నిజం చెప్పండి.. మీకు స్నేహితులు ఉన్నారా?

Friendship Day Special Article - Sakshi

నేడు ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా కవర్‌ స్టోరీ

మైత్రీబంధానికి ఆరంభం ఉంటుంది, అంతం ఉండదంటారు. ఆ బంధం గురించి రాయడం, చెప్పడం కూడా అలాంటిదే. మొదలు పెట్టడం సులభమే. అదేమిటో, ఎవరెలా అర్థం చేసుకున్నారో, వ్యాఖ్యానించారో చెప్పుకుంటూ వెళ్లిపోవచ్చు. ముగింపు మాత్రం అందదు. పైగా స్నేహమనే భాషలో ఉండేవి పదాలు కాదు, అర్థాలేనట. కాబట్టి స్నేహమంటే ఏమిటో ఆవిష్కరించేటప్పుడు పదాలు పలాయనం చిత్తగిస్తాయి. ఒకే ఒక్క గులాబీ నా పూదోట కాగలదు. ఒక్క మిత్రుడే నా యావత్ప్రపంచం కూడా కాగలడు అన్నారొకాయన. మహాకవి కాల్‌రిట్జ్‌ ఏమన్నాడు, ‘ప్రేమ ఒక పుష్పం వంటిదైతే, స్నేహం నీడనిచ్చే చెట్టు’ అని. ఎవరు చెప్పినా మైత్రీబంధం అంటే రెండు గుండెల మధ్య భాషణమేననే, పెదవుల మీద నుంచి అలవోకగా జారిపోయే మాట కాదు అనే.

అదెలాగంటే, నా హృదయ గీతం ఏదో తెలిసినవాడే మిత్రుడు, ఆ గీతాన్ని మరచినప్పుడు నా కోసం పాడి వినిపించేవాడే మిత్రుడు’ అన్నారొకాయన. రక్తబంధానికి మించిన గాఢత్వం, కేవల బంధుత్వానికి అతీతమైన దగ్గరతనం, అంతరాలూ అంతస్తులూ పట్టించుకోని స్వచ్ఛత స్నేహంలో ఉంటాయంటారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (జూ), ‘శత్రువుల మాట కాదు, మిత్రుల మౌనం గురించే మనం అంతిమంగా గుర్తు చేసుకుంటాం’ అన్నారు. స్నేహంలోని గొప్పతనమంతా ఆ మౌనమే. అయినా, ‘స్నేహబంధాలు చాలా ఉన్నాయి, కొన్నింటిలో స్వార్థం కూడా సహజం’ అంటాడు మన చాణక్యుడు. దీనిని మాత్రం కొట్టి పారేయలేం.

జీవితకాలంలో చాలామంది కలుస్తారు. బాల్యంలో, కళాశాలలో, ఉద్యోగ జీవితంలో మనకి ఎన్నెన్నో పరిచయాలు అవుతాయి. ఇరుగు పొరుగు కూడా ఉంటారు. స్నేహం ఏ క్షణంలో మొదలవుతుందో, పరిచయం స్నేహమై వికసిస్తుందో లేదో ఆ క్షణంలో తెలియదు కూడా. ఈ ప్రయాణంలో ఏదో ఒక మైలురాయి దగ్గర లేదా మలుపులోను ఎందరో  నిష్క్రమిస్తారు. ఎవరో మిత్రులుగా మిగులుతారు. అప్పటి నుంచి ఆ ఇద్దరి సంతోషాలు, ఇద్దరి విషాదాలు ఉమ్మడి సహజాతాలుగా మారిపోతాయి. మారిపోవాలి. అలాంటి వారే స్నేహితులు. మనుషులు ఎక్కడ ఉన్నా, ఎంతదూరంలో ఉన్నా మనసులు మాట్లాడుకుంటూనే ఉంటాయి. ఇద్దరి మనుషుల మధ్య ఉన్న స్నేహం అనే ఆ భావనకి రూపం లేదు. అది వర్ణనకి అందేది కూడా కాదు. దాని గాఢత, స్వచ్ఛత అనుభవించాలి తప్ప, మాటలకు అందేది కూడా కాదు. అందుకే కొన్ని ఉదాహరణల ద్వారానే మైత్రీతత్వం గురించి, గొప్పతనం గురించి చెప్పుగలుగుతాం.

