బహుళత్వంతోనే భవితవ్యం

k ramachandra murthy write article on 2019 elections - Sakshi

త్రికాలమ్‌

ఈ రోజున ప్రధాని నరేంద్రమోదీ దేశంలో అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు అనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. అర్ణవ్‌గోస్వామి రిపబ్లిక్‌ టీవీ, అరుణ్‌పురీ ఇండియా టుడే చానల్‌ తాజాగా నిర్వహించిన సర్వేల ఫలితాలలో కొన్ని అంకెలలో వ్యత్యాసం ఉండవచ్చును కానీ తాత్పర్యం ఒక్కటే. 2019 సార్వత్రిక ఎన్నికలలో సైతం బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందనీ, ప్రధానిగా నరేంద్రమోదీ కొనసాగుతారనే. నిజానికి, మోదీ నాయకత్వం కారణంగానే బీజేపీకీ, దాని మిత్రపక్షాలకీ మెజారిటీ స్థానాలు లభిస్తాయన్న మాట కూడా స్పష్టమే. నేపాల్‌లోని లుంబిని గౌతమ బుద్ధుడి జన్మస్థానం. అక్కడి నుంచి లక్నో వరకూ బుధ, గురువారాలలో ముగ్గురు మిత్రులతో కలసి కారులో చేసిన ప్రయాణం ఈ రచయితకు గయ వెళ్ళి బోధివృక్షం కింద కూర్చునే అవసరం లేకుండానే ఒక రకమైన రాజకీయ జ్ఞానోదయం కలిగించింది. 

ఉత్తరప్రదేశ్‌ (యూపీ) ఈశాన్య ప్రాంతం అంతా చూశాం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధిపతిగా ఉన్న గోరఖ్‌పూర్‌ మఠం సందర్శించాం. బుద్ధుడి మహాపరినిర్వాణం జరిగిన కుశీనగర్‌లో మకాం చేశాం. వివాదాస్పదమైన అయోధ్య నగరంలో కొద్దిసేపు ఆగి తాజా సమాచారం సేకరించాం. రామ జన్మభూమి పోలీసు పర్యవేక్షణలో బ్యారికేడ్ల మధ్య బిక్కుబిక్కుమంటూ ఉంది. హైవేకు రెండు వైపులా కనుచూపు ఆనినంతవరకూ ఆకుపచ్చని తివాచీ పరచినట్టు వరి, జనుము, గోధుమ పొలాలు. కొద్దిగా లోపలికి వెడితే కటిక పేదరికంలో ముస్లిం గ్రామాలు. పూర్వం బౌద్ధం పరిఢవిల్లిన ప్రాంతాలలో అత్యధికంగా ముస్లింలు కనిపించారు. మ«ధ్య ఆసియా నుంచి వచ్చిన దురాక్రమణదారుల దాడుల నుంచి బౌద్ధులకు రక్షణ లేక ఇస్లాంను ఆశ్రయించారంటూ అంబేడ్కర్‌ చేసిన ప్రతిపాదనను రుజువు చేసే ఆధారాలలో ఇది ఒకటి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా మదిలో మెదిలిన ఆలోచనలు మనవి చేస్తాను.

యూపీ ప్రయోగం
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం యూపీలో ముస్లింలు 19.25 శాతం. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 403 నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థిని ఒక్కరిని కూడా నిలబెట్టకుండా బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంలోని రహస్యం తెలుసుకోవాలంటే యూపీ ప్రయోగం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మొత్తం 19 బీజేపీ పాలిత రాష్ట్రాలలో అదే ప్రయోగం అటూఇటుగా అమలు జరుగుతోంది. రేపు కర్ణాటకలోనూ అదే వ్యూహం అమలు చేసి ఘనవిజయం సాధించేందుకు అమిత్‌షా పావులు కదుపుతున్నారు. మైనారిటీలను పూర్వపక్షం చేసి మెజారిటీ మతస్థులను ఏకం చేయడం ద్వారా అధికారం సాధించడం, ఇందుకు క్షేత్రవాస్తవికతను సవ్యంగా అర్థం చేసుకొని చాకచక్యంగా వ్యూహం రచించడం, పకడ్బందీగా అమలు జరపడం. బ్రిటన్, ఫ్రాన్స్‌లో (అనేక ఐరోపా దేశాలలో) లాగా, పాకిస్తాన్‌లో అత్యధికులు ఒకే మతానికి చెందినవారూ, ఒకే భాష మాట్లాడేవారూ, ఒకే వారసత్వం ఉన్నవారూ, ఒకే సంస్కృతి కలిగినవారూ ఉండటం. ‘క్లాష్‌ ఆఫ్‌ సివిలిజేషన్స్‌’ రచయిత శామ్యూల్‌ హంటిం గ్టన్‌ అమెరికాను వైట్‌–ఆంగ్లో ప్రొటెస్టెంట్‌ (వాస్ప్‌) దేశంగా అభివర్ణించాడు. ఇండియాను ఆ విధమైన మూసలోకి మార్చడం సాధ్యమా? ప్రస్తుతానికి కాకపోవచ్చు. ఆ దిశగా ప్రయత్నానికి ఊతం మాత్రం కొంత దొరికింది. 

