ఉత్తరపు గది | Sakshi
Sakshi News home page

ఉత్తరపు గది

Published Sun, May 6 2018 12:19 AM

funday horror story - Sakshi

నిరుడు వేసవి వెళ్లాక ఆ ఇంట్లోకి వచ్చారు వాళ్లు. కనుక వేసవిలో ఆ ఇంట్లో ఎలా ఉంటుందో తెలీదు. వేసవి వచ్చింది. కనుక ఇప్పుడు తెలుస్తోంది! అద్దె ఇల్లు అది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలకు సరిగ్గా సరిపోతుంది. సామాను తక్కువగా ఉంటే కొంచెం పెద్ద ఇల్లుగా కూడా అనిపిస్తుంది. పదేళ్ల కూతురు, ఎనిమిదేళ్ల కొడుకు, ఇరవై ఏళ్లకే భార్య అయిన అమ్మాయి, పాతికేళ్లలోపే భర్త అయిన అబ్బాయి.. ఇదీ ఆ ఇంట్లో ఉన్న కుటుంబం. అతని పేరు అమిత్‌. మంచి ఉద్యోగం. సమృద్ధిగా జీతం. ‘గృహస్థు యవ్వనాన్ని’ అతడు చక్కగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. పిల్లల్ని ఆడిస్తాడు. భార్యని ఆటపట్టిస్తాడు.ఆమె పేరు పున్నమి. యాక్టివ్‌గా ఉంటుంది. పిల్లలు, భర్తే ఆమె ఉద్యోగం. వాళ్ల సంతోషమే ఆమె జీతం. వీళ్లింట్లో.. వీళ్లు కాకుండా ఉత్తరం వైపున ఒక గది ఉంది. ఇంట్లో వీళ్లున్నప్పుడు ఇంట్లో ఉత్తరంగా గానీ, దక్షిణంగా గానీ, మిగతా రెండు వైపులా గానీ ఉన్న గది కూడా వీళ్లదే అవ్వాలి కదా! అవ్వాలి కానీ, ‘ఆ గదిని ఇవ్వను’ అన్నాడు ఇంటి ఓనరు.. వీళ్లు ఆ ఇంట్లో చేరేముందు. ‘‘అదేం మీకు అడ్డు కాదు. అదేం మీకు అదనపు కంఫర్ట్‌ కూడా కాదు. దాన్నొదిలేసి మిగతా గదులన్నీ వాడుకోండి’’ అని కూడా అన్నాడు.ఆ ఉత్తరపు గదికి తాళం వేసి ఉండదు. సన్నటి ఇనుప వైరు చుట్టి ఉంటుంది. తీస్తే వచ్చేసేలా ఉంటుంది. కానీ వాళ్లెప్పుడూ దానిని తియ్యాలనుకోలేదు. అసలు ఆ గది గురించి కానీ, గది లోపల ఏముంటుందని కానీ ఆ భార్యాభర్తలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు.క్రితం రోజు రాత్రి కనుక.. వేసవిలో ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలియకపోయుంటే.. అసలు ఎప్పటికీ ఆ ఉత్తరపు గది గురించి మాట్లాడుకునేవారే కాదు! 

