస్‌ పార్టీ పరిపాలిస్తున్న కాలంలో అజయ్‌ మాకెన్‌ అనే నాయకుడు క్రీడామంత్రిగా ఉండేవాడు. ఆయన పాపం క్రీడా సంఘాల పేరుతో సాగే దుకాణ దుర్మార్గాలను నిలిపివేయడానికి వాటిలో పారదర్శకత తేవాలని అనుకున్నాడు.  ఎంత మంచి ఆలోచన. క్రికెట్‌ అనే అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లను ఎంపిక చేసే మహత్తర బాధ్యతలను నిర్వర్తించదలుచుకున్నారా? అయితే మీరు ప్రభుత్వ కార్యవిధులు నిర్వహిస్తున్నట్టే కనుక మీరు ఆర్టీఐ కింద జవాబుదారీగా ఉండండి అని అజయ్‌ మాకెన్‌ సందేశం ఇవ్వదలచుకున్నారు. ఆయన ఒక చట్టాన్ని తెద్దామనుకున్నారు. అదేమంటే దేశంలో అన్ని క్రీడా సమాఖ్యలను ప్రభుత్వ సంస్థలుగా పరిగణించి వాటిని ఆర్టీఐ చట్టం పరిధిలోకి తేవడం. బిల్లును తయారు చేశారు గాని దానికి చిల్లులు కొట్టే వారుం టారని పాపం అజయ్‌ మాకెన్‌ గారు ఊహించి ఉండరు. మన్‌ మోహన్‌ సింగ్‌ గారి క్యాబినెట్‌ లో దానికి ఆమోదం లభించలేదు. కారణం బీసీసీఐ వారి లాబీయింగ్‌ శక్తి అని ది ఫస్ట్‌ పోస్ట్‌ అనే అంతర్జాల పత్రికా సంస్థ వ్యాఖ్యానించింది.

జనం కళ్లనుంచి తమ క్రికెట్‌ క్రీడనే కాదు, దేశంలో ఉన్న అన్ని క్రీడా వ్యాపారాలను రక్షించుకుని తమ కార్యకలాపాలను ప్రజల ప్రశ్నలకు గురికాకుండా కాపాడుకోవడానికి క్రికెట్‌ సంఘం వారు ఎంతగా శ్రమించారో మనకు ఈ సంఘటనతో అర్థమవుతుంది. సుప్రీం కోర్టు వారు ఎన్ని నీతి వాక్యాలను ధర్మసూత్రాలను వల్లించినా, ఎన్ని సలహాలు సందేశాలు ఇచ్చినా ఆదేశాలు జారీచేసినా, రాజకీయాధికారాన్ని శాసించడం కొంచెం కష్టమే. అందుకే  ఆ బిల్లు డీలా పడింది. క్రీడా సంస్థలలో పారదర్శకత తేవాలనే ఆలోచన మూలన పడింది. అంతటితో ఆగిందనుకుంటే అదీ పొరబాటే. క్రీడాసంఘాల బలం ఎంత పెరిగిం దంటే మళ్లీ క్రికెట్‌ క్రీడలో పారదర్శకత అనే మాట మాట్లాడకుండా ఉండాలంటే అజయ్‌ మాకెన్‌ నుంచి క్రీడాశాఖనే తొలగించాలని ఆ లాబీ పనిచేసిందని, విజయం సాధించిందనీ ఆ అంతర్జాలపత్రిక రచిం చింది. ఆ తరువాత ఏ క్రీడామంత్రయినా ఆ పదవిలో ఉండాలంటే క్రికెట్‌ దుకాణాలలో పారదర్శకత గురించి మాట్లాడడానికి ధైర్యం చేయరాదనే నీతి సూత్రాన్ని ఈ కథ నేర్పింది.

ముకుల్‌ ముద్గల్‌ అనే న్యాయనిపుణుడు రూపొందించిన బిల్లు క్రీడాపారదర్శక క్రమబద్దీకరణ ప్రయత్నం మూలన పడిపోయింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఐపీఎల్‌ ఇంకో భారీ వ్యాపారం. జాతీయ ఆర్థిక ప్రయోజనాలకు ఉపకరించే భారీ స్థాయిలో డబ్బును సమకూరుస్తున్న క్రికెట్‌ను ఆరోగ్యవంతంగా కాపాడుకోవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రిషన్‌ లాల్‌ గెరా వర్సెస్‌ హర్యానా కేసులో (2011)అభిమన్యుతివారీ (2016) బలరామ్‌ శర్మ (2010) కేసులో స్పాట్‌ ఫిక్సింగ్‌ అన్యాయాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. 2015 బీసీసీఐ కేసులో పరిశోధనల ద్వారా అధ్యక్షుడు ఎన్‌ శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మెయ్యప్పన్‌కు ఇందులో ప్రమేయం ఉందని తెలిసి, ఇక చాలు శ్రీనివాసన్‌ దిగిపొమ్మని అంటే గాని ఆయన దిగిపోలేదు. ఆయన అనుయాయులు కూడా పొటీ చేయరాదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించవలసి వచ్చింది. అయినా పారదర్శకత ను బీసీసీఐ స్వాగతించడం లేదు. ఎంత దుర్మార్గం?

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top