రేపొద్దున్న  నీ కొడుకు డాక్టరైతే...

Seen is yours title is ours - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’ అని చెప్పిన ఈ సినిమాలో పదునైన డైలాగులు ఉన్నాయి. కంటతడి పెట్టించే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సిల్వర్‌జూబ్లీ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం...

చెప్పాపెట్టకుండా పట్నం నుంచి ఊడిపడ్డ  కొడుకు ఆనంద్‌ను చూసి...‘‘అదేంట్రా ఇలావచ్చావు? ఉత్తరం ముక్కయినా రాయలేదు’’ అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ.‘‘అది కాదమ్మా’’ అని  ఆనంద్‌  ఏదో చెప్పబోతుండగానే రంగయ్య ఇలా విసురు విరిశాడు...‘‘ఆ... ఏముంది. రాసి ఉంచుకున్న ఉత్తరాలన్నీ అయిపోయి ఉంటాయి. అందుకనే సరాసరి వాడే వచ్చేశాడు’’‘‘మీరు ఊరుకుందురూ... ఎప్పుడు బయలుదేరాడో ఏమో పదబాబూ స్నానం చేసిరా... భోజనం చేద్దువుగానీ’’ అని కొడుకు వైపు మురిపెంగా చూసింది సీతమ్మ.అందరూ భోజనాలకు కూర్చున్నారు.సీతమ్మ కొడుక్కి కొసరి కొసరి వడ్డిస్తోంది.‘‘వద్దమ్మా చాలు’’ అంటున్నాడు ఆనంద్‌.‘‘వద్దంటే ఎలారా? బావకు ఇష్టమని ఎంతో రుచిగా చేసింది సుగుణ’’ అన్నది సీతమ్మ.సుగుణ బావ ఆనంద్‌ను ఆశ్చర్యంగా చూస్తూ...‘‘అత్తయ్యా చూశావా! బావ ఇదివరలా ములక్కాడలు శుభ్రంగా నమిలి తినడం లేదు. ఇప్పుడు చూడు అసలు తినడమే మరిచిపోయాడు’’ అంటూ బావ వైపు జాలిగా చూసింది సుగుణ.‘‘అది మరిచిపోవడం కాదమ్మా... ఫ్యాషను ఫ్యాషను. ఇదేం చూశావు. పట్నంలో చూడాలి సోకు. ముష్ఠోడికి కాణీ ధర్మం చేయడానికి మనసొప్పదుగానీ హోటళ్లో సగం ఇడ్లీ తిని సగం పారేస్తారు. ఫ్యాషను  ఫ్యాషను’’ అని పట్నపు పోకడలను వెక్కిరించాడు రంగయ్య.

‘‘హోటలు కూడు నీకు కూడా వంటబట్టినట్లుందే’’ కొడుకు వైపు చిలిపిగా చూస్తూ అన్నది సీతమ్మ.‘‘రేపొద్దున్న నీ కొడుకు డాక్టరైతే మనమంతా హోటల్‌ కూడు తినాల్సిందే’’ అన్నాడు రంగయ్య పళ్లెంలో చారు పోసుకుంటూ.‘‘ఏ... ఎందుకు?!’’ అని ఆశ్చర్యపోయింది సీతమ్మ.‘‘మీరంతా వంట చేసి కందిపోతారేమోనని’’ అన్నాడు రంగయ్య. ఆయన భారీ మీసాల మీద వ్యంగ్యం సన్నగా మెరిసింది.ఆ తరువాత అసలు విషయంలోకి వచ్చి...‘‘ఆ... తమరు ఎందుకొచ్చినట్లో?’’ కొడుకు వైపు చూస్తూ అడిగాడు రంగయ్య.‘‘కన్నకొడుకుని పట్టుకొని ఏమిటండీ ప్రశ్న?’’ మూతి మూడిచింది సీతమ్మ.‘‘పిచ్చిముఖమా! వాడు ఉత్తినే రాలేదే...ఏదో పెద్ద మొత్తం పట్టడానికి వచ్చి ఉంటాడు’’ కొడుకు రాకలోని మర్మం గురించి చెప్పకనే చెప్పాడు రంగయ్య.‘పెద్ద మొత్తం’ అనేమాట వినబడగానే...‘‘ఆ... వాడు తినడానికా!’’ అన్నది సీతమ్మ.‘‘ఆ మాట నేనన్నానా’’ అని బదులిచ్చాడు రంగమ్మ.‘చిన్నమొత్తమైనా... పెద్ద మొత్తమైనా అది చదువు కోసమే కదా... జల్సాలకు కాదు కదా’ అనేది ఆ పిచ్చితల్లి ఉద్దేశం.‘‘అసలు నేను కాలేజీ మానాలనుకుంటున్నాను’’ బాంబు పేల్చాడు ఆనంద్‌.‘ ఏ ఎందుకని?’’  కన్నెర్ర చేశాడు రంగయ్య.‘‘మిమ్మల్ని ఈరకంగా బాధ పెట్టడం ఇష్టం లేక’’ ముఖం అదోరకంగా పెట్టి అన్నాడు ఆనంద్‌.‘‘మరి ఇన్నాళ్లు చదివిన చదువు ఏంకావాలి?’’ అమాయకంగా అడిగింది సీతమ్మ.