బీజేపీ జయప్రదంగా అనుసరిస్తున్న వ్యూహంలో ముఖ్యమైన అంశం దేశభక్తిని పూర్తిగా సొంతం చేసుకోవడం. దేశభక్తికీ, బీజేపీకీ అభేదం పాటించడం. బీజేపీని కానీ మోదీని కానీ విమర్శించినవారి దేశభక్తిని అడ్డంగా ప్రశ్నించడం. దీన్ని జింగోయిజంగా ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వంటి మేధావులు అభివర్ణిస్తున్నారు. దీనికి బదులు రాజ్యాంగబద్ధమైన దేశభక్తి (కానిస్టిట్యూషనల్‌ పేట్రియాటిజమ్‌) ఉండాలన్నది ఆయన వాదన. అందుకే గుజరాత్‌ దళిత నాయకుడు, అసెంబ్లీ సభ్యుడు జిగ్నేశ్‌ మేవానీ ఒక చేత్తో మనుస్మృతినీ, రెండో చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంటుకు ప్రదర్శనగా వెళ్ళి ప్రధాని మోదీకి సమర్పించి ఆ రెండింటిలో దేన్ని స్వీకరిస్తారో చెప్పాలని అడగబోతున్నట్టు ప్రకటించాడు. మనువాదం అంటే స్థూలంగా ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్న విధానమని అతని వాదన. బీజేపీ వ్యూహం ఆరంభమైంది అడ్వాణీ అయోధ్యయాత్రతో. మలుపు తిరిగింది బాబ్రీమసీదు విధ్వంసంతో. లక్ష్యం నెరవేరింది 2014లో మోదీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయంతో. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ‘ఇండియా దటీజ్‌ భారత్‌’కూ ప్రస్తుతం బలంగా వేళ్ళూనుకుంటున్న భావజాలానికీ పొంతన లేదు. 

రాజ్యాంగ నిర్మాతలు ఇండియన్‌ రిపబ్లిక్‌కు షరతులు లేని ప్రజాస్వామ్యం, మత, భాషాపరమైన బహుళత్వం, కుల, లింగ సమానత్వం, పేదరికం నిర్మూలన, వివక్షను అంతం చేయడం పునాది కావాలని భావించారు. ఇప్పటి ధోరణులు ఇంతవరకూ దేశ ప్రజలు విశ్వసించిన దేశ స్వరూపస్వభావాలకు (‘ఐడియా ఆఫ్‌ ఇండియా’) విరుద్ధమైనవనీ బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నవారు ముక్కుమీద గుద్దినట్టు చెబుతున్నారు. యూపీలో వచ్చే ఎన్నికలలో కూడా బీజేపీ గెలుస్తుందని ఎవరినడిగినా చెబుతారు. ఆ రాష్ట్రంలో మొన్నటి వరకూ యాదవ కులాధిపత్యం ఉండేది. ఇప్పుడు ఠాకూర్ల మాటకు విలువ పెరిగిందని అంటున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ పూర్వాశ్రమంలో ఠాకూర్‌. అతని ప్రమేయం లేకుండానే ఆ కుల ప్రముఖుల ప్రాబల్యం పెరుగుతుంది. 

