 
													‘‘అమ్మ  బెహెరైన్‌కు వెళ్లినప్పుడు ఇది యేడాది పిల్లండీ. నాకు నాలుగేళ్లు. ఈ ఇరవై రెండేళ్లలో ఒక్కసారి కూడా అమ్మను మేం చూళ్లేదండీ. దీనికైతే ఆమె ఎలా ఉంటుందో కూడా తెలీదండీ..ఫొటోల్లో తప్ప. అమ్మ వెళ్లిన మొదట్లో  ఓ నాలుగైదు సార్లు  కనీసం నేను ఫోన్‌లో అమ్మ  గొంతైనా  విన్నానండీ. దీనికి ఆ భాగ్యమూ దొకరలా! నాన్న పోయినా.. తనను వాళ్లు పంపలేదండీ. పోయిన నాన్న కోసం కన్నా  రాలేని అమ్మ కోసమే ఎక్కువగా ఏడ్చాం. నానమ్మనే అమ్మ అనుకున్నామండీ. ఇన్నేళ్లకు అమ్మ ఇంటికొస్తుందని పండగే  చేసిందిది’’ ముందు గది తలుపు చెక్కకు ఆనుకొని నిలబడి ఉన్న   చెల్లిని  చూపిస్తూ అన్నాడు సూరిబాబు బాధగా.  
అన్నయ్య మాటలతో రేవతికి ఏడుపు ఆగలేదు.  చున్నీలో మొహం దాచుకుంది. 
ఈ కుటుంబంతో సుధాకర్‌కు ఈ మధ్యే పరిచయం. మైగ్రెంట్స్ రైట్స్ గురించి పనిచేస్తున్న ఓ ఎన్‌జీవోలో కీలకమైన ఉద్యోగి. ఒకప్పుడు అతనూ బహెరైన్‌లో ఉండొచ్చాడు. ఆ పరిచయాలతోనే ఇరవై రెండేళ్ల తర్వాత అరుంధతి బహరైన్ నుంచి ఇండియా వచ్చేలా చేశాడు. 
 అరుంధతి రాక ఖాయమై, టికెట్ కూడా కన్ఫర్మ్ అయిందని  తెలియగానే..  అమ్మకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఇంట్లో అన్ని సౌకర్యాలూ పెట్టించి ఇంటిని బాగుచేయించాలని వాళ్లన్నతో పట్టుబట్టింది రేవతి. వంటింట్లో గట్టు, సింక్, సింక్‌లో కుళాయి, బాత్రూమ్‌లో కుళాయి, ఉన్న మూడు గదుల్లోనూ కొత్త ఫ్యాన్లు, కొత్త కూలర్ అన్నీ కొనిపించింది. రాగానే కట్టుకోవడానికని నాలుగు మంచి చీరలూ, రెండు నైటీలు తీసుకొచ్చింది.
‘‘ఏవే.. నీ పెళ్లికైనా ఇంత హడావిడి ఉంటుందో ? లేదో?’’ అని రేవతి స్నేహితురాళ్లూ ఆటపట్టించారు ఆమెను. 
‘‘ ఏమాటకామాట చెప్పుకోవాలంటే నండీ.. అమ్మతో ఫోన్లో మాట్లాడించకపోయినా డబ్బులు మాత్రం ఠంచనుగా పంపించేవాడండీ.  చెల్లి పెళ్లికుదిరితే పెళ్లికీ సాయం చేస్తానని మాటిచ్చాడండీ.. షేక్’’ కొనసాగించాడు సూరిబాబు. 
‘‘మరి ఎందుకు చూడలేదు సంబంధాలు?’’ అన్నట్లుగా చూశాడు సుధాకర్. 
