నీచ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి

 Lakshmi parvathi writes guest column on dirty politics - Sakshi

జనవరి 18వ తేదీని చంద్రబాబు నికృష్ట రాజకీయానికి ప్రతిరూపంగా పరిగణించాలి. ఇప్పటికీ ఎన్టీఆర్‌ను స్త్రీలోలుడిగా చిత్రీకరిస్తూ బతుకుతున్న చంద్రబాబు నీచ రాజకీయానికి శాశ్వత సమాధి కట్టాలి.

వెన్నుపోటు చర్య తప్పు కాదని చెప్పేందుకు చంద్రబాబునాయుడు చరిత్రను మార్చేందుకు కూడా సిద్ధపడ్డారు. స్త్రీలోలుడైన మావో నుంచి చైనాను రక్షించేందుకు డెంగ్‌ జియావో పింగ్‌ తిరుగుబాటు చేశాడని బూటకపు ప్రచారం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల శిక్షణ కోసం వెలువరించిన పుస్తకాలలో ఇలాంటి వక్రీకరణలను చొప్పించారు. ఎన్టీఆర్‌ కూడా స్త్రీలోలుడట! ఆయన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే చంద్రబాబు తిరుగుబాటు చేశాడట! అధికార దాహంతో 1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుని చేసి, ఇందుకు ఎన్టీఆర్‌ భార్య కారణమని పచ్చ పత్రికల సాయంతో దుష్ప్రచారం చేయడం చూస్తే, చరిత్రలో ఇంత అథమస్థాయి నేత మరొకరు ఉండరని చెప్పవచ్చు. ఒక ప్రశ్న– ఎన్టీఆర్‌ను స్త్రీలోలునిగా చిత్రించే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఆయన ఫొటోలకు ఎందుకు దండలు వేస్తున్నట్టు?

1982లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలస వచ్చి తిష్ట వేసినవారు చంద్రబాబు. ఒక పథకం ప్రకారం పార్టీలోని అనుభవజ్ఞులకు వంచనతో ఉద్వాసన పలికారు. ‘ఏదో ఒకనాడు ఇతడు ఎన్టీఆర్‌ స్థానాన్ని ఆక్రమించడానికి ఆయనను చంపనయినా చంపుతాడు’అంటూ ఆ సమయంలోనే నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి గుర్తు చేసుకోవాలి. చంద్రబాబుకు ఎన్టీఆర్‌ కేబినెట్‌ హోదాతో కూడిన కర్షక పరిషత్‌ నేతృత్వం కట్టబెట్టారు. కోర్టు మూడుసార్లు తిరస్కరించడంతో అప్పటివరకు ఎన్టీఆర్‌ సాధించుకున్న మంచిపేరుకు కూడా గ్రహణం పట్టింది. ఆపై పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చంద్రబాబు చేజిక్కించుకున్నారు. ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం మొదలుపెట్టారు. అవినీతి విధానాలకు బాటలు పరిచారు. దీని ప్రభావం 1989 ఎన్నికల మీద కనిపించింది. పార్టీ ఓడిపోయింది. 

1994లో 74 ఏళ్ల ఎన్టీఆర్‌ ఆయన భార్య వెంట ఉండగానే ఎన్నికల బరిలో దిగారు. ఎంతో కష్టించారు. 294 స్థానాలలో, మిత్రపక్షాలతో కలసి 258 చోట్ల విజయకేతనం ఎగురవేశారు. ఇదొక చరిత్ర. ఈసారి కూడా ఆర్థిక, రెవెన్యూ శాఖలనే కాకుండా, అదనంగా విద్యుత్‌ శాఖను కూడా చంద్రబాబు కైవసం చేసుకున్నారు. ఇదంతా పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు సాధించడానికే. పార్టీకి చంద్రబాబు చేసిందేమీ లేదు. కానీ ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. హెరిటేజ్‌ స్థాపన కూడా అవినీతి సొమ్ముతోనే జరిగింది. 