‘‘వాడి కోసం చదువుతున్నాడా! నాకు డబ్బు ఎక్కువై చదివిస్తున్నాను’’ అని ఆనంద్‌కు వేడి వేడి చురక అంటించి భార్యను చూస్తూ బాధగా అన్నాడు...‘‘మన సాధకబాధకాలు వాడికి తెలిస్తేగా’’ భర్త కోపం కట్టలు తెంచుకుంటుంది అని గ్రహించిన సీతమ్మ...‘‘అబ్బా! మీరుండండీ’’ అంది.‘‘లేకపోతే ఏంటే వాడు మాట్లాడేది? ఉత్తరం రాయడం పాపం డబ్బులు పంపిస్తూనే ఉన్నాంగా. ఇబ్బంది పెట్టింది ఎప్పుడని!’’ కోపంతో ఊగిపోయాడు రంగయ్య.‘‘మీరు పంపేది కాలేజీ ఫీజులకీ, పుస్తకాలకే సరిపోతుంది. ఇంకా ఏం అక్కర్లేదా ఏంటి?’’ అంటూ మూతిముడిచాడు ఆనంద్‌.‘‘ ఏం కావాలో చెప్పరాదు?’’ అనే ప్రశ్న తండ్రి నోటి నుంచి రాగానే....‘‘తోటివాళ్లంతా స్కూటర్లు, కార్ల మీదే వస్తారు. ఎప్పుడూ సూట్‌ల మీదే ఉంటారు’’ అడగకుండానే  ఆశించేదాని గురించి అడగానే అడిగాడు  ఆనంద్‌.‘‘వాళ్లంతా లక్షాధికారులురా’’ అనే ఒక్క మాటతోనే కొడుకు నోరు కట్టేసే ప్రయత్నం చేశాడు రంగయ్య. ఆనంద్‌ ఊరుకుంటేగా!‘‘కనీసం సూటు కుట్టించుకునే స్థోమత కూడా లేనప్పుడు చదవడం దేనికి?’’ అన్నాడు.చదువు అనేది సూట్లు కుట్టించుకోవడం కోసమే అన్నట్లు!ఇదే మాట రంగయ్య అన్నాడు...‘‘ఏరోయ్‌ పెద్దోళ్లతో తిరుగుతున్నావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు! మన స్థితి  ఏంటో తెలుసుకో. సూట్లు బూట్లు వేసుకుంటేనే కాదురా చదువు... బుర్ర ఉండాలిరా బుర్ర’’ తింటున్న అన్నాన్ని మధ్యలోనే వదిలేసి కోపంగా లేచాడు రంగయ్య. తండ్రి లాగే తాను కూడా భోజనం మధ్యలోనే లేవబోయాడు ఆనంద్‌.‘‘ఒరేయ్‌ ఏంట్రా ఇది? అన్నం తినకుండా లేస్తావా? నీ ముందు అలా అంటారేగానీ నీ గురించి ఎంత మురిసిపోతారో తెలుసా! తిను నాయనా తిను’’ అంటూ కొడుకు అలక మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేసింది సీతమ్మ. ఒకవైపు రంగయ్య కోపంతో గుర్రుమంటున్నాడు. మరోవైపు దిగులు ముఖంతో మంచంపై కూర్చున్నాడు ఆనంద్‌.ఈ పరిస్థితి చూసి...‘‘డబ్బు ఏమైనా సర్దుబాటు అవుతుందేమో... అలా తులసమ్మ ఇంటి వరకు వెళ్లొస్తా’’ అని  ఉన్నపళంగా బయటికి నడిచింది సీతమ్మ.
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top