సాయి యోగ్యశక్తి

The power of shirdi sai - Sakshi

షిర్డీ గ్రామంలో ఏ రోజుకారోజు సాయి స్వయంగా అందరు అంగడులవారి వద్దకి వెళ్లి, మసీదులో, మరికొన్ని ప్రదేశాల్లో దీపాలని వెలిగించవలసి ఉందని చెప్పి నూనెని అడగడం చేస్తుండేవాడు. అందరూ కూడా సాయి గొప్పదనాన్ని విని ఉండటం, చూస్తూ ఉండటం కారణంగా ఎవరూ కాదనకుండా యథాశక్తి నూనెని దీపాల నిమిత్తం ఇస్తూనే ఉండేవాళ్లు. అంతా సవ్యంగా జరిగిపోతూ ఉంటే చెప్పుకోవాల్సిందంటూ ఏముంటుంది? సాయి అంటే కిట్టనివాళ్లు కొందరు పగ అనే వత్తిని, ద్వేషమనే నూనెలో తడిపి, వ్యతిరేకత అనే దీపాన్ని వెలిగించారు అంగడిదారుల బుద్ధులందరిలో. అంతే! ఎవ్వరూ కూడా నూనెని సాయికి ఇవ్వరాదని తీర్మానించుకున్నారు. ‘అంతమంది భక్తులొస్తున్నారుగా!? అందరిలో ఎవరో ఒకరితోనో, లేదా అందరితోనో నూనెని ఏర్పాటు చేసుకోలేడా?’ అని కొందరు, ‘అయినా మసీదులో కిరసనాయిలతో వెలిగే లాంతర్లు ఉండగా, ఈ నూనె దీపాలని కూడా వెలిగించాల్సిన అవసరమేమిటి?’ అని ఇంకొందరు, ‘ఇదంతా కాదు. మసీదేమిటి? హిందూ ఆచారం ప్రకారం నూనె దీపాలు వెలిగించడమేంటి?’ అని మరికొందరు మాట్లాడుకోసాగారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు అనుకుని, సాయికి నూనె ఇవ్వరాదని తీర్మానించుకున్నారు.

ఎప్పటిలానే సాయి నూనె కోసం వస్తే, వ్యాపారస్థులంతా ముభావంగా ఉండటం, ముఖం తిప్పుకోవడం, అయిష్టంగా ఇవ్వదలచడం, రేపటిరోజున రండి అనడం వంటివేం చెయ్యలేదు. ముఖానే చెప్పారు ఇవ్వడం సాధ్యంకాదని. ఇలాంటి అకస్మాత్‌ వ్యతిరేకతకు సాయి ఏ మాత్రం దుఃఖపడలేదు. వ్యతిరేకత సామూహికమైనందుకు అశ్చర్యపడలేదు. తన మసీదుకి తిరిగొచ్చేశాడు. తన దగ్గరున్న డబ్బాలో అట్టడుగున ఉన్న నూనెలో నీటిని పోశాడు. కలియదిప్పాడు డబ్బాని. ఆ నూనె, నీరు కలిసిన మిశ్రమాన్ని తాగి ఊశాడు. ఆ మీదట నిండుగా నీటిని డబ్బాలో నింపాడు. ఆ నీటినే వత్తులు ఉన్న ప్రమిదల్లో నిండుగా పోశాడు. ఎవరికీ ఏం అర్థంకాని స్థితిలో నూనె దీపాలులాగానే వాటిని క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వెలిగించసాగాడు. అలా వెలిగిన నీటి దీపాలు రాత్రి రాత్రంతా కాంతిని ఇస్తూనే, వెలుగుతూనే ఉండిపోయాయి. ఇది అందరూ చూస్తుండగా జరిగిన కథ కాదు, చరిత్ర.