ఎందుకంటే మన ప్రజలు నాయకులను ప్రేమించడంతో ఆగరు. వారినీ, వారి చుట్టూ ఉన్నవారినీ ఆరాధిస్తారు. నాయకులను పూజించే స్వభావాన్ని ప్రజలు విడనాడకపోతే, ప్రశ్నించే తత్వాన్ని ఒంటబట్టించుకోకపోతే పరిస్థితి విషమించి నియంతృత్వానికి దారి తీస్తుంది. రాజ్యాంగ పరిషత్తులో అంబేడ్కర్‌ చేసిన ఆఖరి ప్రసంగంలో చేసిన హెచ్చరిక గమనించండి: ‘మతం పట్ల భక్తి (వ్యక్తుల) ముక్తికి దారి తీయవచ్చు. కానీ రాజకీయాలలో భక్తి లేదా వ్యక్తిపూజ పతనానికీ, నియంతృత్వానికీ తిరుగులేని మార్గం’ ((Bhakti in religion may be a road to the salvation of the soul. But in politics, Bhakti or hero - worship is a sure road to degradation and to eventual dictatorship).). అంబేడ్కర్‌ హెచ్చరికను కాంగ్రెస్‌ నాయకులు పెడచెవిన పెట్టబట్టే ఇందిరాగాంధీ ఆత్యయిక పరిస్థితిని విధించే సాహసం చేశారు. ‘ఇండియా ఈజ్‌ ఇందిరా, ఇందిరా ఈజ్‌ ఇండియా’ అనే నినాదం చేసిన నాటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దేవ్‌కాంత్‌ బారువా ప్రమాదకరమైన పరమభక్తుడుగా నవభారత చరిత్రలో నల్లటి అక్షరాలతో నమోదై దోషిగా మిగిలిపోయాడు. ఇప్పుడు మోదీ పట్ల, కొందరు ముఖ్యమంత్రుల పట్ల అంధభక్తుల వీరవిధేయత చూస్తే భయం కలుగక మానదు. 

కాంగ్రెస్‌ తప్పిదం
స్వాతంత్య్ర యోధులలో అత్యధికులు తమ మతాన్ని ప్రేమించినవారే. స్వామి వివేకానంద వంటి వివేకవంతులైన హిందూమత ప్రబోధకులను అంగీకరించినవారే. ఆయన రచనలు చదవడం వల్ల తన దేశభక్తి వందవంతులు పెరిగిందని గాంధీ అన్నాడు. భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే వివేకానందుడి రచనలను అధ్యయనం చేయాలన్నాడు టాగోర్‌. జాతీయోద్యమాన్ని నిర్మించిన మహానుభావులలో వివేకానంద అగ్రగణ్యుడని నెహ్రూ అంటాడు. సుభాష్‌చంద్రబోస్, రాజ గోపాలాచారి తదితరులకు కూడా ఆయనే ప్రేరణ. దేశభక్తితో పాటు వివేకానందనూ, పటేల్‌నూ, అంబేడ్కర్‌నూ సొంతం చేసుకోవడానికి బీజేపీ, దాని అనుబంధ సంస్థలూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. 

ఆ సంస్థలకు ఇటువంటి అవకాశం ఎట్లా వచ్చింది? కాంగ్రెస్‌ స్వాతంత్య్ర సమర సేనానులందరినీ విస్మరించి నెహ్రూ–ఫిరోజ్‌గాంధీ కుటుంబ వృక్షాన్ని మాత్రమే పట్టుకొని వేళ్ళాడటం ఇందుకు ప్రధాన కారణం. ఇందిరాగాంధీని పూజించినట్టు సోనియాను కాంగ్రెస్‌లో బారువా వారసులు తనివితీరా సేవించారు. 19 సంవత్సరాలు పార్టీపై ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయించిన సోనియా మనోగతానికి భిన్నంగా మాట్లాడే సాహసం ఒక్కరికీ లేకపోయింది. ప్రధానిగా ఐదేళ్ళు పని చేసి, దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రగతికి బాటలు వేసిన పీవీ నరసింహారావును పదవీ విరమణ తర్వాతనే కాకుండా మరణానంతరం సైతం అవమానపరచడం తప్పని చెప్పిన నాయకుడు ఒక్కడూ లేడు. ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ళు ప్రతిపక్ష స్థానంలో చతికిలబడిన కాంగ్రెస్‌ను సమరానికి సమాయత్తం చేసి 2004లో, 2009లో విజయాలు సాధించి, అధిక సంఖ్యలో ఎంపీలను గెలిపించి, కేంద్రంలో యూపీఏ సర్కార్‌ ఏర్పడటానికి దోహదం చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడిని ప్రతిపక్ష తెలుగుదేశంతో కుమ్మక్కయి సీబీఐ విచారణ పేరుతో 16 మాసాలు జైలులో ఉంచడం విశ్వాస ఘాతుకమని అధినేతకు చెప్పే గుండెగల నాయకుడు ఒక్కడూ లేకపోయాడు. 

