కవ్వించి నవ్వించిన వాడి కథ

Seen is yours title is ours 17-03-2019 - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

ముగ్గురు మహానటులు నటించిన సినిమాలోని దృశ్యాలివీ... ఈ సినిమాపేరేంటో చెప్పుకోండి చూద్దాం...‘‘గుండెల్లో భయంకర అగ్నిగోళాలు బ్రద్దలవుతున్నా ప్రజలను కవ్వించి నవ్విస్తా తల్లీ. అమ్మా... ధన్యోస్మీ... జగదాంబ ధన్యోస్మీ’’ అన్నాడు అతడు.ఆతరువాత భార్యాబిడ్డలతో కలిసి విజయనగరరాజ్యంలోకి ప్రవేశించాడు. ఒక సత్రంలోకి వెళ్లి...‘‘ఏవండీ...దూరం నుంచి వస్తున్నాం. బస వీలవుతుందా?’’ అని అడిగాడు నెమ్మదిగా.‘‘ఆ గదిలో బూజు దులుపుకుని ఉండండి. రెండురోజులు ఉండవచ్చు’’ అన్నాడు సత్రం నిర్వాహకుడు. తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో తాను కవిని అనే విషయం చెప్పాడు అతడు.‘కవి’ అనే శబ్దం వినిపించగానే అతడికి అక్కడ అపూర్వమైన గౌరవమర్యాదలు లభించాయి. ఇది చూసి కవిగారు మురిసిపోయి...‘‘యాథారాజా తథాప్రజా అని ఊరకే అన్నారా పెద్దలు. మీ ఆదరణలో అతిథి మర్యాదలు చూస్తుంటే ఏలిన వారికి కవులంటే  ఎంత ఇష్టమో అర్థమవుతుంది’’ అన్నాడు.ఆచార్య స్వాముల వారిని కలవాలని ప్రయత్నిస్తున్నారు కవిగారు. అక్కడి సిబ్బంది మాత్రం ఇతడిని బొత్తిగా ఖాతరు చేయడం లేదు.‘‘ఎవరయ్యా నువ్వు?’’ అని గద్దించాడు  ఒక ఆస్థాన కవి.‘‘నాకు కవిత్వంలో కొంత ప్రవేశం ఉందండి. వారి అనుగ్రహంతో రాజాశ్రయం పొందాలని వచ్చా!’’ తాను వచ్చిన పని గురించి చెప్పారు కవిగారు.‘‘నాకు కవిత్వంలో ప్రవేశం ఉందండి’’ అనే మాట విని ఈ కవిగారిని ఆస్థాన కవిగారు ఇలా వెటకారం చేశారు...‘‘ఈ కాలంలో కవిత్వం, వైద్యం రానివాడెవ్వడులే’’ అన్నాడు. మహారాజును కలిసే వరకే అతని దురదృష్టం. ఆతరువాత అదృష్టమే  ఆ కవి వెంట పరుగులు తీస్తుంది. కాని ఆ అదృష్టఘడియ ఎప్పుడు వచ్చేనో ఎలా వచ్చేనో!

రాయలవారి సభ.‘‘ఏమిటి మీ విజ్ఞాపన?’’ గంభీరస్వరంతో అడిగారు మంత్రి.‘‘మా తండ్రిగారి మరణశాసనం ప్రకారం స్థిరాస్తి మాకు పంచబడింది. కాని స్థిరాస్తి మాకు పంచలేకపోతున్నారు మహాప్రభో’’ అన్నాడు రాయలవారి ముందు నిల్చున్న ముగ్గురిలో ఒకరు.‘‘కారణం?’’ అడిగారు రాయలవారు.‘‘మా తండ్రిగారి పదిహేడు ఏనుగులు... సగం పాలు నాకు, మూడో పాలు రెండో వాడికి, అందులో మూడో పాలు మూడోవాడికి రావాలి. ఈ పంపకం చేయలేక వాటిని మీ గజశాలకు తోలించారు. మాకు న్యాయం చేయండి మహాప్రభో’’ అని దీనంగా వేడుకున్నాడు ముగ్గురిలో పెద్దవాడు.రాయలవారు వెంటనే స్పందించారు:
‘‘మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగబోనివ్వం’’ అంటూ ‘‘ఈ సమస్య గురించి మీ అభిప్రాయం?’’ అని ధర్మాధికారులను అడిగాడు.‘‘ఎన్ని విధాల భాగించి చూసినా  జంతుహింస చేయకుండా పాలు పంచడం సాధ్యంగా కనిపించడం లేదు మహారాజా’’ అన్నాడు ధర్మాధికారులలో ఒకరు.‘‘మరణించినవాడు మతిలేనివాడు కాదు మహాప్రభో. ప్రతిభవంతుడైనా ప్రభుభక్తిపరాయణుడు. కనుకనే సాధ్యం కాని విభాగాలలో మరణశాసనం రాశాడు. కాబట్టి ఆయన అభిమతాన్ని మన్నించి మీరు ఏనుగుల్ని స్వీకరించడం ధర్మం’’ అన్నాడు మరో ధర్మాధికారి.‘‘ధర్మం కాదు మహాప్రభో’’ బాధగా అన్నారు అన్నదమ్ముల్లో ఒకరు.‘‘ఈ మహాసభ నిర్ణయాన్ని అన్యాయమని ఆక్షేపించేది ఎవరో’’ సభను ఉద్దేశించి గట్టిగా అడిగారు మహామంత్రి.‘‘నేను’’ అంటూ ఎవరో అనామకుడు లోనికి వచ్చాడు.‘‘ఎవరు నువ్వు?’’ గద్దించారు మహామంత్రి.‘‘ఎవడో పిచ్చివాడు’’ సమాధానమిచ్చాడు ఒక పాలనాధికారి.‘‘కాదు మహాప్రభో తమ ఆశ్రితుడిని’’ అన్నాడు ఆ అనామకుడు.‘‘విద్యానగర పౌరుడివేనా?’’ అడిగారు మహామంత్రి.‘‘ప్రభువులు అనుగ్రహిస్తే అవుతాను. నియోగి బిడ్డను, ఎందుకు వినియోగించినా వినియోగపడతాను’’ అని తెలివిగా సమాధానం ఇచ్చాడు అనామకుడు.

