
చాలామంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు, ర్యాంకులు వచ్చిన పిల్లలకి మా చిన్నప్పుడు నగదు రూపంలో బహుమానాలు ఇచ్చేవారు. సాధు సుబ్రహ్మణ్య శర్మ గారు మాత్రం పుస్తకాలు బహుమానంగా ఇచ్చేవారు. సైన్సుని, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి విస్తృతంగా చదవడం తప్పనిసరి అనే ఎరుక నా మటుకు నా చిన్నప్పుడు సాధు సుబ్రహ్మణ్య శర్మ (Sadhu Subrahmanyam Sarma) గారిలోనే చూశాను.
చిన్నతనంలో ఆ కాలానికి ఆయన ఇచ్చిన పుస్తకాల విలువ నాకు తెలియ లేదు. అందుకే, చిన్నప్పుడు ఆయన నాకు స్వయంగా బహూకరించిన
నండూరి రామ్మోహనరావు ‘విశ్వదర్శనం’ దర్శనానికి నోచుకోకుండా చాలా కాలం అలాగే ఉండిపోయింది. అందరి చేతా చదివించాలి అనే ఆయన బలమైన ఆశయమే కాకినాడలో సొంత ఖర్చులతో గ్రంథాలయాన్ని నెలకొల్పేలా చేసింది.
‘బంకోలా’ నవలా రచయితగా సుప్రసిద్ధులైన ఆయన ఇండస్ట్రీస్ డిపార్ట్ మెంట్‌లో పని చేసి పదవీ విరమణ చేశారు. కాకినాడలో నివాసం. గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో గల సముద్ర తీరంలోని కోరంగి రేవు ప్రాంతంలో బ్రిటిష్ కాలం నాటి మత్స్యకారుల జీవన ఘర్షణ, వలస దేశంగా మారుతూ ఉన్న పరిణామాలు, దాని గురించి వారి ఆవేదన కథా వస్తువుగా బంకోలా రాశారు. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే నవల అది. అందులో 1825–30లలో వాడుకలో ఉండి కనుమరుగైన అనేక అచ్చ తెలుగు పదాలు కనబడతాయి. ఒక చారిత్రక సందర్భానికి నవలా రూపం ఇవ్వదలచుకున్న రచయిత ఎంత లోతుగా పరిశోధన చేయాలో తెలియజేసే గ్రంథం అది.
ఈ మధ్యే ఆయన్ని కాకినాడ వెళ్లి కలిశాను. అదే ఆఖరి కలయిక అవుతుందని మాత్రం అనుకోలేదు. తొంభైకి పైగా వయసు, నడవ లేని స్థితిలో కూడా నేను పుస్తకాల గురించి మాట్లాడితే ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. ‘జీవితం చాలా పెద్దది, ఒక సిద్ధాంతానికి పరిమితమవ్వద్దు. విస్తృతంగా తెలుసుకోవాలి’ అని చెప్తూ, ఆయన సహాయకురాలితో, ‘లైబ్రరీకి తీసుకుని వెళ్ళు’ అన్నారు. ‘సాధు మెమోరియల్ మినీ లైబ్రరీ మరియు పిల్లల ఆటలకేంద్రము’ అని బోర్డు ఉంది. లోపలకి వెళ్తే రెండు గదుల నిండా పుస్తకాలు. ఐదారు పుస్తకాలు తీసుకుని రిజిస్టర్‌లో నోట్ చేశాను. మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళి తీసుకున్న పుస్తకాలు చూపించాను. కొంత సేపు పుస్తకాల గురించి మాట్లాడారు. ఎక్కువ మాట్లాడలేక ఆక్సిజన్ పెట్టుకుంటున్నారు. ఇబ్బంది పెట్టకూడదు అని, ‘థాంక్స్ అండి, వెళ్తున్నాను’ అన్నాను. ఇంతలో సహాయకురాలిని పిలిచి, ఆయన రాసిన పుస్తకాలు ఇమ్మన్నారు. ఆయనకి చాలా పేరు తెచ్చిన ‘బంకోలా’ నా దగ్గర ఉండటంతో మిగతా పుస్తకాలు ఇచ్చారు. అందులో ఒకటి ‘డయలెక్ట్స్ ఆఫ్ ఎవల్యూషన్స్ సిస్టమ్స్ ఎప్రోచ్‌అండ్ న్యూ ఫ్రంటీర్స్ ఆఫ్ ఫిలాసఫీ’. 600 పేజీల పుస్తకం. దానికి రెండవ భాగం కూడా రాయ వలసిందని నేను అంటే, ‘అనుకున్నాను కానీ కుదరలేదు’ అన్నారు.
ఉద్యోగ రీత్యా ట్రాన్స్‌ఫర్లలో ఏ ఊరు వెళ్తే ఆ ఊరులో ఉన్న సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్స్‌కి మా పిల్లలని తీసుకుని వెళ్ళి పుస్తకాలు కొనే వాడిని అని పాత సంగ తులను అపురూపంగా గుర్తు చేసుకున్నారు. తొమ్మిది పదుల వయసులో ఒక మంచి మానవ సమాజాన్ని కాంక్షిస్తూ తనకి ఉన్న పరిమితుల్లో సొంతంగా లైబ్రరీ నిర్వహించ డానికి మించిన సార్థకత ఒక మనిషికి ఇంకేముంటుంది! ఆ సార్థక జీవి తన 93వ యేట జూలై 18న తుది శ్వాస విడిచారు. పుస్తకాలు అందరూ చదవాలి, అందరూ ఎదగాలని చివరి క్షణం వరకూ కాంక్షించిన గొప్ప పుస్తక ప్రేమికుడికి ఇవే కన్నీటి నివాళులు.
గోదావరి సముద్ర తీరంలోని కోరంగి రేవు ప్రాంతంలో బ్రిటిష్ కాలం నాటి మత్స్యకారుల జీవన ఘర్షణ, వలస దేశంగా మారుతూ ఉన్న పరిణామాలు, దాని గురించి వారి ఆవేదనకథా వస్తువుగా ‘బంకోలా’ (లైట్‌హౌజ్) నవల రాశారు సాధు సుబ్రహ్మణ్య శర్మ.
– పిన్నింటి సాయి పవన్ న్యాయవాది