సత్వరమైతేనే.. న్యాయం!

Dileep Reddy Article On Indian Judiciary System - Sakshi

సమకాలీనం

న్యాయం అందించడం ఒక ఎత్తైతే న్యాయం అందుతుందనే విశ్వాసం ప్రజల్లో కలిగించడం మరో ఎత్తు! అవిచ్ఛిన్నంగా, కచ్చితంగా, సత్వరంగా ఒకటోది అందితే రెండోది దానంతట అదే సిద్ధిస్తుంది. మనం, మన వ్యవస్థలు, ప్రభుత్వాలు పనిగట్టుకొని అందించాల్సింది మొదటిదే! రెండోదాని కోసం ఎవరూ ప్రత్యేకంగా కృషి చేయాల్సిన పని లేదు. అంతటా న్యాయం సులువుగా అందుతున్న క్రమంలో అంతే సహజంగా విశ్వాసం ప్రజల్లో ఏర్పడు తుంది, క్రమంగా బలపడుతుంది. రెండోది లేదంటే, మొదటిది లభించడం లేదనే అర్థం! ఈ దుస్థితి ఇటీవల బాగా పెరిగింది. న్యాయం అంత తేలిగ్గా దొరక్కపోవడం, కొన్నిసార్లు ఎంతకీ లభించక పోవడంతో అది లభిస్తుందనే విశ్వాసం పౌర సమాజంలో సన్నగిల్లు తోంది. అనుచిత జాప్యాలతో సాగే నేర దర్యాప్తు–న్యాయ విచారణ ప్రక్రియ (క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌) న్యాయనిరాకరణే కాక తీరని నష్టమనే భావన జనంలో బలపడుతోంది. ముఖ్యంగా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరిగి, పట్టుబడ్డ నిందితులు బేషుగ్గా జైళ్లలోనో, బెయిల్‌పై వచ్చి బయటో కాలం వెళ్లదీస్తున్నపుడు... న్యాయం జరుగుతుందనే నమ్మకం సడలుతోంది. ఇది ఆరంభం నుంచీ ఉన్న పరిస్థితేం కాదు. పలు జాడ్యాల వల్ల ముప్పిరిగొంటున్న ఇటీవలి అనుచిత జాప్యాలే ఇందుకు కారణం. మన పరిపాలన, పోలీసు– దర్యాప్తు, న్యాయ వ్యవస్థ ఇలా అన్నిచోట్లా నిర్వాకాలు వెరసి ఉమ్మ డిగా విశ్వాసాన్ని సన్నగిల్లజేస్తున్నాయి. 

ఫలితంగా, ప్రజాస్వామ్య ప్రక్రియను కాదని ప్రజలు సత్వర ఫలితాల కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. అవి ప్రజా స్వామ్యబద్ధమైన చర్యలు కావు అని తెలిసినా... కాప్‌ పంచాయతీల వైపు మొగ్గుతున్నారు. అసాంఘిక శక్తుల సెటిల్‌మెంట్లకు తలొగ్గుతు న్నారు. అసహజ ఎన్‌కౌంటర్లనూ సమర్థిస్తున్నారు. హక్కుల సంఘాల కృషినీ అభిశంసిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎక్కడికక్కడ తీర్పులిచ్చే చర్యల్ని తప్పుపట్టకపోగా... గట్టిగా సమ ర్థిస్తున్నారు. పట్టరాని హర్షాలు, పాలాభిషేకాలు అందుకే! ఇదివర కెప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో ఈ రకం భావజాలం వ్యాపిస్తోంది. ప్రమాదకరంగా ఇది బలపడుతోంది. తీవ్ర భావోద్వేగాలకు లోన వుతున్న కొందరు ఈ పరిస్థితిని సామాజిక మాధ్యమాల్లో నెత్తికెత్తు కుంటున్నా... ఇదంత మంచిది కాదనేది విజ్ఞుల అభిప్రాయం. తాజా ఘటనల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక ప్రజాస్వామ్య వ్యవ స్థలో ప్రజలు ఏం కోరుకోవాలి, నిజానికి ఏం కోరుకుంటున్నారు? అని లోతుగా చూస్తే... ఈ పరిణామాలు ఆలోచనాపరుల్లో కాస్త గగు ర్పాటు కలిగిస్తున్నాయి.

