చరిత్ర అద్దంలో ‘కొండ’

Krishna Patrika Founder Freedom Fighter Konda Venkatappaiah Guntur - Sakshi

ధ్రువతారలు 

‘మనం మనస్ఫూర్తిగా కోరుకున్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్య్రయోధులలో నీతినియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతున్నది. ప్రజలు కాంగ్రెస్‌ను దూషిస్తున్నారు. బ్రిటిష్‌ రాజ్యమే మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెస్‌ అవినీతికి ఆలవాలమైపోతున్నది... పైసా ఆదాయం లేనివారు ఇప్పుడు మహారాజులలాగా పెద్దపెద్ద కార్లలో తిరుగుతున్నారు.....’

1947 డిసెంబర్‌లో, ప్రపంచ చరిత్రలోనే ఒక మహోన్నత చారిత్రక ఘట్టంగా చెప్పే స్వేచ్ఛా భారతి ఆవిర్భావం తరువాత మూడు మాసాలకే గాంధీజీకి అందిన ఒక లేఖలోని వ్యథాభరిత వాక్యాలివి. గాంధీజీకి ఇలాంటి లేఖ ఒకటి అందిందని ‘మార్చ్‌’ అనే పత్రిక పెద్ద పెద్ద అక్షరాలతో వార్తా కథనం కూడా ప్రచురించింది. ఆ వార్తకు శీర్షిక ‘కాంగ్రెస్‌ వర్స్‌ దేన్‌ ది బ్రిటిష్‌’. కాంగ్రెస్‌ పతానావస్థ గురించి అలా లేఖ రాసిన వారు కొండా వెంకటప్పయ్యపంతులు. వెంకటప్పయ్య అంటే హిందూ మహాసభ సభ్యుడేమీ కాదు. కమ్యూనిస్టు కూడా కాదు. గాంధీ మార్గాన్ని తుచ తప్పకుండా అనుసరించినవారు. ఉత్తర భారతంలో బాబూ రాజేంద్రప్రసాద్‌ వలె, దక్షిణాదిన రాజాజీ వలె, తెలుగు ప్రాంతాల నుంచి గాంధీజీకి విశ్వాసపాత్రులుగా ఖ్యాతి గాంచినవారు వెంకటప్పయ్య.

భారత జాతీయ కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధం కలిగినవారు చరిత్రలో చాలా తక్కువగా కనిపిస్తారు. దేశం కోసం ఆ సంస్థ జరిపిన పోరాటాన్ని, చివరికి స్వతంత్ర భారతాన్ని చూసిన అతి తక్కువ మందిలో కొండా వెంకటప్పయ్య ఒకరు (స్వీయ చరిత్రలో ఆయన, దానికి ముందుమాట రాసిన ప్రఖ్యాత కవి కాటూరి వేంకటేశ్వరరావు ‘కొండ వేంకటప్పయ్య పంతులు’ అనే రాయడం గమనార్హం). కాటూరి వారు ఆ ముందుమాటలో ‘గాంధీజీ పిలుపు పంతులుగారి గోపికా హృదయమునకు వేణునాదమైనది’ అని కవితాత్మకంగా చెప్పినప్పటికీ, భారత జాతీయ కాంగ్రెస్‌ (దీనిని కొండా స్వీయ చరిత్రలో ‘భారత దేశీయ మహాసభ– పేజీ 89– అని పేర్కొనడం విశేషం) మూడో సమావేశం మొదలు, 1947 వరకు ఆ సంస్థ ప్రస్థానానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచినవారాయన.

