దారి దెయ్యం

A story from madhav singaraju - Sakshi

పదేళ్ల వరకు లోకం తెలియకపోయినా అబ్బాయిల్ని లోకం ఏమీ అడగదు. పదేళ్లయినా లోకం తెలియడం మొదలవకపోతే ‘ఏం అబ్బాయ్‌’ అని లోకమే అడగడం మొదలుపెడుతుంది. ఇరవై ఏళ్లు దాటుతున్నా లోకాన్ని అలా నోరు తెరుచుకుని చూస్తుంటే, ‘ఏం అబ్బాయో!’ అంటుంది. ఆ తర్వాత కూడా అలాగే ఉంటుంటే.. ‘అసలు అబ్బాయేనా?’ అంటుంది.ఇందులో లోకాన్ని తప్పుపట్టడానికి లేదు. సృష్టికి ఒక ధర్మం ఉన్నట్లు.. లోకమూ తనకో ధర్మం ఉందనుకుంటుంది. అడగడం తన ధర్మం అనుకుంటుంది. ఇలా సృష్టికి, మానవులకు కొన్ని ధర్మాలు ఎందుకు ఉంటాయో, తనని తనలా ఉండనివ్వకుండా అవెందుకొచ్చి తనను ప్రశ్నిస్తాయో అనిర్వేద్‌ పెద్దగా ఎప్పుడూ ఆలోచించలేదు. పాతికేళ్లు ఉంటాయి అనిర్వేద్‌కి. దృఢంగా, మరీ ఎత్తుగా కాకుండా, మ్యాన్‌లీ ఉంటాడు. మ్యాన్‌లీగా ఉండేవాళ్లలో లోకం ఆశించే మొదటి లక్షణం.. దేనికీ భయపడకపోవడం.

అది అనిర్వేద్‌లో లేదు. మ్యాన్‌లీగా ఉండేవాళ్ల రెండో లక్షణం.. ఎప్పుడూ అమ్మాయిల గుంపులో కనిపించడం. ఈ లక్షణం కూడా అనిర్వేద్‌లో లేదు. లేకపోగా, అతడికి అమ్మాయిలంటే భయం! అమ్మాయిలంటే అతడికున్న భయానికి పనిగట్టుకుని కారణాలేవీ లేవు. లేవు కానీ, ఒకటి మాత్రం ప్రత్యేకమైన కారణంలా కనిపిస్తుంది. పదేళ్ల వయసులో ఆడుకుంటూ ఆడుకుంటూ ఎవరి ఇంటి లోనికో వెళ్లినప్పుడు..  అక్కడ తొలిసారి నిండు గర్భిణిని చూశాడు అనిర్వేద్‌. ఆ నిండు గర్భిణి కూర్చున్నప్పుడో, నిలుచున్నప్పుడో, నడుస్తున్నప్పుడో, నవ్వుతున్నప్పుడో అతడు చూడలేదు. నొప్పులు పడుతుండగా చూశాడు. దగ్గరగా చూశాడు. భయపడిపోయాడు. ‘పాపం’ అని దుఃఖపడిపోయాడు. కన్నీళ్లు తుడుచుకున్నాడు. పరుగున ఇంటికెళ్లి తన తల్లిని గట్టిగా కావలించుకుని ఆమె చీర కొంగుతో తన ముఖాన్ని ఊపిరి ఆడనంతగా చుట్లుచుట్లుగా చుట్టేసుకున్నాడు.
ఇప్పటికీ నిండు గర్భిణిని ఎక్కడైనా చూస్తే అనిర్వేద్‌ భయపడిపోతాడు.

