‘చదువు - సంస్కారం’

‘చదువు - సంస్కారం’ - Sakshi


తపాలా:  ‘చదువు - సంస్కారం’ అని విన్నప్పుడు చదువు ఉంటే సంస్కారముంటుందని, చదువు లేకపోతే సంస్కారముండదని చాలామంది భావిస్తుంటారు. నేనూ అలానే భావిస్తూ ఉంటిని. కానీ నేను కర్నూల్ జిల్లా ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన, చదువు లేకపోయినా మంచి సంస్కారముండే వ్యక్తులుండవచ్చని రుజువు చేసింది.

 

 ప్యాపిలి నేషనల్ హైవేలోని ఒక చిన్న గ్రామం. అక్కడ కొంతమంది హమాలీలు, వాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక కట్ట కట్టించుకున్నారు. వారు ఆ కట్టమీద కూర్చుని ఉంటారు. ఏదైనా లారీ వస్తే, అందులోని మూటలు దించటానికి పోతారు. వారి పని అయిపోయిన తర్వాత, మళ్లీ వచ్చి ఆ కట్టమీద కూర్చుని ఇంకొక లారీ కోసం ఎదురుచూస్తుంటారు. రోజూ సాయంత్రం మేం కూడా కొంతమంది లెక్చరర్లు అక్కడికి చేరి, ఆ కట్టమీద కూర్చుని కొంతసేపు మాట్లాడుకుని పోయేవాళ్లం.

 

 ఒకరోజు నేను మామూలుగా పోయే టైమ్ కంటే కొంచెం ముందుగా ఆ స్థలానికి వెళ్లాను. అప్పటికే ఆ కట్టమీద ఒక ముసలివాడైన హమాలీ కూర్చుని ఉన్నాడు. వస్తున్న నన్ను గమనించి, తన భుజంపైనున్న టవల్‌తో తన పక్కనున్న స్థలాన్ని శుభ్రం చేశాడు. నన్ను చూసి, ‘‘రండి సార్, రండి కూర్చోండి’’ అన్నాడు. నేను వెళ్లి కూర్చున్నాను. ఇక ఆ హమాలీ అక్కడి నుంచి లేచి పోబోయాడు. ‘‘మీరూ కూర్చోండి’’ అన్నాను నేను. అతడు ‘‘వద్దులెండి సార్, నేను సారా తాగాను. మీకు వాసనొస్తింది, మీకు సరిపోయేల్లేదు కదా, మీరు ఇక్కడ కూర్చోండి. ఏదో కొంతసేపు కూర్చునిపోయేవాళ్లు మీరు, అంతసేపు నేను దూరంగా అక్కడ కూర్చుంటాలే’’ అంటూ దూరంగా వెళ్లిపోయాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది.

 

 బహుశా ఆయన ఏ బడికీ వెళ్లి ఉండడు. పైగా ఆ కట్ట వాళ్లు చందాలు వేసి కట్టించుకున్నది. దానిపైన నేను కూర్చోవటానికి, తాను ముఖం తుడుచుకునే టవల్‌తో శుభ్రం చేసి, నన్ను కూర్చోమని, తాను తాగి ఉండటం వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందని తాను దూరంగా వెళ్లిపోవటమా! ఎంత సంస్కారం! 



కొంతమంది బాగా చదువుకొన్నవారు, పెద్ద ఉద్యోగాలు చేసేవారు ఇతరుల ఇబ్బందిని గమనించక, సిగరెట్లు తాగి, పొగను ఇతరుల ముఖాలపైకి దర్జాగా వదులుతుంటారు. బస్సుల్లో స్త్రీలకోసం కేటాయించబడిన సీట్లలో కూర్చుని ఉంటారు. ఒక వృద్ధుడు నిలుచుని ఉన్నా,  దర్జాగా కాలుమీద కాలేసుకొని కూర్చునే కుసంస్కారం యువతకు అలవడరాదు. చదువు ఒక్కటే సరిపోదు, తగిన సంస్కారం ఉండాలి. సంస్కారముంటే చదువు లేకపోయినా పర్వాలేదు. చదువు - సంస్కారం రెండూ ఉంటే మరీ మంచిది. అలాంటివాళ్లే కావాలి ఈ సంఘానికి.

 

 - రాచమడుగు శ్రీనివాసులు

 అనంతపురం

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top