కానీ భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే కాదు, దక్షిణ భారత చరిత్రలో కూడా కొండా పేరు చాలా కొంచమే. జాతీయ కాంగ్రెస్‌తో, ఆంధ్రమహాసభతో ఆయన ఆరు దశాబ్దాల పాటు కలసి నడిచారు. అయినా చరిత్రలో ‘కొండ’ స్థానం కొంచెమే. ఇందుకు కారణం, కాటూరి వారు తన ముందుమాటలో పేర్కొన్నట్టు, ‘భోగరాజువారి ప్రజ్ఞాప్రకర్షగాని, టంగుటూరివారి సాహసరసికతగాని, కాశీనాథుని వారి వితరణవీరము గాని కొండా వారికి లేవు. అట్లయ్యు, వీటన్నిటినీ మించిన సత్యతత్పరత, ఆస్తికత్వము, వినయము, నిరంతర సేవాసక్తి, ఆత్మ వితరణము– ఇవి దేశభక్తుని సమానులలో ఉత్తమ శ్లోకుని చేసినవి.’ ఇదొక నిందాస్తుతి. చాలా అరుదుగా ‘దేశభక్త’ అన్న బిరుదు ఆయనకే దక్కింది. 

కొండా వెంకటప్పయ్య (ఫిబ్రవరి 22, 1866–ఆగస్టు 15, 1949) పాత గుంటూరులో పుట్టారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి కోటయ్య. ప్రాథమిక విద్య గుంటూరులోనే జరిగింది. తరువాత బీఏ, బీఎల్‌ మద్రాసులో చేశారు. ఈ చదువుకు కొంచెం ముందు వెంకటప్పయ్య  రాజమహేంద్రవరంలో కొద్దకాలం ఉన్నారు. అప్పుడే కందుకూరి వీరేశలింగంగారి ప్రభావంలో పడ్డారు. ఆ రోజులలో విధవా పునర్వివాహాల కోసం ఆ అభాగినులను రహస్యంగా కల్యాణవేదికల వద్దకు తీసుకురావడం ఎంత క్లిష్టంగా ఉండేదో వెంకటప్పయ్య వర్ణించారు. వీరేశలింగం ఉద్యమాన్ని ఆయన హృదయ పూర్వకంగా స్వాగతించారు. 

వెంకటప్పయ్యగారు శ్రోత్రియ కుటుంబంలో పుట్టారు. కానీ ఆయన భిన్నంగా ఆలోచించడానికి వెనుకాడేవారు కాదు. ఆ రోజుల్లో  అమెరికా నుంచి ఒక మిషనరీ వైద్యురాలు గుంటూరు వచ్చారు. ఆమె ఎంతో నిబద్ధతతో వైద్యం చేస్తూనే,  క్రైస్తవమత వ్యాప్తికీ కృషి చేసేవారు. ఒకరాత్రి వెంకటప్పయ్య స్నేహితునికి ప్రాణం మీదకు వచ్చింది. అతని తల్లిదండ్రులు ఈయనను బతిమాలి డాక్టరమ్మ వద్దకు పంపారు. వెంకటప్పయ్య సంగతి చెప్పగానే వచ్చి రోగిని చూశారామె. ఆ రోజుల్లోనే సూదిమందు కూడా ఇచ్చారు. తరువాత రోగి కోలుకోవడానికి రోజూ ఎవరో ఒకరు వచ్చి, తన సలహాను అర్థం చేసుకుని ఆ మేరకు మోతాదులు ఇవ్వగల వారు కావాలని ఆమె ఆదేశించారు. ఆ బాధ్యత కూడా వెంకటప్పయ్య గారి మీదే పడింది. రోజూ ఉదయం లేదా సాయంత్రం వెళ్లి మందు తెచ్చేవారు. అదే సమయంలో ఆ డాక్టర్‌ నివాసంలో బాలబాలికలు క్రైస్తవ ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. ఎందుకో మరి, తాను కూడా అలా ప్రార్థనలు చేయాలని, అందుకు క్రైస్తవం స్వీకరించాలని కూడా ఆ వయసులో వెంకటప్పయ్య అనుకున్నారట. కానీ విరమించుకున్నారు. ఇది కూడా స్వీయచరిత్రలోనే ఉంది. 

