 
															నేర పరిశోధన
అది కోటె డీ అజూర్ ఎక్స్‌ప్రెస్‌లోని కంపార్ట్‌మెంట్ 813. రాత్రి ప్రయాణించే ఆ పెట్టెలోని ఒకరు బాగా వృద్ధుడు.
	మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  20
	అది కోటె డీ అజూర్ ఎక్స్‌ప్రెస్‌లోని కంపార్ట్‌మెంట్ 813. రాత్రి ప్రయాణించే ఆ పెట్టెలోని ఒకరు బాగా వృద్ధుడు. తెల్ల జుట్టు. ముడతలు పడ్డ చర్మం. కళ్లద్దాలు. కాని ఆయన నీలం రంగు కళ్లల్లో చురుకుదనం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి యువకుడు. అతను ఏదో పుస్తకాన్ని చదువుతున్నాడు. కొద్ది క్షణాల తర్వాత ఆ ముసలాయన అడిగాడు.
	 ‘‘మీరు బహుశ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయి ఉండాలి.’’
	 
	ఆ యువకుడి మొహంలో వెంటనే ఆశ్చర్యం కనిపించింది.
	‘‘ఎలా అనుకున్నారు?’’
	‘‘మీ బ్రీఫ్‌కేస్ మీది ఇనీషియల్స్ ఎస్.పి. కాబట్టి మీరు సెర్నైన్ సిసిల్ అయి ఉండాలి. ఆ పేరుగల ఇన్‌స్పెక్టర్ ఇవాళ డూప్లక్స్ అనే గ్రామానికి ఓ వజ్రం దొంగతనం పరిశోధనకి వెళ్తున్నాడని స్థానిక దినపత్రికలో చదివాను.’’
	 ‘‘మీ తార్కిక జ్ఞానం బావుంది’’ అతను మెచ్చుకున్నాడు.
	 ‘‘అది బాగా పని చేసిందో లేదో మీరు చెప్పనే లేదు’’ ఆ వృద్ధుడు ప్రశ్నించాడు.
	 వెంటనే ఆ యువకుడు పుస్తకాన్ని బ్రీఫ్‌కేస్‌లో ఉంచి తన చేతిని చాపి చెప్పాడు.
	 
	
	‘‘నేను స్యూరెటే (నేర పరిశోధక సంస్థ)లో పని చేసే ఇన్‌స్పెక్టర్ సెర్నైన్ సిసిల్‌నే. మీరు?’’
	 ‘‘నా పేరు బెట్రాండ్. ప్యారిస్‌లో మేథమెటిక్స్ ప్రొఫెసర్ని.’’
	 ‘‘మీరు ఏదైనా మేథమెటికల్‌గా ఆలోచిస్తారనుకుంటాను?’’ ఆ యువకుడు అడిగాడు.
	     ‘‘అవును.’’
	 ‘‘మనకి కొన్ని గంటలు ఉన్నాయి. నేను పరిశోధించబోయే కేసు గురించి చెప్తాను. వజ్రం దొంగ ఎవరో కనుక్కోగలరేమో దయచేసి ప్రయత్నించగలరా?’’ ఆ యువకుడు అడిగాడు.
	 బెట్రాండ్ నవ్వి చెప్పాడు. ‘‘అలాగే. నేర పరిశోధన నాకూ అసక్తి కలిగించే విషయమే. అన్ని వివరాలూ చెప్పండి. నాకూ కాలక్షేపంగా ఉంటుంది.’’
	 
	‘‘మీరు నిజాన్ని కనుక్కోగలిగితే మీరు స్యూరెటే సంస్థ కంటే గొప్పవారని ఒప్పుకుంటాను. డూప్లెక్స్‌లోని బేరన్ అనే ఓ ధనవంతుడి ఇంట్లో మొన్న రాత్రి జరిగిన పార్టీలో ఓ విలువైన వజ్రం దొంగతనానికి గురైందని మీకీ పాటికి తెలిసే ఉంటుంది.’’
	 ఆయన తెలుసన్నట్లుగా తల ఊపాడు.
	 ‘‘ఆ కాక్‌టెయిల్ పార్టీకి ఆరుగురు అతిథులు హాజరయ్యారు. పార్టీ పూర్తయి సేవకులు వెళ్లాకే ఆ దొంగతనం జరిగింది. డిన్నర్ తర్వాత బేరన్... ‘టైగర్స్ హార్ట్’ అనే విలువైన వజ్రాన్ని లాకర్లోంచి తీసి తన అతిథులకి చూపించాడు.
	
	దాని విలువ ఇరవై లక్షల ఫ్రాంక్స్. అది ఒకరి చేతిలోంచి మరొకరి చేతిలోకి వెళ్లింది. తర్వాత చూస్తే ఎవరి చేతిలోనూ ఆ వజ్రం లేదు! మాయం అయింది. అందర్నీ అడిగితే అది ఎవరి దగ్గరా లేదని జవాబు వచ్చింది. ఈ ట్రిక్ చాలా పాతది. అంత విలువైంది ఎవరి చేతికీ ఇవ్వకూడదనే పాఠాన్ని బేరన్ ఆలస్యంగా నేర్చుకున్నాడు. తక్షణం అందర్నీ గదిలోనే ఉండమని స్యూరెటేకి ఫోన్ చేసాడు. నలుగురు పోలీసులు వెళ్లి ఆ ఆరుగురినీ క్షుణ్ణంగా వెదికారు.’’
	 ‘‘దీని గురించి పేపర్లో చదివాను. క్షుణ్ణంగా వేరే పదం. నగ్నంగా వేరే పదం. నగ్నంగా వెదికారు’’ ఆయన కరెక్ట్ చేసాడు.
	 