1998లో సోనియా కాంగ్రెస్‌ అధ్యక్షపదవి చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ ఆ పార్టీ సారథ్యం ఆమె చేతి నుంచి పుత్రుడు రాహుల్‌ చేతిలోకి మారింది. అదే బీజేపీలో 1998 నుంచి ఇప్పటి వరకూ బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, అడ్వాణీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షాలు పార్టీ అధ్యక్షులుగా పని చేశారు. సాధారణ కార్యకర్తలు బీజేపీ అధ్యక్షులుగా, ప్రధానులుగా ఎదిగారు. ముస్లింలలో ఛాందసం పెంచి పోషించడంలోనూ (షాబానో కేసు), వారిని ఓటుబ్యాంకు రాజకీయాలకు వినియోగించుకోవడంలోనూ కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రయత్నాలు కూడా బీజేపీ వ్యూహం విజయం సాధించడానికి అవకాశం ఇచ్చాయి. ఇస్లామిక్‌ దేశాలలో కూడా లేని ‘త్రిపుల్‌ తలాఖ్‌’దురాచారాన్ని అంతం చేసే ప్రయత్నం చేయడానికి డెబ్బయ్‌ ఏళ్ళు ఎందుకు పట్టింది? కాంగ్రెస్‌ హయాంలో పెచ్చుమీరిన అవినీతి కూడా 2014లో మోదీ ప్రభంజనానికి దోహదం చేసింది. కమ్యూనిస్టు పార్టీలు నేల విడిచి సాము చేయడం, విదేశీ అనుభవాలనూ, భావజాలాలనూ అరువు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం ద్వారా చీలికపేలికలై కృశించి నశించడానికి సిద్ధంగా ఉండటం కూడా బీజేపీ భావజాలం బలపడటానికి దారి తీసింది.

కింకర్తవ్యం? 
కాంగ్రెస్‌ ఎన్ని తప్పులు చేసినా అంబేడ్కర్, నెహ్రూ, తదితర వైతాళికులు నిర్మించిన నవభారతం సమైక్యంగా, సమగ్రంగా మనగలగడానికి కారణం ఏమిటి? దళితులకూ, ఆదివాసులకూ ఉద్యోగాలలో, చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడం. భాషాప్రాతిపదికపైన రాష్ట్రాల పునర్నిర్మాణానికి అంగీకరించడం. హిందీని రుద్దరాదన్న తమిళుల డిమాండ్‌ను ఆమోదించడం. పాకిస్తాన్‌ ఆవిష్కరణ జరిగిన వెంటనే జిన్నా ఢాకా వెళ్ళి ఉర్దూ నేర్చుకోవలసిందేనని తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీలకు కటువుగా చెప్పాడు. అందుకే పాతికేళ్ళకే తూర్పు పాకిస్తాన్‌ విడిపోయి బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది. తమిళులపైన సింహళ భాషను బలవంతంగా రుద్దబట్టే శ్రీలంకలో మూడు దశాబ్దాలపాటు నరమేధం సాగింది. 

మన దేశంలో ప్రభుత్వాలు పట్టువిడుపులు ప్రదర్శించిన కారణంగానే, ప్రజల ఆకాంక్షలను ఆలకించినందువల్లనే బహుళత్వంలో ఏకత్వం అనే ఆదర్శం ఇప్పటి వరకూ బతికి బట్టకట్టింది. ఈ ఆలోచనా విధానానికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా రాజ్యాంగ నిర్మాతల స్వప్నం భగ్నమౌతుంది. పది మంది ‘ఆసియాన్‌’దేశాధినేతల సమక్షంలో శుక్రవారం సగర్వంగా జరుపుకున్న రిపబ్లిక్‌ దినోత్సవం సార్థకం కావాలంటే భారత గణతంత్రంలోని బహుళ సంస్కృతినీ, బహుముఖీనతనూ పరిరక్షించుకోవడం తప్పనిసరి. ఇప్పుడు కలవరపెడుతున్న పెడధోరణులను అరికట్టడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ఇప్పటికైనా నడుంబిగిస్తే అది హృదయపూర్వకంగా ఆహ్వానించదగిన పరిణామం అవుతుంది. 

అటువంటి పూనిక ప్రభుత్వం తరఫు నుంచి లేకపోతే ఏమి చేయాలన్నది ప్రశ్న. ఉదార హిందూత్వ అంటూ ‘సాఫ్ట్‌ హిందూత్వ’ విధానాన్ని రాజీవ్‌గాంధీ హయాం (అయోధ్యలో శిలాన్యాస్‌) నుంచీ అనుసరిస్తున్న కాంగ్రెస్‌కి ఇంతటి గురుతరమైన బాధ్యతను నిర్వర్తించే చిత్తశుద్ధీ, సామర్థ్యం ఉన్నాయని చెప్పలేం. న్యాయవ్యవస్థను రక్షించుకోండి అంటూ సీనియర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేసినట్టే అన్ని మతాలనూ, ప్రాంతాలనూ, భాషలనూ, సంస్కృతులనూ సమాదరించే అద్భుతమైన దేశంగా ఇండియాను కాపాడుకోండని ప్రజలకు పురమాయించడం వినా మరో మార్గం కనిపించడంలేదు.

  - కె. రామచంద్రమూర్తి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top