విశ్వనిర్మాణ రహస్యం
ఏదైనా ఒక వస్తువు మరమ్మతుకి గాని వస్తే దాన్ని బాగు చేయవలసిన వానికి, ఆ వస్తువుకి సంబంధించిన, మొత్తం నిర్మాణానికి సంబంధించిన అంత సమాచారం ఎలా తెలిసి ఉండాలో, అదే తీరుగా విశ్వంలో జరిగిన ఈ విచిత్రానికి సంబంధించిన నిజానిజాలు తెలియాలంటేనూ, దాన్ని వివరించి చెప్పాలంటేనూ ఆ విశ్వానికి సంబంధించిన నిర్మాణ రహస్యం తెలిసి ఉండి తీరాల్సిందే కదా! ఆ దృష్టితో చూస్తే పృధ్వి – అప్‌ – తేజస్‌ – వాయు – ఆకాశం అనే ఐదింటితో ఈ జగత్తు ఏర్పడింది కాబట్టే దీన్ని ‘ప్ర–పంచము’ (ఐదింటి సమాహారం) అన్నారు. ఇది బ్రహ్మ చేత నిర్మింపబడింది కాబట్టి, బ్రహ్మకి మాత్రమే దీన్ని సృష్టించే అధికారాన్ని ఇచ్చారు కాబట్టి దీన్ని బ్రహ్మా+అండము ‘బ్రహ్మా అనే దీర్ఘం చివర ఉంటే పురుషుడైన బ్రహ్మ’ అని అర్థం. అదే ‘బ్రహ్మ+అండము’ అన్నట్లయితే స్త్రీ పురుష భేదం లేని బ్రహ్మపదార్ధమనే అర్థం వస్తుంది. ఈ జగత్తుని సృష్టించగల అధికారాన్ని పురుషుడైన బ్రహ్మే పొందాడు కాబట్టి ‘బ్రహ్మా+అండము’ అనేదే సరైన పదవిభాగం. అలాంటి బ్రహ్మ చేత సృష్టించబడిన ‘అండం’ ( స్త్రీయో, పురుషుడో తెలియని స్థితిలో ఉండే ముద్ద – ప్రాణియో, అప్రాణియో తెలియని స్థితిలో ఉండే ముద్ద) కాబట్టి దీన్ని బ్రహ్మాండము అన్నారు.

ఈ బ్రహ్మాండమే జగత్తంతా. దీనికి సరైన పోలికతో ఉండేది మనం. మనందరం తల్లి గర్భంలో ఉన్న పిండం నుంచి పుట్టాం కాబట్టి మనం ‘పిండాండం’ నుంచి పుట్టినవాళ్లం. బ్రహ్మాండానికి ఎలా పంచభూతాలు సహకరించాయో అలాగే పిండాండానికి కూడా పంచభూతాలు సహకరించి ఉన్నాయి. అంటే బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాలు, పిండాండంలో కూడా ఉండనే ఉన్నాయన్నమాట! బ్రహ్మాండంలోని ‘పృ«థ్వి’ మనకి కన్పించే నేల. పిండాండం అంటే మనలో పృ«థ్వి మన శరీరంలో ఉన్న మాంసం, మజ్జ అనేవి. బ్రహ్మాండంలోని ‘అప్‌’ మనకి కన్పించే నదులు, సముద్రాలు అన్నీను. పిండాండం అంటే మనలో ‘అప్‌’ మన శరీరంలోన ఉన్న నీరు. రక్తంలో ఎక్కువశాతం నీరే. బ్రహ్మాండంలోని ‘తేజస్‌’ (వేడిమి) మనకి కన్పించే సూర్యుని ఉష్ణత. పిండాండంలో కన్పించే ‘తేజస్‌’ మన శరీరంలో ఎప్పుడూ ఒకేలా ఉండే 98.4 డిగ్రీల వేడిమి. బ్రహ్మాండంలోని ‘వాయువు’ మనకి అనుభవంతో కన్పించే వాయువు. పిండాండంలో అంటే మన శరీరంలో (5+5) దశవిధాలైన వాయువులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన మొదలైనవి ఉన్నాయి.