‘‘ఎవరివయ్యా నువ్వు?’’ అని  అక్కడ ఎవరో అడిగారు.తాను కృష్ణా తీరం నుంచి వచ్చాను అని, తండ్రి పేరు గార్లపాటి రామన్న మంత్రి అని చెప్పాడు ఆ యువకుడు.‘‘నువ్వు ఈ సమస్యను పరిష్కరించగలవా?’’ అడిగారు మహామంత్రి.‘‘తమకు అభ్యంతరం లేకుండా పరిష్కరిస్తాను’’ అని రంగంలోకి దిగాడు రామన్నగారి కుమారుడు.‘‘పదిహేడు ఏనుగు బొమ్మలు  తెప్పించండి’’ అని అడిగాడు.అలాగే పదిహేడు ఏనుగు బొమ్మలు అతని దగ్గరకు తెచ్చారు.‘‘ఈ పదిహేడు ఏనుగుల్లో రాజుగారి ఏనుగును చేర్చడానిక మీకు ఏమైనా అభ్యంతరమా?’’ అని అడిగాడు.‘‘చేర్చడానికి వీల్లేదు. పంచేవి పదిహేడే’’ అన్నారు ఒక ధర్మాధికారి.‘‘నేను పంచేది కూడా పదిహేడే స్వామి’’ అన్నాడు యువకుడు.సభాసదులలో ఆసక్తి అంతకంతకూ  పెరిగిపోయింది.‘ఇతడు ఏం చేయబోతున్నాడు?!’‘‘ఇక్కడ ఉన్నవి  ఎన్ని ఏనుగులు?’’ అని అడిగాడు యువకుడు.‘‘పదిహేడు’’ అన్నాడు అక్కడ ఉన్నవారిలో ఒకడు.‘‘పదిహేడు కాదు రాజుగారి ఏనుగుతో కలిపి, వెరసి పద్దెమినిది. ఇందులో సగం పాలు పెద్దవాడికి...ఈ తొమ్మిది తీసుకో...రెండో వాడికి మూడో వంతు...అనగా ఆరు...మూడో వాడి పాలు రెండు...ఇక మిగిలింది శ్రీవారి ఏనుగు. ఇది వారి పాలు’’ అని జటిలమైన సమస్యను నిమిషాల్లో తీర్చేశాడు ఆ యువకుడు.‘‘శబ్భాష్‌’’ అన్నారు మెచ్చుకోలుగా రాయలవారు.ఆనందంగా ఇంటికి వచ్చాడు ఆ యువకుడు.‘‘ఆహా, రాయలవారిది ఇంద్రవైభవం కమల’’ అన్నాడు భార్యతో.‘‘ఆదరించారా?’’ అడిగింది ఆమె.‘‘అన్నాక తప్పుతుందా! వారు మహారాజు, మనల్ని కవిరాజుని చేసేశారు. మహామంత్రి అప్పాజీగారు, మా నాన్నగారు ఒకే గురువు శిష్యులట! ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. మనకు మంచి భవనం కూడా ఏర్పాటు చేస్తానన్నారు. రేపటి నుంచి మన కాపురం అక్కడే’’ అని సంతోషంగా  చెప్పుకుపోతున్నాడు యువకుడు.
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top