క్రితం రోజు రాత్రి.ఎవరి మంచాలపై వాళ్లు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ ఒక మంచం. పక్కనే కొద్ది దూరంలో పిల్లలిద్దరూ ఒక మంచం. పిల్లలింకా నిద్రపోలేదు. కనుక ఇద్దరూ అమ్మానాన్నకు చెరో పక్కా ఉన్నారు.
‘టప్‌’మని పెద్ద శబ్దంతో భుజం మీద కొట్టుకున్నాడు అమిత్‌. ‘‘ఏమైంది డాడీ?’’ పకపకా నవ్వి అడిగింది భవ్య.  ‘‘దోమ’’ అన్నాడు అమిత్‌. ‘‘ఇంత చిన్న దోమను అంత పెద్దగా కొట్టాలా డాడీ’’ అంది.అమిత్‌ నవ్వాడు. కూతురు నుదుటిపై ముద్దు పెట్టాడు. ‘‘దోమ చిన్నదేరా. కుట్టిన చోట చురుక్కుమనగానే నాకు తెలియకుండానే పెద్దగా కొట్టేశాను’’ అన్నాడు.భార్య అతడి వైపు చూసింది. ‘‘ఇంత ఆవిర్లొస్తుంటే ఇంట్లోకి ఈ దోమలెలా వస్తున్నాయండీ. మనకంటే ఎలాగూ తప్పదు. అద్దె ఇస్తున్నాం’’ అంది పున్నమి. ‘‘సొంత ఇల్లయితే దోమలు ఉండవా మమ్మీ’’ అన్నాడు వినోద్‌. ‘‘దోమలకు అన్నీ సొంత ఇళ్లేరా’’ అంది భవ్య. అమిత్‌ నవ్వాడు. పున్నమి ఎండ గురించి మాట్లాడుతుంటే పిల్లలు దోమల టాపిక్‌లోకి వెళ్లిపోయారు. ఎండ తెలిసే వయసా మరి!‘ఎండాకాలం వచ్చేసిందండీ’ అని ఆ ఉదయమే భర్తతో అంది పున్నమి. ఆ సాయంత్రం మళ్లీ.. కిచెన్‌ నుంచి కొంగుతో మెడ కింద తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి.. ‘‘ఉదయం మార్చి, మధ్యాహ్నం మే, సాయంత్రం ఏప్రిల్‌’’ అంది. ‘‘నిజమే’’ అని నవ్వాడు అమిత్‌. పిల్లలు అమ్మానాన్నలకు అటు ఇటు ఛేంజ్‌ అయ్యారు. పైన సీలింగ్‌ ఫ్యాన్‌ తిరుగుతోంది.‘‘ఇది ఫ్యాన్‌ గాలిలా లేదు. ఎండ గాలిలా ఉంది’’ అన్నాడు అమిత్‌. పున్నమి మౌనంగా ఉంది. పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్‌?’’ అన్నాడు.‘‘ఆ ఉత్తరపు గది తలుపు తీస్తే కాస్త చల్లగాలి వస్తుందేమో’’ అంది పున్నమి.‘‘నేనూ అదే అనుకుంటున్నా’’ అన్నాడు అమిత్‌. పిల్లలిద్దర్నీ నిద్దట్లోనే పక్కనున్న మంచం మీద పడుకోబెట్టాడు. తర్వాత వెళ్లి ఉత్తరపు గది తలుపులకు ఉన్న వైరును తొలగించాడు! ఆ ఉత్తరపు గదికి ఒక కిటికీ కూడా ఉంది. ఆ కిటికీ వీళ్లకు బయటి నుంచి కనిపిస్తుంటుంది. ఇప్పుడు గది తలుపులు తియ్యగానే ఇంట్లోంచి కనిపిస్తోంది. వెళ్లి, ఆ కిటికీ కూడా తెరిచాడు అమిత్‌. ఒక్కసారిగా చల్లటి గాలి లోపలికి వచ్చింది.అయితే గాలి మాత్రమే రాలేదని ఆ కొద్దిసేపటికే.. మంచంపై పడుకుని ఉన్నప్పుడు అమిత్, పున్నమి ఎవరికి వారే గ్రహించారు. ‘‘నీకూ అలానే అనిపించిందా?’’ అన్నాడు అమిత్, ‘‘మీకేమైనా అనిపిస్తోందా?’’ అని పున్నమి అడిగినప్పుడు. ఇద్దరూ అలా పడుకునే, తలతిప్పి ఉత్తరపు గదిలోని ఆ కిటికీ గుండా బయటికి చూశారు. కిటికీ అవతల అంతా ఖాళీ స్థలం. ఓ పెద్ద వేప చెట్టు. చీకట్లో ఆ చెట్టు.. చెట్టులా లేదు. చెట్టు నీడే లేచి కూర్చున్నట్లుగాఉంది!ఆ ఉదయం పిల్లలు లేచే ముందే మళ్లీ ఆ ఉత్తరపు గది తలుపులు మూసి, ఎప్పటిలా వైరు చుట్టేశాడు అమిత్‌. 

‘‘అందుకే అన్నాడంటారా.. ఆ ఇంటి ఓనరు.. ఉత్తరపు గది తలుపులు తియ్యొద్దని?!’’ అంది పున్నమి.. ఆ మధ్యాహ్నం అమిత్‌ భోజనానికి వచ్చినప్పుడు. అతడి ఆఫీస్‌.. ఇంటికి దగ్గరే. దగ్గరగా ఉంటుందనే ఆ ఇంటిని ఎంపిక చేసుకున్నారు భార్యాభర్తలు. ‘‘ఛ.. ఛ.. అలాంటిదేమీ అయి ఉండదు. ఏదో భ్రమలాగనిపిస్తోంది.’’ అన్నాడు అమిత్‌. ‘‘ఇద్దరికీ ఒకే భ్రమా?!’’ అంది పున్నమి. ‘అయుండొచ్చు. నువ్వూనేను వేర్వేరు కాదు కదా’’.. నవ్వుతూ అన్నాడు. పున్నమీ నవ్వింది. ‘‘పిల్లలతో అనేవు. భయపడతారు’’ అన్నాడు అమిత్‌.. మళ్లీ ఆఫీస్‌కు బయల్దేరుతూ. ఆ రాత్రి పిల్లలిద్దరూ చాలాసేపు నిద్రపోలేదు.అమ్మానాన్న దగ్గరే పడుకుంటామని పట్టుబట్టారు! అమిత్‌ నిద్రలోకి జారుకుంటుండగా భవ్య అడిగింది.. ‘‘డాడీ.. రాత్రి నీ పక్కన, మమ్మీ పక్కన పడుకున్న ఆ బాబూ, పాప ఎవరు?’’ అని!!ఒక్కసారిగా పున్నమి నిద్ర కూడా వదిలిపోయింది. ‘‘అవును మమ్మీ.. నేను కూడా చూశాను. మధ్యరాత్రిలో మీ మంచం మీద ఎవరో బాబు, పాప ఉన్నారు’’ అన్నాడు వినోద్‌. 
- మాధవ్‌ శింగరాజు

Advertisement
 
Advertisement
 
Advertisement