కీచైన్‌ ఉద్యమం

Keychain Funday Story On 14th July 2019 - Sakshi

కొత్త కథలోళ్లు

ఎప్పుడు తెల్లారుతుందా...అన్నట్లుగా చూస్తుంది ప్రీతి. అదేమిటో టైమ్‌ త్వరగా గడవాలనుకున్నప్పుడే... గడియారంలోని ముళ్లు అతిభారంగా కదులుతుంటాయి! ఉత్సాహం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు  నిద్ర పట్టడం కష్టమేమో! తనపై ప్రేమతో ప్రీతి వాళ్ల నాన్న కొనిచ్చిన అలారం అది. ఎగ్జామ్స్‌ కోసం అలారం లేకుండానే మెలకువరావడం అలవాటైపోయిన ప్రీతికి అలారం అవసరం లేదు. కాని నాన్న మీద ప్రేమతో పక్కనే పెట్టుకొని పడుకుంటుంది.
ఎట్టకేలకు తెల్లారింది... అనుకున్న టైమ్‌కు అలారం నిద్ర లేపింది. లేచి సాన్నం చేసి బ్లాక్‌ జీన్స్, చెక్స్‌ టాప్‌ వేసుకుంది. తనకి నచ్చిన పోనీ వేసుకుంది. ఫ్రీజర్‌ నుంచి పాలు తీసి కాఫీ చేసింది. డాడీని లేపింది. కాఫీలో పంచదార ఎక్కువైనా, తక్కువైనా డాడీ పట్టించుకోడు... ప్రీతిని మెచ్చుకుంటూనే ఉంటాడు!
ఆరోజు కూడా ‘‘చిట్టితల్లీ ఎంత బాగా నేర్చేసుకుంటోంది’’ అని భార్యతో అన్నాడు. ఈమాటకు ఒకవైపు మురిసిపోతూనే...
‘‘డాడీ లేటవుతుంది. సర్‌ వాళ్లు అందరూ వెయిట్‌ చేస్తున్నారు’’ అని తొందర చేసింది ప్రీతి.

ఆరోజు ప్రీతి తన కాలేజి ఫ్రెండ్స్‌తో బెంగళూరు వెళ్తోంది.
‘‘నీకు విజయ్‌ తెలుసా? గుర్తున్నాడా?’’ అని అడిగింది అప్పుడే  తన దగ్గరకు వచ్చిన  రియ.
‘‘అవును గుర్తున్నాడు’’ అన్నది ప్రీతి.
 ‘‘తను నిన్న యాక్సిడెంట్‌లో చనిపోయాడట’’ చెప్పింది రియ.
ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో విజయ్‌ది ప్రీతి పక్క సీటు. అంతేతప్ప ఏరోజూ మాట్లాడింది లేదు. ఒక విధంగా చెప్పాలంటే ముఖపరిచయం మాత్రమే ఉంది.
అయినప్పటీకి చాలా బాధ అనిపించింది ప్రీతికి.
‘ఈమధ్య కాలంలో ఇలాంటి వార్తలు ఎన్ని వినాల్సి వస్తోంది!’ బాధగా అనుకుంది ప్రీతి.
మొన్నటికి మొన్న శ్రీరాగ్‌! తమ పక్కింటి అబ్బాయి.
పట్టుమని పాతికేళ్లు ఉండవు. పాదరసంలా చురుగ్గా ఉంటాడు. బైక్‌ డ్రైవింగ్‌ అంటే  ఇష్టం...బైక్‌పై స్పీడ్‌గా ఊరంతా చక్కర్లు కొట్టడం అంటే చాలా ఇష్టం.
‘అబ్బాయి  సరదా పడుతున్నాడు. ఈ వయసులో ఇది కామనే కదా’ అని అనుకున్నాడే తప్ప తండ్రి సత్యం ఏనాడూ సీరియస్‌గా తీసుకోలేదు. అదే ఆయన పాలిటి శాపం అయింది.
ఒకరోజు బైక్‌పై స్పీడ్‌గా వెళుతున్న శ్రీరాగ్‌ అదుపుతప్పాడు...ఇసుక ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు!

