తెలుగు భాష పరాయీకరణపై ప్రశ్నలు

Bhasha Vaaranam book review by B.Narsan - Sakshi

సమీక్ష

భాషా శాస్త్రవేత్తలు భాష పుట్టుక, కాలమాన మార్పులు తదితర భౌతిక విషయాలను విశ్లేషించగలరేమోగాని, ఇతర భాషల ఆధిపత్యంలో ఒక భాష ఎలా చిన్నాభిన్నమవుతుందో భాషా, సమాజ ప్రేమికులు మాత్రమే పసిగట్టగలరు. ఈ నేపథ్యంలో తెలుగు భాషా పరిస్థితిని పరామర్శిస్తూ జయధీర్‌ తిరుమలరావు రాసిన వ్యాస పరంపర ‘భాషావరణం’. ఇందులోని 46 వ్యాసాలు ఏప్రిల్‌ 2008 నుండి డిసెంబర్‌ 2012 వరకు చూపు శీర్షికన ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రికలో వచ్చినవి. శీర్షిక పరిమితులకు లోబడినట్లు కాకుండా రచయిత ఎత్తుకున్న అంశంపై సర్వస్వతంత్రంగా వ్యవహరించారు. అందువల్ల ఇవి పత్రికా వ్యాసాలుగా కాకుండా రచయిత భాష పట్ల సమర్పించిన ఒక పరిశోధక గ్రంథంగా కనిపిస్తాయి.

జన సామాన్య భాషగా బతికిన తెలుగును ఆర్య భాష అయిన సంస్కృతంతో నింపి, దాని సహజ రూపాన్ని దూరం చేశారనీ, ఇలా వాడుక తెలుగును సామాన్యుడికి అర్థంకాని స్థాయికి తీసుకెళ్లి పండితులు తెలుగు సాహిత్యాన్ని తమ గుప్పిట్లో ఉంచేసుకున్నారనీ, జనం కళలు, భాష, సాహిత్యాన్ని న్యూనతా భావంలోకి నెట్టేశారనీ ఈ వ్యాసాలు ఆరోపిస్తాయి. ఆంగ్లం విషయ పరిజ్ఞాన సముపార్జనకు పరిమితం కాకుండా యావత్‌ తెలుగు జాతి జీవన రీతుల్నీ, వాటి మూలాల్నీ ధ్వంసం చేస్తున్న విధానాన్ని ప్రతిఘటించాల్సిన అవసరాన్ని ఈ వ్యాసాలు గుర్తు చేస్తాయి.

భూస్వామ్య రాచరిక మత వ్యవస్థకు సంకేతమైన సంస్కృతాన్ని, సామ్రాజ్యవాద సంస్కృతిని విస్తరింపజేస్తున్న ఆంగ్ల భాషాదిపత్యాన్ని ప్రశ్నిస్తూ, తెలుగు భాష మనుగడ కోసం ప్రజలను ఆలోచించేలా చేయాలనేది తన వ్యాసాల ప్రధాన ఉద్దేశమని రచయిత పరిచయ వాక్యాల్లో పేర్కొన్నారు.

పరభాషల దాడుల వల్ల తెలుగువారు స్వాభావికంగా తెలుగువానిగా లేడు. వాడు పాళీపండితుడు, వాడు నిరంతరం సంస్కృత పండితుడు. నివసిస్తున్న సమాజం సంస్కృత భూయిష్ట సమాజం. ఇంత జరిగినా భాషా శాస్త్రవేత్తలు భాషా పరిణామానికి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు దోహదపడుతాయన్న దృష్టికోణాన్ని విస్మరించారని రచయిత ‘మన నాలుకపై పరభాష పొరలా!’ అని ప్రశ్నించారు. అన్ని రకాల యాసలు, మాండలికాలు, వ్యవహార భాషలు, వృత్తుల భాషలు భాషా వ్యవస్థలో అనివార్య విభాగాలనీ వాటిని ‘అపభ్రంశాలు’గా భ్రమ పడకూడదనీ హితవు పలికారు.

1963లో తెలుగు నానుడి కూటమి వారు అచ్చేసిన ‘తెలుగా, ఆంధ్రమా?’ అనే 68 పేజీల పుస్తకం, అదే రచయిత రాసిన 340 పేజీల ‘నుడి, నానుడి’ ప్రస్తావన ఈ వ్యాసాలకు వన్నె తెచ్చింది. ఈ రెండు పుస్తకాల రచయిత ‘వాగరి’. 1992లో చనిపోయిన వాగరి అసలు పేరు బి.సత్యానందం. అది సంస్కృత పదం కాబట్టి బంగారయ్యగా పేరు మార్చుకున్నట్టు తిరుమలరావు రాశారు. బంగారయ్య తెలుగును చుట్టేసిన సంస్కృతాన్ని తూర్పార బట్టారు. ‘తెలుగు చరితాకారులు పరిసోదకులు కారు, వారు చాటింపుదారులు. వారు చేసేపని నారు ఒక చోట నుండి తీసి మరి ఒక చోట నాటడము. తెలుగును తీసి ఆంధ్రమును నాటాలి. తెలుగు నాడును ఆంధ్రప్రదేశమును  మొల ఎయ్యాలి. తెలుగు జాతిని ఆంధ్ర జాతిగా మార్చాలి. ఇంతకు మించి ఏమీ చేయలేదు’. ‘తెలుగునాటిలోని బడులలో తెలుగు అనే పేరున పిల్లలకు నేర్పింపబడుతూ ఉండినది తెలుగు లిపిలోని సమస్క్రుతము’ అని పలికిన బంగారయ్య వాదన మూడు వ్యాసాల్లో వివరించబడింది.

‘భాషావరణం’ పద బంధంలోనే విస్తృత అర్థం ఉంది. భాష అనగానే అక్షరమాల, లిపి, శాస్త్రాల గిరిగీసుకోక– భాషతో సమాజానికీ జీవనానికీ ఉన్న లెంకలన్నీ ఇందులో చర్చించబడ్డాయి. సాంప్రదాయ వాదుల నుండి, కార్పొరేట్‌ శక్తుల నుండి, తల్లినుడి కాపాడుకోవాలని ఉద్బోధించాయి. వ్యాసాలు కొనసాగించేందుకు రచయిత భాషతో బంధం గల పత్రికారంగం, పాఠశాల వ్యవస్థ విద్యాహక్కులను కూడా తడమక తప్పలేదు. కొన్ని వ్యాసాలు పేరుకు భాషతో మొదలై సాహిత్య చర్చలోకి జారిపోయాయి. ఈ సంపుటి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, గుంటూరు వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడింది. రూపకల్పన ఆకర్షణీయంగా ఉంది.

- బి.నర్సన్‌
9440128169

భాషావరణం (వ్యాసాలు); రచన: జయధీర్‌ తిరుమలరావు; పేజీలు: 310; వెల: 200; ప్రచురణ: సాహితీ సర్కిల్, 402, ఘరోండా అపార్ట్‌మెంట్స్, ఓ.యూ. మెయిన్‌ గేట్‌ దగ్గర, లేన్‌ –1, డీడీ కాలనీ, హైదరాబాద్‌–7. ఫోన్‌: 9951942242

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top