
సాక్షి,రాజమండ్రి: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రిలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
‘సూపర్ 6హామీలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని? నెరవేర్చినవి ఎన్ని?వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చేష్టలు,మాటలు చెబుతున్నాయి. 14 నెలలకే వైఎస్ జగన్ అధికారంలోకి వస్తున్నారని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు పెద్దాపురం స్పీచ్‌లో ఇదే కనిపించింది. చంద్రబాబులో భయం మొదలైంది. భూతవైద్యుడిని సంప్రదిస్తే ధైర్యం వస్తుంది.
వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు జరిగిపోయిన కథలన్నీ వల్లే వేస్తున్నారు. చంద్రబాబులో అభద్రతాభావం పెరిగిపోయింది. తిరిగి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన మాటలే చెబుతున్నాయి. 2019లో చంద్రబాబు ఓటు షేరు 23 సీట్ల గాను 39.17 గా ఉంది.2024లో 11 సీట్లు సాధించిన వైఎస్సార్‌సీపీ ఓటు షేర్ 39.37గా ఉంది. 23 సీట్లు సీట్లు గెలుచుకున్న టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీకి వచ్చిన 11 సీట్లకే అధికంగా ఓట్ షేర్ ఉంది.
వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తున్నారన్న భావన చంద్రబాబులో భయం పెరుగుతోంది. వైఎస్ జగన్‌పై వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం జరుగుతోంది. సింగపూర్ వెళ్లిన దావోస్ వెళ్లిన పెట్టుబడులు రాలేదు. జగన్‌ను భూతంతో పోలుస్తున్న చంద్రబాబు రాజమండ్రిలో భూత వైద్యున్ని సంప్రదిస్తే మంచిది.

జగన్ మళ్ళీ వస్తాడని చంద్రబాబు డయాస్ మీదే ఒప్పుకుంటున్నారు.పోలవరం దుస్థితికి చంద్రబాబు దుర్మార్గమే కారణం.పోలవరం విషయంలో చంద్రబాబు రామానాయుడు చర్చకి పిలిస్తే నేను సిద్ధం. కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును తామే చేస్తామని చంద్రబాబు ఎందుకు ముందుకు వచ్చారో స్పష్టం చేయాలి. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, కాపర్ డ్యాములు పూర్తిగా కాకుండా రూ. 400 కోట్లతో డయాఫ్రం వాల్ ఎందుకు వేశారో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా.
రూ.950 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ వేయటానికి కారణం చంద్రబాబు దుర్బుద్ధే. ఓటమి ప్రభుత్వం 15 నెలలకే ప్రజలకు దూరమైందని స్పష్టమైపోతుంది.చంద్రబాబు గుండెల్లో గుబులు మొదలైంది. 14 నెలల్లో చంద్రబాబు కాన్ఫిడెన్స్ కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు.