తెలుగు కథపై చెదరని ‘ఛాయ’

Chayadevi Great Telugu Writer From Rajahmundry - Sakshi

అబ్బూరి ఛాయాదేవిగారు వెళ్లిపోయారు. ఆమె నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడే మాటలిక ఎన్నటికీ వినపడవు అనుకుంటే చాలా విచారంగా ఉంది. కానీ, జీవించటంలోనూ, మరణించటంలోనూ తన మార్గాన్ని తాను ఎంచుకున్న మనిషి. మనం విచారించటాన్ని ఆమె ఇష్టపడరు. ఏదో ఒక జోక్‌ వేసి నవ్విస్తారు.  తెలుగు సాహిత్యంలో, అందునా స్త్రీవాద సాహిత్యంలో ఆమె చెరగని సంతకం. ఆమె వ్యక్తిత్వం, మేథస్సు, హాస్య చతురత, సునిశిత దృష్టి, సాహిత్య కళారంగాల పట్ల ఆమెకున్న గాఢానురక్తి–ఇవన్నీ ఆమెను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడతాయి. 1933 అక్టోబర్‌ 3న రాజమండ్రిలో జన్మించిన ఛాయాదేవిగారు తన పందొమ్మిదవ ఏట మొదటి కథ ‘అనుబంధం’ రాశారు. ఆ తర్వాత మరెన్నో కథల పంట పండించారు. చిన్నతనంలో కట్టుబాట్లతో కూడిన సంప్రదాయ జీవిత నేపథ్యం ఆమెది.

ఆ నేపథ్యపు నీడ నుంచి తప్పించుకుని ఒక స్వతంత్ర ఆలోచనాపరురాలిగా తనను తాను మలచుకునేందుకు ఆమె తనదైన ఒక మార్గాన్ని, ఒక జీవన శైలిని అలవరచుకున్నారు. నిజాం కాలేజీలో చదివారు. అబ్బూరి రామ కృష్టారావుగారి అబ్బాయి అబ్బూరి వరద రాజేశ్వరరావుగారితో వివాహం జరిగాక లైబ్రరీ సైన్స్‌మీద ఆసక్తి కలిగిందేమో–ఆ చదువూ చదివి న్యూఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌లో డిప్యూటీ లైబ్రేరియన్‌గా పనిచేశారు. పని చేయటమంటే ఛాయాదేవిగారి పద్ధతిలోనే. పర్‌ఫెక్ట్‌గా. తను చేసే ఏ పనైనా శ్రద్ధగా, దాని గురించిన పూర్తి అవగాహనతో, కళాత్మకంగా చేయడం ఆమె పద్ధతి. ఆ లైబ్రరీలో తన అనుభవాల గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆమె నవ్వుతూ సింపుల్‌గా చెబుతుంటే ఇంత సాదా సీదాగా కనిపించే ఈమె ఎంత మేథావో కదా అనిపిస్తుంది. 1982లో ఢిల్లీలో ఆ ఉద్యోగం వదలి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు దంపతులిద్దరూ. 

అప్పటికే ఛాయాదేవిగారు చరిత్రలో నిలిచి పోయే సాహిత్య కృషి చేశారు. 1954లోనే ‘కవిత’ అనే పేరుతో కవిత్వం కోసం పెట్టిన పత్రికలకు సంపాదకత్వం వహించారు. అది రెండు సంచికలే వచ్చినా.. అటువంటి పత్రికలకు ఒక ఒరవడి పెట్టింది. ‘అనగా అనగా’ అంటూ పిల్లల కోసం ప్రపంచ దేశాల జానపద కథలను సంకలనం చేశారు. 1956లో ‘మోడర్న్‌ తెలుగు పొయెట్రీ’ ఆంగ్లానువాద సంకలనానికి సంపాదకురాలిగా ఉన్నారు. ఈ మధ్యలో కథలు రాస్తూనే ఉన్నారు. వారిల్లు ఒక సాహితీ చర్చా కేంద్రంగా, నాటకరంగ కార్యగోష్టిశాల వలే నడుస్తూ ఉండేది. పెద్ద రచయితలందరూ ఆమె ఆతిథ్యం స్వీకరించినవారే. ఆమె వారి గురించి చెప్పే హాస్య కథలు రికార్డు చేయడానికి ఆమె అనుమతించలేదుగానీ, అదొక మంచి చరిత్ర పుస్తకమయ్యేది. 