ఒక్కగానొక్క కొడుకు.
కొడుకు మరణవార్త విని సత్యం దంపతులు తట్టుకోలేకపోయారు.
‘కొడుకు లేని ఈ బతుకు ఎందుకు?’ అని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది సత్యం భార్య సరిత.
కొత్తా పాతా అనే తేడా లేకుండా ఒకప్పుడు అందరితో గలగలా మాట్లాడే సత్యం ఇప్పుడు ఎవరితో సరిగా మాట్లాడం లేదు. ఎవరితో పెద్దగా కలవడం లేదు.
అప్పుడప్పుడూ కొడుకు యాక్సిడెంట్‌కు గురైన చోటు  దగ్గరికి వెళ్లి ఏడుస్తుంటాడు. ఇది చూసిన వాళ్లకు కళ్లనీళ్లు ఆగవు!
అమ్మ వాళ్ల కజిన్‌ ఒకరు తన పెళ్లికార్డులు పంచడానికి బైక్‌పై వెళ్లి యాక్సిడెంట్‌లో చనిపోయాడు!
చిన్నప్పటి ఫ్రెండ్‌ రీతిక వాళ్ల నాన్న  ఏదో ఫంక్షన్‌కు వెళ్లి  ఇంటికి రాకుండా దారిలోనే ఆగిపోయాడు.
‘‘డ్రింక్‌ తీసుకున్నావు కదా...ఇంత రాత్రి వేళ వెళ్లడం ఎందుకు? ఉదయం వెళ్లొచ్చులే’’ అని చెప్పారట ఫ్రెండ్స్‌.
‘‘నేను డ్రింక్స్‌ తీసుకోవడం కొత్తా, బైక్‌ నడపడం కొత్తా’’ అని ఆరాత్రే  బయలుదేరాడట!
ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్దదిక్కులేదు.... బతకడానికి ఆధారం లేదు!
ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఎన్నెన్నో యాక్సిడెంట్‌ విషాదాలు గుర్తుకొస్తున్నాయి ప్రీతికి. ఈ ఆలోచనలతో మనసంతా అదోలా అయిపోయింది.

అప్పుడే అక్కడికి వచ్చిన రాజేష్‌ సర్‌ దగ్గర  విజయ్‌ ప్రస్తావన తెచ్చింది.
‘‘అవునమ్మా, నాకు నిన్ననే తెలిసింది. హెల్మెట్‌ వేసుకొని ఉండుంటే ప్రాణాలు మిగిలేవి’’ అన్నారు రాజేష్‌ సర్‌.
‘హెల్మెట్‌’ అనే మాట వినబడగానే ప్రీతికి మళ్లీ శ్రీరాగ్‌ గుర్తుకు వచ్చాడు.
‘‘వెళితే వెళుదువుగాని ఆ హెల్మెట్‌ పెట్టుకొని వెళ్లరా’’ అని అప్పుడప్పుడూ అనేవాడట సత్యం.
కానీ తండ్రి మాటలను శ్రీరాగ్‌ తేలికగా తీసుకునేవాడు.
‘‘హెల్మెట్‌ పెట్టుకొని బైక్‌ ఎక్కితే ఏం మజా ఉంటుంది డాడీ’’ అనేవాడట!
బస్సులో అంతా హడావిడిగా ఉంది. ఎవరి ముచ్చట్లలో వాళ్లు ఉన్నారు. నవ్వించే వాళ్లు నవ్విస్తూనే ఉన్నారు...నవ్వే వాళ్లు నవ్వుతూనే ఉన్నారు.
అందరిలో ప్రయాణ ఉత్సాహం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
ప్రీతి మాత్రం ఆ వాతావరణాన్ని ఎంజాయ్‌ చేయలేకపోతోంది.
తనకు పదే పదే నాన్న గుర్తుకు వస్తున్నాడు.
ఎప్పుడో  తప్ప నాన్న హెల్మెట్‌ పెట్టుకోడు. ఈరోజు తనని బస్‌స్టాప్‌లో వదిలినప్పుడు కూడా నాన్న హెల్మెట్‌ పెట్టుకోలేదు.
ప్రీతి ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదు.
‘‘డాడీ హెల్మెట్‌ మరిచిపోతున్నారు’’ అని గుర్తు  తెస్తే అదో విషయం కాదన్నట్లు వెళ్లిపోయేవాడు.