	‘‘అవును. అందుకు వారంతా అనుమతించారని పేపర్లో రాయలేదు. కాని అది ఎవరి దగ్గరా లేదు. వాళ్లు కూర్చున్న ఆ గదిని వెదికారు. వజ్రం బయటికి తీశాక ఎవరూ బాత్‌రూమ్‌లోకి వెళ్లకపోయినా దాన్నీ వెదికారు. అక్కడా లేదు. ఇల్లంతా చాలా క్షుణ్ణంగా వెదికారు. అయినా ఆ వజ్రం దొరకనే లేదు.’’
	 ‘‘ఈసారి క్షుణ్ణంగా పదాన్ని సరిగ్గా వాడారు’’ ఆయన నవ్వాడు.
	 ‘‘నన్ను ప్యారిస్‌లోని స్యూరెటే హెడ్ క్వార్టర్స్ నించి ఆ వజ్రపు దొంగని పట్టుకోడానికి పంపుతున్నారు. మీరు ఆ ఆరుగురిలో ఎవరు దొంగో సూచించగలరా? వారి వివరాలు ఇప్పటికే వార్తల్లో చదివే ఉంటారుగా’’ ఆ యువకుడు అర్థించాడు.
	 
	‘‘చదివాను. బేరన్‌కి పిల్లల్లేరని చదివాను?’’
	 ‘‘అవును. పిల్లల్లేనివారు చేసే పనే ఆయన కూడా చేశాడు. ఓ పిల్లిని పెంచుకుంటున్నాడు.’’
	 చిన్నగా తల ఊపి ఆయన గొణిగాడు.
	 ‘‘అనుకున్నాను. ఆ పిల్లి ఇంట్లోంచి బయటికి, బయటి నించి ఇంట్లోకి వెళ్లి రావడానికి ఓ తలుపుకి క్యాట్ డోర్ కూడా తప్పకుండా ఉండి ఉండాలి.’’
	 ‘‘ఉంది. నేనా రిపోర్ట్‌ని క్షుణ్ణంగా చదివాను.’’
	 ‘‘దాన్ని దొంగ ఉపయోగించి ఉంటాడు.’’
	 
	‘‘ఏమిటి మీరనేది? అందులోంచి మనిషి వెళ్లలేడు’’... ఆ యువకుడు చెప్పాడు.
	 ‘‘దొంగ ఆ పిల్లిని ఆ సమయంలో తన ఒళ్లో ఉంచుకుని ఉంటాడు. లేదా దగ్గరికి తీసుకుని దువ్వి ఉంటాడు. ఆ క్రమంలో ఆ పిల్లి కడుపు కింద ఆ వజ్రాన్ని బహుశా బబుల్‌గమ్‌తో అతికించి దాన్ని వదిలి ఉంటాడు. పోలీసులకి కాని, బేరన్‌కి కాని దాన్ని వెతకాలనే ఆలోచన వచ్చి ఉండదు. దాంతో పోలీసుల మధ్య నించి అది క్యాట్ డోర్‌ని తెరచుకుని బయటికి వెళ్లినప్పుడు, దానికోసం బయట వేచి ఉన్న తోడుదొంగ, బహుశ ఆ దొంగ భార్యో, ప్రియురాలో... ఆ పిల్లి నించి దాన్ని తీసుకుని ఉంటుంది. ఆ వ్యక్తి ఆ పిల్లికి పరిచయం ఉన్న వ్యక్తే అవడంతో అది అరిచి ఉండదు.’’
	 ఆ యువకుడు తల తాటించి చెప్పాడు.
	 ‘‘ఈ ఆధారాల ప్రకారం ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోగలను అనుకుంటున్నాను.’’
	   
	పది రోజులదాకా ఆ ముసలాయన దినపత్రికని చూస్తూనే ఉన్నాడు. ఆ దొంగతనం గురించిన ఏ వార్తా రాలేదు. పదకొండో రోజు ఆయనకి ఇటలీలోని రోమ్ నించి ఓ టెలిగ్రాం వచ్చింది. అందులో ఇలా ఉంది.
	 ‘ఆ దొంగని నేనే. ఆ రోజు పార్టీకి వెళ్లిన ఆ ఆరుగురు వ్యక్తుల్లో నేనూ ఒకడ్ని. మీ మేధాశక్తికి జోహార్లు. కాని రైల్లో నా బ్రీఫ్ కేస్ మీది ఇనీషియల్స్ విషయంలో మాత్రం మీరు పప్పులో కాలేశారు. నా పేరు సెవిల్ క్రోనిస్. ఇక దేశంలో ఉండటం మంచిది కాదని ఇటలీకి చేరుకున్నాను.’
	- (ఆర్ధర్ పోర్కెస్ కథకి స్వేచ్ఛానువాదం)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
