స్పూర్తి క‌థ‌లు

Special story on  Christmas inspirations stories - Sakshi

 ∙కవర్‌ స్టోరీ

క్రిస్మస్‌ ప్రత్యేకం

పవిత్ర గ్రంథం మనకు చెప్పేది కరుణలో, క్షమాగుణంలో, ప్రేమలో, ఆదరణలో, త్యాగంలో, సేవలో పవిత్రత ఉంటుందని. మన జీవితాలను నలుగురికి పనికి వచ్చేలా కొందరికి ఉదాహరణగా, అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ప్రార్థిస్తూ మీకు అందిస్తున్న కొన్ని స్ఫూర్తికథలు...

పంచదార మానేశాడు!
కలకత్తాలో ఒకసారి పంచదారకు కొరత ఏర్పడింది. ‘మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ’ హోమ్‌లోని పిల్లలకు పాలలో కలిపి ఇవ్వడానికి కూడా పంచదార దొరకడం లేదని ఎట్లా తెలిసిందో, నాలుగేళ్ల పసివాడు తన తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకుని వచ్చాడు! వాళ్ల చేతిలో పంచదార పొట్లం ఉంది. మదర్‌ థెరిసాకు ఆశ్చర్యమేసింది.‘‘ఏం చెప్పి మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు’’అని వాళ్లను అడిగారు మదర్‌.‘‘మూడు రోజులుగా వీడు పాలలో పంచదార వేసుకోవడం లేదు’’.. చెప్పింది తల్లి.‘‘తన కోసం వేసే పంచదారను మిగిల్చి మీ హోమ్‌లోని పిల్లలకు ఇమ్మన్నాడు’’ అని చెప్పాడు తండ్రి.పసివాడిని దగ్గరకు తీసుకున్నారు మదర్‌. ఆమె పేరు పలకడం కూడా వాడికి రాదు. కానీ తను చేయవలసింది ఏమిటో ఆ వయసుకి అర్థమయింది!! ఉన్నదాన్ని పంచుకోవాలన్న ఆలోచన తప్ప,ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నించే వయసు కూడా కాదది.‘‘భగవంతుడు మనిషి మనసును ఎంత అందంగా సృష్టించాడు!’’ అని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకున్నారు మదర్‌.ఆ పిల్లవాడు అలా చేశాడంటే నమ్మాలని అనిపించకపోవచ్చు.దేవుడి మహిమను కూడా తరచు మనం అలాగే నమ్మలేనట్లు చూస్తుంటాం. దేవుడి గొప్పతనం, ప్రేమ గొప్పతనం, పలకరింపు గొప్పదనం, ప్రశాంతత గొప్పతనం, చిరునవ్వు గొప్పతనం తెలుసుకోవాలంటే ఎవరికైనా సేవ చేసి చూడండి. ‘‘గొప్ప గొప్ప పనులు చేయనవసరం లేదు. చిన్న పనులనే గొప్ప ప్రేమతో చెయ్యండి చాలు’’ అన్నది మదర్‌ చెప్పిన మాటే.

ఎన్నో గుండెల తడి
నారాయణరావుది శ్రీకాకుళం. చాలా రోజుల నుంచి గుండెనొప్పి వస్తుండటంతో హైదరాబాద్‌కు వచ్చి పెద్ద డాక్టర్‌కు చూపించుకోవాలనుకున్నాడు. మంచి పేరున్న ఓ డాక్టర్‌ గారి  క్లినిక్‌కు కొడుకుతో పాటు వచ్చాడు. సరిగ్గా క్లినిక్‌ ముందు తీవ్రమైన గుండెపోటుతో  కుప్పకూలిపోయాడు. వెంటనే  అంబులెన్స్‌ వాళ్లు నారాయణరావును దగ్గర్లోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు.. ఉచితంగానే! పెద్దాసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స మొదలుపెట్టాక గుండె స్పందనలు కాస్త బలహీనంగానే మొదలైనట్టు డాక్టర్లు గుర్తించారు. అయితే స్పృహతప్పి ఉండటంతో మెదడు చేతనంగా ఉందో లేదో తెలియదు. కానీ తన తండ్రిని ఎలాగైనా బతికించమని కోరిన కొడుకు కన్సెంట్‌ మేరకు నారాయణరావుకు యాంజియోప్లాస్టీ చేశారు. ఆయన పేదరికం గమనించిన ఆసుపత్రివర్గాలు అత్యవసరమైన కొన్ని ఖర్చులకు తప్ప దాదాపుగా ఫీజు మాఫీ చేశాయి. ఇంతలో మరో కాంప్లికేషన్‌. అతడి కిడ్నీ ఫెయిలయ్యింది. నెఫ్రాలజిస్ట్‌ వచ్చారు. ఆయనా తన సేవల్ని చాలావరకు ఉచితంగానే అందించారు. మిగతా చికిత్సకోసం ఉస్మానియాకు తీసుకెళ్లమని, అక్కడ చికిత్సలన్నీ ఉచితంగానే జరిగేలా చూస్తామంటూ డాక్టర్లు సూచించారు. కానీ ఒకసారి చూపించుకొని వెళ్దామనుకున్న తాము ఇప్పటికే చాలా రోజులు హైదరాబాద్‌లో ఉండిపోవాల్సి వచ్చిందనీ, విశాఖపట్నానికి వెళ్తే తమకు ఒకింత సౌకర్యంగా ఉంటుందంటూ రోగి బంధువులు ఆయన్ని విశాఖకు తీసుకెళ్లారు. మొట్టమొదట చికిత్స అందించిన డాక్టర్‌ అతడి గురించి మరచిపోయారు. సరిగ్గా మూడు నెలల తర్వాత ఒకరోజు నారాయణరావు తన కొడుకుతో కలిసి డాక్టర్‌గారి దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించాడు. నారాయణరావు కొడుకు డాక్టర్‌కు పాదాభివందనం చేశాడు. దాదాపు మృత్యువు ఒడిలో ఉండి, కిడ్నీలు దాదాపుగా పూర్తిగా విఫలమైన అతడు బతుకుతాడని అప్పుడెవరూ అనుకోలేదు. కానీ నారాయణరావు బతికి అలా నడిచివస్తుండటం చూసి డాక్టర్‌గారికి చాలా సంతోషంగా అనిపించింది.  మొదట తాను, తర్వాత అంబులెన్స్‌వారు, పిమ్మట ఆసుపత్రి యాజమాన్యం, ఆ తర్వాత నెఫ్రాలజిస్ట్‌ చేయగలిగినంతా చేసి, రోగికి ఖర్చులు తగ్గించారు. విశాఖలోనూ అతడికి   సేవల్ని చాలామంది దయతో అందించారని తెలిసింది. ఆ కొడుకు కూడా తనకు ఉన్నదంతా తండ్రి వైద్యం కోసం తెగనమ్మేశాడు.  విలువలు లుప్తమైపోయాయని మనలో చాలామంది అనుకుంటుంటారు. కానీ.. మనిషిలో మానవత్వం,కళ్లలో దయ, గుండె కింద తడి, మనసులో ఆర్ద్రత ఇంకా ఉన్నాయనీ ఈ సంఘటనతో మరోమారు రుజువైంది. 

తరాలుగా కృతజ్ఞత 
1955 –1960ల నాటి రోజులు. ఒక పెద్దాయన తన కొడుకును చూడటానికి దాదాపు 200 కి.మీ. దూరం నుంచి వస్తున్నాడు. గమ్యం మరో 50 కి.మీ. ఉందనగా బస్సు ఫెయిలయ్యింది. అప్పటికి సాయంత్రం నాలుగయ్యింది. మరో రెండు గంటల్లో చీకటి పడితే  బస్సులుండవు. పైగా చుట్టూ అడవి. చేసేదేమీ లేక ఆ పెద్దాయన తన తలపాగా బిగించికట్టి గమ్యం వైపునకు నడవడం మొదలుపెట్టాడు. కాసేపట్లో ఒక మోటారు కారు ఆయన పక్కనే ఆగింది. అడవిలో అపరిచితులను నమ్మని ఆ రోజుల్లో కారులోని వారు కిందికి దిగి, ఈ టైమ్‌లో మీరెక్కడికి వెళ్తున్నారంటూ వాకబు చేశారు. పెద్దాయన జరిగింది చెప్పాడు.వాళ్లు నవ్వి.. ‘50 కి.మీ. నడుస్తూ వెళ్లగలరా? అందునా ఈ వయసులో’ అన్నారు. తామూ ఆ ఊరిమీదుగానే నగరానికి వెళ్తున్నామనీ, ఊళ్లో దింపేస్తామంటూ కార్లో ఎక్కించుకుని, కొడుకు దగ్గర దింపేసి వెళ్లారు. ఇప్పుడా పెద్దాయన తాలూకు నాలుగో తరం నడుస్తోంది. అప్పుడు ఆ పెద్దాయనకు సహాయం చేసిన ఆ మోటారు కార్లోని వ్యక్తులు బాగుండాలని, వాళ్ల కుటుంబాల్లోని వాళ్లు చల్లగా ఉండాలని, వాళ్ల తరతరాలూ తరగని వృద్ధిపొందాలంటూ ఈ నాల్గో తరం వారు ఇప్పటికీ ప్రార్థిస్తుంటారు. అలా తమ కృతజ్ఞతను వెల్లడిస్తూనే ఉన్నారు. అవును... మానవత్వం తరతరాలూ సాగితేనే కదా రాబోయే తరాలూ ఆ స్ఫూర్తిని తమ ముందుతరాలకు అందిస్తాయి. 