నిండు గర్భిణులంటేనే కాదు, అనిర్వేద్‌కి దెయ్యాలన్నా భయమే. లోకధర్మానికి భయపడి ధైర్యాన్ని నటించడం వ్యక్తిగా తనకు ధర్మం కాదు అని అనుకున్నప్పటి నుంచీ అతడు నిర్భయంగా భయపడడం అలవాటు చేసుకున్నాడు. ఎవరేమనుకుంటే నాకేంటీ అనే తెగింపు అది. అయితే అదే అనిర్వేద్‌.. దెయ్యాలకు, నిండు గర్భిణులకు భయపడే విషయంలో మాత్రం.. ఎవరైతే నాకేంటీ అని తెగించి ధైర్యంగా ఉండలేకపోతున్నాడు. ఇప్పటికీ భయపడుతూనే ఉన్నాడు. ఈ „ý ణంలో కూడా..! ‘దెయ్యాల దారి’లో మెల్లిగా వెళుతోంది వ్యాను. అనిర్వేద్, ఇంకో వ్యక్తి మాత్రమే ఉన్నారు ఆ వ్యానులో. ఆ ఇంకో వ్యక్తి వ్యాన్‌ డ్రైవర్‌. చీకట్లో, ఇరుకైన ఆ గతుకుల దారిలో వ్యాన్‌ని సాధ్యమైనంత స్థిమితంగా ఆ వ్యక్తి డ్రైవ్‌ చేస్తున్నప్పటికీ వ్యాను ఎగుడు దిగుడు అవుతూనే ఉంది. అరవై ఏళ్లుంటాయి ఆ డ్రైవర్‌కి. తలజుట్టు, గడ్డం తెల్లగా నెరిసి ఉన్నాయి. దగ్గర్లోని టౌన్‌కి వచ్చి, తిరిగి ఊళ్లోకి వెళుతున్న ఆ వ్యాన్‌ని ఆపి మధ్యలో ఎక్కాడు అనిర్వేద్‌. ఇంకో అరగంటకు పైగా ఉంది ప్రయాణం.

వ్యాన్‌లో కూర్చున్నప్పట్నుంచీ దెయ్యాల గురించే ఆలోచిస్తున్నాడు అనిర్వేద్‌. ఆ దారిలో తరచూ దెయ్యాలు కనిపిస్తుంటాయని ఊళ్లోవాళ్లు చెప్పుకోవడం ఆ సమయంలో అతడికి గుర్తుకొచ్చింది.   ‘‘తాతా.. ఈ దారిలో నీకెప్పుడైనా దెయ్యాలు కనిపించాయా?’’ అడిగాడు అనిర్వేద్‌. సడెన్‌ బ్రేక్‌తో వ్యాన్‌ ఆపేశాడు ఆ వ్యక్తి. అనిర్వేద్‌ ఉలిక్కిపడ్డాడు. సడన్‌ బ్రేక్‌తో ఆ వ్యక్తి వ్యాన్‌ ఆపేశాడనే అనుకున్నాడు అనిర్వేద్‌. కానీ సడన్‌ బ్రేక్‌ వేసినట్లుగా వ్యానే దానంతటదే ఆగిపోయింది.‘ఏమైంది! దీనికి?!’ అనుకుంటూ ఒక్కక్షణం నిట్టూర్చి, విండ్‌ షీల్డ్‌లోంచి బయటికి చూశాడు ఆ వృద్ధ డ్రైవర్‌. రోడ్డు మీద వ్యాను లైట్ల మసక వెల్తురులో చాలా దూరంగా రోడ్డు మధ్యకు వచ్చి ఒక ఆకారం కనిపిస్తోంది. ఆ ఆకారాన్ని అనిర్వేద్‌ కూడా చూశాడు. ‘‘ఏంటది తాతా?’’ అని అడిగాడు. ‘‘ఎవరో మనిషి’’ అన్నాడు డ్రైవర్‌. ‘‘మనిషా! మనిషిలా కనిపించడం లేదు తాతా’’ అన్నాడు అనిర్వేద్‌.. భయంగా. రెండుసార్లు చేశాక, మూడోసారి స్టార్ట్‌ అయింది వ్యాను. అనిర్వేద్‌ ఊపిరి బిగించి రోడ్డు మధ్యలో అస్పష్టంగా కనిపిస్తున్న ఆకారం వైపే చూస్తున్నాడు. వ్యాన్‌ కొంత దూరం వెళ్లాక ఆ ఆకారానికి ఒక ఆకృతి వచ్చింది.