మిత్రత్వానికి ఈ ప్రపంచంలో ఎక్కడైనా గౌరవమే కనిపిస్తుంది. ఏ కాలంలో అయినా స్నేహబంధం విలువైనదే. పురాణకాలంలో, చరిత్రలో వర్తమానకాలంలో స్నేహబంధం ఔన్నత్యం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుంది. 
స్నేహితులలో దాదాపు ఎవరూ సమ హోదాలో ఉన్నవారు కానరారు. స్నేహానికి అంతరాలు ఉండవన్నది కూడా పురాతన కాలం నుంచి వస్తున్న పరమ సత్యమే. రామాయణంలో శ్రీరామచంద్రుడు ప్రభువు.  క్షత్రియుడు. సూర్యవంశీయుడు. ఆయనకు ఆప్తమిత్రులైనవారంతా సర్వసాధారణమైనవారు. సుగ్రీవుడు, గుహుడు రాముని మిత్రులు. సుగ్రీవుడు వానరరాజు. గుహుడు పడవ నడిపే అదివాసి. రాక్షసరాజు రావణుడు, వానరవీరుడు వాలి కూడా మిత్రులు. వీరి స్నేహం విచిత్రమైనది.

వైరం జాడ కూడా అందులో ఉంది. వాలి అంటే రావణునికి ఒకింత భయం కూడా. నన్ను చాటు నుంచి కొట్టావెందుకు? నాతో ఒక్కమాట అంటే రావణుని ఆదేశించి, అతడి చెరలో ఉన్న సీతమ్మకు  క్షణాలలో విముక్తిని కల్పించేవాడిని కదా రామా! అని కూడా రాముడిని వాలి నిష్ఠురమాడతాడు. రాముని వైరి శిబిరంలోని త్రిజట జానకితో స్నేహం పెంచుకుంటుంది. ధైర్యం చెబుతుంది. తరువాత రావణాసురుని సోదరుడు విభీషణుడు కూడా రాముని మిత్రబృందంలో ఒకడవుతాడు. అంటే తామున్న వర్గంలోని చెడును, వైరిపక్షంలోని మంచిని గ్రహించి, దానిని స్నేహం ద్వారా వ్యక్తం చేసిన పాత్రలు ఇవి.

కృష్ణుడు ద్వారక ప్రభువర్గంలోని ప్రముఖుడు. యాదవరాజు బలరాముని సొంత సోదరుడు. కానీ సాందీపుని ఆశ్రమంలో ఉండి విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఆయనకు సుధాముడు మిత్రుడయ్యాడు. ఆశ్రమం నుంచి ఎవరి ఊరికి వారు వెళ్లిపోయారు. కానీ పేద బ్రాహ్మణుడైన సుధాముడు తనకు సాయం చేయమని ద్వారక వెళ్లి కృష్ణుడిని కలుసుకుంటే సాయమందించాడు. అది ముష్టి వేయడం కాదు. గొప్ప ఆదరంతో, గౌరవంతో చేసిన సాయం. మహాభారతంలో స్నేహానికి నిర్వచనం చెప్పే పాత్రలు ఎక్కువగానే ఉంటాయి. అవన్నీ ప్రధాన పాత్రలే కూడా. సుయోధనుడు–కర్ణుడు, కృష్ణుడు–అర్జునుడు గొప్ప మిత్రులు. కృష్ణార్జునులకు బావాబావమరిది బంధం ఉన్నప్పటికీ స్నేహమే వారి మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. సూతపుత్రుడైన కర్ణునికి అంగరాజ్యం అప్పగించి క్షత్రియుల సరసన నిలిచి యుద్ధ విద్యలలో పోటీ పడే అవకాశం కల్పించాడు దుర్యోధనుడు.