ఆమె కథా సంకలనం చాలా ఆలస్యంగా 1991లో వచ్చింది. ‘బోన్సాయ్‌ బతుకులు’ 1974లో ఆమె రాశారు. అప్పటికీ స్త్రీవాదం, విమెన్స్‌ స్టడీస్, జండర్‌ దృక్పథం గురించి మాటలు కూడా మొదలు కాలేదు. కానీ స్త్రీల శక్తులన్నిటినీ బోన్సాయ్‌ మొక్కల్లా కత్తిరించి కుంచింప చేస్తున్నారని, అందంగా వుంటే, ఇంట్లో సురక్షితంగా పెరిగితే చాలని కుటుంబం చేసే అదుపు వల్ల పెద్ద వృక్షంలా ఎదిగి నలుగురికి నీడనివ్వగల స్త్రీ తానే పరాధీన అయిపోతోందని చెప్పి ఎంత కనువిప్పు కలిగించారో. 1991లో ‘అబ్బూరి ఛాయాదేవి కథలు’ పేరుతో కథా సంకలనం వచ్చాక అది స్త్రీలు తప్పనిసరిగా చదవాల్సిన కథ అయ్యింది. అనేక భాషల్లోకి అనువాదమైంది. కళాశాలల్లో పాఠ్యభాగమైంది. మన రాష్ట్రంలోనే కాదు. కర్ణాటకలో కూడా. జండర్‌ గురించి అర్థం చేయించాలంటే ఆ ఒక్క కథ చదివిస్తే చాలు. 

‘సుఖాంతం’ కథ జనప్రియమైన కథ అయింది. ఆ కథ కూడా స్త్రీల అనంతమైన ఇంటిచాకిరి గురించే. నిద్రకు కరువైన జీవితాల గురించిన వేదన కథంతా పరుచుకుని, సుఖ నిద్ర కోసం శాశ్వత నిద్రనాశ్రయించిన ఒక స్త్రీ మన మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది. చాలా కథలు సున్నితమైన హాస్యంతో చురకలు పెడతాయి. ఉద్యోగ ధర్మం, భార్యా ధర్మం మధ్య నలిగే స్త్రీలు, ఆఫీసుల్లో లైంగిక వేధింపులకు గురై సతమతమవుతూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడే స్త్రీలు–ఇలా అనేకానేకమంది మధ్యతరగతి స్త్రీలు, వారి ఆరాటాలు మనకు అర్థమవుతాయి. స్వతంత్ర జీవన కాంక్ష స్త్రీలలో బలంగా ఉం టుంది. దానిని సంహరించే వ్యతిరేక శక్తులతో వారు జీవితాంతం ఏదో ఒక రకమైన పోరాటం చేయవలసే ఉంటుంది. సంసారాలు నిలబెట్టుకుంటూనే, బాంధవ్యాలను తెగగొట్టుకోకుండానే, సున్నితంగానే నిలబడాలి పోరాటంలో. ఇది చాలా కష్టం. ఏదో ఒక ఆయుధం పుచ్చుకుని ప్రత్యక్షంగా కదనరంగంలోకి దూకడమే సులువు.. విజయమో, వీర స్వర్గమో తెలిసిపోతుంది. మధ్యతరగతి స్త్రీలు అస్వతంత్రత, స్వతంత్రతల మధ్య బంతిలా తిరుగుతూ, కిందపడిపోకుండా, ఎవరి చేతికీ చిక్కకుండా తమను తాము కాపాడుకునే సాము గారడీ చాలా కష్టం. ఆ కష్టాలను తన సున్నితమైన శైలిలో మనల్ని ఎక్కువ కష్టపెట్టకుండా రాస్తారు అబ్బూరి ఛాయాదేవి. ‘తన మార్గం’ కథ చూడండి. వృద్ధాప్యంలో ఎంత ఆనందముంటుందో తెలుస్తుంది. ఒంటరిగా పార్కుకెళ్లి పిడతకింది పప్పు కొనుక్కు తినడంలో జీవితపు రుచి ఎలా ఊరుతుందో అర్థమవుతుంది. ‘పరిధి దాటిన వేళ’ కథలో కూడా అంతే–ఒక వయసు మళ్లిన స్త్రీ మందులు కొనుక్కొచ్చుకుందామని, దగ్గరే కదాని ఎవరితో చెప్పకుండా బైటికి వెళ్లటం కుటుంబంలో ఎంత అలజడికి కారణమవుతుందో రాశారామె. ఏ వయసు పరిధులు, లక్ష్మణరేఖలు ఆ వయసుకి ఎలా ఆపరేట్‌ అవుతాయో,అదంతా ఎంత సహజంగా జరి గిపోతుందో ఆమె కథలు చదివితే అర్థమైపోతాయి.
 
