దెయ్యాలపల్లి

Funday horror story - Sakshi

కిర్ర్‌..ర్‌..!

‘‘నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది’’ అన్నాడు కుర్రాడు. ‘‘ఏమో.. చెప్పలేం.. ఉండిపోవలసి వస్తుందేమో’’ అన్నాడు ఆ గురువులాంటి ఆయన. 

దెయ్యాలపల్లిఇంకో రెండు కిలోమీటర్ల దూరంలో ఉందనగా, వేగంగా వెళుతున్న ఆ వ్యాన్‌లోని నలుగురికీ ‘దెయ్యాలపల్లికి స్వాగతం’ అనే బోర్డు.. ఇలా కనిపించి, అలా మాయమైపోయింది. ‘దగ్గరికొచ్చింది’ అనుకున్నారు. ఆ నలుగురిలో ఒకరు డ్రైవరు కాదు. డ్రైవరు ప్లస్‌ నలుగురు. మొత్తం ఐదుగురున్నారు వ్యాన్‌లో. డ్రైవరుకు, దెయ్యాలపల్లికి సంబంధం లేదు. వాళ్లు రమ్మంటే వచ్చాడు. ఎందుకు, ఏమిటి అని అడగలేదు. డబ్బులిస్తాం అన్నారు. సరేనని వచ్చేశాడు. పెట్రోల్‌ వాళ్లే కొట్టించాలి. భోజనం వాళ్లే పెట్టించాలి. రోజుకు ఇంతని ఇవ్వాలి. అదీ ఒప్పందం. అప్పుడు కూడా డ్రైవర్‌ అడగలేదు. ఏమిటీ, ఎన్నిరోజులు అని. ఎన్ని రోజులైతే మాత్రం ఏంటి? తన బండి ఖాళీగా ఉండదు. అదే అతడికి కావలసింది. ‘దెయ్యాలపల్లికి దేనికి సార్‌?’ అని ఒక్కమాట అడిగి ఉంటే.. డ్రైవర్‌ మనసు మార్చుకుని ఉండేవాడేమో అనుకోనవసరం లేదు. అతడికి దెయ్యాలపల్లి అయినా, దేవుళ్లపల్లి అయినా ఒకటే. జీవితం అతyì కి రోజూ మనుషుల్లోనే ఎక్కడో ఒకచోట దెయ్యాలను, దేవుళ్లను చూపిస్తూనే ఉంటుంది. అందుకని ఒకవేళ అతడికి దేవుడినో, దెయ్యాన్నో చూడాలని అనిపించినా దెయ్యాలపల్లికో, దేవుళ్లపల్లికో వెళ్లే అవసరం ఉండదు.

ఆరు గంటలుగా అతడు డ్రైవ్‌ చేస్తున్నాడు. తన వ్యాన్‌లో కొంతమంది మనుషులున్నారని, వాళ్లేదో మాట్లాడుకుంటున్నారనీ ధ్యాస లేదు అతడికి. అయినా అప్పుడప్పుడు కొన్ని మాటలు అతడి చెవిలో పడుతూనే ఉన్నాయి. వాళ్ల నలుగురూ దెయ్యాలపై రిసెర్చ్‌ చెయ్యడానికి దెయ్యాలపల్లి బయల్దేరారని మాత్రం అతడికి అర్థమైంది. ‘పిచ్చి పని’ అనుకున్నాడు. దెయ్యాలు ఉంటే ఉంటాయి? లేకపోతే లేదు. ఉన్నాయని నిర్ధారించుకున్నందు వల్ల, లేవని నిరూపించినందు వల్ల ఈ దెయ్యాల గొడవ అక్కడితో వదిలిపోయేది కాదు. కొత్తగా మనుషులు పుట్టుకొస్తున్నట్లే.. ఆ కొత్త మనుషులకు దెయ్యాల గురించి ఈ పాత సందేహాలే మళ్లీ పుట్టుకొస్తుంటాయి. ‘‘దెయ్యాలు లేకపోతే దెయ్యాలపల్లి అనే పేరు ఎలా వస్తుంది?’’ అని అంటున్నాడు నలుగురిలో చిన్నవాడైన కుర్రాడు వ్యాను బయల్దేరినప్పటి నుండి. మిగతా ముగ్గురిలో ఇద్దరు అతడి కన్నా వయసులో కాస్త పెద్దవాళ్లు.  నాలుగో మనిషి ఈ బృందానికి లీడర్‌లా ఉన్నాడు. గడ్డం తెల్లబడింది. జుట్టు నల్లగా ఉంది! ‘ఊళ్లు–పేర్లు’ అనే అంశంపై వాళ్లు అధ్యయనం చేస్తున్నప్పుడు ‘దెయ్యాలపల్లి’ అనే ఈ ఊరు వారి దృష్టిలో పడింది. ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో ‘తవ్విచూద్దాం’ అని ప్రాజెక్ట్‌ వర్క్‌ ప్లాన్‌ చేసుకున్నారు. ‘‘నిధులు, నిక్షేపాల్లా.. దెయ్యాలు భూగర్భంలో ఉండవు.. తవ్వి తియ్యడానికి..’ అన్నాడు ఆ తెల్లగడ్డం మనిషి. మిగతావాళ్లు నవ్వారు. 