ఎవ్వరూ నో చెప్పలేదు! – జయసుధ, సినీ నటి
అరుళ్‌ అనే అబ్బాయి గురించి చెప్పాలి మీకు. ఎప్పటిలాగే చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుని వస్తున్నాను. క్రిస్మస్‌ సందర్భంగా ఓ ఐదు వేల రూపాయలు సహాయం చేద్దామనుకున్నాను. ఎవరికి అవసరమో  తెలియదు కాబట్టి ‘‘నేనొక  ఐదువేల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. నిజంగా సాయం అవసరమైన వాళ్లు ఎవరో కొంచెం చెప్పండి’’ అని అక్కడ ఉన్నవాళ్లను అడిగాను. వాళ్లు తలా ఓ పేరు చెప్పారు.సరే అని అనుకొనేలోపు నా వెనకనుంచి ఎవరో ఒకతను సడెన్‌గా వచ్చి ‘‘ 12 ఏళ్ల ఓ బాబు క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. వీలైతే మీరు ఆ అబ్బాయికి సహాయం చేయండి’’ అని ఆ అబ్బాయి ఇంటి అడ్రస్‌ కూడా  చెప్పి  వెళ్లిపోయాడు. నేనెప్పుడూ అతనిని అక్కడ చూడలేదు. ఎవరికైనా ఇద్దామనుకున్నా డబ్బే కదా అని,  స్వయంగా ఆ అబ్బాయి వాళ్లింటికి బయలుదేరాను. చూసేసరికి  చర్చిలో అపరిచిత వ్యక్తి చెప్పినట్టుగానే బాబు పరిస్థితి  దయనీయంగా ఉంది. నా చేతిలో ఉన్న ఐదు వేలు ఎందుకు ఉపయోగపడతాయి అనిపించింది. హాస్పిటల్‌ ఖర్చులు ఎంత అవుతాయి అని వాళ్లమ్మని అడిగాను. ఆమె చెప్పిన నంబర్‌ (నాలుగు లక్షలు) విని ఏం చేయలో అర్థంకాని  నేను  కష్టమైనా సరే... నా బడ్జెట్‌లో లేకపోయినా  ఓ 25 వేలు సహాయం  చేస్తాను అని చెప్పి ఇంటికొచ్చేశాను. దారి పొడవునా అరుళ్‌ నాకు గుర్తుకొస్తూనే ఉన్నాడు. నాలుగు లక్షలే కదా,  మీరే ఇవ్వలేరా అని మీరు అనుకోవచ్చు. కాని సడెన్‌గా అంత పెద్ద మొత్తం అంటే ఎవరికైనా ఇబ్బందే కదా. ఎవరినన్నా అడుగుదామా అనిపించింది, కానీ నాలో నాకే నువ్వు.. ఇంత పెద్ద ఆర్టిస్టువి, నువ్వు ఎవరికోసమో డబ్బు సాయం చేయమని అడగటమేంటి అని నా మనసుకు అనిపించింది. మళ్లీ అంతలోనే దేవుని మాటలు గుర్తుకొచ్చాయి. ‘నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించు’ అన్న మాటలు మళ్లీ మళ్లీ నాకు వినపడ్డాయి. నీకు అంతలేదు, నిన్ను నువ్వు తగ్గించుకొని చూడు, నువ్వు కేవలం జయసుధ అనే మనిషివి మాత్రమే అని దేవుడు అన్నట్లు అనిపించింది. ఇక ఆలస్యం చేయదలచుకోలేదు. ఏమయితే అది అయిందని మొదట నటుడు ప్రకాశ్‌రాజ్‌కి ఫోన్‌ చేశాను. ఆయన వెంటనే పాజిటివ్‌గా స్పందించి 25వేల రూపాయలు ఇస్తానన్నారు నిండు మనసుతో.అప్పటికి నాకు ఆయనతో అంత పరిచయం కూడా లేదు. హమ్మయ్యా ఇక ఎవరినైనా అడగొచ్చు అనే ధైర్యం వచ్చింది. వెంటనే హీరో అర్జున్‌కు ఫోన్‌ చేశాను. తర్వాత రాధిక, సుహాసిని, సీత, విజయశాంతిలతో పాటు లత, వాళ్ల తమ్ముడు రాజ్‌కుమార్‌ , తమిళ దర్శకుడు కె.యస్‌ రవికుమార్‌ ఇలా అందరూ ఎవ్వరూ నో చెప్పలేదు, వీళ్లతో పాటు ఇంకా చాలామంది. ఆ పిల్లాడి ట్రీట్‌మెంట్‌కి కావాల్సిన మొత్తం డబ్బు అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు గంటలో సమకూరాయి. నా జీవితంలో ఈ సంఘటను ఎన్నటికీ మరువలేను. కారణం ఏంటంటే ఆ రోజు క్రిస్‌మస్, దేవుడు నన్ను చూస్తున్నాడేమో అనే ఫీలింగ్‌.. మనల్ని మనం తగ్గించుకొని (అహం), మనకు చేతనైన సాయం చేయడం కంటే ఆత్మ సంతృప్తి ఉండదు. ఒక్కోసారి మాట సాయం కూడా ఓ జీవితాన్ని నిలబెడుతుంది. 

మంచినీళ్లమ్మ 
సత్యవతమ్మ అవకాశం వచ్చినప్పుడల్లా తనకు తోచిన మానవ సేవ చేస్తూండేవారు. ఆవిడకు ఆరు పదులు నిండేటప్పటికే  చాలా జబ్బు పడ్డారు. ఎన్ని అనారోగ్యాలు వచ్చినా ‘నేను జబ్బు మనిషిని’ అని అనుకోకుండా, ఓపిక ఉన్నంత వరకు ఇతరులకు సేవ చేయాలి’ అనే భావనతో ఉన్నారు సత్యవతమ్మ. పిల్లలకు వివాహాలు అయిపోయి ఎక్కడివారు అక్కడకు వెళ్లిపోయారు. భర్త కాలం చేయడంతో, ఒంటరి అయిపోయారు. నిత్యం సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా బావురుమంది. ఆత్మస్థైర్యంతో, ఒంటరిగా జీవించడానికి అలవాటు పడ్డారు. ఇరుగుపొరుగు వారితోనే కాకుండా, ఆ వీధిలో సంచరించేవారితో సైతం ప్రేమగా ఉంటూ, ఒంటరితనాన్ని మరచిపోయారు.  విజయవాడ అంటే ఎండలకు కొదవ ఉండదు. ఎన్ని చలివేంద్రం కేంద్రాలు పెట్టినా మధ్యాహ్నానికి నీళ్లు ఖాళీ అయిపోతాయి. ఒక చిన్న కాలనీలో చిన్న సందులో ఉండే సత్యవతమ్మ, ఆ రోడ్డులో తిరిగే రిక్షావారికి, కూరలు పళ్లు అమ్ముకోవడానికి వచ్చేవారికి మంచినీళ్లు అందించాలనుకున్నారు. నీళ్లు మోయడానికి పనివారి ఆసరా లేదు. మంచి చేయాలనే సంకల్పమే ఆవిడకు బలం చేకూర్చింది. ఒక మట్టి కుండ తీసుకువచ్చి, ఇంటి ముందు గేటు దగ్గర ఉంచారు. ఇంట్లో ఉన్న చిన్న గిన్నెతో పది సార్లు నీళ్లు తీసుకువచ్చి ఆ కుండలో పోశారు. పైన మూత, ఒక స్టీలు గ్లాసు ఉంచారు. ఉదయం ఎనిమిది గంటలకు కుండ నింపేవారు. మధ్యాహ్నం ఓ గంట కునుకు తీసి లేచి వచ్చి కుండ చూసేవారు. అప్పటికి కుండ ఖాళీ అయిపోయేది. ఆవిడ మనసు సంతృప్తితో నిండిపోయేది. అంతే మళ్లీ కుండ నింపేవారు. సాయంత్రానికి ఖాళీ అయిపోయేది. ఇది ఆవిడ దినచర్యగా మారిపోయింది. అలా మార్చి నెల నుంచి జూన్‌ వరకు నీళ్లు పెట్టేవారు. ఇలా సుమారు పది సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతి వేసవి కాలం ఆ ఇంటి ముందర మంచినీళ్లు దొరుకుతాయన్న భరోసా కలిగింది అందరికీ. ఒక రోజు కుండ చిన్నబోయింది. అదేమిటా అని ఆ వీధిలో నిత్యం సంచరించే రిక్షా వాళ్లు, çపండ్ల అమ్మకాల వాళ్లు ఇంట్లోకి తొంగి చూశారు. సత్యవతమ్మగారు ఆ రోజు తెల్లవారు ఝామున తీవ్రమైన గుండెపోటుతో కాలం చేశారని తెలుసుకున్నారు. ‘అయ్యో! నిన్న రాత్రి కూడా ఆ తల్లిని పలకరించి, మంచినీళ్లు తాగాం’ అనుకుంటూ అందరూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఆవిడ చేతి నీళ్లు తాగిన వారి కళ్లు వర్షించసాగాయి. బరువెక్కిన గుండెలతో ఆ తల్లిని వేనోళ్ల పొగిడారు. పెద్ద కర్మనాడు వారంతా వచ్చి ‘అమ్మగారి ప్రసాదం’ అని స్వచ్ఛందంగా వచ్చి తిని, ‘మా తల్లి బతికున్నన్నాళ్లు కడుపు నిండా పలకరించే ది, మా దాహం తీర్చింది’ అనుకున్నారు.

