రణదేవ్ బిల్లా అంటే ఎవరు?

రణదేవ్ బిల్లా అంటే   ఎవరు? - Sakshi


ఐ టాకు ఏ ఇంగిలీసు ఆల్ పీపులు వెల్లా టుడే!

ఉత్తమ విలన్


ఇది నాది అని  ఒక్కసారి నేను అనుకుంటే అది నాకు దక్కి తీరాలి


విలన్ ఎలా ఉండాలి?

కోపం కోసమే పుట్టినట్లు... రెండు నిప్పుల కుంపట్లు ఎప్పుడూ కళ్లలో పెట్టుకోవడమే తన హక్కు అన్నట్లు ఉండకూడదు. ఒక లెక్క ప్రకారం చెప్పుకోవాలంటే... సెలైంట్‌గా ఉంటూనే సునామీ సృష్టించాలి. సునామీలా వెర్రెత్తిపోతూనే... సెలెనైై్సపోవాలి. వ్యూహాన్ని మెరుగుదిద్దుకోవాలి. ‘ఉత్తమ విలన్’ అంటే ఇలా ఉండాలి’ అనిపించుకోవాలి. చల్లగా చాపకింద నీరులా ఉండి చావు దెబ్బతీసే ‘విలన్’ పాత్రలకు ఇంకా చేరువకాలేదుగానీ... ఆవేశాన్ని, హాస్యాన్ని సమపాళ్లలో పండించగలనని నిరూపించాడు దేవ్ గిల్.


దేవ్ గిల్ అంటే? ఎవరు?

అదేనండీ... ‘మగధీర’ విలను.

రణదేవ్ బిల్లా!!

అమ్మో....! నాలుగు శతాబ్దాల నాటి తీరని వాంఛతో రాకుమార్తె కోసం మళ్లీ పుట్టిన విధ్వంసకారుడు. ఎంతకైనా తెగించి తొడగొట్టే రాక్షసుడు... రణదేవ్ బిల్లా! ‘మగధీర’లో మగటిమి ఉట్టి పడే విలన్‌గా భయపెట్టిన దేవ్... ‘పూలరంగడు’లో ‘ఐ టాకు ఏ ఇంగిలీసు’ అంటూ నవ్వించాడు. ‘సినిమాలో ఒక హీరో ఉంటాడు కాబట్టి... అతనికొక విలన్ ఉండాలి’ అన్నట్లుగా ‘మగధీర’ సినిమాలో ‘విలన్’ పాత్రను డిజైన్ చేయలేదు. ఆ పాత్రలో రక్తమాంసాలు ఉంటాయి. చీకటి వెలుగులు ఉంటాయి. కొండను ఢీ కొట్టే బలమైన ముందడుగు ఉంటుంది. అగ్గిలాంటి ఆవేశం ఉంటుంది. దీంతో పాటు అడుగుతడబడడం ఉంటుంది. అవమానం ఉంటుంది.


ప్రత్యర్థిని సవాలు చేసే దమ్ము కావాలి.ఆ దమ్ము గొంతులోనే కాదు... గంభీరమైన దృఢమైన శరీరంలోనూ కనిపించాలి.‘మగధీర’లో విలన్ పోస్ట్‌కు ఎంపిక కావడం అంటే ఆషామాషీ ఏమి కాదు.


మరి అదృష్టం ఉంటే?

ఆ అదృష్టానికి ప్రతిభ తోడైతే....

ఆ ప్రతిభే... రణదేవ్ బిల్లా, రఘువీర్‌గా నటించిన దేవ్ గిల్!  దేవిందర్‌సింగ్ గిల్ మహారాష్ట్రలోని పుణేలో పుట్టాడు.తండ్రికి చిన్న రెస్టారెంట్ ఉంది.నటుడు కావాలనే కోరిక మూడో క్లాసు నుంచే మొదలైంది. మూడో క్లాసులోనే ఒక నాటికలో నటించాడు. అలా ప్రతి సంవత్సరం నటిస్తూనే ఉన్నాడు. పెద్దయ్యాక... మోడల్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.బాలీవుడ్ సినిమా ‘షాహీద్-ఏ-ఆజమ్’లో రాజ్‌గురుగా నటించాడు. మంచి పాత్ర!దమ్మున్న పాత్ర!! కానీ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తరువాత... దేవానంద్ డెరైక్ట్ చేసిన ‘మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమాలో నటించాడు. ప్చ్... పెద్దగా ప్రయోజనం లేదు.


కేసీ బొకాడియా ‘బోల్డ్’ సినిమాలో.... ‘డబ్బుతో ఈ ప్రపంచాన్ని ఈజీగా కొనేయవచ్చు’ అని నమ్మే బిజినెస్ టైకూన్ ప్రాత్రలో నటించాడు. ఆ సినిమా పెద్ద హిట్టై ఉంటే... పరిస్థితి ఎలా ఉండేదో తెలియదుగానీ... ‘బోల్డ్’ తరువాత గ్యాప్ వచ్చింది.గ్యాప్ తరువాత తెలుగులో నాగార్జున, విష్ణు సినిమా ‘కృష్ణార్జున’లో నటించాడు.ఆ సమయంలోనే మోహన్‌బాబు దృష్టిలో పడ్డాడు. ఆయన రాజమౌళికి దేవ్ గిల్ గురించి చెప్పాడు. గిల్ రాజమౌళిని కలిశాడు. ‘‘ఇప్పుడు ఎలా ఉన్నావో... నెల తరువాత కూడా అలాగే కనిపించాలి’’ అని చెప్పాడు రాజమౌళి.అదే... మీసం... అదే గడ్డంతో... నెల తరువాత కలిశాడు. ఒడ్డూ పొడుగు బాగున్న దేవ్ గిల్‌ను ‘రణదేవ్ బిల్లా’ పాత్ర వరించింది. ‘ఉత్తమ విలన్’గా ఎంతో పేరు తెచ్చింది. తెలుగు చిత్రసీమకు చాలా దగ్గర చేసింది. హైదారాబాద్ అల్లుడిని కూడా చేసింది! ‘మగధీర’ ‘పూలరంగడు’ ‘రగడ’ ‘ప్రేమకావాలి’ ‘రచ్చ’ ‘నాయక్’ ‘లింగ’ సినిమాలతో ‘యంగ్ విలన్’గా మంచి మార్కులు కొట్టేశాడు  దేవ్ గిల్. ‘‘చెడ్డ పాత్రల్లో నటించాలని నాకు మా చెడ్డ కోరిక’’ అంటాడు దేవ్‌గిల్.అందుకే కదా... దేవిందర్ సింగ్ గిల్ కాస్తా  ఉదయఘడ్ సేనాధిపతి ‘రణదేవ్ బిల్లా’గా మనకు చేరువయ్యాడు!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top