ప్రామాణిక వైద్యానికి మారుపేరు

Doctor balaji Special Column On Jaipur Leg - Sakshi

హైదరాబాద్‌లో 2005లో పుట్టిన 108 సేవలు, 2006–7లో పురుడు పోసుకున్న 104 ఫోనుపై ఆరోగ్య సమాచారం, ప్రతి నెలా మీ వూరిలో అందించే ఆరోగ్య సేవలు అన్నీ డాక్టర్‌ అయితరాజు పాండురంగారావు అందించిన ఆలోచనలే.

గడచిన నాలుగు సంవత్సరాల ప్రత్యేక ఉనికిలో తెలంగాణ తన ప్రజల భవిష్యత్తుకి అవసరమైన, ముఖ్యమైన కొన్ని విషయాలపై దృష్టి సారించి కీలకమైన పునాదిరాళ్ళు రూపొం దించుకుంది. అందులో ప్రత్యేకంగా అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి వివిధ ప్రణాళికలకు ప్రాణం పోసింది. అట్లా రూపొందించిన చాలా ప్రణాళికలు దేశానికే నేడు కొత్త ప్రమాణాలుగా పేరు పొందినాయి. వీటిలో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, టిఎస్‌ ఐపాస్‌ వంటివి మచ్చుకు కొన్ని. ఇవన్నీ కొన్ని సంవత్సరాలలోనే ప్రజలకు మెరుగైన ఫలాలు అందిస్తాయని మన అంచనా. దాదాపు ఆరు దశాబ్దాలపాటు సాంస్కృతి కంగా, ఆర్థికంగా అణగారిన తెలంగాణ ప్రస్తుతం విశిష్ట పథకాల సాక్షిగా కొత్త ఊపిరులు పోసుకొంటోంది. 

హార్డ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఎంత అవసరమో సాఫ్ట్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కూడా ఒక సమాజానికి అంతే  అవసరం అంటే అతిశయోక్తి లేదేమో. సాఫ్ట్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా విద్య, వైద్యం, కల్చర్‌ తల భాగాన ఉంటాయి. రోమ్‌ నగరం ఒక్క రోజులో కట్టలేదు అని ఒక ఆంగ్ల నానుడి. తెలంగాణ అభివృద్ధి కూడా కొన్ని రోజుల్లోనే సమకూరదు. ఐతే కావలసిన ప్రణాళికలు, పునాదిరాళ్ల ప్రక్రియలు ఇప్పుడే ఆలోచించుకోవాలి. విద్య, ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించి, రాష్ట్ర ప్రగతికి పనికివచ్చే ఉన్నత విద్యా ప్రమాణాలు, ప్రణాళికలు శోధించి వీలైనంత త్వరగా ఒక బ్లూప్రింట్‌ తయారుచేసి ఉంచుకోవాలి. 

ఈ సందర్భంగా తెలంగాణ గడ్డపై వైద్య రంగంలో గతంలో చేసిన కొన్ని విశిష్ట ప్రయోగాలు, ప్రయత్నాల గురించి, వాటి వెనుక తెర వెనుక ఉన్న తారలు తెరమరుగు కాక మునుపే మనం వారిని గుర్తించి గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అశోక స్తంభం మీద ఉన్న నాలుగు సింహాల్లో మూడే కనిపిస్తాయి, నాలుగోది కనిపించదు. అయితే నాలుగో సింహం కనిపించదు కాబట్టి అది లేదనుకోవడం పొరపాటే! 
అటువంటి నాలుగో సింహమే తెలంగాణ వైద్యరంగ ఆణిముత్యం డాక్టర్‌ ఐతరాజు పాండు రంగారావు.  2005 సంవత్సరంలో హైద్రాబాదులో పుట్టిన 108 సేవలు, 2006–7లో పురుడు పోసుకున్న 104 (24/7) ఫోనుపై అందించే ఆరోగ్య సమాచారం, డాక్టర్‌ సలహాలు, ప్రతి నెలా మీ వూరి గడపలో అందించే ఆరోగ్య సేవలు Fixed Day Health Services) అన్నీ ఆయన అందించిన ఆలోచనలే. వాటిని ఆచరణలో పెట్టిన సైనికులలో నేనూ ఒక్కణ్ణి. 

ఈ సేవలే కాదు, ఇంకా ఎన్నో కొత్త తరహా ఆలోచనలకి, ఆలోచనల ఆచరణకి ఆనవాలం డాక్టర్‌ అయితరాజు. పోలియో చుక్కలు పోలింగ్‌ బూత్‌లో ఇప్పిస్తే ప్రజలు సునాయాసంగా సేవలు పొందవచ్చు అని ఆలోచించిన ఘనత కూడా డాక్టర్‌ రంగారావుదే.  రాజస్థాన్‌ తరువాత జైపూర్‌ ఫుట్‌ని తయారుచేసిన నగరం హైదరాబాద్‌. డాక్టర్‌ సేథీ కనిపెట్టిన జైపూర్‌ ఫుట్‌ని ఆయనని ఒప్పించి, డి.సి గలడాని మెప్పించి, నిజాం ఇన్సి్టట్యూట్‌లో కార్ఖానా పెట్టించి మరీ, కాలు కోల్పోయిన తెలుగు ప్రజలకు జైపూర్‌ ఫుట్‌ సమర్పించింది ఆయనే!  

డబుల్‌ పంక్చర్‌ లాప్రోస్కోపీ ప్రొసీజర్ని కనిపెట్టిన పక్క రాష్ట్రంలోని ఇరువురు డాక్టర్లను హైదరాబాద్‌కు రప్పించి  ఆ నూతన విధానాన్ని ఇక్కడ డాక్టర్లకు నేర్పించి కుటుంబ నియంత్రణకు సంబంధించి, 1990లలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఫెర్టిలిటీ తగ్గించడానికి ప్రణాళికలు రచించి ఆచరణలో పెట్టించిన దూరదృష్టి కల డాక్టర్‌ పాండురంగారావు! చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఇంకా ఎన్నెన్నో కొత్త పుంతలు వైద్యరంగంలో తెలుగు గడ్డపై పుట్టడానికి కారణం ఆయన. 

ఇప్పటికీ ఏదైనా కొత్త సమస్య ఆయన ముందుం చితే, చిన్న పిల్లలముందు చాక్లెట్‌ పెడితే వాళ్ళ కళ్ళు ఎట్లా మెరుస్తాయో , అట్లా మెరుస్తాయి ఆయన కళ్ళు! గత సంవత్సరం అందించిన పద్మ అవార్డులలో అంబులెన్సు సేవలకు గాను గుజరాత్‌కి చెందిన ఒక డాక్టర్‌కి లభించింది. అప్పుడు అనుకున్నాము పనికి పద్మ అవార్డుకు సంబంధం అసలుంటుందా అని! ఏది ఏమైనా మన తెలంగాణ ఆణిముత్యాలని మనమే గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే డబ్బుకంటే, డంబాలకంటే ముఖ్యమైంది స్ఫూర్తి! రంగారావు, ఆయన మిత్రులు, ఆ  తరం స్ఫూర్తి ప్రదాతలు, వారి త్యాగాలు, ప్రయోగాలు, ప్రయత్నాలు, వాళ్ళు వేసిన పునాదిరాళ్ళపై తెలంగాణ ముందుకు నడుస్తుందని, బంగారు తెలంగాణ నిర్మించుకుంటామని మనసావాచా నమ్మేవాళ్ళల్లో నేనొకణ్ణి!


డాక్టర్‌ బాలాజీ ఊట్ల
వ్యాసకర్త సీఈఓ, క్రియ హెల్త్‌ కేర్‌
మొబైల్‌ : 98665 04104

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top