‘‘మా అమ్మ వస్తేగానీ పెళ్లిచేసుకోనని బాసింపట్టేసుకుందండీ.. చుట్టాలంతా  నాకేదో ఖర్చయిపోతుందని చెల్లి పెళ్లిచేయకుండా ఇంట్లో పెట్టేశానని కూడా అనుకున్నారు. ఆ మాట చెప్పి కూడా తనను పెళ్లికి ఒప్పించే ట్రై చేశానండీ. మా మేనత్తా నచ్చచెప్పింది. ఉహూ.. వింటేనాండీ.. అమ్మ రావాలి.. వచ్చాకే నా పెళ్లి అంటూ పట్టుబట్టింది. అందుకేగా  మీ దగ్గరకొచ్చింది అమ్మ విషయంలో హెల్ప్ చేయమని’’ చెప్పుకుపోయాడు సూరిబాబు. 
ఇల్లంతా పరికించి చూశాడు సుధాకర్. తెల్లటి సున్నం, తలుపులకు రంగులతో కొత్త ఇల్లులా వెలిగిపోతోంది. ఇంటిముందు మల్లెచెట్టు కింద కూర్చన్న అరుంధతి వంకా చూశాడు.  ఈ ఇంటితో.. ఇంట్లో వాళ్లతో తనకే సంబంధం లేనట్టుగా ఏదో పోగొటుకున్నట్టు దిగులుగా ఉంది ఆమె.  
తల్లి గురించి ఏడ్చి ఏడ్చి సూరిబాబు చెల్లి  రేవతి కళ్లు ఉబ్బిపోయాయి. చీది చీది ముక్కు ఎర్రబడ్డది. 
‘‘కొంచెం కాఫీ ఇస్తావామ్మా’’ రేవతి మనసు మరల్చడానికి అడిగాడు సుధాకర్. 
‘‘అయ్యో.. సర్.. మా బాధ చెప్పుకోవడమే తప్ప కనీసం మంచినీళ్లయినా ఇవ్వలేదండీ’’ అని నొచ్చుకుంటూ లోపలికి వెళ్లింది. 
ఆ అమ్మాయి లోపలికి వెళ్లిందని నిర్ధారించుకున్నాక సుధాకర్ అడిగాడు సూరిబాబుని ‘‘మీరు పలకరించినా ఏమీ మాట్లాడట్లేదా?’’ 
‘‘లేదండీ.. అసలు తెలుగు అర్థమైనట్టు కూడా లేదు’’ చెప్పాడు ఆరుబయట ఉన్న తల్లివంక చూస్తూ!
ఎయిర్‌పోర్ట్ నుంచి ఈ ఊరికి తోడుగా ఆమెతో సుధాకరే ఉన్నాడు. ఈ వాతావరణానికి ఆమెను అలవాటు చేయడానికి సుధాకర్ ఆమెను మాట్లాడిస్తూన్నా అరుంధతి ముభావంగానే ఉంది తప్ప పెద్దగా మాట్లాడలేదు. ఆ మాట్లాడిన నాలుగు ముక్కలూ  అరబ్ భాషకు సంబంధించనవే. ఇన్నేళ్లు అక్కడే ఉండడం వల్ల అది సహజం అనుకున్నాడు. అయితే అప్పుడే సుధాకర్‌కు ఆశ్చర్యం కలిగించిన విషయం.. ఆమె ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాగానే ఆమెతో పాటు ఉన్న వాళ్లు తనను ఆమెకు, ఆమెను తనకు పరిచయం చేసినప్పుడు..   పిల్లల గురించి, వాళ్లెందుకు రాలేదని అడగకపోవడం. 
దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ కుర్చీలోంచి లేచి అరుధంతి దగ్గరకు వెళ్లాడు సుధాకర్. 
‘‘అమ్మా..’’ అంటూ ఆమె భుజమ్మీద చేయివేశాడు అనునయంగా. 
అంతే  అతని రెండు చేతులు పట్టుకొని ఏడ్చేసింది అరుంధతి. కడుపులోంచి వస్తోంది దుఃఖం. 