బ్రహ్మాండంలోని ‘ఆకాశం’ మనకి కన్పిస్తున్నట్లుగా ఉంటూ ఎంత దూరం వెళ్లినా కన్పించని శూన్యమైన పదార్థం. ఇక పిండాండంలో ఉండే ఆకాశమంటే అనుభవంలో కన్పిస్తూ ఎవరూ చూడడానికి అవకాశం లేని మనస్సు. ఇలా బ్రహ్మాండ – పిండాండాలు అనే రెండూ పరస్పరం సమానంగా ఉంటూ రెంటి స్వభావం, స్వరూపం ఒకటే అయినా ఆ రెండూ వేర్వేరుగానే ఉంటాయి. ఒకటిగా ఉండలేవు. ఉండవు. ఇదంతా ఎందుకంటే ఈ పంచభూతాలు పైకి వేర్వేరుగా కన్పిస్తున్నా అన్నీ ఆకాశం నుంచి వచ్చాయని చెప్పడానికి. తద్వారా నీటిని గురించిన, అలాగే అగ్నిని గురించిన తత్వాన్ని తెలుసుకుని నీటిలో అగ్నితనం ఎలా ఉంటుందో నిరూపించడానికీను. ఆకాశాద్వాయుః – ఆకాశం నుండి వాయువు పుట్టింది. ‘గాలి బిగదీసింది’ అంటూ ఉంటాం. అంటే ఆకాశం ఆ సమయంలో తన శూన్య ప్రదేశం నుండి వాయువుని విడుదల చేయడం లేదని అర్థమన్నమాట. అంతే కాక వాయువెప్పుడూ శూన్యం నుండే వస్తుందని కూడా భావమన్నమాట. వాయో రగ్నిః – ఇలా వచ్చిన వాయువు నుండే అగ్ని పుట్టిందని దీనర్థం.

ఇదేమిటి? ఎక్కడైనా నిప్పుంటే ఆ సమయంలో గాలి బలంగా వీస్తే నిప్పు ఆరిపోతుందిగా!? అని అనుకుంటాం మనం. నిప్పు ఆరిపోవాలన్నా, బాగా రాజుకుని నిప్పు మరింతగా పెరిగి, తన ప్రతాపాన్ని చూపాలన్నా వాయువు వీచినప్పుడే అని అనుకోం. దానికి కారణం సాధారణమైన దృష్టితో ఆలోచించడమే. లో–దృష్టితో పరిశీలించకపోవడమే!!అగ్నే రాపః – ఆ అగ్ని నుంచి నీరు పుట్టిందని దీనర్థం. ఇదేమిటి? ఇది మరీ వింతగా ఉంది! అనిపిస్తుంది. అగ్ని అనేది నీటిని వేడి చేస్తుంది. అలాగే నీరు అనేది నిప్పుని ఆర్పుతుంది. అంతేతప్ప అగ్ని నుండి నీరు పుట్టడమేమిటి? అన్పిస్తుంది. దీనికి కూడా కారణం సాధారణ దృష్టితో మాత్రమే చూడడం. లో–దృష్టి పెట్టాలనే ఆలోచన కూడా లేకుండా ఉండడమూనూ. అబ్‌భ్యః – పృధ్వి అలాంటి నీటి నుండి నేల పుట్టిందని దీనర్థం. ఎక్కడైనా నేల అనేది కణాలు కణాలుగా ఉంటే ఆ భూకణాలని తొలగించడానికి దూరంగా నెట్టివేయడానికీ నీటిని వాడతాం తప్ప నీటి నుండి భూమి ఎలా పుట్టే వీలుంది? అన్పిస్తుంది.

