భళా...కాంభోజ!

భళా...కాంభోజ!


అదిగో అల్లదిగో...  కంబోడియా

ఆగ్నేయ ఆసియాలోని ఇండోనేషియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉన్న దేశం కంబోడియా. ఇప్పటికీ రాచరిక విధానం అమలులో ఉన్న దేశం ఇది. ఖైమర్ సామ్రాజ్యకాలంలో విస్తారమైన సంపదలతో  దక్షిణాసియా దేశాలలో ఆధిపత్యం సాధించింది.  పద్దెనిమిదవ  శతాబ్దంలో పొరుగు దేశాలైన థాయిలాండ్, వియత్నాంల ఆధిపత్యానికి గురైంది. థాయిలాండ్ కంబోడియాను ఆక్రమించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది. పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో కంబోడియాపై వియత్నాం దాడి చేసింది.



దీంతో రక్షణ కోసం కంబోడియా థాయిలాండ్‌ను ఆశ్రయించింది. ఫలితంగా వాయవ్య కంబోడియా థాయిలాండ్ వశమైంది.  థాయిలాండ్, వియత్నాంల నుంచి తమ దేశాన్ని రక్షించవలసిందిగా  కంబోడియా రాజు వేడుకోవడంతో, 1863లో కంబోడియా ఫ్రెంచ్ రక్షణలోకి వెళ్లిపోయింది.



ఫ్రెంచ్ పాలనలో కంబోడియాలో చెప్పుకోదగ్గ ఆర్థికాభివృద్ధి చోటుచేసుకుంది. రోడ్లు, రైల్వే లైన్ల నిర్మాణం జరిగింది. 1920లో రబ్బర్ పరిశ్రమ అభివృద్ధి చెందింది. అయినప్పటికీ కంబోడియన్లు పెద్ద ఎత్తున పన్నులు చెల్లించాల్సి రావడంతో దేశంలో జాతీయవాదం తలెత్తింది. 1941లో కంబోడియా జపాన్ ఆక్రమణకు గురైంది. 1945లో జరిగిన యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో  కంబోడియా మరోసారి ఫ్రెంచ్ పాలనలోకి వెళ్లింది. రాజకీయ పార్టీలు స్థాపించుకోవడానికి, రాజ్యాంగం  నిర్మించుకోవడానికి ఈసారి కంబోడియన్లకు అవకాశం ఇచ్చింది. 1949లో జరిగిన ఒక ఒడంబడికతో కంబోడియా పాక్షికంగా స్వాతంత్య్రదేశమైంది.



1953లో ఫ్రెంచ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కంబోడియాకు  స్వాతంత్య్రం ఇచ్చింది. కంబోడియా  చరిత్రలో 1975 ఒక చీకటి కాలం. దీనికి కారణం నియంత పాల్ పాట్  పాలన. ఆయన పరిపాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయి. కంబోడియాను పూర్తిస్థాయిలో వ్యవసాయ దేశంగా మార్చడానికి  పట్టణాల్లో ఉన్నవారిని పల్లెల్లోకి తరలించాడు. వ్యవసాయ ఉత్పాదన నాలుగు సంవత్సరాల్లో రెట్టింపు కావాలని నిర్ణయించి ప్రజలను కష్టపెట్టాడు. ఎంతో మంది ప్రజలు అనారోగ్య సమస్యలతో చనిపోయారు.

 

విదేశీ భాషలు మాట్లాడటం కూడా నేరమైపోయింది. అనేక విషయాల్లో  నియంతృత్వం వెర్రితలలు వేసింది. 1978లో వియత్నాంతో జరిగిన యుద్ధంతో పీడకలలాంటి వాస్తవానికి తెరపడింది. కొద్దికాలం తరువాత వియత్నాంకు వ్యతిరేకంగా గెరిల్లా పోరు మొదలైంది. 1998లో పాల్ పాట్ చనిపోయిన తరువాతగానీ దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడలేదు. పేద దేశంగానే ఉండిపోయిన  కంబోడియాలో 21 శతాబ్దం తొలినాళ్లలో ఆర్థికవృద్ధి వేగవంతం అయింది.  అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పుడు కంబోడియా ముందు వరుసలో ఉంది.

 

టాప్ 10

1.    కంబోడియా పురాతన నామం... కాంభోజ.

2.    కంబోడియా జలభాగంలో 2001లో చమురు నిల్వలు, సహజవాయు నిక్షేపాలను కనుగొన్నారు.

3.    చిత్రమైన విషయమేమిటంటే కంబోడియాలో ఎవరూ పుట్టిన రోజు జరుపుకోరు.

4.    దేశజాతీయ పతాకంపై కట్టడం (ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం) ఉన్న ఏకైక దేశం కంబోడియా.

5.    కంబోడియాకు  ఉత్తరంలో థాయిలాండ్, ఈశాన్యంలో లావోస్, వియత్నాంలు ఉన్నాయి.

6.    కంబోడియాలో 536 పక్షి జాతులు, 850 మంచి నీటి చేప జాతులు, 435 సముద్రజాతి చేపలు ఉన్నాయి.

7.    అడవుల క్షీణత ఎక్కువగా ఉన్న దేశాలలో కంబోడియా ఒకటి.

8.    వస్త్రపరిశ్రమ తరువాత కంబోడియాలో చెప్పుకోదగ్గది పర్యాటకరంగం.

9.    కంబోడియా పర్యాటకానికి ప్రధాన ఆకర్షణ ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం. ప్రపంచంలోని మత సంబంధిత పెద్ద కట్టడాల్లో ఇదొకటి. ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా పేరుగాంచింది.

10.    దేశంలో 95 శాతం కంటే ఎక్కువ మంది బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top