‘‘అయ్యో.. అమ్మా.. ఎందుకేడుస్తున్నారు? ఏమైంది?’’ అడిగాడు అరబ్‌లో సుధాకర్. 
‘‘పిల్లలు గుర్తొస్తున్నారు. వాళ్లు లేకుండా నేనుండలేను’’ అరబ్‌లోనే చెప్తూ  అతని అరచేతుల్లో మొహం దాచుకొని పొగిలి పొగిలి ఏడ్వసాగింది. 
ఆ మాటకు బిత్తరపోయాడు సూరిబాబు. కాఫీ గ్లాసులతో అప్పుడే  గుమ్మంలోకి వచ్చిన రేవతీ ఖిన్నురాలైంది. 
‘‘నీ పిల్లలు ఇక్కడే ఉన్నారు కదమ్మా.. అందుకేగా ఇక్కడికి వచ్చారు’’ చెప్పాడు సుధాకర్ అరబ్‌లోనే. 
‘‘ఏరీ.. వచ్చారా పిల్లలు?ఏరీ’’ అని వెదుక్కుంటూ లేచింది. 
‘‘ ఇక్కడే ఉన్నా.. ఇదిగో కాఫీ తేవడానికి వంటింట్లోకి వెళ్లా... ’’అంటూ ఓ కాఫీ గ్లాస్‌ను సుధాకర్ దగ్గర పెడ్తూ ఇంకో కాఫీ గ్లాస్‌తో తల్లి దగ్గరకు పరిగెత్తింది రేవతి. 
ఈసారి అరుంధతి బిత్తరపోయింది. ‘‘అమ్మా.. ’’ అంటూ రేవతి ఆమెను హత్తుకోబోతుంటే అపరిచితురాలిని చూసినట్టు చూస్తూ తోసేసింది. 
‘‘పిల్లల దగ్గరకు తీసుకెళ్లండి’’ అంటూ మళ్లీ సుధాకర్ దగ్గర వచ్చి అతని చేతులు పట్టుకుంది. 
ఇదంతా చూస్తున్న సూరిబాబుకి నోట మాటే రావట్లేదు. షాక్ అయినట్టుగా అలా ముందు గదిలోనే ఉండిపోయాడు. 
మల్లెపందిరి గుంజకు తలకొట్టుకుంటూ ఏడుస్తోంది రేవతి. 
సుధాకర్ వెళ్లి రేవతిని ఆపి.. ‘‘మీ అమ్మ ఇన్నేళ్లూ అక్కడే.. ఆ షేక్ పిల్లలను పెంచి పెద్దచేస్తూండడం వల్ల  వాళ్లే తన పిల్లలనే భ్రమలో ఉంది. కొంచెం టైమ్ పడ్తుంది మామూలు అవడానికి. కంగారు పడకండి’’అని చెప్పి  అరుంధతి దగ్గరకు వచ్చాడు. 
ఫోన్‌లో వీడియో ఆన్ చేసి  ‘‘ఇందులో మీ పిల్లలకు చెప్పండి.. వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లమని..’’ అంటూ ఆ ఫోన్‌ను ఆమె చేతికిచ్చాడు సుధాకర్. 
ఆత్రంగా ఫోన్ అందుకని ఏడుస్తూ అరబ్‌లో ఆ షేక్ పిల్లలకు ఏదో చెప్పసాగింది అరుంధతి.
అయోమయంగా బయటకు వచ్చిన సూరిబాబుని చూసి.. అతని దగ్గరకు వెళ్లి.. భుజం తడుతూ ‘‘ఆమె మాట్లాడుతున్న ఈ  వీడియోను షేక్‌కి పంపిద్దాం. పిల్లలతో మాట్లాడించమని చెబుదాం. వాళ్లతోనే నచ్చచెప్పే ప్రయత్నం చేయిద్దాం.. వర్రీ అవకండి. అంతా సర్దుకుం టుంది’’ అంటూ  ధైర్యమిచ్చాడు సుధాకర్.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