కథలు రాయటంతోనే తన సాహిత్య పాత్రను పరిమితం చేసుకోలేదావిడ. ఒక సాహితీ కార్యకర్తగా ఎన్నో పనులు చేశారు. అలా చేస్తున్నానని ఎవరికీ అనిపించనివ్వకుండా చేశారు. అది ఆమె మార్గం. ఆమె పద్ధతి. సాహిత్య ఎకాడమీకి ఒక కథా సంకలనాన్ని తన సంపాదకత్వంలో తీసుకొచ్చి ఇచ్చారు. ఎన్నో సాహితీ సభలలో మంచి ఉపన్యాసాలు చేశారు. కొన్నేళ్లపాటు ఛాయాదేవిగారు లేకుండా జరిగిన సాహితీ సభలు అరుదు. ఐతే వేదిక మీద తప్ప సభలో కూర్చునేతత్వం కాదు ఆమెది. ప్రతి సభకూ హుందాగా వచ్చేవారు. ఆ సభకు గౌరవం తెచ్చే వారు. ‘ఉదయం’ వార పత్రికలో, ‘భూమిక’ మాసపత్రికలో కాలమ్స్‌ రాశారు. తన తండ్రిగారి గురించిన వస్తువుతో ‘మృత్యుంజయ’ రాశారు. అనేక సాహితీ వ్యాసాలు రాశారు. ఆమె మంచి కళాకారిణి. పనికిరానివని పక్కనపడేసే వస్తువులతో బొమ్మలు చేయటం ఆమె ప్రత్యేక విద్య. ఎంత కళాత్మకంగా ఉండేవో అవి. ఇంట్లో వాడకుండా ఉన్న చాటలో భారతంలోని వ్యక్తుల్ని నిలిపి ‘చాట భారతం’ చేశారు. స్నేహితులకు, పరిచయస్తులకు, పిల్లలకు వాటిని కానుకగా ఇచ్చేవారు. ఆ విద్య గురించి ‘బొమ్మలు చేయడం’ అనే పుస్తకం ప్రచురించారు.  

