విద్యుత్‌ తేజో ‘ప్రభాకరుడు’

Article On TRANSCO CMD Devulapally Prabhakar Rao - Sakshi

సందర్భం

కొందరికి పదవుల వల్ల పేరొస్తుంది. కానీ, కొందరు వ్యక్తుల కృషి వల్ల ఆ పదవులకు వన్నె వస్తుంది. అలాంటి అరుదైన వ్యక్తులలో ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఒకరు. ఆయన వృత్తిలో ప్రవేశిస్తున్నప్పుడే ఎ.పి.ఎస్‌.ఇ.బి వ్యవస్థ ఏర్పడింది. ఇపుడు ఆ సంస్థ వయస్సు 50 ఏళ్లయితే ప్రభాకర్‌రావు సర్వీసు కూడా 50 ఏళ్లు అయ్యింది. ఇది కూడా అరుదైన సంఘటనగానే మిగిలిపోయింది. 

ప్రభాకర్‌రావు విద్యుత్‌ శాఖకే వెలుగులు పంచి వన్నె తెచ్చారు. ఇది కూడా ఆయనకు చెరగని కీర్తి తెచ్చి పెట్టింది. ఆయన వృత్తిలో ఎందరెందరో ఉద్యోగులను, ఇంజనీర్లను, ఆడిటింగ్‌ సెక్షన్‌ ఆఫీసర్లను, పలురకాల ట్రేడ్‌ యూనియన్లు చూశారు. వాళ్లందరి తలలో నాలుకలాగా వ్యవహరించటం  ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి నుంచి చివరి ఏపీ సీఎంలు కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల వరకు ఆయనకు బాగా తెలుసు. ఆ కాలంలోని సీఎంలందరూ ప్రభాకర్‌రావు వ్యక్తిత్వాన్ని కొనియాడారు. 

తెలంగాణ రాష్ట్రం అవతరించాక సీఎం కేసీఆర్‌ చేపట్టిన 24 గంటల కరెంట్‌ సరఫరా ఆలోచన అమలుకు ప్రాణంగా ప్రభాకర్‌రావు పనిచేశారు. విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను మలచటానికి ఎంతో శ్రమించి ప్రభుత్వానికి కుడిభుజంగా పనిచేశారు. కేసీఆర్‌ నమ్మి బాధ్యతనిస్తే చిత్తశుద్ధితో పనిచేసి ఆయన మన్ననలు పొందారు. ఈ 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ప్రభాకర్‌రావు వ్యక్తిత్వం, పనివిధానం ద్వారా, నిజాయతీ, నిబద్ధతల ద్వారా విద్యుత్‌ శాఖపై చెరగని ముద్ర వేశారు. ఒక రకంగా ఆయన తన ఇంటిని చూసుకున్నట్లే విద్యుత్‌ శాఖను కూడా చూసుకున్నారు. చేసే పనిలో చిత్తశుద్ధి, కృషి, ఆత్మగౌరవం, ఎవరికీ తలవంచనితనం, క్లిష్టసమయాల్లో సమస్యలను ఎదుర్కునే శక్తిని అందుకు పరిష్కార మార్గాలను వెతికి పట్టుకోవటంలో ఆయన సిద్ధహస్తుడు.

విద్యుత్‌శాఖలో ప్రభాకర్‌రావు ఒక ఇన్‌సైడర్‌గా ఉన్నారు. విద్యుత్‌ శాఖ ఆత్మను ఆయన పట్టుకున్నారు. ఆయన ఆ శాఖలో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 22 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ప్రభాకర్‌రావును ఒక అధికారి అపార్థం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయనను ‘ఐ విల్‌ సీ యువర్‌ ఎండ్‌’ అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారి అంతమాట అన్నందుకు ‘మనిద్దరి అంతు చూడటానికి పైవాడున్నాడు. మీరు మంచి మూడ్‌లో లేరు’ అని సమయస్ఫూర్తిగా మాట్లాడారు. 