బెంగళూరు వచ్చేసింది. కొద్దిసేపటి తరువాత హెచ్‌.ఏ.ఏల్‌కి  చేరుకున్నారు. అక్కడ ఎన్నో యుద్ధవిమానాలు చూసింది, వాటి చరిత్ర చదివింది ప్రీతి. ఆ తరువాత విశ్వేశ్వరయ్య  మ్యూజియంకు వెళ్లారు. పిల్లలంతా బయట షాపింగ్‌ చేస్తున్నారు. రియ ప్రీతిని పిల్చుకొని వెళ్లింది.
అక్కడ ప్రీతి కళ్లు  కీచైన్‌పై పడ్డాయి. దాని మీది–
‘ఐయామ్‌ వెయింటిగ్‌ ఫర్‌ యూ’ అని రాసి ఉంది.
వెంటనే యభై  వరకు కీచైన్‌లను కొనింది.
బెంగళూరులో కప్పన్‌పార్క్, బన్నర్‌గట్టా జూ చూసి బస్‌లో తిరుగుప్రయాణమయ్యారు.

తాను బెంగళూరులో కొన్న కీచైన్‌ను తండ్రికి  గిఫ్ట్‌గా ఇచ్చింది ప్రీతి.
‘‘ఎందుకమ్మా ఇదంతా!’’ అన్నాడు ఆయన.
‘‘డాడీ ఇది కీ చైన్‌ కాదు...మా ఎదురుచూపులు’’ అన్నది ప్రీతి.
అర్థం కానట్లు చూశాడు ఆయన.
అప్పుడు ప్రీతి విజయ్‌ గురించి చెప్పింది.
విజయ్‌కి ఊహ తెలియని రోజుల్లోనే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి  విజయ్‌కి సర్వస్వం అయిపోయింది. ఎండ కన్నెరుగని ఆమె భర్త మరణంతో కూలీనాలికి కూడా వెళ్లింది. అలా కూలిపనులు చేసుకూంటూనే ఆపేసిన చదువును కొనసాగించింది. డిగ్రీ తరువాత అదృష్టవశాత్తు చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కొడుకును బాగా చదివించి పెద్ద హోదాలో చూసుకోవాలని కలలు కనేది ఆమె.
చుట్టాలు పక్కాలతో ‘మా విజయ్‌’ అని కాకుండా...
‘మా కలెక్టర్‌’ అని మాట్లాడేది.
వినే వాళ్లకు ఇది వింతగా అనిపించేది...కాని తల్లి ప్రేమ ముందు తర్కాలు పనిచేయవు కదా!
‘‘అరేయ్‌ నువ్వంటూ లేకుంటే మీ నాన్నతో పాటు నేను చనిపోయేదాన్నిరా. నీ కోసమే బతుకుతున్నాను నాన్నా. బాగా చదువుకో’’ అని అడగకపోయినా కావల్సినన్ని డబ్బులు కొడుకు చేతిలో పెట్టేది తల్లి.
నిజానికి టెన్త్‌క్లాస్‌ వరకు విజయ్‌కి అమ్మ తప్ప మరోప్రపంచం తెలియదు. కాలేజి చదువుకు సిటీకి వచ్చి ఫ్రెండ్స్‌తో రూమ్‌ తీసుకొని ఉండేవాడు.
ఇక్కడే విజయ్‌కి ‘బైక్‌ సోకు’  తగులుకుంది.
‘‘కాలేజిలో అందరూ బైక్‌పై స్టైల్‌గా వస్తున్నారు. నేను మాత్రం నడుచుకుంటూ కాళ్లీడ్చుకుంటూ వెళుతున్నాను’’ అని తల్లి దగ్గర తరచుగా అంటుండే వాడు విజయ్‌.
విజయ్‌ పుట్టిన రోజుకు బైక్‌ కానుకగా ఇచ్చి కొడుకు కళ్లలో అంతులేని సంతోషాన్ని చూసింది తల్లి. కానీ అది సంతోషం కాదని... మృత్యువు అని రెండు నెలలకుగానీ ఆమెకు అర్థం కాలేదు! ప్రీతి చెప్పింది విన్న తరువాత నాన్న కంట్లో నుంచి బొటబొటమని కన్నీళ్లు కారాయి.
‘‘డాడీ, ప్లీజ్‌ ఇది మీ బైక్‌ కీస్‌కి తగిలించుకోండి’’ అంది ప్రీతి.
‘‘అలాగేనమ్మా’’ ద్రవించిన హృదయంతో అన్నాడు   ఆయన.