కఠిన శిక్షా? కచ్చితమైన శిక్షా?
నేర దర్యాప్తు, న్యాయ విచారణల్లో జరిగే అనుచిత జాప్యాల వల్ల తీవ్రమైన నేరాల్లోనూ కేసులు కొలిక్కి రావట్లేదు. సత్వర న్యాయం దొరకటం లేదు. నేరస్తులకు శిక్షలు లేవు. బాధితుల కడగండ్లు తీరటం లేదు. ఇది ప్రజల్ని అసహనానికే కాకుండా ఆగ్రహానికీ గురిచేస్తోంది. బాధితులకు, ప్రజాస్వామ్యవాదులకు న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లడంతోపాటు దీనివల్ల మరో ప్రమాదం కూడా ఉంది. ఆడ వాళ్లపై అఘాయిత్యాలు చేసే వారికి, ఆ మాటకొస్తే నేరస్వభావు లెవరికైనా చట్టమంటే, శిక్షలంటే భయం లేని తెంపరితనం వచ్చే స్తుంది. అది బరితెగింపులకు దారితీస్తోంది. మొత్తం జనాభాతో పోల్చినపుడు నేరాలకు పాల్పడే వారి సంఖ్య చాలా తక్కువే అయినా, చట్టాలంటే భయంలేనితనం వల్ల సర్వత్రా అభద్రత రాజ్యమేలు తోంది. ‘తప్పు చేసిందెవరైనా, ఎంతవారైనా శిక్ష తప్పదు...’ అన్న నమ్మకం బలపడాలి. అది బలహీనులకు భరోసా కల్పిస్తూనే నేర స్వభావులకు భయాన్నీ కలిగిస్తుంది. ఏడేళ్ల కింద జరిగి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ కేసు’లో నిందితులైన వారికి ఇప్ప టికీ శిక్షలు అమలు కాకపోవడాన్ని సాధారణ జనం కూడా జీర్ణించు కోలేకపోతున్నారు. నేర నిర్ధారణ జరిగి, శిక్షలు ఖరారై... అమలు జరు గకపోవడం వారికి మరింత కోపకారణమవుతోంది. న్యాయ ‘ప్రక్రియ’ అంటేనే పరిహాసం చేస్తున్నారు.

మరోవంక, ఇక్కడ హైదరాబాద్‌ శివార్లలో జరిగిన ‘దిశ’ దుర్మార్గం తర్వాత స్వల్ప వ్యవధిలోనే ‘ఎన్‌కౌంటర్‌’లో నిందితులు నలుగురు చనిపోవడం ఒకింత ఉపశమనం కలిగించింది. దాంతో, ఎక్కువ మంది ఈ రెండు... నిర్భయ, దిశ కేసుల అంతిమ ఫలితాన్ని సరిపోల్చి చూస్తున్నారు. దేనికన్నా ఏది నయం? అని బేరీజు వేస్తు న్నారు. నిర్భయ ఘటన తర్వాతనాడే దేశం అట్టుడికింది. సాక్ష్యాత్తూ దేశ రాజధాని నడిబొడ్డున ఇంత దారుణమా? అనే ఆగ్రహావేశాలు సర్వత్రా పెల్లుబికాయి. కేంద్ర ప్రభుత్వం జస్టిస్‌ వర్మ నేతృత్వంలో కమిషన్‌ వేసింది. దాని ముందుకు రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి. పిల్లలు, మహిళలపై అత్యాచారం, హత్యోదంతం వంటి అఘాయిత్యాలకు తలపడే వారికి కఠిన శిక్షలు అమలు పరచాలనే వాదనా వచ్చింది. అక్కడికక్కడే మరణ శిక్ష విధించాలని, నేరుగా ఉరి తీయాలని... ఇలా వచ్చిన పలు ప్రతిపాదనల్లో చట్టాల్ని సమూలంగా మార్చే అంశం కూడా తెరపైకొచ్చింది. ప్రస్తుత చట్టాల్లోనూ ఆయా శిక్షలున్నాయని, కొత్తగా అమానుష శిక్షలు ప్రతిపాదించి నాగరిక సమాజం వెనక్కి నడవాల్సిన పనిలేదనే వాదనా వినిపించింది. అయితే ప్రక్రియలో జాప్యం నివారించి, సత్వర న్యాయం అందించేం దుకు చర్యలు తీసుకోవాలనే గట్టి వాదన ముందుకు వచ్చింది.

సమయపరిమితే సరైన మార్గం
అన్నిస్థాయిల్లోనూ సమయపరిమితులు విధించి నేర దర్యాప్తు– న్యాయ విచారణ ప్రక్రియను వేగవంతం చేయడం ఓ పరిష్కారం. అవసరం మేర ఎప్పటికప్పుడు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు ఒక మార్గం. దయాబిక్షతో సహా తీర్పు తదనంతర ప్రక్రియకూ సమయ పరిమితులుండాలి. కొన్ని నేరాల్లో దయాబిక్షే ఉండకూడదు. కఠిన శిక్షల్ని వర్తింప చేయడం ద్వారా, ఎవరూ మహిళలపై ఏ దుశ్చర్యకూ తలపడలేని విధంగా భయం పుట్టించాలి. జాప్యాల్ని హరించి, ప్రక్రి యను సత్వరం పూర్తి చేస్తే ఫలితాలుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిందదే! సీఆర్పీసీ, ఐపీసీలను తగు విధంగా సవరించడంతో పాటు సొంతంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ప్రతి పాదనకు మంత్రివర్గం ఆమోదించింది. సామాజిక మాధ్యమాల వేది కగా జరిగే దుశ్చర్యలకూ పగ్గాలు వేసే చర్యల్ని ప్రతిపాదించారు. ముసాయిదా కూడా సిద్ధమైంది. ఇక నేడో, రేపో అసెంబ్లీలో ఆ బిల్లు చట్టరూపు సంతరించుకోవడమే తరువాయి.
 