మద్రాసు కైస్తవ కళాశాలలో బీఏ ‘జూనియర్‌’  చదువుతూ ఉండగానే, అంటే 1887లో భారత జాతీయ కాంగ్రెస్‌ మూడో మహాసభలు ఆ నగరంలో జరిగాయి. ఆ సభల విశేషాలను చక్కగా నమోదు చేశారు వెంకటప్పయ్య. సభాధ్యక్షుడు డబ్ల్యూసీ బెనర్జీ కంచుకంఠంతో కార్యకలాపాలను నిర్వహించిన తీరు, సురేంద్రనాథ్‌ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, మహదేవ గోవింద రనడే వంటి పెద్దల సందేశాలు, మదన్‌ మోహన్‌ మాలవీయ, బిపిన్‌చంద్ర పాల్‌ వంటి యువనేతల ఆకర్షణీయమైన ఉపన్యాసాలు అన్నీ వివరించారాయన. అప్పుడే తాను జాతీయ కాంగ్రెస్‌ పట్ల అభిమానం ఏర్పరుచుకున్నట్టు వెంకటప్పయ్య స్పష్టంగానే రాశారు. 

వెంకటప్పయ్య సేవలు బహుముఖీనమైనవి. ఆనాడు కోర్టు మచిలీపట్నంలో ఉండేది. అందుకే న్యాయశాస్త్రం చదివిన తరువాత మచిలీపట్నంలో చాలాకాలం ఉన్నారు. అప్పుడే దాసు నారాయణరావుతో కలసి ‘కృష్ణాపత్రిక’ను (1902) స్థాపించారు. ఆ పత్రిక తెలుగు ప్రాంత రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలను సుసంపన్నం చేసిందంటే అది అక్షర సత్యమే అవుతుంది. కృష్ణా మండలం నుంచి గుంటూరు జిల్లాను వేరు చేసిన తరువాత ఆ జిల్లాకు వేరే న్యాయస్థానం రావడంతో, వెంకటప్పయ్య స్వస్థలం వచ్చేశారు. అప్పుడే  ‘కృష్ణాపత్రిక’ను ముట్నూరు కృష్ణారావుకు అప్పగించారు.  

బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం ఇటు భారతీయులను ఎంతగా కదిలించిందో, అటు పాలకులను కూడా తీవ్రంగానే భయపెట్టింది. అందుకే అలాంటి ధోరణులకు మళ్లీ పాల్పడలేదు. ‘ఒక్క భాష, ఒక్క సంస్కృతి గల జనులు ఏకముగా ఒక రాష్ట్రములో ఒక్క పరిపాలనలో ఉండడమే ధర్మం. అలాంటి ఐక్యత జాతి సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తుంది’ అని వైస్రాయ్‌ లార్డ్‌ హార్డింజ్‌ (1910–1916) పదవిలోకి వచ్చిన కొత్తలోనే ఒక ప్రకటన చేశారు. అప్పటికే మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ఆధిపత్యంతో తెలుగువారికి జరుగుతున్న అన్యాయాల గురించి ‘ది హిందూ’ వంటి పత్రికలు చైతన్యవంతమైన వ్యాసాలు ప్రచురించాయి. అనేక తెలుగు సంఘాలు గళం ఎత్తాయి. 1913లో ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆంధ్ర మహాసభ ఆవిర్భవించింది. 1913లో తొలి సభ బాపట్లలో జరిగింది. బీఎన్‌ శర్మ అధ్యక్షులు. ఆంధ్రుల ఆకాంక్ష  గురించి దేశమంతా తిరిగి ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసిన సంఘంలో వెంకటప్పయ్య ప్రధాన పాత్ర వహించారు.

నాటి రాజకీయ సంస్థలు ఎంత నిర్మాణాత్మకంగా ఆలోచించాయో తలచుకుంటే గుండె ఉప్పొంగుతుంది. స్వీయ చరిత్ర (పే 180)లో వెంకటప్పయ్య పొందుపరిచిన అంశమిదిః 1918లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ఏర్పడినప్పుడు తొలి కార్యదర్శిగా వెంకటప్పయ్య ఎన్నికయ్యారు. ఒకసారి గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ సభలు వెంకటప్పయ్య అధ్వర్యంలో నరసరావుపేటలో జరిగాయి. పేదలకు ఉచిత విద్యను అందించడంతో పాటు, మధ్యాహ్న భోజన వసతి కల్పించడానికి అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన ఆ సభ ద్వారానే ప్రభుత్వాన్ని కోరారు. వెంకటప్పయ్య మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. కానీ సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చిన సందర్భంలో రాజీనామా చేశారు. తరువాత అఖిల భారత కాంగ్రెస్‌ సభ్యుడు కూడా అయ్యారు.