దీనికి కూడా సమాధానం సాధారణ దృష్టితో ఆలోచించడమే తప్ప లో–దృష్టిని పెట్టకపోవడమే అనేదే. అంటే ఏమన్నమాట? నీటితో దీపాల్ని వెలిగించడం వంటి అనూహ్యమైన, ఎన్నడూ వీలుకాని సంఘటనలని విన్నట్లయితే, చూసినట్లయితే సాధారణ దృష్టితో కాకుండా లో–దృష్టితో పరిశీలించి తీరాల్సిందే అని దీని భావమన్నమాట! మరొక్క మాటని అనుకుని సమాధానాన్ని తెలుసుకుందాం! మన శరీరానికి నవ(9) రంధ్రాలున్నాయి. రంధ్రం అంటే కన్నం లేదా చిల్లు అని కదా అర్థం. మరి ఈ తొమ్మిదింటి నుంచి శరీరంలోకి మనం నీటిని పంపినా, అన్నాన్ని పంపినా, మరి దేన్ని తిన్నా వెంటనే అన్నీ కన్నాల నుండి లేదా ఏవో ఒకటో రెండో కన్నాల నుంచి బయటికొచ్చేయాలి కదా! అనుకుంటాడు సామాన్య దృష్టి మాత్రమే ఉన్నవాడు. సహజంగా పిల్లలు ఈ ప్రశ్నని చిన్నపిల్లలు అడిగే ఉన్నారు కదా! దాన్ని వివరించి చెప్తేగదా వాడు ఆ రోజున అర్థం చేసుకోగలిగాడు!

ఇదే తీరుగా పంచభూతాల్నీ వివరించుకోకుండా (అసందర్భం అవుతుంది కాబట్టి) నీటిని గురించి మాత్రమే అనుకుందాం! నీరు అనేది ‘అగ్నేరాపః’ నిప్పునుంచి పుట్టిందే. అయితే ఈ నీరు నిప్పుని ఆర్పగల శక్తితో కన్పిస్తోంది. లౌకికంగా ముందు ఒక సమాధానాన్ని చూద్దాం! నీటిని బాగా వేడి చేశాం. వేడి నీళ్లు అయ్యాయి. మనం ముట్టుకుంటే మన శరీరభాగం కాలేంతటి నిప్పుదనం (ఉష్ణత) ఆ నీటికి పట్టుకుంది. అవును కదా! ఆ నిప్పుదనంతో నిండిన నీటిలోనికి నీళ్లని ఎక్కువగా పంపితే... పూర్తి ఉష్ణతని కోల్పోయి మళ్లీ చల్లబడిపోయి, వేడిమి చేయడానికి ముందు ఏ చల్లదనంతో ఉన్నాయో ఆ స్థితికే వచ్చేస్తాయి నీళ్లు. అంతే కదా! ఇప్పుడు నీళ్లు అనేవి ఎలా ఏర్పడ్డాయో ఈ ఉదాహరణతో గమనిద్దాం! నీళ్లు అనేవి రెండు వాయువుల కలయిక వల్ల ఏర్పడి వాయురూపాన్ని మార్చుకుని, ద్రవరూపాన్ని పొందాయి. వాయువులు రెండు కలిస్తే ఆ పదార్థం వాయువే కావలసి వస్తూంటే ఆ రెండు వాయువుల సమ్మేళనం ద్రవంగా (నీరు) కావడమేమిటి? ఇక్కడే ఉంది రహస్యం. పంచభూతాలు వేటికి అవిగా ఉన్నప్పుడు చెప్పుకోవలసిందంటూ ఏమీ ఉండదు.

పృధ్వి(నేల)+అప్‌(నీరు) = ప్రవాహం
అప్‌(నీరు)+ తేజస్‌(ఉష్ణత) = వేడి నీరు
తేజస్‌(ఉష్ణత)+ వాయువు(గాలి) = వేడిగాలి(గాడుపు)
వాయువు + ఆకాశం = శూన్యం (కన్పించని ఆకాశం)
ఇదే తీరుగా ఉష్ణతని కలిగించే శక్తి ఉన్న వాయువు (ఆక్సిజన్‌) మరో ఉష్ణత ఏమాత్రం ఉండని వాయువుతో (హైడ్రోజన్‌) కలిసినట్లయితే ఆ రెంటి సంయోగం ‘నీరు’గా మారుతుంది.
(ఏ2+ౖ2  ఏ2ౖ అని తీర్మానించారు విజ్ఞాన శాస్త్రజ్ఞులు).