మహిళలపై దుర్మార్గపు హింస జరిగినపుడు వారం రోజుల్లో నేర దర్యాప్తు, పక్షం రోజుల్లో న్యాయ విచారణ పూర్తిచేసి, నిర్ధారించే సాక్ష్యాలున్న కేసుల్లో మూడు వారాల్లో తుది తీర్పు ఇప్పించాలనేది తాజా చొరవ ఉద్దేశం. న్యాయ ప్రక్రియపై ప్రజలకు భరోసా కల్పిం చడమే కాకుండా నేర స్వభావుల్లో భయం కలిగిస్తే లక్ష్యం నెరవేరినట్టే! ఇదొక్కటే సరిపోతుందా? అని సందేహం వ్యక్తం చేసేవాళ్లుంటారు. ఇలాంటి సంస్కరణలు, చట్ట సవరణలు, సత్వర చర్యలు అన్ని స్థాయిల్లో ఉంటే పని సజావుగా జరిగిపోతుంది. హైకోర్టు, సుప్రీం కోర్టు స్థాయిలో విచారణకు గడువెలా విధిస్తారనే వాదన రావొచ్చు! అసాధారణ పరిస్థితుల్లో తప్ప కేసు విచారణలకు సమయ పరిమి  తులు విధించుకోవచ్చు. ప్రక్రియను సత్వరం పూర్తిచేసి ఒక హేతు  బద్ధమైన ముగింపునకు తీసుకురావాలనే ఒత్తిడయితే ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థపైనా పెరుగుతుంది. సత్వర విచారణ, తగు తీర్పు తోనే సరిపోదు, సదరు శిక్షలు అమలు కావాలి. జరిగిన నేరపు ఘోర త్వం జనుల స్మృతిపథం నుంచి జారక ముందే నేరస్తులకు శిక్షలు అమలయితేనే సార్థకం.

ఏకకాలంలో ఎన్ని కావాలో...!
కేసు నమోదు దశ నుంచి ప్రాసిక్యూషన్‌ ముగిసే దాకా నేర దర్యాప్తు ప్రక్రియను పోలీసులు వేగిరపర్చాలి. పాలన, సాంకేతిక, దురుద్దేశ పూర్వక జాప్యాలన్నింటినీ çహరించాలి. ముఖ్యంగా దేశంలో అత్యా చార నేరాల పెరుగుదల తీరు ఆందోళన కలిగిస్తోంది. జరిగినా, పలు సాంఘిక  కారణాల వల్ల నమోదయ్యేవే తక్కువంటే, ఈ అధికారిక గణాంకాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. గత 15 ఏళ్లలో 3.41 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఒక వైపు ఘటనలు పెరుగు తుంటే, మరోవైపు శిక్షల రేటు తగ్గుతోంది. 2016లో 38,947 కేసులు రాగా 6,289 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. మహిళలపై జరిగే నేరాల్లో పోలీసుల సత్వర స్పందన, బాధ్యతాయుత ప్రవర్తన చాలా ముఖ్యం. దర్యాప్తుతో పాటు న్యాయ విచారణ ప్రక్రియలోనూ వేగం పెరగాలి. గర్భస్థ పిండాలుగా ఉన్నప్పటి నుంచి కడ శ్వాసవరకు మహిళలపై గౌరవ భావం కలిగేలా మన సమాజానికి అవగాహన పెంచాలి. కుటుంబం, బడి, పనిప్రదేశం, బహిరంగ స్థలం.... ఇలా అన్ని చోట్లా, ప్రతి స్థాయిలో వివక్ష పోవాలి. మనిషి తప్ప సృష్టిలో మరే జీవి పాల్పడని అతి హీనమైన నేరం అత్యాచారం. అది సామూహికంగా జరిగి, ఘాతుకమైన హత్యతో ముడివడటం భూమ్మీద అతిపెద్ద నేరం! దీనికి సమాజం నుంచే పరిష్కారం లభించాలి. దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి అన్ని విధాలుగా, అన్ని స్థాయిల్లో సమాజం సమాయత్తం కావాలి. ఇది సమష్టి బాధ్యత.

దిలీప్‌ రెడ్డి 
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top