1921లో అఖిల భారత కాంగ్రెస్‌ ప్రత్యేక సభలు బెజవాడలో జరిగాయి. వీటిని నిర్వహించడమే కాదు, వేలాది రూపాయలు వసూలు చేసి తిలక్‌ స్వరాజ్య నిధికి విరాళం కూడా ఇచ్చారాయన. తరువాత పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు కారాగారానికి వెళ్లారు. అదే ఆయన అనుభవించిన తొలి కారాగారవాసం. చరిత్రాత్మక కాకినాడ కాంగ్రెస్‌ సమావేశాలను బులుసు సాంబమూర్తితో కలసి అమోఘంగా నిర్వహించిన ఘనత కూడా ఆయనదే. 1927లో జరిగిన సైమన్‌ గోబ్యాక్‌ ఆందోళనలో, 1930 నాటి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు, 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంతో నడిచినందుకు కూడా ఆయన జైలు శిక్ష అనుభవించారు. 1937లో శాసనసభలకు జరిగిన కీలక ఎన్నికలలో వెంకటప్పయ్య మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళ, కన్నడ, కేరళ ప్రాంతాలను, తెలుగు ప్రాంతాన్ని భాష ప్రాతిపదికగా విభజించాలని సభలో ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా గెలిచింది. ఆంధ్రోద్యమం, గాంధీ ఉద్యమం, ఖద్దరు ఉద్యమం, హరిజన దేవాలయ ప్రవేశం వంటి అన్ని ఉద్యమాలు గాంధీ మార్గదర్శకత్వంలోకి వెళ్లాయి. వీటన్నింటినీ వెంకటప్పయ్య చిత్తశుద్ధితో నిర్వర్తించారు. గాంధీజీ అంటే ఆయనకు అపారమైన అభిమానం.    

‘కొండ అద్దమందు కొంచమై ఉండదా’ అని ప్రశ్నించాడు శతకకారుడు. చరిత్ర అనే అద్దంలో ఈ ‘కొండ’ కొంచెమయ్యే ఉంది. కానీ ఆ కొండ విశ్వరూపాన్ని దర్శించే అవకాశం చరిత్రకారులు మనకు ఇంకా ఇవ్వలేదనే అనాలి. భారత దేశానికి స్వాతంత్య్రం రావడం వెంకటప్పయ్య కళ్లారా చూశారు. ఆయన వ్యక్తిగత జీవితం ఏమాత్రం ఆనందదాయకం కాదు. ‘ఏ వ్యక్తి జీవితం పూర్తిగా ఆనందంతోను ఉండదు. అలా అని పూర్తిగా విషాదంతోనే సాగదు’ అంటూనే స్వీయ చరిత్ర ఆరంభమవుతుంది. తన కళ్లెదుటే తన కుమారులు ఇద్దరు కన్నుమూశారు.

తన ఆస్తిలో కొంత అమ్మేసి ఉన్నవ దంపతులు స్థాపించిన బాలికల విద్యాసదనానికి ఇచ్చారు. తన శిష్యుడు స్వామి సీతారాం కావూరులో స్థాపించన వినయాశ్రమానికి భారీగా విరాళం ఇచ్చారు. ఇలాంటి దానాలు ఇంకా ఎన్నో చేశారు. కానీ తామందరినీ దేశ స్వాతంత్య్రం కోసం ఐక్యం చేసిన మహా సంస్థ లక్ష్యసిద్ధి జరిగిన కొన్ని నెలల్లోనే చెదలు పట్టిపోవడం కూడా ఆయన చూడవలసి వచ్చింది. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. గాంధీ హత్య తరువాత సంవత్సరానికి అంటే 1949లో  దేశమంతా ఆగస్టు పదిహేను వేడుకలలో మునిగి ఉండగా, అదే రోజు వెంకటప్పయ్య ప్రాణం అనంత స్వేచ్ఛావాయువులలో కలసిపోయింది. 
 -డా. గోపరాజు నారాయణరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top