పెరాల్టిక్‌ స్ట్రోక్‌తో బాధపడుతూ ఆసరా కోసం ఒక స్త్రీని జీవితంలోకి ఆహ్వానిస్తే, ఆమెనే బాబు బూచిగా చూపించి, ఎల్లో మీడియా సాయంతో చరిత్ర మరువలేని కుట్రను అమలు జరిపారు. ఎనిమిది నెలలు తిరగకుండానే ప్రభుత్వాన్ని కూలదోశారు. ఆగస్ట్‌ 26, 1995 న వైస్రాయ్‌ హోటల్‌ ముందు జరిగిన ఘోరం మరువలేనిది. ముఖ్యమంత్రి హోదాలో వెళ్లిన ఎన్టీఆర్‌ మీద చెప్పులు విసిరారు. కుంగిన ఎన్టీఆర్‌ ఆగస్ట్‌ 30, 1995న ఆస్పత్రి పాలయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ కళ్లనీళ్లు పెట్టుకుని ‘ఎన్టీఆర్‌ ఈరోజే చనిపోయాడు. నన్ను బ్రతికుండగానే సమాధి చేశాడు’అంటూ దుఃఖం పొంగి పొర్లుతుండగా అక్కడే మైకు తీసుకుని మాట్లాడిన సంఘటన ఎవరయినా మర్చిపోగలరా? 

చంద్రబాబు మీద పోరాటానికి సిద్ధపడ్డ ఎన్టీఆర్‌ ఫిబ్రవరి 1996లో ‘సింహగర్జన సదస్సు’ ఏర్పాటు చేస్తున్నానని, ప్రజలకు చంద్రబాబు నీతిమాలిన చర్యను తెలియజేస్తానని చెప్పారు. సదస్సు కోసం ‘బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా’లో తన పేరుతో ఉన్న పార్టీ సభ్యత్వ డబ్బును తీసుకురమ్మని జనవరి 17–1996న దేవినేని రాజశేఖర్‌కు చెక్కు ఇచ్చి పంపారు. కానీ చంద్రబాబు స్టే ఆర్డర్‌ తెచ్చి ఎన్టీఆర్‌కు ఆ హక్కు లేదని చెప్పించారు. ఆయన ఆగ్రహోదగ్రుడై,‘ఇతడు క్షమించటానికి వీల్లేని పెద్ద ద్రోహి’ అని అందరిముందే తిట్టారు. ఆ బాధ తట్టుకోలేక మరో 10 గంటల్లోనే ఎన్టీఆర్‌ గుండె ఆగిపోయింది. అదుపు తప్పిన బీపీ, షుగర్‌ వల్లనే అలా జరిగిందని డాక్టర్లు ప్రకటించారు.

ఈ రాజకీయ హత్య చేసిందెవరు? 60 ఏళ్ల వయసులో పార్టీ పెట్టి, 70 ఏళ్ల వయసులో కూడా కష్టించి ఎన్టీఆర్‌ సాధించిన ప్రభుత్వాన్ని కబ్జా చేయడమే కాకుండా ఆయన మీద, ఆయన భార్యమీద నిందలు మోపటం ఎటువంటి అధమ రాజకీయం? ఇదే పరిస్థితి ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పన్నిన ఉచ్చులో సోనియా ఇరుక్కున్నారు. అడ్డమైన కేసులు పెట్టించి, జగన్‌ను జైలుకు పంపారు. 
74 ఏళ్ల వయసులో సర్వం పోగొట్టుకుని ప్రాణాల్నే విడచిన నా భర్త నందమూరి తారక రామారావును దుఃఖంతో స్మరించుకునే జనవరి 18వ తేదీని చంద్రబాబు నికృష్ట రాజకీయానికి ప్రతిరూపంగా పరిగణించాలి. ఇప్పటికీ ఎన్టీఆర్‌ను స్త్రీలోలుడిగా చిత్రీకరిస్తూ బతుకుతున్న చంద్రబాబు నీచ రాజకీయానికి శాశ్వత సమాధి కట్టండి– అదే ఎన్టీఆర్‌ ఆత్మకు శాంతి– ప్రశాంతి.
అశ్రునయనాలతో...(నేడు ఎన్టీఆర్‌ 22వ వర్ధంతి)


డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి
వ్యాసకర్త సాహితీవేత్త, వైఎస్సార్‌సీపీ నాయకురాలు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top