సర్పంచ్‌ గెస్ట్‌ హౌస్‌ దగ్గర వీళ్ల వ్యాన్‌ ఆగింది. ‘తొందరగా భలే వచ్చేశాం!’ అనుకున్నారు కానీ.. అప్పటికే సూర్యుడు కొండ దిగుతున్నాడు. ‘‘లోపల గదులన్నీ మీవే. ఉన్నన్ని రోజులు ఉండొచ్చు. ఊళ్లో తిరిగినన్ని రోజులు తిరగొచ్చు. మీకే వివరం కావాలన్నా ఊళ్లోవాళ్లు చెబుతారు. భోజనాలూ అవీ గెస్ట్‌ హౌస్‌కే వస్తాయి’’ అని చెప్పాడు సర్పంచ్‌ పంపిన మనిషి.‘‘ఆ.. మీ డ్రైవరు కూడా లోపలే ఓ గదిలో ఉండొచ్చు. వ్యాన్‌లో పడుకోనవసరం లేదు’’.. వెళ్తున్నవాడల్లా మళ్లీ వెనక్కొచ్చి చెప్పాడు ఆ మనిషి. ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదు డ్రైవర్‌. స్నానాలు అయ్యాక, ఫ్లాస్క్‌లో సిద్ధంగా ఉన్న కాఫీని తాగుతూ బాల్కనీలోంచి బయటికి చూస్తూ నిలబడ్డారు ఆ నలుగురూ. ఊళ్లో ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. దగ్గర్లో రామాలయంలోంచి భక్తి పాటలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. ఆ ఊరి పేరుకు, ఆ ఊరున్న తీరుకూ ఎక్కడా పొంతన లేదు. అసలు ఊళ్లోకి వస్తున్నప్పుడే వాళ్లు గమనించారు.. ఊరంతా పచ్చగా, ప్రశాంతంగా ఉండడం! పొద్దునెప్పుడో పేడనీళ్లు చల్లి, ముగ్గు వేసిన ముంగిళ్లు సాయంత్రం అవుతున్నా కూడా పొద్దు పొడవడానికి ముందే సిద్ధమైపోయినట్లుగా పచ్చి వాసన కొడుతున్నాయి. ‘‘నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది’’ అన్నాడు కుర్రాడు. ‘‘ఏమో.. చెప్పలేం.. ఉండిపోవలసి వస్తుందేమో’’ అన్నాడు ఆ గురువులాంటి ఆయన. 

మిగతా ఇద్దరూ అర్థం కానట్లు చూశారు. ‘‘దెయ్యాలపల్లికి ఆ పేరెలా వచ్చిందో శోధించడానికి వచ్చాం మనం. కానీ అదంత తేలిగ్గా అనిపించడం లేదు. చూశారుగా.. ఇది దెయ్యాలపల్లిలా లేదు. దేవుళ్లపల్లిలా ఉంది. గుడి, చర్చి, మసీదు ప్రతి ఊళ్లోనూ ఉండేవే. కానీ ఈ ఊళ్లో ప్రతి ఇల్లూ  ఓ ప్రార్థనాస్థలంలానే ఉంది’’ అన్నాడు ఆయన. ‘‘దెయ్యాలు ఉంటేనే దేవుళ్లు అవసరం ఉంటుంది సర్‌’’.. అకస్మాత్తుగా వెనుకనుంచి మాట వినిపించింది.చప్పున తలతిప్పి చూశారు అంతా. ఆ మాట అన్నది డ్రైవర్‌! వాళ్లకు నాలుగడుగుల దూరంలో ఉండి కాఫీ తాగుతున్నాడతను.తెల్లగడ్డం ఆయన పెద్దగా నవ్వాడు. ‘‘రిసెర్చ్‌ అవసరం లేకుండానే ఒక్క మాటతో తేల్చేశాడు’’ అన్నాడు. మిగతావాళ్లూ నవ్వారు. 

తెల్లారే అందరికంటే ముందు డ్రైవర్‌ లేచాడు. కోనేటì లో స్నానం చేసి వచ్చాడు అతడు. గుడికి కూడా వెళ్లొచ్చినట్లున్నాడు. నుదుటిపై కుంకుమ బొట్టు ఉంది. ‘‘అప్పుడే తెరిచారా?’’ అన్నాడు తెల్లగడ్డం ఆయన. ‘‘ఎప్పుడూ మూయరట’’ అన్నాడు డ్రైవర్‌. ‘‘అవునా! ఏ గుడి?’’ అడిగాడాయన. చెప్పాడు డ్రైవర్‌.లె ల్లగడ్డం ఆయన వింతగా చూశాడు. ఆ మధ్యాహ్నం తనొక్కడే ఊళ్లొకి వెళ్లొచ్చాక తన టీమ్‌కి చెప్పాడు. ‘‘రిసెర్చ్‌ అయిపోయింది. వెళ్దాం, సర్దుకోండి’’.డ్రైవర్‌తో పాటు మిగతా ముగ్గురూ ఆశ్చర్యంగా చూశారు. వారం తర్వాత వీళ్ల ప్రాజెక్టు రిపోర్టు సిద్ధమైంది. అందులో తెల్లగడ్డమాయన చేతి రాతతో ముగింపు వాక్యం ఇలా ఉంది:‘దెయ్యాలపల్లిలో ఒక గుడి ఉంది. అది దేవుడికి కట్టినది కాదు. ఊరికి కట్టిన గుడి! దెయ్యాలపల్లికి ఆ పేరు ఎలా వచ్చిందో ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఊరికన్నా ముందే ఆ గుడి అక్కడ వెలసింది! 
- మాధవ్‌ శింగరాజు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top