కరోనాను మించిన వైరస్‌ చంద్రబాబు

C Ramachandraiah Writes Guest Column About Chandrababu Cheap Politics - Sakshi

సందర్భం 

గాంధీ టోపీలు ధరించిన వారందరూ గాంధీలు ఎలా కాలేరో.. మానవత్వం ముసుగులు ధరించి.. సోషలిజం పలుకులు పలికినంతమాత్రాన వారు పేదల పక్షపాతి కాలేరు. అవకాశం వచ్చినప్పుడు వారు మానవత్వం చూపించగలిగారా? పేదలకు న్యాయం చేయగలిగారా? అన్నదే కొలమానం. అవును మనం ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురించే మాట్లాడుకుంటున్నాం. కరోనా వైరస్‌ సృష్టిస్తున్న ఈ అనిశ్చిత పరిస్థితిలో కూడా బాబు తన చౌకబారు రాజకీయాలకు స్వస్తిపలకడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలు పట్టలేదు. సామాన్యుల వెతలు విన్పించలేదు. సబ్సిడీలన్నా, సంక్షేమమన్నా రుచించలేదు. అలాంటి బాబు ఈ ప్రభుత్వానికి సంక్షేమ పాఠాలు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన బాబు ఆ ఐదేళ్లలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చినప్పటికీ.. రైతాంగానికి మాఫీ చేస్తానన్న రుణాలలో (రైతుల రుణాల మొత్తం రూ. 1 లక్షా 25 వేల కోట్లు కాగా.. అనేక షరతులు పెట్టి చివరకు తేల్చిన మొత్తం రూ. 24,000 కోట్లు మాత్రమే) రూ. 11,000 కోట్ల మేర ఎగనామం పెట్టారు. రైతులతోపాటు డ్వాక్రా మహిళలకు చేస్తామన్న రుణమాఫీ చేయనేలేదు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఇవ్వనేలేదు. దశలవారీగా చేస్తామన్న మద్యపాన నిషేధం హామీని అటకెక్కించారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి ప్రతిపక్షంలోకి రాగానే ఆయన మానవతామూర్తి అవతారం ఎత్తారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘‘రైతులకు ప్యాకేజీ ప్రకటించండి, గీత కార్మికుల్ని ఆదుకోండి, పేదకుటుంబాలకు నెలకు రూ. 10,000 ఇవ్వండి’’.. అంటూ ఆయా వర్గాల పట్ల తనకేదో సానుభూతి ఉన్నదన్నట్లు బాబు ఎడాపెడా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖలు సంధిస్తున్నారు.

కరోనాను సాకుగా చేసుకొని ప్రతిరోజూ ప్రెస్‌మీట్లు పెట్టి సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడం, తమ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించి.. ఆ సమాచారాన్నంతా మీడియాకు అందించడం చేస్తున్నారు. పైగా, అదే సమాచారాన్ని అటూ, ఇటూ మార్చి తమ పార్టీ నేతలతో తిరిగి మాట్లాడించడం, పత్రికా ప్రకటనలు విడుదల చేయించడం రివాజుగా చేసుకున్నారు. వీరి ప్రకటనలలో నిర్మాణాత్మక సూచనలేమైనా ఉన్నాయా? అంటే కాగడాపెట్టి వెతికినా ఒక్కటీ కనపడదు. తను ఏమి చెప్పినా ఎదురు ప్రశ్నించకుండా చూపించడానికి కొన్ని టీవీ చానెళ్లు; ప్రచురించడానికి కొన్ని దినపత్రికలు ఉన్నాయి కనుక బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.

పేదవాడి సంక్షేమం గురించి, రైతుల ప్రయోజనాల గురించి చంద్రబాబు ఈ రోజు కొత్తగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి పాఠాలు చెప్పడం ఏమిటి? వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రకటించిన ‘నవరత్నాలు’ చంద్రబాబు చెబితే చేసినవా? ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే అమలు చేస్తున్న ఈ వినూత్న సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ చంద్రబాబు చెబితే చేస్తున్నవా? గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తే దానిని అవహేళన చేసిన బాబు.. నేడు కరోనా వ్యాప్తి నిరోధానికి గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగిం చుకోండంటూ చెప్పడం ఎంత హాస్యాస్పదం? 

మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన కాలంలో.. బాబు తనదైన ముద్రగలిగిన ఒక్క సంక్షేమ పథకాన్నైనా అమలు చేయగలిగారా? ఏపీలో పేదల కోసం అమలు చేసిన సబ్సిడీ బియ్యం పథకం ఎవరిది? ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టింది కాదా? బాబుతోసహా ఎంతోమంది సాధ్యం కాదని చెప్పినప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్‌ను విజయవంతంగా అందించిన ఘనత డా‘‘ వైఎస్‌ రాజశేఖరరెడ్డిది కాదా? చంద్రబాబు రైతులు, పేదల సంక్షేమానికి చేసిందేమిటి? అధికారంలో ఉన్నప్పుడు పేదలకు అందించే సబ్సిడీల్లో భారీ కోతలు పెట్టడం నిజం కాదా? పాతిక కేజీల సబ్సిడీ బియ్యాన్ని 20 కేజీలకు తగ్గించింది బాబు కాదా? రూ. 2 ల బియ్యాన్ని అధికారంలోకి రాగానే రూ. 5.50కి పెంచిన విషయం బాబు మరిచారా? సంస్కరణల పేరుతో గృహ విద్యుత్‌ చార్జీలను అమాంతం పెంచడమే కాకుండా చార్జీలను తగ్గించమని ఆందోళన చేసిన ఉద్యమకారులపై కాల్పులు జరిపించి వారి ఉసురు తీసిందెవరు? కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు కొమ్ముకాసి వారికి భారీ రాయితీలు అందించి పేదవాడిని హీనంగా చూసిన బాబు.. నేడు ప్రతిపక్షంలో కూర్చొని తానేదో గొప్ప మానవతామూర్తి మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ‘ఇది చేయండి.. అది చేయండి’అంటూ ఉచిత సలహాలతో ఆడుతున్న డ్రామా వెనుక అసలు పరమార్థం గ్రహించలేని వెర్రివాళ్లా ప్రజలు? అదేనిజమైతే.. తాను ఎందుకు చిత్తుగా ఓడిపోవాల్సివచ్చిందో ఆలోచించుకోవాలి.

నిజానికి, ప్రపంచ మానవాళికి ముప్పుగా కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో.. తెలుగు ప్రజలు ముందుగా గుర్తు చేసుకోవల్సిన వ్యక్తులు ఇద్దరు ఒకరు ఎన్టీఆర్, రెండు  వైఎస్సార్‌. సబ్సిడీ బియ్యం పథకం ప్రవేశపెట్టి నిరుపేదలకు పోషకాహారాన్ని అందించిన వారు ఎన్టీఆర్‌ కాగా; పేదలు ప్రాణాంతక జబ్బుల బారినపడి వారు ఆర్థికంగా, భౌతి కంగా చితికిపోయే పరిస్థితుల నుంచి తప్పిస్తూ ‘ఆరోగ్యశ్రీ’ వంటి గొప్ప పథకాన్ని, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ పథకంతో  పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకొనే అవకాశాన్ని కల్పించి.. వీటితోపాటు అందరికీ అన్నం పెట్టే రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకొని ఆత్మహత్యలు చేసుకోకుండా.. వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్, రుణాలమాఫీ కల్పించిన మానవతామూర్తి వైఎస్సార్‌.

మన దేశ, రాష్ట్ర కాలమాన పరిస్థితులకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రెండూ కీలకం అని నమ్మిన వైఎస్సార్‌ అధికారంలోకి రాగానే వాటి అభివృద్ధికై అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన హయాం లోనే చిన్న, మధ్య, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికై ‘జలయజ్ఞం’ మొదలైన కారణంగానే నేడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో.. సాగునీటి ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు పండుతున్నాయి. 

గత తొమ్మిది నెలలుగా బాబు ప్రతిపక్షనేతగా కూడా విఫలమయ్యారు. కరోనా మహమ్మారిని మించిన వైరస్‌ నేడు ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించి ఉంది. దీనికి ఏకైక ఔషధం ప్రజల విజ్ఞతే. ప్రజలు బాబు ప్రవర్తనను గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజా సమస్యలపట్ల పూర్తి అవగాహన ఉంది. వాటిని పరిష్కరించే చిత్తశుద్ధి ఉంది. ప్రజల సహకారంతో తాత్కాలికంగా ఏర్పడిన ఈ ఇబ్బందులను విజయవంతంగా అధిగమించే ఆత్మవిశ్వాసం నిండుగా ఉంది.


సి. రామచంద్రయ్య 
వ్యాసకర్త మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top