నెత్తుటి బంధం
అప్పుడు జేమ్స్‌ హారిసన్‌కు పద్నాలుగేళ్లు. అతడిది ఆస్ట్రేలియా. తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడు. ఛాతీకి పెద్ద శస్త్రచికిత్స చేయాల్సివచ్చింది. దానికిగానూ పదమూడు లీటర్ల రక్తం అవసరమైంది. ఎవరెవరో ఆయనకు రక్తదానం చేశారు. మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నాడు.కోలుకున్నాక, హారిసన్‌ తనకు తాను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఎవరో తనకు పేరు కూడా తెలియనివాళ్లు ఇచ్చిన రక్తం వల్ల తాను బతికినప్పుడు, తాను కూడా మరొకరు బతకడానికి కారణం కావాలని అనుకున్నాడు. అట్లా ఆయన రక్తదానాలు చేయడం మొదలుపెట్టాడు.1936లో జన్మించిన హారిసన్‌ 1954లో తన తొలి రక్తదానం చేశాడు. కుదిరినప్పుడల్లా ఇస్తూ వచ్చాడు. అయితే కొన్ని దానాల తర్వాత వైద్యులు ఆయన రక్తపు ప్లాస్మాలో ఒక అరుదైన విశేషం ఉందని కనుగొన్నారు.సృష్టిలో కొన్ని ఎందుకు జరుగుతాయో అంతు పట్టదు. ఒక గర్భిణి రక్తంలోని యాంటీ బాడీస్‌ ఒక్కోసారి గర్భంలో ఉన్న శిశువు రక్తకణాలను ధ్వంసం చేస్తాయి. దాంతో శిశువుకు రక్తహీనత కలుగుతుంది, కామెర్లు వస్తాయి. దీనికి విరుగుడు ఇవ్వకపోతే ప్రాణాపాయం. ఈ స్థితిని రీసస్‌ డిసీజ్‌ అంటారు. అయితే, దీనికి విరుగుడుగా పనికొచ్చే యాంటీ–డీ మెడిసిన్‌ అందరి రక్తంలో లభించదు. అది హారిసన్‌ రక్తంలో ఉందని కనుగొన్నారు. అరుదుగా తప్ప దొరకని యాంటీ–డీ హారిసన్‌ రక్తంలో ఉండటం ఒక విచిత్రమైతే, ఆయన ఎన్నో దానాలు చేయడానికి సంకల్పించుకుని ఉండటం మరో విశేషం. దీనివల్ల లభ్యత శాతం అత్యధికమైంది. 60 ఏళ్ల కాలంలో హారిసన్‌ అక్షరాలా 1,172 సార్లు రక్తదానం చేశాడు. అయితే, తన 81వ ఏట ఇంకా రక్తం ఇవ్వడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరించిన పిమ్మట, పైగా ఎనభై ఏళ్లు పైబడినవాళ్లు రక్తదానం చేయకూడదని ప్రభుత్వ నిబంధన కూడా ఉండటంతో మొన్న మే 11న తన చివరిదైన 1,173వ రక్తదానం చేసి తన పని నుంచి విరమణ తీసుకున్నాడు.హారిసన్‌ రక్తం నుంచి సేకరించిన యాంటీ–డీ మెడిసిన్‌ వల్ల సుమారు 24 లక్షల మంది పసివాళ్లకు ప్రాణాపాయం తప్పిందని అంచనా. ‘మ్యాన్‌ విత్‌ ద గోల్డెన్‌ ఆర్మ్‌’( బంగారం చేయి కలవాడు)గా ఆయన్ని ఆస్ట్రేలియన్లు ముద్దుగా పిలుచుకుంటారు. 

విడువని చెయ్యి
లక్ష్మి గుర్తుందా? యాసిడ్‌ దాడి జరిగిన లక్ష్మి.. వెంట పడుతున్న ప్రేమకు ‘నో’ అని చెప్పినందుకు ఒంటి మీద యాసిడ్‌ కుమ్మరించారు. ఆమెతో పాటు  దేశాన్నీ భయోత్పతంలోకి నెట్టిన  సంఘటన అది.జరిగిన దారుణానికి భీతిల్లినా కుంగిపోలేదు. న్యాయపోరాటం చేసింది లక్ష్మి.  ఆ పోరాటంలో ఆమెకు అండగా నిలబడ్డాడు యాక్టివిస్ట్‌ అలోక్‌ దీక్షిత్‌. ఆమెను చూసిన లోకం జడుసుకుని పక్కకు తప్పుకుంటుంటే ఆమె చేయి పట్టుకుని వెన్నంటి ఉన్నాడు. జీవన సహచరుడిగా మారాడు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాడు. సామాజిక అడ్డంకులు ఎదురైనా ఆమె చేయి విడువలేదు. అలోక్‌ ఇచ్చిన సపోర్ట్‌తో న్యాయపోరాటంలో విజేతగా నిలిచింది. పోయిన సంతోషం తిరిగి ఆమె మొహంలో నవ్వై మెరిసింది. లక్ష్మి.. ఇప్పుడొక బిడ్డకు తల్లి! బాధను పంచుకుని.. ధైర్యాన్నిచ్చి నిజమైన స్నేహితుడిగా.. అత్యంత ఆప్తుడిగా ఉన్నాడు అలోక్‌ దీక్షిత్‌.  

కైండెస్ట్‌ బాస్‌
అలు భత్రానియా... జేఆర్‌డీ (జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయి)కి పదిహేనేళ్లుగా సెక్రటరీగా పనిచేశారు. కింది ఉద్యోగుల పట్ల ఆయన ఉండే తీరు, ఇచ్చే గౌరవం, చూపించే ఆపేక్ష గురించి  ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే ఫేస్‌బుక్‌ పేజ్‌లో ఆమె ఇలా షేర్‌ చేసుకున్నారు. ‘‘మాది మధ్యతరగతి కుటుంబం. కష్టపడి పనిచేయడం నేర్పారు మా వాళ్లు. కాలేజ్‌లో ఉన్నప్పుడే పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూ నాన్నకు హెల్ప్‌ చేసేదాన్ని. 1961లో గ్యాడ్యుయేషన్‌ పూర్తయ్యాక టాటా స్టీల్‌లో చేరాను టెంపరరీ ఎంప్లాయ్‌గా. తర్వాత పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. ఈలోపే ఉద్యోగం చేస్తూనే లా కూడా కంప్లీట్‌ చేశాను. 1970ల చివర్లో ‘బాంబే హౌజ్‌’ ఫోర్త్‌ ఫ్లోర్‌ నుంచి నాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. జేఆర్‌డీ టాటాకు సెక్రటరీగా రిక్రూట్‌ చేస్తున్నట్టు. నమ్మలేకపోయా. అప్పటి దాకా ఆయన గురించి వినడమే.. ఫొటోల్లో చూడ్డమే. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన దగ్గర పనిచేయడం. ఆ రోజు నాకు ఇప్పటికీ జ్ఞాపకమే.. ఆయన దగ్గర ఫస్ట్‌ డిక్టేషన్‌ తీసుకుంటున్నా.. చెమటతో అరచేతులు తడిసి ముద్దయిపోయాయి. అది ఆయన గ్రహించి వెంటనే చాలా క్యాజువల్‌గా మాట్లాడ్డం మొదలుపెట్టారు. నా పట్లే కాదు కింది ఉద్యోగుల అందరిపట్లా ఆయనలాగే ఉండేవారు. అంతే కేరింగ్‌ చూపించేవారు. కైండెస్ట్‌ బాస్‌. ఫారిన్‌కి వెళ్లినప్పుడల్లా తోటమాలి పిల్లల కోసం చాక్‌లెట్స్‌ తెచ్చేవాళ్లు.  లెక్కలేనంత మందికి ఆయన సహాయం చేయడం కళ్లతో చూశా. సాఫ్ట్‌ అండ్‌ హంబుల్‌ పర్సన్‌.  బిజినెస్‌ పనులతో ఊపిరిసల్పనంత బిజీగా ఉన్నా.. చుట్టూ ఉన్న మనుషులతో గడిపేవాళ్లు. తనను నమ్ముకున్న వాళ్ల క్షేమాన్ని కాంక్షించేవాళ్లు. ఆయనతో కలిసి పనిచేయడమంటే ప్రతి రోజూ ఇన్‌స్పైర్‌ అవడమే. నిజాయితీ, హార్డ్‌వర్క్, పరులకు హెల్ప్‌ చేయడం.. ఆయనను చూసి.. తెలుసుకుని అలవర్చుకోవాల్సిన క్వాలిటీస్‌. ప్రపంచానికి ఆయన బిజినెస్‌మన్‌.. బట్‌ ది పర్సన్‌ హి వజ్‌ ట్రూలీ ఎ జెమ్‌. ఈ రోజుల్లో అలాంటి వాళ్లు కనిపించరు. ఆయనలో హాస్య చతురత కూడా అంతే.ఒకసారి నా బర్త్‌డేకి మా ఫ్యామిలీని ఒబేరాయ్‌లోని ఫ్రెంచ్‌ రెస్టారెంట్‌కి తీసుకెళ్లారు. భోజనం అయిపోయాక బిల్‌ తెమ్మని అడిగారు. హోటల్‌ మేనేజర్‌ పరుగుపరుగున వచ్చి.. ‘‘మీరు బిల్‌ పే చేయడం ఏంటీ సర్‌’’ వద్దు అన్నాడు. ‘‘అయ్యో.. ఆ ముక్క ముందే చెబితే ఇంకొన్ని ఆర్డర్‌ చేసేవాళ్లం కదా’’ అన్నారు టాటా ఇన్నోసెంట్‌గా. ఆయనకు సెక్రటరీగా పదిహేనేళ్లు ఆయనకు సెక్రటరీగా పనిచేయడం నిజంగా నా బిగ్గెస్ట్‌ ప్రివిలేజ్‌. జేఆర్‌డీ టాటా సర్‌.. యూ ఆర్‌ స్పెషల్‌ బియాండ్‌ వర్డ్స్‌!’’ అని రాసుకున్నారు అలు భత్రానియా.