ఇందుకు కర్ణుడు చూపిన కృతజ్ఞతా భావం ఆ పాత్ర పట్ల ఎవరికైనా గొప్ప గౌరవాన్ని పెంచుతుంది. దీనికి ప్రాతిపదిక స్నేహమే. ద్రుపద మహారాజు, ద్రోణుల స్నేహ బంధం మరొక రకమైనది. ఆ ఇద్దరూ ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించినప్పుడు స్నేహితులయ్యారు. తరువాత  ద్రుపదుడు పాంచాల రాజ్య పాలకుడయ్యాడు. ద్రోణుడు గొప్ప యుద్ధ విద్యల గురువుగా పేర్గాంచినా, పేదరికం నుంచి తప్పించుకోలేకపోయాడు. అలాంటి స్థితిలో  సాయం కోరి వెళ్లిన ద్రోణుడిని బాల్య సఖుడు ద్రుపదుడు అవమానించి పంపుతాడు. తరువాత అర్జునునికి విద్య నేర్పి ద్రుపదుని మీద ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు. భారతదేశంలో, చింతనలో స్నేహానికి ఎంతటి విలువ ఉండేదో ఈ పాత్రల ద్వారా తెలుస్తుంది. స్నేహితుల మధ్య బాంధవ్యాన్ని చెప్పేవి కొన్ని. స్నేహధర్మాన్ని విడనాడిన వారికి పట్టిన గతిని వెల్లడించేవి ఇంకొన్ని.

గొప్ప మిత్రులకు ఈ లోకంలో లోటు లేదనే చెప్పాలి. మనుషులకు సాటి మనుషులతో మైత్రి నెరపవలసిన అవసరం అలాంటి కూడా. కానీ సాధారణ ప్రజలు స్నేహానికి ఎంత విలువను ఇచ్చారో లోకమంతటికీ తెలిసే అవకాశం లేదు. స్నేహబంధానికి విలువను ఇచ్చి ఇక్కట్లు పడుతున్న స్నేహితుడినీ, అతడి కుటుంబాన్నీ అక్కున చేర్చుకున్న సాధారణ ప్రజల సంఖ్య అపారంగానే ఉంటుంది. కానీ లోక ప్రసిద్ధులైన వారి స్నేహబంధం గురించే అందరికీ తెలుస్తుంది. రాజకీయ నాయకులు, చలనచిత్ర రంగ ప్రముఖులు, క్రీడారంగంలో ఖ్యాతి ఉన్న వారి మైత్రీబంధం గురించిన కథనాలు అందరికీ అందుతూ ఉంటాయి.

ఎలుగు ఏం చెప్పింది?


ఒకసారి సాయం అందుకుంటే సాయం చేసినవారు, ఆ సాయం అందుకున్నవారు మిత్రులవుతారు. ఈ నీతిని చెప్పే కథలు మన సాహిత్యంలోను, బయటి ప్రపంచంలోని సాహిత్యంలోను విశేషంగా కనిపిస్తాయి. మిత్రునిగా నటించేవారికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పే చక్కని కథ ఇది. ఆ ఇద్దరు మిత్రులు అడవిదారి వెంబడి పొరుగూరు వెళుతున్నారు. కొంతదూరం నడిచాక అలసిపోయారు. చుట్టూ పరిశీలించి అడవి జంతువులు వచ్చే అవకాశం ఏదీ లేదని నమ్మి ఒక చెట్టు కింద పడుకున్నారు. నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి ఏదో అలజడి అయి ఒక మిత్రుడికి మెలకువ వచ్చింది. చూస్తే ఏముంది! ఒక భయంకరమైన ఎలుగు సమీపంగా వచ్చేసింది. మెలకువ వచ్చిన ఆ మిత్రుడు చటుక్కున లేచి ఒక కొమ్మ అందుకుని చెట్టెక్కి కూర్చున్నాడు.