ఆరాత్రి ప్రీతి పడుకొంది కాని విజయ్‌ గుర్తుకు వస్తున్నాడు.
మనసులో  ఏవేవో భయాలు, కంటి నిండా నీళ్లు.
‘నా వంతుగా ఏదైనా చేయాలి’  ఆరాత్రి గట్టిగా అనుకుంది.

కాలేజీ ‘బ్రేక్‌’ సమయంలో స్టేజీ ఎక్కింది ప్రీతి.
‘‘దీస్‌ ఈజ్‌ ప్రీతి. మీ అందరికి విజయ్‌ గురించి తెలుసు. మూడు నెలల క్రితం వరకు మనతోనే ఉన్న వ్యక్తి ఇప్పుడు లేడు. హెల్మెట్‌ వేసుకొని ఉంటే బతికి ఉండేవాడట. మనలో చాలామందికి బైక్‌లు ఉన్నాయి. హెల్మెట్‌ ధరించి నడపేవాళ్లకంటే, ధరించకుండా నడిపేవాళ్లే  ఎక్కువమంది ఉన్నారు. అలాంటి వారికి నాదొక విన్నపం.. మీకంటూ ఒక ఇల్లు ఉంది...ఆ ఇంట్లో మీ కోసం ఎదురుచూసే కుటుంబసభ్యులు ఉన్నారు. మీరు చేసే తప్పుకు వారికి జీవితకాలశిక్ష విధించవద్దు. అందుకే ఈ కీచైన్‌. దీని మీద ‘ప్లీజ్‌ కమ్‌ హోమ్‌. వీ ఆర్‌ వెయింటిగ్‌ ఫర్‌ యూ’ అని ఉంది.
నా దగ్గర ఉన్న కీచైన్‌లను కొందరికి ప్రెజెంట్‌ చేద్దామనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి’’ అన్నది ప్రీతి.
చప్పట్లతో ఆ ప్రదేశం మారుమోగిపోయింది.
మరుసటిరోజు మిగిలిన విద్యార్థులంతా తమ దగ్గర ఉన్న డబ్బులతో కీచైన్‌లను కొని రోడ్డుపై వేగంగా వెళుతున్న వారికి పంచిపెట్టారు. వారం తిరిగేలోపే కీచైన్‌లు పంచడం అనేది ఎన్నో కాలేజీలకు పాకి పెద్ద ఉద్యమంగా మారింది!

కలలు ఎందుకు వస్తాయో, వాటిలో నిజమెంతో ఎప్పుడూ ఆలోచించలేదు ప్రీతి. కానీ నిన్న రాత్రి వచ్చిన కల గురించి మాత్రం పదే పదే ఆలోచిస్తోంది.
ఆ కలలో... విజయ్‌ కనిపించి– ‘‘థ్యాంకూ ప్రీతి!’’ అంటున్నాడు!
- వసీహా అంజుమ్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top