శిబి, కర్ణుడు చిన్నబోయారు  – ఆర్‌. నారాయణమూర్తి, నటుడు
మానవత్వం అనగానే  నలభై ఏళ్ల క్రితం నేను ఆమె పాదాలకు దణ్ణం పెట్టడం మాత్రమే గుర్తుకు వస్తుంది. అది 1970 ల ప్రాంతం. నేను డిగ్రీ చదువుతున్నాను. కాలేజి ప్రెసిడెంట్‌గా, సోషల్‌ సర్వీస్‌ సెక్రటరీగా చాలా యాక్టివ్‌గా తిరుగుతుండేవాడిని. ఆ టైమ్‌లో బీహార్‌లో బీభత్సమైన వరదలు వచ్చాయి. భారత ప్రభుత్వం దానిని జాతీయ విపత్తుగా పరిగణించింది. అప్పుడు మా కాలేజికి కూడా సహాయ సహకారాలు అందించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. మా కాలేజ్‌ పెద్దాపురంలో ఉండేది. కాలేజీ తరపున విద్యార్థులందరం వీధి వీధికి వెళ్లి అందరినీ బియ్యం, బట్టలు ఇవ్వాలని  అడుగుతున్నాం. అలా అన్ని వీధులు తిరిగిన తర్వాత నేను, నా ఫ్రెండ్స్‌ కొంతమందిమి కళావంతుల వీధికి వెళ్లాం. అక్కడ ఉన్న ఓ మహిళ దేనికోసం ఇదంతా చేస్తున్నారు అని అడిగారు. మేము జరిగిన విషయం చెప్పాం. అయ్యో! అవునా పాపం, ఆగండి అని చెప్పి ఇంట్లోకి వెళ్లి , ఇంట్లో ఉన్న బియ్యం, బట్టలు తెచ్చి ఇచ్చింది.  తర్వాత అందరిలో ఉన్న నన్ను కొద్దిగా పక్కకు పిలిచి ‘‘నేను దేవదాసి పనిచేస్తాను. రాత్రి బేరాలు ఏమీ రాలేదు.అందుకే డబ్బులు  ఇవ్వలేక పోయాను. మీరు ఓ పని చెయ్యండి, రేపు ఉదయం వచ్చి నన్ను కలవండి. ఈ రోజు మంచి బేరాలు చూసుకుని వచ్చిన డబ్బంతా మీకే ఇస్తాను’’ అని అన్నది. సరే అనుకుని మా దారిన మేము వెళ్లిపోయాం. తర్వాత రోజు మేము సేకరించినవన్నీ తీసుకుని కాలేజీకి వెళ్లాం. అక్కడ నా స్నేహితుడు ఒకడు ‘‘మూర్తీ నిన్న మనం కళావంతుల  వీధీలో ఒకామె  డబ్బులు ఇస్తాను అన్నది కదా. ఓసారి  వెళ్లి అడుగుదామా’’ అన్నాడు. అలాగే అంటూ ఇద్దరం కలిసి వెళ్లాం.  ఆమె మాకు ఎదురొచ్చి ‘‘మీ గురించే ఎదురు చూస్తున్నాను. ఈ రోజు వస్తారా, రారా అనుకుంటున్నాను. రాత్రి బాగా బేరం జరిగింది. ఇవిగో తీసుకోండి’’ అంటూ ఆమె దగ్గరున్న మొత్తం డబ్బు నా చేతిలో పెట్టింది. అంతే నా కళ్లల్లో నీళ్లు ఆగలేదు. ఒక్కసారిగా ఆమె కాళ్లమీద పడి దణ్ణం పెట్టాను. ‘‘ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవటం కంటే మంచి పని ఏదీ ఉండదు బాబూ. అదే మనల్ని కాపాడుతుంది’’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆవిడలో ఉన్న దయ, కరుణ, మానవత్వం ముందు శిబి చక్రవర్తి, కర్ణుడు చిన్నగా కనిపించారు. నలభై ఏళ్లుగా ఈ విషయం గుర్తొస్తూనే ఉంటుంది. అయ్యో.. ఆమె పేరు అడగడం మర్చిపోయానే అని బాధతోపాటు. ఆమెలో  కరుణ, దయ, మానవత్వం చూశాను. 

ఇద్దరు అతిథులు
అబ్దుల్‌ కలాం రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే  కేరళ రాజ్‌భవన్‌లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్రపతికున్న అధికారానుసారం  ఆయన ఓ ఇద్దరిని తన అతిథులుగా రాజ్‌భవన్‌కు ఆహ్వానించాలి. ఆ సమయంలో కలాం ఆహ్వానించిన అతిథులు ఎవరో తెలుసా.. తిరువనంతపురంలోని ఓ రోడ్డు పేవ్‌మెంట్‌ మీద చెప్పులు కుట్టే వ్యక్తి, ఓ చిన్న హోటల్‌ ఓనర్‌. ఈ ఇద్దరూ అబ్దుల్‌కలాం మిత్రులు. తిరువనంతపురంలో ఆయన సైంటిస్ట్‌గా పనిచేసినప్పుడు ఆ చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరే చెప్పులు రిపేర్‌చేయించుకునేవారు. ఆ హోటల్‌లో తినేవారు. ఆ స్నేహమే ఆ ఇద్దరినీ రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి అతిథులను చేసింది. ఇంకొక సందర్భం. ఒకసారి వారణాసిలోని ఐఐటిలో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లారు అబ్దుల్‌కలాం. వేదిక మీద అయిదు కుర్చీలు వేశారు. మధ్యలో పెద్దగా.. ప్రత్యేకంగా ఉన్న  కుర్చీని కలాంకు కేటాయించారు.  మిగిలిన నాలుగు యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్ల కోసం. ఆ ప్రత్యేకతను గమనించిన కలాం ఆ కుర్చీలో కూర్చోడానికి తిరస్కరించి.. మిగిలిన నాలుగింటిని పోలిన కుర్చీనే తెప్పించి అందులోనే ఆసీనులయ్యారు. ఈ రెండు సంఘటనలు.. ఎదిగినకొద్దీ ఒదగమనే విషయాన్ని చెప్తున్నాయి. 

వెళ్లినవాళ్లు వెనక్కి వచ్చారు
‘‘ఒకపక్కనేమో చీకటి పడుతోంది... ఇంటికెళదామంటే కారు టైర్‌ పంక్చర్‌. వయసా 80 దాటుతోంది పక్కనే 75 ఏళ్ల శ్రీమతి. పోనీలే ఎవరికైనా ఫోన్‌ చేసి రమ్మందామా అంటే సిగ్నల్‌ అస్సలు లేదు. ఐదేళ్ల క్రితం ధార్వాడ శివార్లలో ఉండే కెల్‌గేరి సరస్సు వద్ద ఇదీ నా పరిస్థితి. సాయంకాలం అలా కాసేపు తిరిగి వద్దామని సరస్సు వద్దకు వెళ్లామా.. కారు పార్క్‌ చేసి ఇల్లాలితో మాట కలిపి నాలుగు అడుగులేశామో లేదో.. టైమ్‌ అస్సలు తెలియలేదు. తిరిగి కారు దగ్గరకొచ్చి చూస్తే టైర్‌ పంక్చర్‌. ఏం చేయాలబ్బా అనుకుంటూ తలగోక్కున్నా.. ఏదైతే అది అయిందనుకున్నాం. కారు హెడ్‌లైట్లు వేసిపెట్టాలని తీర్మానించుకున్నాం. కాసేపటికే ఓ ట్రక్కు రయ్యి మంటూ దూసుకెళ్లిందిగానీ.. మా కేకలు వినిపించాయో లేదో... ఆగలేదు. బిక్కుబిక్కు మంటూ సాయం కోసం ఎదురుచూస్తున్న టైమ్‌ వచ్చారు వాళ్లునలుగురు ఉన్నారు. రెండు బైక్‌లపై మమ్మల్ని దాటుకుంటూ కాస్త దూరం వెళ్లిన వాళ్లు కాస్తా వెనుదిరిగారు. దగ్గరికి వచ్చారు. ‘‘తాతా ఏమైనా ఇబ్బందా?’’ అని అడిగారు. ప్రాణం లేచొచ్చినట్లు అయింది నాకు. విషయం చెప్పా. ‘‘కార్లో కిట్‌ ఉందేమో చూడండ్రా’’ అని వాళ్లల్లో ఒకరు బైక్‌ దిగాడు. డిక్కీ ఓపెన్‌ చేస్తూంటే వాళ్లు తమని అనిల్, సునిల్, ప్రతీక్, వికాస్‌లుగా పరిచయం చేసుకున్నారు. దగ్గరలోని ఊళ్లో మంచానపడ్డ తాతను పరామర్శించేందుకు వెళ్లి తిరిగి వస్తున్నారంట. అనిల్, సునీల్‌లు బైక్‌ హెడ్‌లైట్‌ ఆన్‌ చేసి కారుపై ఫోకస్‌ చేస్తే.. ప్రతీక్, వికాస్‌లు డిక్కీలోని కారు బయటకు తీయడం.. పంక్చరైన టైర్‌ స్థానంలో బిగించడం టకటకా జరిగిపోయాయి. సమయానికి దేవుళ్లలా వచ్చారయ్యా అంటూ కాసిన్ని డబ్బులు వాళ్ల చేతుల్లో పెట్టబోయో... ‘‘మా తాతతోనైతే డబ్బులు తీసుకుంటామా?. ఒద్దు పెద్దాయన’’ అనేశారు. వాళ్లదారిన వాళ్లు.. నా దారిన నేను వచ్చేశాం. ఐదేళ్లు అవుతున్నా.. ఈ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా... మనసంతా హాయిగా అనిపిస్తుంది’’
– అమృత్‌ రావు కాలే, బెంగళూరు