పైన చెప్పుకున్న ఉదాహరణలో వేడిగా ఉన్న నీళ్లలో చన్నీళ్లని అతిమాత్రంగా కలిపితే ఎలా ఆ వేన్నీళ్లు కాస్తా చల్లబడిపోతాయో, అలా ఈ ఉష్ణత కలిగిన గాలి(ఆక్సిజన్‌) అలాగే ఉష్ణతలేని గాలి(హైడ్రోజన్‌) అనే రెంటి సంయోగంలో తీవ్రమైన ఉష్ణతకల వాయువు (ౖ2 లేదా ఆక్సిజన్‌) అనేది మరింత స్థాయి కలిగినదైన పక్షంలో నీరుగా కన్పిస్తున్న ఈ పదార్థానికి మండించగల శక్తి మాత్రమే ఎక్కువ అయి, ఆ నీరు దేన్నైనా మండించగలిగిందిగా అయిపోతుంది. ఇది నిజం కాబట్టే సాయి ఎప్పుడైతే నీటిని తెచ్చాడో, ఆ నీటిలో మండించగల ఉష్ణతాశక్తిని తన యోగశక్తితో పెంపొందేలా (అభివృద్ధి అయ్యేలా) చేసాడో వెంటనే ఆ నీరు తనలోని చల్లదనాన్ని కోల్పోయి, తనలో ఉన్న రెండవదైన ఉష్ణతాశక్తి ఆధిక్యంతో ఉండిపోయింది. అంటే నిప్పుగా అయింది. గుడ్డతోనో, పత్తితోనో చేయబడిన వత్తికి ఉన్న నూనె అనేది మండే అవకాశాన్నిచ్చేది కాబట్టి, ఈ నీటిలో ఉన్న దహించే శక్తి ఆ వత్తికంటుకుని దీపంగా వెలగడం ప్రాంభించింది. అయితే ఇక్కడ ‘మరి సాయి గొప్పదనమేంముంది?’ అనుకోకూడదు. తన యోగశక్తి ద్వారా సాయి నీటిని రెండు వాయువులుగా విభజించేసి, రెండవదైన ఉదజని (హైడ్రోజన్‌) శక్తిని పూర్తిగా కోల్పోయేలా చేసి ప్రాణశక్తిని (ఆక్సిజన్‌) మరింత పెంపుచేసి ఉండడమే.

ఇలాంటిదే మరో ఉదాహరణ. శ్రీమద్రామాయణంలో ఆంజనేయస్వామి తోకకి రావణుని సేనలైన రాక్షసులు నిప్పు పెట్టారు. రావణ ఆజ్ఞకి అనుగుణంగా ఆంజనేయస్వామి ఆ తోకకున్న నిప్పుతో మొత్తం లంకని తగులబెట్టాడని చెప్పింది ఆ ఇతిహాసం. అంతవరకూ బాగానే ఉంది. మరి నిప్పుకి కాల్చివేయడమనేది లక్షణం కాబట్టి, ఆ ఆంజనేయస్వామి తోకకి ఉన్న నిప్పు లంకాజనాన్ని మంటలకి గురి చేసి చంపినట్లే. ఆంజనేయస్వామి శరీర భాగాలకు కూడా వ్యాపించి ఎందుకు ఆంజనేయుడ్ని గాయపరచలేదనేది ప్రశ్న కదా! సాయి కథలో నీటి నుండి నిప్పు కన్పిస్తూంటే, ఆ నిప్పుద్వారా వత్తులన్నీ మండి వెలుగుతుంటే, ఇక్కడ నిప్పులోని నిప్పుదనం(ఉష్ణత) లేకుండా ఆంజనేయునికి చల్లదనం గోచరించడమేమిటి? ఇక్కడ కూడా లోతుగా ఆలోచిస్తే తప్ప సమాధానం దొరకదు. దొరికినా మరింత లోతుగా భావిస్తే తప్ప ఆ సమాధానం అర్థం కాదు. నీటికుండే లక్షణం చల్లదనం. (శీతస్పర్శవత్య ఆపః) అలాగే నిప్పుకుండే లక్షణం ఉష్ణత. (ఉష్ణస్పర్శవత్తేజః) నీటికుండే చల్లదనాన్ని వేడిగా మార్చి దీపాలని వెలిగేలా చేస్తే, సీతమ్మ తన మంత్రశక్తితో అగ్నికుండే ఉష్ణతని చల్లబరిచింది.