ప్రభాకర్‌రావులో ఒక డైనమిజం ఉంది. ఆయన వృత్తిరీత్యా అకౌంట్స్‌ విభాగంలో ఉన్నప్పటికీ ఆయనకు స్నేహితులంతా ఇంజనీర్లుగా ఉన్నారు. అది కింది స్థాయి నుంచి పై వరకు ఉన్నారు. అలాగే ఆఫీసులో పనిచేసే వాచ్‌మెన్‌ దగ్గర్నుంచి ట్రేడ్‌యూనియన్ల వరకు ఎవరు కన్పించినా ప్రేమగా మాట్లాడటం ఆయన నుంచి నేర్చుకోవాలి. 

ఇంజనీరింగ్‌ క్యాటగిరికీ, అకౌంట్స్‌ శాఖకు మధ్యలో అనేక వైరుధ్యాలుంటాయి. ఒక్కొక్కసారి అవి శత్రుత్వాలుగా మారుతాయి. ప్రభాకర్‌రావు ఈ రెండింటి మధ్యలో ఉన్న రైవలిజం అనే బెర్రను చెరిపివేశారు. అదే ఆయనను ఈ రెండు శాఖల మధ్య వారధిని చేశాయి. ఈ రెండు శాఖల మధ్య ఆయన వంతెనగా మారడంతో విద్యుత్‌ శాఖలో ‘‘లోపల మనిషి’’ అయ్యారు. ఆయన అకౌంట్స్‌ ఆఫీసర్‌గా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఈ దశలోనే ఆయన అసోషియేషన్‌ అధ్యక్షుడూ అయ్యారు. దీంతో అన్ని శాఖల మధ్య దూరాన్ని తొలగించి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగారు. విద్యుత్‌ శాఖలో ఆయన ఈ ఉన్నత దశలో ఉండటానికి కారణం ఇదేననుకుంటా!

తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత అలుముకున్న చీకట్లను తొలగించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చీకట్లు కమ్ముకుంటాయని జరిగిన ప్రచారాల్ని తిప్పి కొట్టడానికి ఆయన సీఎం అయ్యాక తొలిగా 24 గంటల నిరంతర కరెంటు ఇచ్చే పనికి శ్రీకారం చుట్టారు. చీకట్లను చీల్చుకుంటూ విద్యుత్‌ వెలుగులను పంచటానికి ముందుకు సాగిన కేసీఆర్‌కు ఈ ప్రభాకర్‌రావు ఒక కార్యకర్తగా కృషిచేశారు. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌శాఖ అభివృద్ధి కోసం కృషిచేసిన ప్రభాకర్‌రావుకు అనుకోకుండా రాష్ట్రం రావడంతో తను పుట్టిపెరిగిన నేలకు సేవ చేసి తరించే అవకాశాన్ని కేసీఆర్‌ కల్పించారు. ట్రాన్స్‌కో సీఎండిగా ప్రభాకర్‌రావును ఎంపిక చేయటం ఒక రకంగా ఆయనకు జీవనసాఫల్య పురస్కారం లభించినట్లుగానే భావించాలి. కేసీఆర్‌ ఏ పనైనా చేపడితే ఎంత మొండితనంతో దూసుకుపోతాడో తెలిసిందే. అందుకు నికార్సైన మనుషులనే ఆయన ఎంచుకుంటారు. ఈ దారిలో విద్యుత్‌శాఖకు ప్రభాకర్‌రావును ఆయన ఎంచుకున్నారు. సరిగ్గా కేసీఆర్‌ ఏ ఆలోచనతో ముందుకుపోతున్నారో అందుకు మొత్తం విద్యుత్‌శాఖను సన్నద్ధం చేసిన కార్యకర్తగా ప్రభాకర్‌రావుకు గుర్తింపు ఉంది. ఇది ఆయన జీవితంలో అందుకున్న అన్ని పురస్కారాలకంటే గొప్పది.


-జూలూరు గౌరీశంకర్‌
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు
మొబైల్‌ : 94401 69896

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top