ఆమె జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని బాగా అర్థం చేసుకుని ఆచరించారు. ఆయన వివిధ సందర్భాలలో చేసే ప్రసంగాలలో స్త్రీలకు ఉపయోగపడే విషయాలను తీసుకుని ‘స్త్రీల జీవితాలు–జిడ్డు కృష్ణమూర్తి’అనే పుస్తకం రాశారు. ఆ తత్వం, జీవితంపట్ల ఆపేక్షతో కూడిన నిర్లి్లప్తత ఆమెకు బాగా పట్టుబ డ్డాయి. వరద రాజేశ్వరరావుగారు 1992లో అను కుంటా మరణించారు. 1986 నుంచీ ఆమె నేనూ మంచి స్నేహితులమయ్యాం. నేను వెళ్లేసరికి సాయం త్రం ఏడుదాటింది. ఆయనను తీసుకెళ్లారు. ఛాయాదేవిగారు ఎలా ఉన్నారో, ఆమె దుఃఖంలో ఉంటారు, ఎలా ఓదార్చాలి అనుకుంటూ వెళ్లాను. ఆమె మామూలుగా చిరునవ్వుతో వచ్చి కూర్చుని ఆ రోజు అదంతా ఎలా జరిగిందో అతి మామూలుగా తన ధోరణిలో చెబుతుంటే నేను ఆశ్చర్యపోయాను. మర ణాన్ని, అందునా ఆప్తుల మరణాన్ని అలా ధైర్యంగా, హుందాగా ఎదుర్కొని ఎదుటివారి మనసులను తేలికజేయగల సాహసియైన స్త్రీని నేను నా జీవితంలో మొదటిసారి చూశాను. ఆ సంఘటనతో నేను చాలా నేర్చుకున్నాను. ఆ విషయంలో ఆమె ఆలోచనల లోతుని అర్థం చేసుకోలేని వాళ్ల ప్రవర్తన గురించి ఆమె ఒక హాస్య కథ కూడా రాశారు. సంవత్సరన్నరలో ఆమె ఎంతో శ్రమపడి, తన సమయాన్నంతా, హృదయాన్నంతా పెట్టి వరద రాజేశ్వరరావుగారి సమస్త రచనల సంకలనం ‘వరద స్మృతి’ ఎంతో అందంగా ముద్రించారు. సహచరుడిపట్ల ప్రేమను ఆయనను చిరంజీవిగా చేసే పనిలో ఆమె వ్యక్తం చేశారు. ఆ పుస్తకం అనేక విషయాలలో విలువైనది. సాహిత్య చరిత్రలో ముఖ్యమైనది. ఆమె ఆ పనికి పూనుకోకపోతే చాలా లోటు మిగిలేది.

తన తోటి రచయిత్రులతో, తనకంటే చిన్నవారితో ఆమె కలిసిపోయే తీరు అపూర్వం. తనకు నచ్చిన కథల గురించి ఆయా రచయిత్రులతో మాట్లాడి ఆనంద పెట్టేవారు. ఆమె నుంచి ఎంత నేర్చుకున్నా ఆమె మరణాన్ని నిర్లిప్తంగా తీసుకోలేక పోతున్నాను. చాలా వెలితిగా ఉంది. దానిని పూరించుకోటానికి ఆమె చూపిన మార్గం ఉందనే ధీమా. ఆమె చేసిన కృషికి తగిన గుర్తింపు కూడా వచ్చిందనే అనిపిస్తుంది. అనేక అవార్డులు, సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. అజోవిభో కందాళం వారి అవార్డు వచ్చినప్పుడు బాపట్లలో రచయిత్రులం ఎంతోమందిమి వెళ్లి ప్రేమాభిమానాలతో మాట్లా డాం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆమె అందుకున్న సందర్భంలో అస్మిత ఏర్పాటు చేసిన సభకు ఎంతమందో వచ్చి సంతోషపడ్డారు. రచయిత్రులమైతే ఆ అవార్డు మాకే వచ్చినంత సంతోషించాం. ఇంతమంది హృదయాల్లో ఇంత ప్రేమ నింపి, స్త్రీల జీవితాలకు వెలుగు చూపే కథలు రాసి, సాహిత్య చరిత్రలో నిలిచే పుస్తకాలను కూర్చి ప్రచురించిన అబ్బూరి ఛాయాదేవి గారు ఎక్కడికి వెళ్తారు? తెలుగు సాహిత్యంతో సహజీవనం చేస్తున్నారు. 
ఓల్గా
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top