గాజు పెంకులు
డిఆర్‌డివో ప్రాజెక్ట్‌ బిల్డింగ్‌ పూర్తయ్యాక అబ్దుల్‌కలామ్‌ దాని ప్రారంభోత్సవానికి వచ్చాడు. ప్రహరీ గోడ మీదుగా చూసిన ఆయన ఆశ్చర్యపోతూ అక్కడే ఉన్న ప్రాజెక్ట్‌ మేనేజర్‌తో ‘ఆ గోడ మీదుగా గాజు పెంకులన్నీ ఎందుకలా అమర్చి పెట్టారు చుట్టూతా అన్నాడు.’ రక్షణ కోసం అలా గాజు పెంకులను అమర్చాం’ అన్నాడు అతను మరింత నైపుణ్యాన్ని చూపామని గర్వంగా! ‘మన రక్షణ అనుకున్నది మరొకరి పాలిట శిక్ష అవుతుంది. ఆ గాజు పెంకుల మీద పక్షులు వాలితే ..’ అని ఆగిపోయాడు అబ్దుల్‌కలామ్‌. ఆ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వెంటనే ఆ గాజు పెంకులను తొలగించడానికి మనుషులను పురమాయించాడు. 

డబ్బులే తీసివ్వాలా?
రెడ్‌ సిగ్నల్‌ కనిపించడంతో ఫుట్‌పాత్‌ సపోర్ట్‌ తీసుకుంటూ బండిని ఆపా. సరిగ్గా సిగ్నల్‌కు ఎదురుగా.. ఫుట్‌పాత్‌ ఎండింగ్‌లో ఏదో గొడవ జరుగుతోంది. ఏంటా గొడవ? ముందున్న వ్యక్తిని అడిగా.. ఏమో తెలియదన్నాడు. బండి మీదే కాస్త పైకి లేచి చూశా... ముసలాయన, ఓ యువకుణ్ని పట్టుకొని తిడుతున్నాడు.. రేయ్‌.. నీకు సిగ్గులేదా? చూడ్డానికి ఆంబోతులా ఉన్నావ్‌..! తల్లిని రోడ్డు మీద అడుక్కోమని కూర్చోబెడుతున్నావ్‌! అసలు నువ్వు మనిషివేనా? అని. దానికి ఆ యువకుడు సమాధానమేదీ చెప్పకుండానే నవ్వుతూ వెళ్లిపోయాడు. ముసలాయన తిట్లు మాత్రం ఆగడం లేదు. అలా తిట్టుకుంటూ నావైపే వచ్చాడా ముసలాయన. ఏం తాతా.. ఎందుకు తిడుతున్నావని అడిగా. ‘లుచ్చాగాడు’.. కాళ్లు లేని తల్లిని తీసుకొచ్చి, అడుక్కోమని ఇక్కడ కూర్చుండబెట్టి వెళ్తున్నాడు. మళ్లీ వస్తాడు.. డబ్బులన్నీ తీసుకొని పోతాడు. లుచ్చాగాడు.. లుచ్చాగాడు. తిట్టుకుంటూ వెళ్లిపోయాడు తాత. ముసలాయన అంతగా తిట్టినా.. ఆ యువకుడు మాత్రం నవ్వుకుంటూ వెళ్లడం నాకెందుకో ఆశ్చర్యం కలిగించింది. తిరిగి చూశా.. ఆ యువకుడి ఎక్కి వెళ్లిపోతున్న ఆటో ఎంతో దూరం పోలేదు. వెంటనే బండి యూటర్న్‌చేసి ఆటో వద్దకు వెళ్లా. అరేయ్‌.. బాబు, ఆ పెద్దాయన అంతగా ఎందుకు తిట్టాడు నిన్ను? అని అడిగా.సమాధానం చెప్పలేదు. మీ అమ్మను అడుక్కోవడానికి రోజూ ఇక్కడ కూర్చోబెతావట.. నిజమేనా? అని అడిగా. సమాధానం చెప్పలేదు!

నేనెవరో తెలుసా? రిపోర్టర్‌ను.. పోలీసులకు చెప్పి, లోపలికి పంపించమంటావా? అని బెదిరించా. అప్పుడు ఆ యువకుడు చెప్పిన మాట విని.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయా!‘ఆమె మా అమ్మకాదు.. మా అపార్ట్‌మెంట్‌ పక్కన రేకుల ఇంట్లో ఉంటది. రెండు కాళ్లు లేవు.. ఏ పనీ చేయలేదు. మొన్నటిదాకా అమెతోపాటు ఓ పిల్లగాడుంటుండే. రోజూ వాడే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి, తీసుకెళ్లెటోడు. వారం కిందట.. ఇంట్లో పైసలన్నీ తీసుకొని పరారైండట. ముసల్ది.. లబోదిబోమంటూ ఏడుస్తుంటే.. వారం రోజులుగా నేనే ఇక్కడికి తీసుకొచ్చి దించుతున్నా. ఆమెకు ఇయ్యడానికి నా దగ్గర పైసల్లేవ్‌..! నేనే.. పైసల కోసం స్విగ్గీల పనిచేస్తున్నా. కమ్‌ సె కమ్‌ ఇడదాక దించుతేనైనా ఆమెకు బతకనీకి కొన్ని పైసలొస్తయ్‌’ అని చెప్పడంతో నా నోట మాట రాలేదు. మరి ఆ ముసలాయన అంతగా తిడుతుంటే.. చెప్పొచ్చుగా? అని అడిగితే.. ‘ఆ పెద్దాయన తిట్టి ఎళ్లిపోయిండు. నిన్న ఒకోడైతే చెంపమీదనే కొట్టిండ’ని చెబుతుండగానే ఆటో కదిలింది. ఆ యువకుడు వెళ్లిపోయాడు. జర్నలిస్టును కదా.. వాడు చెప్పిన దాంట్లో నిజమెంతో? అబద్ధమెంతో? తెలుసుకుందామని.. సిగ్నల్‌దగ్గర అడుక్కుంటున్న ఆమె దగ్గరకు వెళ్లి అడిగా.. ఆ యువకుడు చెప్పింది అక్షరాలా నిజమే! చెంపదెబ్బతో సహా. సాయం చేయాలంటే జేబులో నుంచి డబ్బులే తీసియ్యాలా? మనసులోని దయా, కరుణను కాస్త ఖర్చుచేసినా చాలనిపించింది!
– సుధాకర్, హైదరాబాద్‌

పిట్టలకు ప్రాణమిచ్చాడు 
అసలే ఆయన ఓ రైతు.. పేరు అశోక్‌ సోనులే. ఉండేదేమో మహారాష్ట్రలో. అది కూడా కరవుకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న కొల్హాపూర్‌ ప్రాంతంలో! ఉన్నదేదో ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని మరీ ఖర్చుపెడతాడని అనుకునేందుకు ఇంతకంటే పెద్ద వివరాలు అక్కరలేదు. కానీ.. నిజం ఇది కాదు. అరకొర వర్షాలతో పంటలు పండని దుస్థితి ఉన్నా... చేసిన అప్పులు తీరక తోటిరైతులు అంత విషం తీసుకుని నేలకు ఒరుగుతున్నా...తనకున్న పిసరంత ఆసరాను కూడా పాలపిట్టలకు, పిచ్చుకలకు వదిలేసిన గొప్పమనసు  అశోక్‌ సోనులేది. కొల్హాపూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని గడ్‌మడ్‌షింగీలో ఇద్దరు సంతానంతో కలిసి పొలం పనులకెళ్లే అశోక్‌కు తండ్రుల నుంచి వచ్చిన భూమి ఓ పావు ఎకరం మాత్రం ఉంది. ఎప్పట్లానే ఆ ఏడాది కూడా జొన్నలైతే విత్తాడు కానీ.. వర్షాభావంతో పంటపై ఆశమాత్రం పెట్టుకోలేదు. చిత్రమో.. మహత్యమో తెలియదుగానీ.. ఆ ఏడాది అశోక్‌ పంట విరగకాసింది. హమ్మయ్యా.. ఏళ్ల తరువాతైనా ఒక్క పంట చిక్కింది కదా అనుకున్నాడు. కోతలకు సిద్ధమయ్యాడు. పొలం మధ్యలో ఉన్న బాబూల్‌ చెట్టును కూడా కొట్టేస్తే నాలుగు గింజలు ఎక్కువ దొరుకుతాయి కదా అని  గొడ్డలితో బయలుదేరాడు. తొలి వేటు వేసేలోపు... చెట్టుపైనే గూడు కట్టుకున్న పిట్టలు కువకువలు మొదలుపెట్టాయి. వాల్మీకికి పక్షుల శోకం నుంచి శ్లోకం పుట్టుకొచ్చినట్లు.. బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయమైనట్లు అశోక్‌ మదిలో  చెట్టు కొట్టేస్తే.. పిట్టల పరిస్థితి ఏమిటన్న ఆలోచన మొదలైంది.  గొడ్డలి పక్కకు ఒరిగిపోయింది.తన కష్టాలు తనకెలాగూ ఉన్నాయి. చెట్టు కొట్టేస్తే పిట్టల గూళ్లు చెదరిపోతాయి. పంట తీసేస్తే కాసిన్ని గింజలూ దొరకవు కదా? అనుకున్నాడు. కోతలకు స్వస్తి చెప్పేశాడు. కుటుంబంతో కలిసి ఆ పక్షులకు కాసిన్ని నీళ్లు అందేలా ఏర్పాట్లు చేసేశాడు. అమ్మకు అన్నం పెట్టాలన్నా లక్ష లెక్కలేసుకునే ఈ రోజుల్లో అశోక్‌ వంటి వారు అరుదే!

