ధైర్యం... భయం... ద్వంద్వ వైఖరి | katrina kaif birth in karkataka rasi | Sakshi
Sakshi News home page

ధైర్యం... భయం... ద్వంద్వ వైఖరి

Jun 14 2015 12:15 AM | Updated on Sep 3 2017 3:41 AM

ధైర్యం... భయం... ద్వంద్వ వైఖరి

ధైర్యం... భయం... ద్వంద్వ వైఖరి

రాశులలో నాలుగోది కర్కాటకం. ఇది సరి రాశి, జలతత్వం, సౌమ్య స్వభావం, శూద్రజాతి, రజోగుణం, రంగు తెలుపు, హృదయాన్ని సూచిస్తుంది.

 రాశులలో నాలుగోది కర్కాటకం. ఇది సరి రాశి, జలతత్వం, సౌమ్య స్వభావం, శూద్రజాతి, రజోగుణం, రంగు తెలుపు, హృదయాన్ని సూచిస్తుంది. చర రాశి, స్త్రీ రాశి, దిశ ఉత్తరం. ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. దీని అధిపతి చంద్రుడు. నివాస స్థానం చోళదేశం. ఇది చైనా, రష్యా, స్కాట్లాండ్, అల్జీరియా, గుజరాత్, సింధు పరిసర ప్రాంతాలను సూచిస్తుంది. తేయాకు, వెండి, ఊలు, పండ్లు, పాదరసం వంటి ద్రవ్యాలపై ప్రభావం కలిగి ఉంటుంది.
 
 కర్కాటక రాశిలో జన్మించిన వారు సౌమ్యస్వభావులు. నిరంతరం మార్పు కోరుకుంటూ ఉంటారు. ఇతరులతో ఇట్టే ఇమిడిపోగలరు. భావోద్వేగాలను ఏమాత్రం దాచుకోలేరు. అతి సున్నిత స్వభావం కారణంగా మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. సానుభూతి కోరుకుంటారు. చిన్న చిన్న విషయాలకే తేలికగా సహనం కోల్పోతారు. ఇతరుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం తట్టుకోలేరు. అయితే, వీరి కోపం తాటాకు మంటలాంటిదే. చంద్రుని కళల్లో హెచ్చుతగ్గుల మాదిరిగానే కర్కాటక రాశి వారి ప్రవర్తనలోనూ తరచు హెచ్చుతగ్గులు ఉంటాయి. వీరికి లలిత కళలపై అభిరుచి, అభినివేశం ఎక్కువ.
 
 ఒక్కోసారి పిరికిగా అనిపిస్తారు. కొన్ని సందర్భాల్లో అమిత ధైర్యసాహసాలను ప్రదర్శిస్తారు. పారదర్శకమైన స్వభావం వల్ల సమర్థంగా జనాలకు నాయకత్వం వహించగలుగుతారు. శ్రమించే స్వభావం వల్ల ఏ రంగంలో ఉన్నా, ప్రత్యేకతను చాటుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తేలికగా సర్దుకుపోగలరు. ఎవరైనా బెదిరింపులకు దిగితే మాత్రం మొండిగా ఎదుర్కొంటారు. నిజాయితీ, నిర్భీతి వీరి సహజ లక్షణాలు. ఎక్కువగా ఊహల్లో తేలిపోతుంటారు. నిర్విరామంగా ఏదో ఒక పనిలో నిమగ్నం కావడంలోనే సంతోషం వెదుక్కొంటారు. యుక్తవయసులో తరచు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా శ్వాసకోశ, జీర్ణకోశ, నాడీ సంబంధిత సమస్యలతో బాధపడతారు.
 
  గ్రహగతులు అనుకూలించకుంటే, తరచుగా మానసిక వ్యాకులతకు, అభద్రతా భావానికి లోనవుతారు. ఇతరులు తమకు చేసిన హానిని తేలికగా మరువలేక, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతారు. తమను అర్థం చేసుకునే వారు ఎవరూ లేరనే అపోహతో నిత్యం దిగులుతో కుమిలిపోతారు. కార్యదక్షులు కావడం వల్ల వీరు మేనేజ్‌మెంట్ ఉద్యోగాల్లో, స్వతంత్ర వ్యాపారాల్లో బాగా రాణించగలరు. ఆరోగ్య, విద్యా, ఆతిథ్య, వ్యవసాయ, న్యాయవాద రంగాలు వీరికి బాగా నప్పుతాయి. చరిత్ర పరిశోధకులుగా, రచయితలుగా, పాత్రికేయులుగా, సంగీతవేత్తలుగా, కళాకారులుగా కూడా వీరు తమ ప్రత్యేకతను నిరూపించుకోగలరు.
 (వచ్చేవారం సింహరాశి గురించి...)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement