గ్రహణం

funday crime story - Sakshi

క్రైమ్‌ స్టోరీ

చాలా సేపట్నుంచి బస్టాపులో నిలబడి ఉంది మీనాక్షి. సిటీ బస్సులు రాలేదు. ఎందువల్లనో తెలీదు. తను కాలేజీ నుంచి రావటానికి ముందుగానే బస్సులన్నీ వెళ్లిపోయాయా? అలా జరిగివుండదు. అలాగే అనుకున్నా వేరే రూట్‌లో వెళ్లే బస్సులయినా రావాలిగా. ఒక్క బస్సు కూడా రాలేదు!రోడ్డుమీద ఆటోలు జోరుగా వెళ్లిపోతున్నాయి. కొంతమంది నడిచి వెళ్తున్నారు. సిటీ బస్సులు ఎందువల్ల తిరగడంలేదో మీనాక్షికి అర్థం కాలేదు.సరిగ్గా అప్పుడే రోడ్డుకు అవతలివైపు వున్న హోటలు పక్క పాన్‌ షాప్‌ యజమాని యాభైయేళ్ల మనిషి రోడ్డుదాటి మీనాక్షి దగ్గరగా వచ్చి.. ‘‘అమ్మాయ్‌.. నీకు తెలీదేమో ఇవాళ సిటీ బస్సులు తిరగవు. ఆటోలో ఇంటికి వెళ్లు’’ అన్నాడు.‘‘ఎందుకండీ?’’ మీనాక్షి అడిగింది.‘‘సిటీ బస్సుడ్రైవర్ల మధ్య ఏదో గొడవ జరిగి కొట్టుకున్నారట. అప్పటి నుంచీ బస్సులు తిరగడంలేదు. ఈ విషయం నీకు తెలీదు అనుకుంటాను. రోజులాగే కాలేజ్‌ నుంచి వచ్చి ఇక్కడ నిలబడ్డావు. ఎంత సేపు నిలబడినా సిటీ బస్సులు రావు. ఆటోలో ఇల్లు చేరు’’ అని వెళ్లిపోయాడు.మీనాక్షికి ఏమీ పాలుబోలేదు. ఆటోలో ఇంటికి వెళ్లవచ్చు. కానీ ఆటోకి సరిపడా డబ్బులు లేవు. సిటీ బస్సుకే డబ్బులున్నాయి. ఆటోలో ఇంటికి వెళ్లినా తన మేనత్త ఆటోవాడికి డబ్బులు ఇవ్వదు. తనని తిట్టిపోస్తుంది. ఆమె వట్టి డబ్బు మనిషి. పరమ గయ్యాళి. నీతి నియమాలు లేవు. డబ్బే ప్రధానం ఆమెకు. డబ్బుకోసం ఎంత నీచానికైనా సిద్ధపడుతుంది.

తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు మీనాక్షి తల్లి అనారోగ్యంతో చనిపోయింది. మీనాక్షి తండ్రి శ్రీపాదం మళ్లీ పెళ్లి చేసుకోలేదు. మీనాక్షి ఒక్కతే కూతురు కావడంతో మీనాక్షిని చెల్లెలు సూర్యలక్షి ఇంట్లో వుంచాడు. మీనాక్షి పెంపకానికి చెల్లెలికి కొంత డబ్బు ఇచ్చే ఏర్పాటు చేసుకుని.. శ్రీపాదం కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కూతురి మీద చాలా ప్రేమ. అందుకే శక్తికి మించిన పని అయినా మీనాక్షిని కాలేజీలో చేర్పించి చదివిస్తున్నాడు. మీనాక్షి ఇంటర్‌ చదువుతోంది. ఇంటర్‌ చదువుతున్నా డిగ్రీ పూర్తి చేసిన దానిలా కనబడుతుంది. వయసునుమించిన ఎదుగుదల. మీనాక్షికి తల్లి పోలిక వచ్చింది. తల్లి అందంతో పాటూ.. తల్లి భారీతనం కూడా వచ్చింది.ఆలోచనలో వుండగానే మీనాక్షి ముందు అంబాసిడర్‌ కారు ఆగింది.అందులో మీనాక్షితో పాటు.. కాలేజీలో చదివే అమ్మాయి వకుళ కనపడింది.‘‘మీనాక్షీ... వచ్చి కారెక్కు. ఈ రోజు సిటీ బస్సులు తిరగవట.’’ అని మీనాక్షిని పిలిచింది వకుళ.డ్రైవర్‌ సీటులో కూర్చున్న లావుపాటి మనిషి కూడా మీనాక్షిని పిలిచాడు.‘‘నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తాడు’’ అన్నది వకుళ మీనాక్షి సంశయాన్ని చూసి. మరోకప్పుడయితే మీనాక్షి కారు ఎక్కేది కాదు. కానీ వకుళ పిలవడంతో వెళ్లి కారెక్కి వకుళ పక్కన కూర్చుంది. కారు బయల్దేరింది.

సిటీబస్సు డ్రైవర్ల గొడవ గురించి వకుళ చెబుతున్నప్పుడే వకుళ ఇల్లు వచ్చేసింది. కారు దిగి మీనాక్షికి చెప్పి వకుళ వెళ్లిపోయింది.‘‘మీ ఇల్లు ఎక్కడ?’’ కారు నడుపుతున్న మనిషి అడిగాడు.మీనాక్షి చెప్పింది.కారు బయల్దేరింది. కొంత దూరం వెళ్లి ఊరి బయటవున్న కాలనీలో ఒక మేడ ముందు ఆగింది.‘‘ఇక్కడ ఆపారేం?’’ అనుమానంగా అడిగింది మీనాక్షి.‘‘ఈ ఇంట్లో నా భార్య అనారోగ్యంతో ఉంది. ఒక ముఖ్యమైన మందు సీసా ఇవ్వాలి. నువ్వు కూడా దిగిరా’’ అన్నాడు.‘‘నేనెందుకు?’’‘‘చెబుతాను. ఈ మధ్య నీ వయసులో అచ్చం నీలాగే ఉండే మా కూతురు జబ్బు చేసి చనిపోయింది. ఆ దిగులుతో నా భార్య మంచం పట్టింది. నా భార్య మనసు తేలికపడుతుందని రమ్మంటున్నాను ప్లీజ్‌. కాదనకు’’ అర్థింపుగా అన్నాడు.మీనాక్షిది జాలిగుండె. ఇంకేమీ ఆలోచించకుండా కారుదిగి అతని వెనకే వెళ్లింది. అతను మేడమీద ఒక పెద్ద గదిలోకి తీసుకువెళ్లాడు. మీనాక్షి ఆ గదిలో అతను చెప్పిన అతని భార్య కోసం చూస్తున్నప్పుడు తలుపు మూసి బోల్టు వేశాడు. ఆ గదిలో ఎవరూ లేరు.తలుపు ముయ్యటం చూసి మీనాక్షి భయపడి ‘‘ఏమిటీ మోసం? నేను వెళ్లాలి. తలుపు తెరవండి.’’ అన్నది ఆందోళనగా.అతను నవ్వి ‘‘నువ్వు వెళ్లలేవు. నిన్ను మీ అత్త నాకు అమ్మేసింది. డబ్బు కూడా ఇచ్చేశాను. అందుకే తీసుకొచ్చాను’’ అన్నాడు.‘‘ఎవరు నువ్వు? నన్నేం చెయ్యబోతున్నావు?’’‘‘నిజం చెప్పినా సరే..! నువ్వు నన్నేం చెయ్యలేవు. నేను అమ్మాయిల బ్రోకర్ని. నీలాంటి అందమైన అమ్మాయిలను పట్టుకుని చెన్నై, ముంబై లాంటి మహానగరాల్లో ఉన్న బ్రోతల్‌ కంపెనీలకు అమ్ముతూ వుంటాను. అది నా వృత్తి. నీ మేనత్త సూర్యలక్ష్మి నిన్ను నాకు అమ్మింది. డబ్బు కూడా ఇచ్చాను. అవకాశం కోసం చూస్తున్నాను. ఇవాళ వచ్చింది. నువ్వు చిక్కావు. అక్కడ నీకు ఏ లోటూ వుండదు. ఖరీదయిన బట్టలు, నగలు, నీకు మంచి ఫ్యూచర్‌ వుంటుంది. డబ్బుకు లోటు వుండదు. దిగులుపడకు. నవ్వుతూ వుండు.’’ అన్నాడు.