మిత్రుడిని లేపలేదు. ప్రమాదం నుంచి తప్పించే యత్నం కొంచెం కూడా చేయలేదు. ఎలుగు నిద్రట్లో ఉన్న మిత్రుడి మీదకు వచ్చేసింది. కానీ ఏమీ చేయలేదు. అతడి చెవి దగ్గర మూతి పెట్టి ఏదో వెతికింది. మొహం వాసన చూసింది. కొద్దిసేపటికి తన దారిన తాను పోయింది. నేల మీద ఉన్న మిత్రుడు చటుక్కున లేచి, ‘హమ్మయ్య’ అనుకున్నాడు. ‘ఇక చెట్టు దిగిరా, వెళదాం!’ అన్నాడు. ‘నేను చెట్టెక్కినట్టు నీకెలా తెలుసు?’ అడిగాడు ఆ మిత్రుడు కిందకి దిగుతూ. ‘ఎలుగ్గొడ్డు రావడం, క్షణంలో నీవు చెట్టెక్కడం నేను గమనిస్తూనే ఉన్నాను. కానీ నేను ఒక్క నిమిషం ఆలస్యం చేశాను. అప్పుడు లేచి ఉంటే ఎలుగు చంపేసేదే!’ అన్నాడు ఆ మిత్రుడు. 
‘పడుకుని ఉంటే చంపదా?’ సందేహం వ్యక్తం చేశాడు చెట్టు దిగినవాడు.
‘ఊపిరి బిగపట్టి, నేల మీద  చచ్చినట్టు పడి ఉంటే ఏం చేయదని ఎవరో చెప్పారు. అదే చేశాను.’ అన్నాడు ఈ మిత్రుడు.
‘మరోక ప్రశ్న.’ నడక మొదలుపెడుతూ అడిగాడు రెండో మిత్రుడు.
‘నీ చెవిలో ఎలుగుబంటి ఏదో గుసగుసలాడిందేమిటి?’ అన్నాడు హాస్యమాడుతూ.
సరిగ్గా దొరికాడు, దొంగమిత్రుడు. చురక వేశాడతడు.
‘నీలాంటి మిత్రుడితో కలసి ఎప్పుడూ ప్రయాణం చేయవద్దని చెప్పిందిలే!’

స్వాత్రంత్రోద్యమంలో మిత్రులు

భారత స్వాతంత్య్రోద్యమంలో మిత్రులైన వారు, మొదట మిత్రులుగా ఉండి తరువాత ఉద్యమంలో ప్రవేశించినవారు చాలామందే ఉన్నారు. ఫిరోజ్‌షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, మహమ్మద్‌ అలీ జిన్నా మంచి మిత్రులుగానే ఉండేవారు. గణేశ్‌ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు ఆరంభించిన బాలగంగాధర తిలక్, జిన్నా మధ్య కూడా స్నేహభావమే ఉండేది. తిలక్‌ మీద వచ్చిన దేశద్రోహం కేసును తిలక్‌ మీద గౌరవంతోనే జిన్నా వాదించారు. జిన్నా తనకు ఆప్తమిత్రుడని సరోజినీ నాయుడు అనేక సందర్భాలలో ప్రకటించారు. ఆసియాలోనే గొప్ప న్యాయవాదులుగా పేర్గాంచిన జిన్నా, తేజ్‌బహదూర్‌ సప్రూ మధ్య సాన్నిహిత్యం ఉండేది.  కానీ జిన్నా, గాంధీ మంచి మిత్రులుగా ఉండలేకపోయారు. నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గొప్ప స్నేహితులు. చంద్రశేఖర్‌ ఆజాద్, భగత్‌సింగ్, గణేశ్‌శంకర్‌ విద్యార్థి వంటి వారి మధ్య మంచి మైత్రి ఉండేది. మన్యంవీరుడు అల్లూరి శ్రీరామరాజు, నేతాజీ అనుచరుడు మద్దూరి అన్నపూర్ణయ్య బాల్య స్నేహితులు. ఈ ఇద్దరూ కాకినాడలో పిఠాపురం రాజావారి విద్యాసంస్థలో సహాధ్యాయులు.

ఆధునిక రాజకీయాలలో ఒకే పార్టీలో శత్రువులుగా కొనసాగుతున్నవారు ఉన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా మైత్రిని నెరపుతున్నవారు కూడా ఉన్నారు. రాజకీయాలలో, అది కూడా ఒకే పార్టీలో ఉంటూ 65 సంవత్సరాల పాటు స్నేహితులుగా ఉండడం ఎవరికైనా సాధ్యమా? కానీ సాధ్యమేనని నిరూపించారు అటల్‌ బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అడ్వాణి. వారిద్దరి స్నేహబంధాన్ని భారత రాజకీయ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టంగా చెబుతూ ఉంటారు. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు లేకపోలేదు. రాకపోలేదు.

‘చాలామంది నీతో కలసి నడుస్తారు. ఒకచోట ఆగిపోతారు. కానీ గుండెలో అడుగుజాడలు వేసేది మాత్రం నీ మిత్రులే’ అంటారు ఎలినార్‌ రూజ్వెల్ట్‌. ఆ ఇద్దరి గుండెలలోను అలా పరస్పరం అడుగుజాడలు మిగుల్చుకున్నారని అనిపిస్తుంది. సినిమాలు, సాహిత్యం, రాజకీయ చింతన  విషయంలో ఇద్దరిదీ చాలావరకు ఒకే అభిరుచి. ఒకరి మీద ఒకరికి అపారమైన గౌరవం ఉంది. ఇద్దరూ ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చినవారే. జనసంఘ్‌లో రాజకీయనేతలుగా ఎదిగారు. ఎమర్జెన్సీ కాలంలో ఒకేసారి అరెస్టయ్యారు. బీజేపీని స్థాపించి అధికారంలోకి తీసుకువచ్చారు. చివరికి అడ్వాణి చిరకాలమిత్రుడు వాజపేయిని ప్రధాని పదవి అభ్యర్థిగా స్వయంగా ప్రకటించారు. 

హోలీ పండుగను అడ్వాణి నివాసంలో, ఆయనతో కలసి చేసుకోవడం, తనకు ఎంతో ఇష్టమైన కుల్ఫీని మిత్రునితో కలసి తీసుకోవడం వాజపేయికి దశాబ్దాలుగా ఉన్న అలవాటు. వాజపేయి ప్రధాని అయ్యారు. ఆ సంవత్సరం తన నివాసానికి ఆప్తమిత్రుడు వస్తాడని, ఇద్దరూ కలసి రంగులు అద్దుకుంటారని అడ్వాణీ అనుకోలేదు. పైగా సాధారణంగా వాజపేయి హోలీ రోజు రివాజుగా వచ్చే సమయం కూడా దాటిపోయింది. తరువాత హఠాత్తుగా ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్‌. వాజపేయి అడ్వాణీ ఇంటికి బయలుదేరుతున్నారని. యథాప్రకారం మిత్రునితో కలసి రంగులు పూసుకున్నారు. కలసి కుల్ఫీ తీసుకున్నారు. ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్టు, తాను ప్రధానిని అయినా, మిత్రధర్మం విస్మరించలేనని చెప్పక చెప్పారు వాజపేయి. అలాగే పీవీ నరసింహారావుతో కూడా. కాంగ్రెస్‌ను సైద్ధాంతికంగా తీవ్రంగా వ్యతిరేకించేవారు వాజపేయి. పీవీ ఆ పార్టీలో ప్రముఖుడు. అయినా ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఉండేది.

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, ప్రఖ్యాత సినీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మంచి స్నేహితులు. నిజానికి వారి రెండు కుటుంబాల మధ్య గతం నుంచి ఉన్న బంధమే వీరిద్దరి మధ్య కొనసాగిందని చెప్పాలి. అమితాబ్‌ తండ్రి, ప్రముఖ కవి హరివంశరాయ్‌ బచ్చన్‌ నెహ్రూకు సన్నిహితంగా ఉండేవారు. తరువాత వీరి బాటలు వేరయ్యాయి. అమితాబ్‌ సతీమణి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్‌ సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు. అమితాబ్‌ అసలు రాజకీయాలనే వదిలేశారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ మంచి స్నేహితులు. ఇద్దరూ లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రేరణతో రాజకీయాలలోకి వచ్చారు. తరువాత వీరి పంథాలు మారాయి. రాజకీయ శత్రువులుగా మారిపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియా బాల్య స్నేహితులు.

ఇటీవలి కాలంలో క్రీడలు రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచడంలో కీలకపాత్ర వహించగలవని నిరూపించుకుంటున్నాయి. ఆ పని క్రికెట్‌ చాలాసార్లు చేసింది. టి–20 వచ్చిన తరువాత ఖండాంతరాలలో ఉన్న క్రీడాకారులను కూడా సన్నిహిత మిత్రులను చేసింది. సచిన్‌ టెండూల్కర్‌–షేన్‌ వార్న్, యువరాజ్‌సింగ్‌–కెవిన్‌ పీటర్సన్‌ మంచి మిత్రులయ్యారు. వెస్టిండీస్‌ క్రీడాకారుడు క్రిస్‌ గేల్‌–విరాట్‌ కోహ్లీ స్నేహితులే.

ప్రపంచ చరిత్రలో కూడా మిత్రులైన ప్రముఖులకు కొదవలేదు. అమెరికా స్వాతంత్య్రం పోరాటం తరువాత ఆ దేశానికి రాజ్యాంగ వ్యవస్థను, పార్లమెంటరీ వ్యవస్థను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించినవారు ఇద్దరు– జాన్‌ ఆడమ్స్, థామస్‌ జెఫర్సన్‌. సిద్ధాంతపరంగా కొన్ని విభేదాలు ఉన్నా, మైత్రీబంధం మాత్రం దృఢమైనదే. ఇద్దరూ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఇంకా చిత్రం– ఇద్దరూ ఒకే తేదీన కన్నుమూశారు–జూలై 4న.

స్నేహంతోనే మానసిక ఆరోగ్యం


పిల్లలైనా, పెద్దలైనా ఎవరికైనా స్నేహితులు ఉంటేనే వారి మానసిక ఆరోగ్యం సజావుగా ఉంటుంది. తల్లిదండ్రులతో చెప్పుకోలేని ఎన్నో సంగతులను స్నేహితులతో మనసు విప్పి చెప్పుకుంటారు చాలామంది. స్నేహితులతో కలసి కబుర్లాడుతూ కాలక్షేపం చేయడం వృథా కాలహరణం కానేకాదు. మనసులోని మాటలను పంచుకోగలిగే స్నేహితులు ఐదారుగురైనా ఉన్నవాళ్లు తేలికగా మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనల నుంచి బయటపడగలుగుతారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా మనసులోని మాటలు చెప్పుకునే స్నేహితులు కనీసం ఇద్దరు ముగ్గురైనా ఉంటేనే వారి మానసిక ఆరోగ్యం చక్కగా ఉండటమే కాకుండా, ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించగలుగుతారు. చిన్న వయసులోనే పిల్లలు స్నేహబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకోగలుగుతారు. బిడియం వల్ల, సామాజిక భీతి వల్ల కొందరు తేలికగా స్నేహితులను పెంచుకోలేకపోతారు. అయితే, మొహమాటాలను పక్కనపెట్టి స్నేహితులను ఏర్పరచుకుంటేనే మంచిది. స్నేహితులు లేని వాళ్లు ఒంటరితనంతో కుమిలిపోతూ మానసికంగా కుంగిపోతారు.
– డాక్టర్‌ పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌

స్నేహగుణమే సామర్థ్యానికి కొలమానం
స్నేహబంధం విషయంలో భారతీయులది విశాలమైన దృక్పథమే. ఒక మనిషి సామర్ధ్యానికి కొలబద్ద అతనిలోని స్నేహగుణమే అన్నారు డార్విన్‌. స్వదేశీయులు ఎవరు పైకి వచ్చినా చూడలేనివాళ్లు భారతీయులు అన్న నింద మధ్య ఈ అధ్యయనం మనకి ఆనందాన్ని ఇచ్చేదే. మనవాళ్లకి జీవితకాలంలో కనీసం ఆరుగురు ‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌’ అవుతారట. కానీ ప్రపంచంలో చూస్తే మాత్రం సగటున ఒక వ్యక్తికి 4.3 వంతునే బెస్ట్‌ మిత్రులు ఉంటారని ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. కానీ సౌదీ అరేబియాలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ. అక్కడ ప్రతి మనిషికి సగటున 6.4 లేదా 6.6 మంది మిత్రులు ఉంటారని తేలింది. వీరంతా ఆప్తమిత్రులు.