చిట్టి చేతులు
అది  పెంపుడు కుక్క కాదు. చెత్త కుప్ప దగ్గర కడుపు నింపుకునే వాటిలో అదీ ఒకటి. చలాకీగా ఉండేది. ఊరంతా తనదే అయినట్టు తిరిగేది. అలాంటిది అది తల నేలకేసి పదే పదే బాదుకుంది. ముందరి కాళ్లతో టపీ టపీమని ముఖాన్ని కొట్టుకుంది. కానీ, ముఖానికి పట్టుకున్న భూతాన్ని వదిలించుకోవడం దాని వల్ల కావడంలేదు. పొడవాటి తెల్లటి డబ్బా అది. మెడ నుంచి మూతిని దాటి నాలుగు అంగుళాల ముందుకు పొడుచుకువచ్చింది. దాని శక్తి కొలదీ బాదుతూ ఉండటం వల్ల డబ్బా అడుగు భాగం అయితే పూర్తిగా పగిలింది కానీ, ఆ డబ్బా ఊడిరాలేదు. బహుశా చెత్త కుప్ప దగ్గర పడి ఉన్న డబ్బాలోని ఆహారం తినడానికి అందులో మూతి పెట్టి ఉంటుంది. వీలుకాక మూతి బయటకు తీసేటప్పుడు దానికి తెలియలేదు ఆ డబ్బా తన తలను మింగేసిందని. తను విశ్వ ప్రయత్నం చేసింది. డబ్బా ఊడిరాలేదు.వాడవాడలా తిరిగింది. ఎవరూ పట్టించుకోలేదు. ఎన్ని రోజులయ్యిందో గుక్కెడు నీళ్లు తాగి. ఒంట్లో శక్తి లేక ముందరి కాళ్లతో మాత్రమే అతి కష్టంగా అడుగులు వేస్తూ వెనక కాళ్లను ఈడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. చివరాఖరకు తన చావు ఖాయం అనుకుంది. ఓ పాడుబడిన గోడ కనిపిస్తే ఎలాగోలా దేహాన్ని ఈడ్చుకుంటూ దాని దాపుకు చేరింది. తల నిలబెట్టే శక్తిలేక నేలకు వాల్చింది. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఆ తలను ఓ రెండు చేతులు ఎత్తిపట్టుకున్నాయి. దాని కళ్లు మెరిశాయి. ఒంట్లోకి ఏదో శక్తి వచ్చినట్టు తల పైకెత్తింది. తన తలను పట్టుకున్న చేతులు డబ్బాను చీల్చుతున్నాయి. తనకు పట్టిన భూతంతో ఏ దేవుడో యుద్ధం చేస్తున్నాడు. అపురూపంగా చూస్తోంది అది. డబ్బా ముందు భాగమంతా తీసేసిన ఆ చేతులు మెడకు పట్టిన మిగతా భాగాన్ని కూడా జాగ్రత్తగా విరగ్గొట్టాయి. పోయిందనుకున్న ప్రాణం లేచొచ్చింది. ప్రాణం పోసిన ఆ చిట్టి చేతులను భక్తిగా నాలుకతో స్పర్శించింది అది. తోటి పిల్లలతో ఆడుకుంటూ, పడిపోయిన బాల్‌ని వెతుక్కుంటూ వచ్చిన ఆ ఐదేళ్ల పిల్లాడి ముఖం విప్పారింది. 

జానే కహా గయే వో దిన్‌
పాటలో భావం, రాగం మాత్రమే కాదు కనికరం కూడా ఉంటుంది. ముఖేశ్‌ పాటలు దయగా, వాత్సల్యంగా, వేదనలో సహబాటసారుల్లా ఉంటాయి.  ‘కిసీకా దర్ద్‌ మిల్‌ సకేతో లే ఉధార్‌’ అన్నాడాయన ఒక పాటలో. అంటే ఎవరైనా దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని అప్పుగా అయినా అడిగి తీసుకో అని అర్థం. అలా తీసుకోవడాన్నే జీవితం అంటారనీ ‘జీనా ఇసీకా నామ్‌ హై’ అని కూడా అన్నాడు.ముఖేశ్‌ అప్పట్లో స్టార్‌డమ్‌లో ఉన్నాడు. ఆయనకు శివుడంటే ప్రీతి. ఆయన పేరు కూడా శివునిదే కదా. ఒకసారి ఆయన అభిమానులను కలుస్తూ నాసిక్‌ సమీపంలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయాన్ని దర్శించాలని అనుకున్నాడు. ఆయన వస్తున్న కబురు ముందే అందింది. కాని ఆయన రాక మాత్రం ఆలస్యమైంది. దాదాపు రాత్రి పది గంటలు దాటేశాయి. అప్పటికే ఆలయం మూసేయాల్సిన సమయం కానీ ముఖేశ్‌ వస్తున్నాడని అధికారులు తెరిచిపెట్టారు. అప్పటికి అది చలికాలం. డిసెంబర్‌ నెలలో ఆ ప్రాంతంలో చలి గడ్డ కట్టించేలా ఉంటుంది. ముఖేశ్‌ ఆలయానికి చేరుకున్నాడు. అందరూ ఎదురొచ్చి స్వాగతం చెపుతూ లోపలికి తీసుకెళ్లబోయారు. ఆయన మెట్లెక్కుతూ ఆ మెట్ల మీద ఉన్న బిచ్చగాళ్లను చూసి ఆగిపోయాడు. వాళ్లు కప్పుకోవడానికి దుప్పట్లు లేక చలికి వొణుకుతున్నారు.
‘వీళ్లంతా ఇలా పడుకున్నారేమిటి? దుప్పట్లు లేవా?’ అని అడిగాడు ముఖేశ్‌.

‘వాళ్లకది మామూలే. మీరు పదండి’ అన్నారు నిర్వాహకులు.‘లేదు.. లేదు.. వీళ్లిలా వణుకుతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా. ముందు దుప్పట్లు, కంబళ్లు తీసుకురండి. డబ్బిస్తాను’ అని డబ్బులు తీశాడు.నిర్వాహకులు ఇరకాటంలో పడ్డారు.‘సార్‌... ఇప్పుడు దుకాణాలు ఉండవు. రేపు ఉదయం తెచ్చి ఇస్తాం. ముందు మీరు పదండి. దర్శనానికి ఆలస్యం అవుతుంది’ అన్నారు.‘ముందు మానవ సహాయం... తర్వాతే దైవ సేవ’ అన్నాడు ముఖేశ్‌.నిర్వాహకులు పడుతూ లేస్తూ ఊళ్లో తెరిచిన వారి దుకాణం తెరిపించి దుప్పట్లు, కంబళ్లు ముఖేశ్‌ డబ్బుతో కొని తెచ్చారు.    ముఖేశ్‌ వాటిని ఆ బిచ్చగాళ్లందరికీ పంచాడు. వాళ్లు వాటిని తీసుకుని కప్పుకోవడం చూసే తృప్తిగా గుడిలోకి అడుగు పెట్టాడు. ఇలా చేసిన వాడి పాట దేవుడు వినకుండా ఉంటాడా?

పెద్ద మచ్చ
1961లో రాజ్‌కపూర్‌ తాష్కెంట్‌ టూర్‌ చేశాడు. అప్పటికే అతడు సోవియెట్‌ రష్యాలో కూడా సూపర్‌స్టార్‌. తాష్కెంట్‌ సోవియెట్‌లో భాగం. అక్కడ తన ట్రూప్‌తో షోలు చేయడానికి వెళ్లాడు. తనతో పాటు అప్పుడప్పుడే గుర్తింపు పొందుతున్న గాయకుడు మహేంద్ర కపూర్‌ను కూడా తీసుకెళ్లాడు. రాజ్‌ కపూర్‌ ప్రతి షోలో ‘మేరా జూతా హై జపానీ’ పాడితే జనం వెర్రెత్తి పోయేవారు. కాని మహేంద్ర కపూర్‌ అప్పటికే తనకు హిట్‌గా నిలిచిన ‘హే... నీలే గగన్‌ కే తలే’ పాటను రష్యన్‌ భాషలో అనువదించి తమ స్లాట్‌ వచ్చినప్పుడు హిందీ వెర్షన్‌ కాకుండా ఆ రష్యన్‌ వెర్షన్‌ పాడటం మొదలెట్టాడు. ఆ దెబ్బకు అక్కడి జనం మహేంద్ర కపూర్‌కు జేజేలు పలకడం మొదలెట్టారు. రాజ్‌కపూర్‌కు ఒకటి అర్థమైంది. షోస్‌ తన వల్ల హిట్టేగానీ మహేంద్ర కపూర్‌ వల్ల ఇంకా హిట్‌ అయ్యాయని. ఆ రోజు రాత్రి హోటల్‌ను మహేంద్ర కపూర్‌ కలిసినప్పుడు ‘నువ్వు రావడం మంచిదయ్యింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి ఏదైనా కృతజ్ఞత చూపించాలనుకుంటున్నాను. కాని నిన్ను నా గాయకుడిగా పెట్టుకోలేను. ఎందుకంటే ముకేశే నా పాటలన్నీ పాడతాడు. కాని నేను వెంటనే తీయబోయే సినిమాలో సెకండ్‌ హీరోకి మాత్రం నీచే ఒక పాటైనా పాడిస్తాను’ అన్నాడు.