మీనాక్షికి ఏడుపు వచ్చింది. ఏడుపు గొంతుతో ‘‘నేను నీ కూతురులాంటి దాన్ని. నన్ను వదిలిపెట్టు’’ అన్నది చేతులు జోడించి.‘‘అమ్మాయిల వ్యాపారం చేసే నాకు సెంటిమెంట్లు వుండవు. నాకు డబ్బే ముఖ్యం. నేను నా తమ్ముడి కూతుర్నే చెన్నై కంపెనీకి అమ్మాను’’ అన్నాడు నవ్వుతూ.‘‘అరిచి గోల చేస్తాను’’ బెదిరించింది మీనాక్షి.‘‘నువ్వు అరిచినా ప్రయోజనం వుండదు. నీ అరుపులు ఎవరికీ వినపడవు’’ అని పెద్దగా నవ్వాడు. సరిగ్గా అప్పుడే బయట నుంచి ఎవరో తలుపును గట్టిగా నెట్టారు. బోల్టువూడి కింద పడింది. తలుపు తెరుచుకోగానే మీనాక్షి తండ్రి శ్రీపాదంతో పాటు నలుగురు పోలీసులు లోపలికి వచ్చారు.వాళ్లను చూసి అతడు పరిగెత్తబోయాడు. పోలీసులు అతడిని గట్టిగా పట్టుకున్నారు.తండ్రిని చూసి మీనాక్షి సంతోషంతో.. ‘‘నాన్నా నేను ఇక్కడున్నట్లు నీకెలా తెలిసింది?’’ అన్నది.‘‘నేను బస్టాపు ముందు నుంచి కార్లో వెళుతూ, నువ్వు వీడి కారులో ఎక్కడం చూశాను. వీడి గురించి నాకు తెలుసు. వీడి పేరు  జగదీష్‌. అమ్మాయిల బ్రోకర్‌గా ఈ సిటీలో వీడికి మహాగొప్ప పేరుంది. వీడి కారును ఫాలో అయ్యాను. ఇంట్లోకి తీసుకెళ్లడం చూశాను. నిన్ను మోసంతో తీసుకువచ్చాడని అర్థమైంది. దాంతో పోలీసులను తీసుకొచ్చాను’’ చెప్పాడు శ్రీపాదం.జగదీష్‌ గింజుకుంటున్నాడు పోలీసుల చేతుల్లో..‘‘లక్ష్మి అత్తే నన్ను వీడికి అమ్మిందట’’ మీనాక్షి చెప్పింది.శ్రీపాదం పోలీసు ఇన్‌స్పెక్టర్‌తో అదే చెప్పాడు.‘‘ఎవర్నీ వదిలేది లేదు. ఆమెకీ శిక్ష తప్పదు. పదండి ఆమెను కూడా పట్టుకుందాం’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. అమ్మాయిల బ్రోకర్‌ జగదీష్‌ను ఎక్కించుకున్న పోలీసు జీపు సూర్యలక్ష్మి కోసం బయల్దేరింది.
జొన్నలగడ్డ అరుణ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top