‘ది ఫ్రెండ్‌షిప్‌ రిపోర్ట్‌’ పేరుతో వెలువడిన ఈ నివేదికలో చాలా విషయాలే ఉన్నాయి. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, భారత్, మలేసియా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఇంగ్లండ్‌ దేశాలలో మొత్తం పదివేల మందిని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఇందులో 13 ఏళ్ల వాళ్ల నుంచి 75 సంవత్సరాల పెద్దల వరకు ఉన్నారు. కానీ ఇందులో ఒక అవాంఛనీయమైన విషయం కూడా తేలింది. 13–23 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎక్కువ మంది మిత్రబృందాన్ని తయారు చేసుకోవడానికి ఇప్పుడు విముఖ చూపుతున్నారట. 40–54 మధ్య వయసువారు ఏడుగురి వరకు ఆప్తమిత్రులను తయారు చేసుకుంటూ ఉంటే 13–23 వయసుల వారికి ఐదుగురు వరకు మాత్రమే ఆప్తమిత్రులు ఉంటున్నారు.

జీవిత సహచరితో చేసే ప్రయాణంలో కూడా స్నేహం పరిమళించాలి. ప్రేమ ఉంటేనే చాలదు. వారి మధ్య మైత్రీబంధం కూడా అవసరమే. ‘వివాహాలు విఫలం కావడానికి కారణం వారి మధ్య ప్రేమ లేకపోవడం కాదు, స్నేహబంధం లేకపోవడం’ అంటాడు ఫ్రెడ్రిక్‌ నీషే. స్నేహం అంటే గౌరవం, నమ్మకమే కదా! పిల్లలతో ఒక వయసులో తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాలన్న ఆధునిక సత్యాన్ని కూడా గౌరవించి తీరాలి. మారుతున్న కాలంలో గురువులకు శిష్యులకు మధ్య కూడా గౌరవ ప్రదమైన స్నేహబంధం వెల్లివిరియడం అవసరమన్న వాదన కూడా గమనించదగినదే. కాబట్టి స్నేహం ఈ ప్రపంచంలోని ప్రతి అణువులోను గుబాళించవలసిందే. కానీ ఆధునిక యుగంలో ప్రపంచం కుగ్రామమైంది. మనసుల మధ్య మాత్రం వేల మైళ్ల దూరం పెరిగింది. అందుకే పెంపుడు జంతువులతో మనుషులు స్నేహం చేయవలసిన పరిస్థితి నెలకొంటున్నది. ఈ బంధాన్ని కించపరచడం ఇక్కడ ఉద్దేశం కాదు. గతం నుంచి మూగజీవాలకు, మనుషులకు మధ్య ఉన్న మౌన మైత్రీ బంధం ఇప్పుడు ఇంకొంత బలపడింది. కొత్త రూపు సంతరించుకుంది.

స్నేహం ఏర్పడిన తరువాత అంతరాలు అదృశ్యం కావాలి. లేని పక్షంలో అది స్నేహం అనిపించుకోదు. స్నేహం మాటున ఉన్న అవసరమే అవుతుంది. స్నేహానికీ, మాటకీ మధ్య బంధం ఉందంటుంది రుగ్వేదం. మాటలు ఆపేసినా, అబద్ధాలు ఆడినా స్నేహం చెడిపోతుందని కూడా చెప్పింది. మహాభారతంలో భీష్మాచార్యులు నాలుగు రకాల మిత్రుల గురించి ప్రస్తావించాడు. వారు– సహజ మిత్రులు, పురాతన కాలం నుంచి వస్తున్న మిత్రులు, వ్యవహారాలలో మిత్రులు, స్నేహితుల్లా గౌరవం అందుకునే ఉద్యోగులు. ఇక్కడ అల్బర్ట్‌ కామూ స్నేహబంధంలో సమానత్వం గురించి చెప్పిన ఒక్కమాట గుర్తు చేసుకోవచ్చు. 
‘నా వెనుక నడవొద్దు!
నేను దారి చూపలేకపోవచ్చు!
నా ముందూ నడవొద్దు!
నేను అనుసరించలేకపోవచ్చు! 
నా పక్కనే అడుగులో అడుగెయ్యి!
నా మిత్రునిగా ఉండు!’
– డా. గోపరాజు నారాయణరావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top