అనంత ఏకాంతంలో ‘లోపలి మనిషి’

Bandaru Srinivasa Rao Article On PV Narasimha Rao - Sakshi

సందర్భం

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నం తకాలం అందరూ ‘ఆహా! ఓహో!!’ అన్నారు. పీకలలోతు సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్థిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యా బలం బొటాబొటిగా ఉన్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠంపై ఉంచిన ‘అపర చాణక్యుడ’ని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాత, పొగిడిన ఆ నోళ్లతోనే ఆయన్ని తెగడటం ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం కాగానే వాళ్ళూ దూరం జరిగారు. మాజీగా మారిన పీవీపై విమర్శల దాడి పార్టీకి ఆయన దేశానికి చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు.

అయిదేళ్ళు ‘తెలుగువాడి’లోని ‘వాడినీ, వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త’, నిస్సహాయంగా న్యాయస్థానాలలో ‘బోనులో’ నిలబడినప్పుడు, ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోకపోగా ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’, ‘నోళ్ళు’ మూసుకున్నారు. ప్రధానిగా ఆయన హయాంలో జరిగిన తప్పులో, పొరబాట్లనో  సమర్ధించడం నా ఉద్దేశం కాదు. రాజకీయాల్లో ‘కృతజ్ఞత’, ‘విధేయత’ అనే పదాలకి తావు లేకుండా పోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ.

పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏటా బేగంపేటలోని ఒక సందులో ఉన్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా ఆయన హాజరయ్యేవారు. వాటిని కవర్‌ చేయడానికి వెళ్ళినప్పుడు ‘అధికారాం తమునందు..’ అనే పద్యపాదం జ్ఞాపకం చేసుకోవాలో, ‘ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు అన్నీ దిగదుడుపే’ అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు.

పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో పదిలంగా ఉండిపోయింది. మాజీ ప్రధానిగా పీవీ రాజ్‌భవన్‌లో వున్నప్పుడు, నేనూ, ఆకాశవాణిలో నా సీనియర్‌ కొలీగ్‌ ఆర్వీవీ కృష్ణారావు గవర్నర్‌ రికార్డింగ్‌ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత,  రాజ్‌భవన్‌ గెస్ట్‌ హౌస్‌ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. ఒకరిద్దరు సెక్యూరిటీ వాళ్ళు మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భధ్రతాధికారిని అడిగాము. అతడు తాపీగా ‘లోపలకు వెళ్ళండి’ అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూనే లోపలకు అడుగు పెట్టాము. పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ చూస్తూ కని పించారు. డిస్టర్బ్‌ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరి చయం చేసుకున్నాము. 

లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ, ‘మీ అన్నయ్య పర్వతాల రావు ఎలా వున్నాడయ్యా!’ అని అడిగేసరికి నాకు మతిపోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం.

ఇది జరిగి ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది. మరో సందర్భంలో పీవీ గారిని ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో ఉన్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్దం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే ‘పీవీ గారిని కలవడానికి వీలుంటుందా’ అని వచ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసిగట్టినట్టున్నారు. ‘పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.

‘మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో... మీ రేడియో ఉద్యోగాలు లేవా? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా ఉంటావ్‌?’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను ఊహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.

పీవీ స్మృతికి నా నివాళి.
(నేడు హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ఉదయం 11 గంటలకు సుప్రసిద్ధ జర్నలిస్టు, ‘ది ప్రింట్‌’ సంపాదకులు శేఖర్‌ గుప్తా దివంగత ప్రధాని పీవీపై స్మారకోపన్యాసం చేయనున్నారు)


భండారు శ్రీనివాసరావు
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ‘ 98491 30595

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top