మరికొంత దూరం వెళ్లాక ఆ ఆకృతికి ఒక స్పష్టమైన రూపం వచ్చింది. నిండు గర్భిణి ఆమె! ఒక్కసారిగా గుండె ఝల్లుమంది అనిర్వేద్‌కి. డ్రైవర్‌ ఆమెకు దగ్గరగా తీసుకెళ్లి వ్యాన్‌ని ఆపాడు. ‘‘ఇంట్లో నా పెనిమిటి లేడు. నొప్పులొస్తున్నాయి. టౌన్‌ ఆస్పత్రికి తీసుకెళ్లండి...’’ ప్రాణాల్ని బిగబట్టి, దండం పెడుతూ, రోడ్డు మీద కుప్పలా పడిపోయింది ఆమె. అనిర్వేద్‌ గొంతు తడారింది. నిండు గర్భిణిని మళ్లీ అన్నేళ్ల తర్వాత అంత దగ్గరగా చూడ్డం అదే మొదటిసారి అతడు. ‘‘పట్టు’’ అన్నాడు డ్రైవర్‌.. వ్యాన్‌ బ్యాక్‌ డోర్‌ తీసిపెట్టి. అదిరిపడ్డాడు అనిర్వేద్‌. ఆమెను ఎలా పట్టుకోవాలో, ఎలా పైకి లేపి వ్యాన్‌లో పడుకోబెట్టాలో తెలియడం లేదు అతడికి. నిర్వేదంగా చూస్తుండి పోయాడు. ‘‘పర్లేదు. తలవైపు, భుజాల కింద చేతులు వేసి భద్రంగా పట్టుకో’’ అని అనిర్వేద్‌తో చెప్పి, కాళ్లవైపు ఆమెను భద్రంగా పైకి లేపి, మెల్లిగా వ్యానులోకి చేర్చాడు డ్రైవర్‌. స్పృహలోకి వచ్చి, వాళ్లవైపు కృతజ్ఞతగా చూసింది ఆమె. వ్యాను అదే దారిలో వెనక్కు మళ్లింది. అనిర్వేద్‌ చెమటలు తుడుచుకుంటున్నాడు.

సడెన్‌గా ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. తెరలు తెరలుగా అరుస్తోంది. ఏడుస్తోంది. అనిర్వేద్‌ నిశ్చేష్టుడై చూస్తున్నాడు.   ‘‘జాగ్రత్త.. ధైర్యం చెబుతుండు’’ అన్నాడు అనిర్వేద్‌తో ఆ వృద్ధ డ్రైవర్‌.. వ్యాను వేగాన్ని పెంచుతూ. అనిర్వేద్‌ ధైర్యం తెచ్చుకున్నాడు. ‘‘ఓర్చుకోమ్మా.. దగ్గరికొచ్చేస్తున్నాం’’ అన్నాడు.. ఎలాగో గొంతు పెగిల్చుకుని! పదేళ్ల వయసులో నిండు గర్భిణి యాతనను చూసి దుఃఖపడినట్లే ఇప్పుడూ అతడు దుఃఖపడుతున్నాడు. ఉబికి వచ్చిన కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. పారిపోయి కడుపులో దాక్కోడానికి ఏ తల్లీ ఇప్పుడు అతడి దగ్గర లేదు. తనే తల్లి అయి, ఆ గర్భిణి తలవైపు కూర్చుని, వ్యాను కుదుపులకు ఆమె పడిపోకుండా పట్టుకున్నాడు. వ్యాను.. హాస్పిటల్‌ దగ్గర ఆగింది. ‘‘సేఫ్‌ డెలివరీ’’ నర్సు వచ్చి చెప్పింది. వ్యాను డ్రైవర్‌ చిరునవ్వు నవ్వాడు. అనిర్వేద్‌ నవ్వలేదు! అతడింకా భయం నుంచి తేరుకోలేదు. ప్రసవం జరిగింది ఆమెకే అయినా,  పుట్టింది తనే అయినట్లుగా ఉందతడికి!

- మాధవ్‌ శింగరాజు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top