ఆటోమొబైల్‌ ఆణిముత్యం!

ఆటోమొబైల్‌ ఆణిముత్యం!


మన దిగ్గజాలు



కుటుంబం నుంచి అందిపుచ్చుకున్న వారసత్వానికి తనదైన కృషి, తెలివితేటలను జోడించి వ్యాపారంలో విజయపతాకను ఎగరేసిన తొలితరం మహిళా వ్యాపారవేత్తల్లో ఎన్నదగిన వారు ‘టాఫే’ చైర్మన్‌ మల్లికా శ్రీనివాసన్‌. మహిళలు కొన్ని రంగాలకే పరిమితమనే మూస భావన ను తోసిరాజని ట్రాక్టర్ల వ్యాపారంలో తనదైన ముద్ర వేశారు మల్లిక.1959 లో చెన్నైలో జన్మించారు. తండ్రి ఎ. శివశైలం. ద అమాల్గమేషన్‌ గ్రూపు సార థి. మల్లికకు కష్టం అంటే తెలియకుండా సుకుమారంగా పెంచారాయన. మల్లిక మద్రాస్‌ యూనివర్శిటీ నుంచి ఎం.ఎ. చదివారు. అర్థశాస్త్రంలో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. 1982లో నెలల వయసున్న కూతురును వదలి అమెరికా వెళ్లి వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎం.బి.ఎ. పూర్తిచేశారు. చిన్నతనం నుంచి యంత్రాలు, వ్యవసాయ పరికరాలంటే మల్లికకు అమితమైన ఆసక్తి. ఆ ఆసక్తితోనే 1986లో ‘టాఫే’ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆమె వయసు 26 ఏళ్లు. ఒక మహిళ జీఎంగా బాధ్యతలను చేపట్టటం చూసి పోటీదారులు విస్తుపోయారు.



రైతుల నుంచి పాఠాలు...

మల్లిక జనరల్‌ మేనేజర్‌ హోదాలో ఏసీ క్యాబిన్‌కు పరిమితం కాలేదు. ట్రాక్టర్లను కొనుగోలు చేసేటప్పుడు అందులో ఏ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారో తెలుసుకోవటానికి పొలాలకు వెళ్లి రైతులను కలిసేవారు. దీంతోపాటు కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భారతీయ రైతుల అవసరాలకు తగ్గట్టు మలచారు. రష్యా, స్విట్జర్లాండ్‌ దేశాల్లో పర్యటించి అక్కడి ట్రాక్టర్‌ కంపెనీలను సందర్శించి సాంకేతిక సహాయాన్ని పొందారు. తొలిసారిగా వినియోగదారుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిజైన్లలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి దించారు. ధరలు పెరగకుండా చూశారు. దీంతో కంపెనీ ఆదాయం రూ. 85 కోట్ల నుంచి 2004 కల్లా రూ. 1200 కోట్లకు చేరింది. 2006లో ఐషర్‌ మోటార్స్‌కు చెందిన ఇంజిన్, గేర్, ట్రాక్టర్‌ విభాగాలను రూ. 310 కోట్లకు టాఫే కొనుగోలు చేసింది. దీంతో ఉత్తర భారతదేశంలోను ‘టాఫే’ వాటా పెరిగి దేశంలో రెండో అతిపెద్ద ట్రాక్టర్‌ కంపెనీగా ఎదిగింది. అమెరికా మార్కెట్లోను అడుగుపెట్టింది.



‘టాఫే’ అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు మల్లిక. తను బాధ్యతలు చేపట్టిన 20 ఏళ్లకు ‘టాఫే’ ను దేశంలోనే రెండో పెద్ద కంపెనీగా నిలిపారు. ఇప్పటికీ ఏమాత్రం ఖాళీ సమయం చిక్కినా పొలాలకు వెళ్లి రైతుల అవసరాలను స్వయంగా తెలుసుకుంటారు. సిబ్బందితో చర్చిస్తారు. 2010లో లక్షన్నర ట్రాక్టర్లను విక్రయించటమే గాక టాఫే బిలియన్‌డాలర్ల క్లబ్‌లో చేరింది.›డీజిల్‌ ఇంజిన్లు, బ్యాటరీలు, గేర్లు, హైడ్రాలిక్‌ పంపుసెట్లు వంటి పలు వ్యవసాయ అనుబంధ యంత్రాల తయారీకి మల్లిక ముందుచూపుతో వ్యాపారాన్ని విస్తరించారు. దీంతో రూ. 85 కోట్ల ఆదాయం కాస్తా ప్రస్తుతం రూ. 10 వేల కోట్లకు చేరింది. ‘టాఫే’ ప్రస్తుతం 100కు పైగా దేశాలకు ట్రాక్టర్లను ఎగుమతి చేస్తుంది. టర్కీ, చైనాల్లో ట్రాక్టర్‌ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసింది.



సేవాకార్యక్రమాలలోను మేటి

ఒక పెద్ద సంస్థకు అధిపతైనా మరో పెద్ద వ్యాపార వేత్తల కుటుంబానికి కోడలు అయినా మల్లిక ఇంట్లో మాత్రం సాధారణ గృహిణిలానే ఉంటారు. మల్లిక భర్త టీవీఎస్‌ మోటారు కంపెనీ సీఎండీ వేణు శ్రీనివాసన్‌. 2011లో మల్లికా శ్రీనివాసన్‌ ‘టాఫే’ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వ్యాపార బాధ్యతలతో తలమునకలుగా ఉన్నా సేవా కార్యక్రమాలలోనూ తనదైన ముద్రను చాటుకున్నారామె.  పేదల కోసం చెన్నైలో పలు పాఠశాలలు, ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇందిరా శివశైలం ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి కర్ణాటక సంగీతానికి మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు.  – దండేల కృష్ణ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top