రాజ్‌ కపూర్‌ సినిమాలో పాట అవకాశం అంటే చాలా పెద్ద లాటరీ కిందే లెక్క.మహేంద్ర కపూర్‌ నవ్వి ‘సార్‌.. మీరు చాలా పెద్దవారు. ఇప్పుడు ఈ ఉద్వేగంలో ఇలా అంటారు. కాని ఇండియా వెళ్లాక మీ పనుల్లో పడి ఇచ్చిన మాటను మర్చిపోతారు’ అన్నాడు.రాజ్‌ కపూర్‌ ఒక నిమిషం ఆగి మహేంద్ర కపూర్‌ని చూశాడు. ఆ క్షణంలో తను తాగుతున్న సిగరెట్‌ను నోట్లో నుంచి బయటకు తీసి వెంటనే మణికట్టు మీద చిన్నగా కాల్చుకున్నాడు.మహేంద్ర కపూర్‌ ఉలిక్కి పడ్డాడు.‘చూడు... ఇక్కడ మచ్చ పడింది. ఈ మచ్చ నీకిచ్చిన మాట నాకు గుర్తు చేస్తుంది. ఈ మచ్చ కంటే కూడా పెద్ద మచ్చ ఏమిటో తెలుసా? ఇచ్చిన మాటను మర్చిపోవడం. మాట నిలబెట్టుకోవడం కూడా ఒక రకమైన దైవారాధనే’ అన్నాడు.ఇండియాకు తిరిగి వచ్చాక రాజ్‌ కపూర్‌ తీసిన సినిమా ‘సంగమ్‌’.అందులో మహేంద్ర కపూర్‌ ఏ పాట పాడాడో మీరే గుర్తించండి.

‘మీరే వీఐపీలు’
అది 1990 ఎండాకాలం. లీనాశర్మది అస్సాం. ఇండియన్‌ రైల్వే (ట్రాఫిక్‌) సర్వీస్‌ ప్రొబేషనరీ ఆఫీసరుగా పనిచేస్తున్న లీనా తన స్నేహితురాలితో కలిసి లక్నోలో ఢిల్లీ వెళ్తున్న ట్రెయిన్‌ ఎక్కారు. వీళ్ల బోగీలో ఇద్దరు ఎంపీలు ప్రయాణిస్తున్నారు. ఎంపీలతో పాటు రిజర్వేషన్‌లేని మరో పన్నెండు మంది మగవాళ్లు ఉన్నారు. వాళ్లు అతిగా అరవడం, దుర్భాషలాడటం, వీళ్ల సీట్లలో వీళ్లను కూర్చోలేకుండా చేయడం, ఇంత జరుగుతున్నా ఆ ఎంపీలు నోరు మెదపకపోవడం జరిగింది. ఆ రాత్రి దుర్భరంగా గడిచాక తెల్లారి వీళ్లు ఢిల్లీలో దిగారు.అక్కడినుంచి అహ్మదాబాద్‌ ట్రెయిన్‌ పట్టుకున్నారు. కానీ రిజర్వేషన్‌ చేయించే వీలు లేదు. వీళ్లు టీటీఈని కలిసి తమ పరిస్థితి చెప్పుకున్నారు. ఆయన ఒక కూపె దగ్గరికి తీసుకెళ్లి, ‘ప్రస్తుతానికి ఇందులో కూర్చోండి’ అన్నాడు. ఆ కూపెలో ఇద్దరు కూర్చున్నారు. వాళ్ల ఖాదీ బట్టలను చూస్తే రాజకీయ నాయకులని అర్థమవుతోంది. పెద్దాయనేమో నలభైల్లో ఉన్నాడు. చిన్నాయన ముప్పైల్లో ఉన్నాడు. రాత్రే మరో అనుభవం జరిగివున్న దృష్ట్యా ఈ యువతులు తటపటాయిస్తుంటే టీటీఈ, ‘ఏం ఫర్లేదు, వీళ్లు ఈ రూట్లో రెగ్యులర్‌ ప్యాసెంజర్లే’ అని భరోసా ఇచ్చాడు.ఆ నాయకులిద్దరూ తాము మూలకు సర్దుకుని బెరుగ్గా ఉన్న యువతులను వీలైనంత సౌకర్యంగా కూర్చునేలా చూశారు. నెమ్మదిగా మాటలు కలిశాయి. వాళ్లు గుజరాత్‌ బీజేపీ నాయకులని తెలిసింది. చరిత్ర, రాజకీయాలు, హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌ దాకా చర్చ సాగింది. ఇంతలో నాలుగు ప్లేట్ల భోజనం వచ్చింది. బిల్లు వీళ్లను కట్టనీయకుండా ఆ యువనాయకుడు చెల్లించాడు.ఈలోపు టీటీఈ తిరిగొచ్చి, ‘ఎక్కడా బెర్తులు లేవు, ఏమీ చేయలేను’ అని తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. ఆ యువతులు ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తుంటే, ఆ ఇద్దరు నాయకులు ‘మరేం ఫర్లేదు, మేము సర్దుకుంటాం’ అని చెప్పి, ఈ ఆడవాళ్లకు బెర్తులు ఇచ్చేసి వాళ్లు కింద బట్టలు పరుచుకుని పడుకున్నారు. తెల్లారి వీళ్లు దిగేముందు, అహ్మదాబాద్‌లో ఎక్కడ బస చేశారనీ, అవసరమైతే తమ ఇంటికి రావొచ్చనీ పెద్దాయన వీళ్లను ఆహ్వానించాడు. తాను దిమ్మరిని కాబట్టి తనకో ప్రదేశమంటూ లేదనీ, కానీ పెద్దాయన ఆహ్వానాన్ని మీరు అంగీకరించవచ్చనీ చిన్నాయన వత్తాసు పలికాడు. వసతికి తమకే ఇబ్బంది లేదని చెప్పి, దిగేముందు మరిచిపోకుండా రాసుకుందామని వాళ్లపేర్లు అడిగారు లీనాశర్మ. అప్పుడు వాళ్లు చెప్పిన పేర్లు: శంకర్‌సింగ్‌ వాఘేలా, నరేంద్ర మోదీ. 

శుద్ధమైన కోరిక 
గాయకుడు రఫీ భారతదేశంలో చాలా గొప్పవాడు అయి ఉండవచ్చు. గొప్ప గాయకుడు అయి ఉండవచ్చు. లక్షలాది మంది అభిమానులు అతడికి ఉండవచ్చు. కాని దైవం ముందు అతడొక మామూలు భక్తుడు. మక్కాలో కాబా గృహం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు శతకోటి మంది భక్తులలో అతనూ ఒక్కడు. అందరికంటే ఎక్కువ మంది అభిమానులను సకల చరాచర సృష్టి ఆరాధనను కలిగి ఉన్నది ఒకే ఒక్కడు– ఈశ్వరుడు. అతని ముందు విమన్రంగా ఉండక తప్పదు. 1969లో రఫీ హజ్‌ యాత్ర చేశాడు. ఆయనతో పాటు నాటి పాకిస్తాన్‌ స్టార్‌ సింగర్‌ మసూద్‌ రాణా కూడా ఉన్నాడు. హజ్‌కు వెళితే ఆ నియమాలను పాటించి తిరిగి రావాలి ఎవరైనా. కాని రఫీకి కాబా గృహం దగ్గర నమాజు వేళకు అధికారికంగా ఇచ్చే అజాన్‌ను తనకు ఇవ్వాలనిపించింది. ఇంత మధురమైన గాయకుణ్ణి, పెద్ద గాయకుణ్ణి నేను అజాన్‌ ఇస్తే ఎంత బాగుంటుందో కదా అని వెళ్లి హజ్‌ నిర్వాహక కమిటీని అడిగాడు. కమిటీ ఒక్క నిమిషంలో అతడి కోరికను కొట్టిపడేసింది. ఇక్కడి పద్ధతుల అనుసారం బయటి వాళ్లు అజాన్‌ ఇచ్చే ఆనవాయితీ లేదని చెప్పేసింది. రఫీ నిరాశగా తిరిగి వచ్చాడు. ఈసారి తన గాయక హోదాతో మరెవరినో తీసుకుని కమిటీ దగ్గరకు వెళ్లాడు. మళ్లీ అనుమతి నిరాకరించబడింది. మళ్లీ ఇంకేదో రికమండేషన్‌తో వెళ్లాడు. అదీ నడవ లేదు. ఇలా నాలుగైదు రోజులు గడిచాయి. ఒకరోజు తెల్లవారుజామున రఫీ కాబా చుట్టూ ప్రదిక్షిణం చేస్తూ– ప్రభూ... నేను గాయకుణ్ణి కాదు.. ఒత్త నీ విశ్వాసిని... నీ జీవుడిని... నీ పట్ల అపారమైన ఆరాధన కలవాడిని... ఒక మామూలు భక్తుడిగా అడుగుతున్నాను... నీ పుణ్యక్షేత్రంలో నాకు అజాన్‌ ఇచ్చే అవకాశం ఇవ్వు అని వేడుకున్నాడు. అలా అనుకుని మళ్లీ కమిటీ దగ్గరకు వెళ్లాడు. కమిటీ వాళ్ల ఎదురుగా నిలుచుని ఉన్నది గాయకుడు కాదు సెలబ్రిటీ కాదు ఒక మామూలు ముసల్మాన్‌. వాళ్లు అనుమతి ఇచ్చారు. ఆ తెల్లవారుజాము నమాజు కోసం రఫీ ఇచ్చిన అజాన్‌ అక్కడ ఉన్నవాళ్లందరినీ ఎంత కరుణలో ముంచెత్తిందంటే దైవస్పృహలో వారందరి కళ్లు ధారాపాతం అయ్యాయి. అలాంటి అజాన్‌ను వారు ఇంతకు ముందు వినలేదు. వాళ్లు రఫీని ఆలింగనం చేసుకున్నారు.అంతేనా? రఫీ అక్కడ ఉన్నన్నాళ్లు ప్రతిరోజూ తెల్లవారుజాము అజాన్‌ ఇచ్చే అనుమతి అతనికి లభించింది. అహం వదులుకుంటే కరుణ దొరికే తీరుతుంది.