రెంటికీ ఎంత సామ్యముందో గుర్తించగలగాలి. గుర్తుంచుకోగలగాలి కూడా! ఏ చల్లదనమనేది లేని పక్షంలో దాన్ని నీరు అనమో, ఏ ఉష్ణత లేని పక్షంలో దాన్ని అగ్ని అనమో, చల్లదనమనేది నీటితో కలిసి మాత్రమే ఉంటుందో అలాగే వేడితనమనేది నిప్పుతో కలిసి మాత్రమే ఉంటుందో అలా కలిసి ఉన్న రెంటిలో నుంచి ఒకదాన్ని వేరు చేయడమనేది మంత్రశక్తితోనే సాధ్యం! ఆ మంత్రశక్తి అనేది దేవతల్లో ఉంటే ఆ దేవతలని ప్రార్థించి ప్రార్థించి ఉన్న కారణంగా ఆ తపస్సు శక్తే వ్యక్తుల్లో యోగశక్తిగా మారుతుంది. ఆ యోగశక్తి ఉన్న వ్యక్తి యోగిగా మారుతాడు. తనకున్న ఆ యోగశక్తి కారణంగానే ఇలాంటి లోకాతీతమైన కొన్నింటిని చేయగలుగుతాడు. శంకరాచార్యులవారు రాసిన సౌందర్యలహరిలో ఓ శ్లోకం (మహీం మూలాధారే..)లో యోగశక్తి గురించి మరింత వివరంగా కన్పిస్తుంది. మూలాధార చక్రాన్ని బాగా ఉపాసించినట్లయితే భూమిలోపల దాగి ఉండగల శక్తిని సాధకుడు సంపాదించగలడట. కపిల మహర్షి అలాగే తపస్సు చేస్తూ ఉండిపోయాడు.

సగరుని పుత్రులైన అరవై వేల మందిని భస్మం చేసింది ఆ యోగశక్తితోనే. అలాగే మణిపూరక చక్రాన్ని బాగా ఉపాసించినట్లయితే నీటిని గురించిన మహాశక్తిమంతుడవుతాడు. దాంతో నీళ్లలో దాగి ఉండగలుగుతాడు. దుర్వాసో మహర్షి అలాగే తపస్సు చేసి ఆ యోగశక్తితోనే అంబరీషుని మీదికి కృత్య అనే రాక్షసిని పంపగలిగాడు. ఇదే తీరుగా మిగిలిన ఐదు చక్రాలనీ కూడా ఉపాసించినట్లయితే.. ఆయా లోకాతీత శక్తులు లభిస్తాయి ఉపాసించినవారికి. సాయి ఎవరితో మాట్లాడుతూ ఉన్నట్లు కన్పించినా నిరంతరమైన తన ఏకాగ్రతతో కూడిన ఉపాసన సాగిపోతూనే ఉంటూ ఉండేది. కాబట్టి అన్ని శక్తులు ఆయనకి లభించాయి. అంతటి శక్తిమంతుడు కాబట్టే కుల, మత, వర్గ, స్త్రీ, పురుష, బాల, వితంతు... వంటి భేదాలు ఆయనకి లేనే లేవు. అంతే కాక ఉరుసు – శ్రీరామనవమి జెండా ఉత్సవం, చందనోత్సవం వంటి ఈ ఆ మతాలకి సంబంధించిన పండుగలన్నీ ఆయనకి ఒకటిగానే అన్పించాయి, కన్పించాయి. మనకి మనం, అలాగే మన పక్కనున్న మరో కొంతమంది మాత్రమే కన్పిస్తాం గానీ పర్వతమెక్కిన వారికి అందరం కన్పిస్తాం! దాన్నే సమదృష్టి, సరైన దృష్టి అంటారు.

- డా. మైలవరపు శ్రీనివాసరావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top