ఒక్క చిరునవ్వు 
19వ శతాబ్దిలో అమెరికన్‌ నవలా రచయితలలో పేరెన్నికగన్నవాడు మార్క్‌ట్వెయిన్‌. మార్క్‌ చదివే స్కూల్‌లో విద్యార్థులకు టీచర్‌ జనరల్‌ నాలెడ్జికి సంబంధించిన పరీక్ష పెట్టారు. ఆ ప్రశ్నాపత్రంలోని చివరి ప్రశ్న ‘రోజూ ఈ స్కూల్‌ని శుభ్రపరిచి, ఆయాగా పనులు చేసే ఆమె పేరు ఏమిటి?’ అని ఉంది. పిల్లలందరికీ ఆమె రూపం జ్ఞప్తికి వచ్చింది. రోజూ ఆమెను తమందరూ చూస్తారు. ఆమె పొడుగ్గా ఉంటుంది, నల్లటి జుట్టు ఉంటుంది, యాభై ఏళ్లకు పైనే వయసు ఉంటుంది. కానీ, పిల్లలెవెరికీ ఆమె పేరు తెలియదు. టీచర్‌ తమను ఆటపట్టించడానికే ఆ ప్రశ్న ఇచ్చారని, ఇదెందుకు పనికివస్తుందని విద్యార్థులందరూ అనుకున్నారు. క్లాస్‌ చివరలో ఒక విద్యార్థి లేచి ‘సర్‌ ఈ ప్రశ్నకు సమాధానం రాయకపోయినా మా ర్యాంకు తగ్గదు కదా’ అన్నాడు. టీచర్‌ ‘కచ్చితంగా తగ్గదు’ అంటూనే ‘మీ జీవితంలో ఎంతో మంది మీకు తారసపడుతూ ఉంటారు. మరెంతో మందిని కలుస్తూ ఉంటారు. ఎంతోమంది మీకు ఏదో రూపంలో సేవలు చేస్తూనే ఉంటారు. వారిలో నిరుపేదలే ఎక్కువ. వారందరూ గుర్తించదగినవారే! వారు మీ నుంచి కోరుకునేది ఒక్క చిరునవ్వు, చిన్న పలకరింపు. అదే మిమ్మల్ని దైవానికి దగ్గర చేరుస్తుంది’ అని చెప్పాడు. ‘ఆ రోజే ఆ ఆయా పేరు డోరతి అని తెలుసుకున్నానని, ఈ పాఠం జీవితంలో తనెప్పుడూ మర్చిపోలేద’ని డైరీలో రాసుకున్నాడు మార్క్‌. 

నాన్నకు ప్రేమతో.. 
క్యాబ్‌ డ్రైవర్లలో కొందరు హుషారు మనుషులు వుంటారు. కార్లో ప్రయాణం చేస్తున్నంత సేపూ ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. రాత్రి వచ్చిన టీవీ ఛానల్‌ కారు డ్రైవర్‌  ఈ మాదిరే. అతను ఏవేవో కబుర్లు చెబుతూ ఉంటే, అతన్ని అడ్డుకట్ట వేస్తూ, ‘మీ కుటుంబం ఏమిటి, సంపాదన సరిపోతుందా’ అనే ప్రశ్నలు వేస్తూ సంభాషణను జయప్రదంగా దారి మళ్ళించాను. కానీ అతడు చెప్పిన సంగతులు వింటే ఏ తండ్రికి అయినా ఇలాంటి కొడుకు వుంటే బాగుంటుందనిపించింది.పేద కుటుంబంలో పుట్టాడు. ఒక్కడే కొడుకు. చదువు సరిగా అబ్బక పోవడంతో సంసారం నడపడానికి స్టీరింగ్‌ చేతబట్టాడు. తండ్రికి వేరే సంపాదన లేదు. టాక్సీ నడిపిన రోజుల్లో  బాగానే గిట్టుబాటయ్యేది. ఒక్కోసారి రోజువారీ ఆదాయం వేలల్లో వుండేదిట. సంసారం కాస్త తెరిపిన పడింది. దేశంలో తిరగని ఊళ్ళు లేవు. రోజులు ఎప్పుడూ ఒకలా వుండవు. తండ్రికి జబ్బు చేసింది.  ఏ క్షణాన ఆసుపత్రికి తీసుకువెళ్ళాలో తెలవదు. దేశం పట్టుకుని  తిరుగుతూవుంటే సంపాదన బాగా ఉండొచ్చు కానీ, ఇంట్లో ఏదైనా అవసరం పడితే చప్పున రావడం కష్టం.అందుకని రాబడి తగ్గినా పరవాలేదనుకుని హైదరాబాదులోనే ఉండేలా ట్రావెల్స్‌ లో చేరాడుట.‘నాకు మా నాన్న ఆరోగ్యం ముఖ్యం. సంపాదన కానీ, ఏదైనా కానీ దాని తర్వాతే’  అన్నాడు నెమ్మదిగా. వెనక సీట్లో కూర్చోవడం వల్ల అతడి మొహం నాకూ, నా మొహం అతడికీ కనబడే వీలు లేదు. కానీ నాకు మల్లేనే అతడి కళ్ళు చెమ్మగిల్లి వుంటాయి. 
– బండారు శ్రీనివాసరావు, పాత్రికేయుడు

గ్లాసెడు పాలు 
ఒక రోజు ఒక నిరుపేద పిల్లవాడు తల్లి అమ్ముకురమ్మన్ని ఇచ్చిన కొన్ని బొమ్మలున్న బుట్టను తల మీద పెట్టుకొని దారుల్లో తిరుగుతున్నాడు ఎవరైనా ఒక్క బొమ్మనైనా కొనకపోతారా అని. ఒక్క బొమ్మా అమ్ముడుపోలేదు. ఆకలికి కళ్లు తిరుగుతున్నాయి. శోష వచ్చేలా ఉంది. ‘ఈసారి వెళ్లే ఇంట్లో వాళ్లని కొంచెం భోజనం పెట్టమని అడుగుదాం’ అనుకొని ఓ ఇంటి తలుపు తట్టాడు. ఒక యువతి తలుపు తీసింది.భోజనం అడుగుదామనుకున్న ఆ పిల్లవాడు అడగలేక ‘తాగడానికి కొన్ని నీళ్లు ఇవ్వగలరా..’ అన్నాడు. ఆ పిల్లవాడు ఆకలిగా ఉన్నాడేమో అనిపించిన ఆమె పొడవాటి గ్లాసు నిండా పాలు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ పిల్లవాడు ఆ గ్లాసు అందుకొని నెమ్మదిగా ఆ పాలు తాగి ‘మీకు ఎంతో రుణపడి ఉన్నాను. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను?’ అన్నాడు. ఆమె సన్నగా నవ్వుతూ ‘దయ చూపడంలో తల్లి ధరను కోరుకోదు’ అంది. ‘మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ఆ పిల్లవాడు అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు. కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒక నడి ఈడు స్త్రీ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చింది. ఆ నగరంలోనే ప్రముఖుడైన డాక్టర్‌ హావర్డ్‌ కెల్లీనే ఈ జబ్బును నయం చేయగలడని అతని వద్దకు పంపించారు స్థానిక డాక్టర్‌. డాక్టర్‌ హావర్డ్‌ కెల్లీ ఆమెకు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స చేశాడు. ఆమెకు జబ్బు పూర్తిగా నయమయ్యేదాక ఆసుపత్రిలోనే ఉంచి, ఆమె ఆసుపత్రి బిల్లును ఆ డాక్టరే చెల్లించాడు. ఆమె ఆశ్చర్యపోతూ డాక్టర్‌ చెల్లించిన ఆ బిల్లును చూసింది. ఆ బిల్లు అడుగున ‘గ్లాసెడు పాల రుణం ఇప్పుడు తీర్చుకున్నాను’ ఇట్లు డాక్టర్‌హావర్డ్‌ కెల్లీ అని రాసుంది. ఆమె కళ్లు సంతోషంతో వర్షించాయి.  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top